ఓలా, ఉబెర్‌ల వల్ల కార్ల అమ్మకాలు తగ్గాయా... ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?

ఫొటో సోర్స్, Getty Images, Ola
- రచయిత, ప్రశాంత్ చాహల్
- హోదా, ఫ్యాక్ట్‌చెక్ టీం, బీబీసీ
ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులు ఓ కారణమని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి.
కొత్త వాహనాలు కొని ఈఎమ్ఐలు కట్టుకుంటూ ఉండిపోవాలని 'మిలీనియల్స్' అనుకోవడం లేదని, బదులుగా ఉబెర్, ఓలా క్యాబ్‌లను వాడుతున్నారని సీతారామన్ అన్నారు. దాని ప్రభావం ఆటోమొబైల్ రంగం మీద పడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
నిర్మల ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ట్విటర్‌లో #Millennials హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఆమెను విమర్శిస్తూ చాలా మంది ట్వీట్లు పెట్టారు.
వాహనాల అమ్మకాలకు సంబంధించి గత రెండు దశాబ్దాల గణాంకాలను తీసుకుంటే, 2019 ఆగస్టులోనే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు అత్యంత తక్కువగా నమోదయ్యాయి.
ఆగస్టు వరకు వరుసగా తొమ్మిది నెలలపాటు వాహనాల అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. వాహనాల అమ్మకాలపై 28% జీఎస్‌టీ, 17% సెస్‌లను ప్రభుత్వం వసూలు చేస్తోందని, వీటిని తగ్గిస్తే అమ్మకాలు పుంజుకుంటాయని కార్ల డీలర్లు అంటున్నారు.
ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆటో మొబైల్ రంగంలో ఎంతకాలం మందగమనం కొనసాగొచ్చని నిర్మలా సీతారామన్‌ను విలేఖరులు ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీనికి జవాబిస్తూ.. ''రెండేళ్ల క్రితం వరకూ ఆటోమొబైల్ రంగం లాభసాటిగానే ఉంది. ఆ తర్వాత అమ్మకాలు క్షీణించాయి. అందుకు చాలా కారణాలున్నాయి. బీఎస్-6 రాక, రిజిస్ట్రేషన్ రుసుములకు సంబంధించిన అంశాలు కూడా వాటిలో కొన్ని. అయితే, మిలీనియల్స్ వాహనాలు కొని ఈఎమ్ఐలు కట్టుకుంటూ ఉండిపోవడం కన్నా.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్ సర్వీసులు లేదా మెట్రో రైళ్లను ఉపయోగించుకోవడం మంచిదని అనుకుంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిన్నింటి ప్రభావం ఆటోమొబైల్ రంగంపై ఉంటుంది'' అని నిర్మలా సీతారామన్ అన్నారు.
సియామ్ గణాంకాలను, క్యాబ్ సర్వీసుల రిజిస్ట్రేషన్ సమాచారాన్ని బీబీసీ విశ్లేషించింది.
అయితే, క్యాబ్ సర్వీసుల వృద్ధి రేటు కూడా పడిపోతుండటం నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

కార్లు మాత్రమే కాదు
సియామ్ 1997-98 నుంచి వాహన టోకు అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తోంది.
ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసుల కోసం వినియోగిస్తున్న వాహనాల అమ్మకాలు కూడా పడిపోయాయి.
క్షీణించింది కార్ల (ప్యాసింజర్ వాహనాల) అమ్మకాలే కాదు. టూవీలర్, త్రీవీలర్‌తో పాటు ట్రాక్టర్, ట్రక్కుల వంటి భారీ వాహనాల అమ్మకాలు కూడా గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువగా నమోదయ్యాయి.
అన్ని రకాల వాహనాల అమ్మకాల్లో గత తొమ్మిది నెలలుగా క్షీణత కనిపిస్తూనే ఉందని సియామ్ నివేదికలు చెబుతున్నాయి.
2018 ఏప్రిల్-ఆగస్టులో 13,699,848 వాహనాలు తయారవ్వగా, 2019 ఏప్రిల్-ఆగస్టులో ఆ సంఖ్య 12,020,944కు పడిపోయిందని సియామ్ సెప్టెంబర్ 9న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
అంటే, వాహనాల ఉత్పత్తి 12.25% తగ్గింది.

ఫొటో సోర్స్, PTI
‘అమెరికాలో బాగానే ఉందిగా’
భారత్‌లో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఇటీవల పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు.
