నాని గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, facebook/GangLeaderTheFilm
- రచయిత, భవానీ ఫణి
- హోదా, బీబీసీ కోసం
గొప్ప పెర్ఫెక్షన్‌తో జరిగిన ఒక బ్యాంక్ దొంగతనం చివర్లో, అనుకోని అపశృతి ఒకటి దొర్లుతుంది. ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు వ్యక్తుల దగ్గరి బంధువులంతా కలిసి హంతకుడిపై పగ తీర్చుకోవాలనుకుంటారు.
అందుకోసమని వారు, రివెంజ్ నవలలు రాసే పెన్సిల్ పార్థసారథి (నాని) సహాయాన్ని కోరతారు. ఒక వృద్ధ స్త్రీ, మరో నడివయసు మహిళ, ఇంకో పెళ్లీడు కొచ్చిన యువతి, మరో కాలేజీ అమ్మాయి, ఇంకో చిన్న పాప... ఈ ఐదుగురూ, పెన్సిల్ అనే ఆ రచయితతో కలిసి ఎలా తమ పగ తీర్చుకుంటారన్నది కథాంశం.
అసలు విలన్ ఎవరు? అనేక రకాల వయసులలో ఉన్న ఈ స్త్రీలంతా కలిసి ఒక సాధారణమైన రచయిత సహాయంతో అతడిని ఎలా కనిపెడతారు? బలవంతుడైన అతడి మీద ఎలా పగ తీర్చుకుంటారు? ఆ క్రమంలో వారి మధ్య ఎటువంటి బంధం ఏర్పడుతుంది? ఇంకా ఏమేం నిజాలు వెలుగులోకి వస్తాయి? అనే అంశాలన్నీ కలిస్తే నానీ'స్ గ్యాంగ్ లీడర్ సినిమా అవుతుంది.
ఇష్టం, మనం, 24 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్, ఈ సినిమాకు కూడా కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. సినిమా మొదటి భాగమంతా కొత్తగా అనిపించే కథతో, పదునైన, పడీ పడీ నవ్వించే సంభాషణలతో చాలా వేగంగా సాగుతుంది. కథతో పాటుగా కలిసిపోయి, సంభాషణల ద్వారా పలికిన హాస్యం, ప్రేక్షకుల పెదవుల మీద నవ్వుల్ని పూయిస్తుంది.
బ్యాంక్ రాబరీ కథాంశంతో ఇప్పటికే అనేక హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. ఆ సీన్‌ను చిత్రీకరించడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా సినిమా మొత్తం అభాసుపాలవుతుంది. ముఖ్యంగా ది డార్క్ నైట్, ధూమ్ సినిమాలలోని బ్యాంక్ దొంగతనాల సీన్స్ ప్రత్యేకంగా ఉంటాయి.

ఫొటో సోర్స్, facebook/GangLeaderTheFilm
ఈ సినిమాలో దొంగతనానికి చెందిన సన్నివేశాలను కూడా తెలివిగానే తెరకెక్కించారు. అంతేకాక, పోలీసులు ఛేదించలేకపోయిన 300 కోట్ల రూపాయల దొంగతనానికి చెందిన నేరస్థుడి జాడ కనుక్కోవడానికి.. పెన్సిల్ పార్థసారధి చేసిన ఆలోచన ఆకట్టుకుంటుంది. అలా వాళ్ళు నేరస్థుడి దాకా చేరిన తీరు మొత్తం, అవుట్ అఫ్ బాక్స్ థింకింగ్ లాగా అనిపించి, సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
24 వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాతో చక్కని ప్రయోగం చేసి విజయం సాధించిన విక్రమ్ కుమార్, ఈ సినిమా ద్వారా కూడా మన నేటివిటీతో నిండిన థ్రిల్లర్ ఒకటి సృష్టించాడన్న భావం కలుగుతుంది. మూస ధోరణి కొనసాగుతున్న కాలంలో ఒక కొత్తదనం నిండిన సినిమాపై ఆశ మొదలవుతుంది. కానీ అంతలోనే ఇంటర్వెల్ వస్తుంది.
ఇక ఇంటర్మిషన్ తర్వాత నుండీ కథాంశంలోనూ, కథనంలోనూ కూడా తడబాటే కనిపించింది. కథ గాడి తప్పిపోతుంది. హీరో తన తెలివిని కోల్పోయి తప్పులు చేయడం మొదలుపెడతాడు. సంభాషణల్లో చమక్కులు తగ్గిపోతాయి. హాస్యాన్ని ఎమోషన్ తో భర్తీ చేయాలని ప్రయత్నించడంతో సినిమా తీరు మారిపోయింది. ఆ మార్పే ఈ సినిమాను, ఒక సాధారణమైన సెంటిమెంట్ నిండిన సినిమాల కోవకి చేర్చేసింది.
కొందరు అపరిచితులు, ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేసే పరిస్థితి వచ్చినపుడు వారి మధ్యన కొంత సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది కానీ, ఈ సినిమాలో అది హఠాత్తుగా ఫ్యామిలీ డ్రామాగా మారిపోతుంది. హీరో తన కొత్త కుటుంబాన్ని చూసుకుని సంబరపడటం మొదలుపెడతాడు గానీ, వారికి రక్షణ కూడా ఇవ్వాలన్న విషయాన్ని మరిచిపోయి పొరపాట్లు చేస్తాడు. అవసరం కూడా లేకుండానే విలన్ ముందుకు వెళ్లి కవ్విస్తుంటాడు.
