అస్సాం డిటెన్షన్ కేంద్రాలు: నరేంద్ర మోదీ చెప్పింది నిజమా.. కాదా..

ఫొటో సోర్స్, AFP
దేశంలో డిటెన్షన్ కేంద్రాలేవీ లేవని, వాటి గురించి వస్తున్న వార్తలన్నీ వదంతులేనని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో చెప్పారు.
దేశాన్ని నాశనం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్, అర్బన్ నక్సలైట్లు ఆ వదంతులను వ్యాప్తి చేస్తున్నారని, అవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన అన్నారు.
''భారత ముస్లింలు, భరత మాత వారసులకు.. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్‌సీలతో ఏ నష్టమూ ఉండదు. దేశంలోని ముస్లింలను ఎవరూ డిటెన్షన్ కేంద్రాలకు తరలించడం లేదు. అసలు భారత్‌లో డిటెన్షన్ కేంద్రాలేవీ లేవు. అది పచ్చి అబద్ధం'' అని మోదీ అన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
అయితే, అస్సాంలో డిటెన్షన్ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన వారితో మాట్లాడిన బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ 2018లో ఓ కథనం రాశారు.
డిటెన్షన్ కేంద్రంలో ఉన్నవారు తమ అనుభవాలను పీడకలలుగా వర్ణించారని, వాటిని మరచిపోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారని శ్రీవాస్తవ ఆ కథనంలో పేర్కొన్నారు.
బీబీసీ ప్రతినిధి ప్రియాంక దూబే కూడా అస్సాంలో ఉన్న డిటెన్షన్ కేంద్రాల గురించి కొన్ని కథనాలు రాశారు.
''పౌరసత్వం నిర్ధరించే ఈ కఠిన చట్ట ప్రక్రియలో చిక్కుకున్న ఈ పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఒక్కోసారి డిటెన్షన్ కేంద్రంలో బంధీలుగా ఉన్న తల్లిదండ్రులతో కఠిన జైలు వాతావరణంలో, ఇంకోసారి వారు లేని కఠిన ప్రపంచంలో ఒంటరిగా జీవించే ఈ పిల్లలను ఆదుకునేవారు ఎవరూ కనిపించడం లేదు'' అని ప్రియాంక దూబే ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PTI
పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది..
భారత పార్లమెంటులో ప్రశ్నోత్తరాలను పరిశీలిస్తే, డిటెన్షన్ కేంద్రాల గురించిన చర్చలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు కేంద్రం కూడా అంగీకరించడం వాటిలో ఉంది.
2019, జులై 10న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పౌరసత్వ నిర్ధరణకాని అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపేవరకు రాష్ట్రాలు డిటెన్షన్ కేంద్రాల్లో ఉంచాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి డిటెన్షన్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎంతమంది ఉంటున్నారు? అనే రికార్డులు తమ వద్ద లేవని వివరించారు.
డిటెన్షన్ కేంద్రాలు ఎలా ఉండాలి, వాటిలో ఏయే సౌకర్యాలు కల్పించాలి అన్నవి సూచించే మ్యానువల్‌ను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు పేర్కొన్నారు.

2009, 2012, 2014, 2018ల్లో డిటెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం వివిధ రాష్ట్రాలకు సూచించినట్లు లోక్‌సభకు నిత్యానంద్ రాయ్ తెలిపారని గత ఏడాది ఆగస్టులో 'ద హిందూ' దినపత్రిక కథనం ప్రచురించింది.
కేంద్ర హోం శాఖ 'మోడల్ డిటెన్షన్ సెంటర్/హోల్డింగ్ సెంటర్ మ్యానువల్'ను రూపొందించిందని, ఈ ఏడాది జనవరి 9న అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాన్ని పంపించిందని 2019, జులై 2న లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇస్తూ వెల్లడించారు.
డిటెన్షన్ కేంద్రాల్లో ఉండే సౌకర్యాల గురించి కూడా ఆయన ఇందులో ప్రస్తావించారు.
2019 జులై 16న లోక్‌సభలో మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. అస్సాంలో డిటెన్షన్ కేంద్రాలు ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే, ఇవి పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేని వారి కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.
విదేశీ పౌరులుగా ప్రకటించిన అక్రమ వలసదారులు.. శిక్ష పూర్తి చేసుకుని కూడా దేశం నుంచి బయటకు పంపే ప్రక్రియ పూర్తి కాని విదేశీ నేరస్తుల కోసం ఈ డిటెన్షన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- పౌరసత్వ సవరణ బిల్లు: అస్సాం ఎందుకు రగులుతోంది? ప్రజల్లో భయం దేనికి?
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- CAA: కాన్పూర్ నిరసనల్లో ఇద్దరి మరణానికి ముందు ఏం జరిగింది - గ్రౌండ్ రిపోర్ట్
- పాకిస్తాన్లో దైవదూషణ అభియోగాలపై లెక్చరర్‌కు మరణశిక్ష
- పౌరసత్వ సవరణ చట్టం: CAA, NRCలపై ఇస్లాం మత గురువులు ఏమంటున్నారు?
- ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?
- పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు
- అస్సాం: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరుగుతోంది?
- మంట పుట్టించే ఘాటైన ఆహారాన్ని జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