''ఆర్థిక మంత్రి చెబుతున్న విషయాలపై ఓ నిర్ధరణకు రావాలంటే సమగ్ర అధ్యయనం అవసరం. కార్లు సొంతం చేసుకునే విషయంలో ప్రజల వైఖరి మారినట్లు ఇప్పటికైతే మేం భావించడం లేదు. అమ్మకాల క్షీణతకు ఓలా, ఉబెర్ సర్వీసులు పెద్ద కారణమని కూడా అనుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.
''ఓలా, ఉబెర్ సేవలు గత ఆరేడేళ్ల నుంచి నడుస్తున్నాయి. ఆటోమొబైల్ రంగం అత్యంత లాభసాటిగా ఉన్న సమయం అది. మొత్తం రంగమే క్షీణించేలా గత కొన్ని నెలల్లో ఈ క్యాబ్ సర్వీసులు ఏం చేశాయి? నేనైతే అమ్మకాలు తగ్గడానికి అవి కారణం అనుకోను. అమెరికాలో ఉబెర్ నెట్‌వర్క్ చాలా పెద్దది. అక్కడ కార్ల అమ్మకాలు చాలా బాగా సాగుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు.
మిలీనియల్స్ కార్లు కొనుగోలు చేయకపోవడం వల్లే ఆటోమొబైల్ రంగం మందగమనంలో ఉందని అనడం పరిస్థితిని చాలా తక్కువ చేసి చూడటం అవుతుందని సీనియర్ ఆర్థికవేత్త వివేక్ కౌల్ అన్నారు.
''ఆర్థిక భవిష్యత్తు గురించి సమాజంలో ఆందోళన నెలకొంది. డబ్బు ఖర్చు పెట్టాలంటే జనాలు భయపడుతున్నారు. అసలు విషయం అదే'' అని ఆయన అన్నారు.

క్యాబ్ రిజిస్ట్రేషన్లూ తగ్గాయి
ఓలా, ఉబెర్ క్యాబ్‌లు ఎక్కువగా నడుస్తున్న దిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కమర్షియల్ వాహనాల రిజిస్ట్రేషన్ గణాంకాలను బీబీసీ పరిశీలించింది.
ఆయా రాష్ట్రాల్లో కార్లతో పాటు ఆటో రిక్షాల ద్వారానూ క్యాబ్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
ఆ నాలుగు రాష్ట్రాల్లో 2018 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగిన ట్యాక్సీ కార్లు, త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ 11 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉంది.
భారత్‌లో యాప్ ఆధారిత క్యాబ్ సేవల ద్వారా రోజూ 36 లక్షలకు పైగా రైడ్‌లు జరుగుతున్నాయని ఆటోమొబైల్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల ప్రకారం వీటి వినియోగదారులు పెరుగుతున్నారా అంటే అదీ లేదు.
ఓలా, ఉబెర్ సంస్థల వృద్ధి రేటు చాలా నెమ్మదిగా సాగుతోందని ఇటీవల 'ఎకనామిక్ టైమ్స్' వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఆయా సంస్థల అంతర్గత వర్గాలు ఈ సమాచారం ఇచ్చాయని పేర్కొంది.
ఈ కథనం ప్రకారం, 2018లో రోజూ యాప్ ఆధారిత క్యాబ్‌ల ద్వారా 35 లక్షల రైడ్‌లు జరిగితే, 2019లో వాటి సంఖ్య మరో లక్షన్నర మాత్రమే పెరిగింది.
2016లో 90 శాతంగా ఉన్న ఆ సంస్థల వృద్ధి రేటు, 2017లో 57 శాతానికి చేరుకుంది. 2018లో 20 శాతానికి క్షీణించింది. 2019లో ఇప్పటివరకూ చూసుకుంటే, వృద్ధిశాతం 4.5 శాతం మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
‘పూర్తిగా తోసిపుచ్చలేం’
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల్లో సహేతుకమైన విషయం ఉందని, వాటిని పూర్తిగా తోసిపుచ్చడం అవివేకపు చర్యే అవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్ ఎకానమిస్ట్ అభీక్ బారువా అభిప్రాయపడ్డారు.