ఇక మెల్లగా కథలో బ్లండర్స్ కూడా దొర్లడం మొదలయింది. (హీరో గ్యాంగ్, బిల్డింగ్ దగ్గరకు సాగించిన రాకపోకల్ని కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో చూడవచ్చన్న ఆలోచన విలన్ కు ఎందుకు రాదు! విలన్ తో ప్రమాదముందని తెలిసినా, హీరో ఇల్లు మారడం వంటి కనీస జాగ్రత్త కూడా ఎందుకు తీసుకోడు? తనకంటే ముందుగానే స్నేహితుడు వచ్చి డబ్బును అక్కడినించి తరలించగలడని హీరో ఎలా భావిస్తాడు?).
మధ్యలో లక్ష్మి పాత్ర ద్వారా మరో అవసరం లేని ట్విస్ట్ ను సృష్టించే ప్రయత్నం చేసి, నిలబెట్టలేక దాన్ని మళ్ళీ భావోద్వేగపు దారిలోకి మళ్లించాలని ప్రయత్నించాడు దర్శకుడు. ఒక సినిమాని థ్రిల్లర్ చేయాలనుకున్నప్పుడు, కాస్త ధైర్యాన్ని ప్రదర్శించాలి. హీరో, ఇంకా ముఖ్య పాత్రలు తప్పు చేయవన్న ఫార్ములానే పట్టుకుని కూర్చుంటే అది కేవలం ఇలా ఎమోషనల్ డ్రామాగా మాత్రమే మిగిలిపోతుంది.
ఆఖరి అరగంటా అయితే విపరీతమైన సెంటిమెంట్‌తో కంటతడి పెట్టించే ప్రయత్నం జరిగింది. ముగింపు మరింత పేలవంగా ఉంది. అయినప్పటికీ ఈ రెండున్నర గంటల సినిమా, పెద్దగా విసుగు తెప్పించకుండా, కాస్త హాయిగా అనిపించి, కొంచెం ప్రశాంతంగా బయటకి పంపిస్తుందని మాత్రం చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, facebook/GangLeaderTheFilm
ముఖ్యంగా, నటనలో నానీ కనబరిచిన ఈజ్ కోసమైనా ఈ సినిమా చూడాలి. హాస్యాన్ని ఎంతో సులువుగా, సమర్థవంతంగా పండించాడతడు. తన హావ భావాలతో, సంభాషణలను పలికే నేర్పుతో, సినిమాని మొదటినించీ చివరివరకూ ఒక స్థాయి కంటే క్రిందికి దిగకుండా కాపాడాడు.
మరో ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మి నటన కూడా సహజంగా ఉంది. హీరోయిన్ ప్రియాంక అమాయకంగా, అందంగా కనిపించింది.
ఆర్ ఎక్స్ 100 తో సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న కార్తికేయ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పోషించాడు. అతడు కూడా పాత్రకు తగ్గ నటనను ప్రదర్శించి, సినిమాకు బలాన్నిచ్చాడు.
మరి కొన్ని ప్రధాన పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్, ప్రియదర్శి, శరణ్యలు మంచి నటననే ప్రదర్శించారు. మాటలు రాని చిన్న పాపగా కనిపించిన ప్రాణ్య ముద్దుగా ఉంది.
అనిరుధ్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. పాటలు ఒకసారి వినేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను అవసరానికి తగ్గట్టుగా ఎలివేట్ చేసింది.
మీరోస్లా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ, కొత్తదనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. కథా, సంభాషణలే ప్రధానమైన ఈ సినిమా రెండో భాగాన్ని కూడా కాస్త తెలివిగా నడిపించి ఉంటే, ఇదొక మంచి సినిమా అయి ఉండేది.
28 ఏళ్ళ క్రిందట గొప్ప హిట్ అయిన చిరంజీవి పాపులర్ సినిమా గ్యాంగ్ లీడర్ పేరుతో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఒకసారైతే చూడచ్చు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడం, నానీ సినిమా కావడం, మొదటి సగభాగంలో మంచి హాస్యం తొణికిసలాడటం వంటి అంశాలు, ప్రేక్షకులను ఈ సినిమా దాకా తీసుకువచ్చే అవకాశాలే ఎక్కువ.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- అమరావతి నగర నిర్మాణంపై రివ్యూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- ఓలా, ఉబెర్ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- జమ్మూకశ్మీర్ పరిస్థితి మెరుగవుతుందా... లేక మరింత దిగజారుతుందా?
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- PUBG ఆడుకోవడానికి అడ్డుపడుతున్నాడని తండ్రిని చంపిన కొడుకు
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది...
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. ఇప్పటికీ ఆ ప్రాంతంతో పాకిస్తాన్‌కు చిక్కులు ఎందుకు?
- గూగుల్ మ్యాప్ గుర్తించిన నీటమునిగిన కారు, అందులో ఓ అస్థిపంజరం... దాని వెనుక 22 ఏళ్ళ నాటి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