''ఆటోమొబైల్ రంగం వృద్ధికి చాలా కారణాలున్నాయనేది వాస్తవం. ఫైనాన్సింగ్ లోటు పెద్ద కారణాల్లో ఒకటి. మిలినీయల్స్ యాప్ ఆధారిత సర్వీసుల వైపు మొగ్గడం వల్ల ఈ రంగంపై ప్రభావం పడదనుకోవడం పొరపాటు కావొచ్చు. కార్ల తయారీదారులు ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది'' అని ఆయన అన్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నాలుగేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
"ఓలా, ఉబెర్ వంటి యాప్స్ వల్ల ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణించొచ్చు. జనాలు అప్పుడు తాము మనసుపడ్డ కార్లనే కొనుక్కుంటారు'' అని ఆయన ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
2019 సెప్టెంబర్ 5న సియామ్ సదస్సులో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ కూడా వాహనాల కొనుగోలు విషయంలో వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావించారు.
''ఓలా, ఉబెర్ సంస్థలు వాహనాలను 40-50 శాతం సమర్థంగా వినియోగించుకుంటాయి. జనాలు తమ సొంత కార్లను 3-5 శాతం మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ప్రజల ఆలోచనలు పూర్తిగా మారిపోవచ్చు. దాని గురించి ఆటోమొబైల్ రంగం ఆలోచించాలి'' అని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
'మిలీనియల్ ఆలోచనా ధోరణి' అంటే..
1981 నుంచి 1996 మధ్య జన్మించిన వారిని సాధారణంగా మిలినీయల్స్‌గా పరిగణిస్తుంటారు.
నిర్మలా సీతారామన్ అన్నట్లుగా వారి ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు ఏమై ఉండొచ్చన్నది ఆటోమొబైల్ రంగంలో సీనియర్ జర్నలిస్ట్ కిశీ సింగ్ బీబీసీకి వివరించారు.
''ఇప్పుడే కొత్తగా ఉద్యోగం సంపాదించుకున్న 22 ఏళ్ల మిలీనియల్‌ను ఉదాహరణగా తీసుకుందాం. కారు కొనాలంటే అతడికి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలు కావాలి. తల్లిదండ్రుల సాయం లేకుండా కొనాలంటే, రుణం తీసుకోక తప్పదు. 22 ఏళ్ల వయసులో రుణగ్రహీత అయిపోతాడు. నెలా నెలా ఈఎమ్‌ఐ కట్టాలి. వార్షిక బీమా కట్టాలి. ఇంధనం పోయించాలి. సమయానికి టైర్లు, బ్యాటరీలు మార్చుకోవాలి'' అని కేశీ సింగ్ అన్నారు.
''అన్నింటి కన్నాముఖ్యమైన విషయం 'డీప్రైసేషన్'. అంటే ధర తగ్గిపోవడం. రూ. 4 - 6 లక్షలు పెట్టిన కారు మూడేళ్ల తర్వాత రూ. 2 లక్షల కన్నా ఎక్కువ ధరకు అమ్ముడుపోదు. ఖరీదైన కార్ల విషయంలో డీప్రైసేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ఖర్చులు, డీప్రైసేషన్ వల్ల కోల్పోయే డబ్బును లెక్కగట్టి చూస్తే ఓలా, ఉబెర్‌లపై పెట్టే ఖర్చులు చాలా తక్కువ. పైగా క్యాబ్‌లను రప్పించుకోవడంలో ఇబ్బందులన్నీ పోయాయి. ఉన్న చోటుకి, అనుకున్న సమయానికి క్యాబ్ వచ్చేస్తోంది. పార్కింగ్, ట్రాఫిక్ చలాన్ల లాంటి ఇబ్బందులేమీ ఉండవు'' అని వివరించారు.
కార్ల విక్రయాల క్షీణతకు మొదటి ఐదు ప్రధాన కారణాల్లో 'మిలీనియల్ ఆలోచన ధోరణిలో మార్పు' కూడా ఉంటుందని కిశీ సింగ్ అభిప్రాయపడ్డారు. భారత్ స్టేజ్ (బీఎస్)-6 ప్రమాణాల అమలు కోసం కొనుగోలుదారులు వేచి చూస్తుండటం కూడా ఒక కారణమని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- 9/11 దాడులకు 18 ఏళ్లు: తీవ్రవాదంపై పోరాటంలో అమెరికా విఫలం - అభిప్రాయం
- డెబిట్ కార్డులు, ఏటీఎంలు త్వరలో కనిపించకుండా పోతాయా...
- పాకిస్తాన్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








