ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?

ఎడం చేతి వాటం

ఫొటో సోర్స్, Getty Images

ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగించే అలవాటు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఎడమ చేతి అలవాటుతో సంబంధం ఉన్న జన్యు పదార్థాన్ని వారు గుర్తించారు. మెదడు నిర్మాణం, పనితీరు విషయంలోనూ దీని ప్రభావం అధికంగానే ఉంటోందని వారు అంటున్నారు.

ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరిది ఎడమ చేతి అలవాటే.

కవల పిల్లలపై ఇది వరకు జరిగిన అధ్యయనాలు ఎడమ చేతి అలవాటుకు జన్యువులతో సంబంధం ఉందని గుర్తించాయి.

అయితే, లోతైన వివరాలు మాత్రం తాజా అధ్యయనంలోనే బయటపడుతున్నాయి.

యూకే బయోబ్యాంక్‌లో ఉన్న సుమారు 4 లక్షల మంది జన్యు క్రమాల సమాచారం ఉంది. ఈ 4 లక్షల మందిలో 38వేల మంది ఎడమ చేతి అలవాటు ఉన్నవాళ్లున్నారు.

ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల బృందం వీరందరి జన్యు క్రమాలను విశ్లేషించింది. వాటిలో కుడి చేతి అలవాటున్నవారికి, ఎడమ చేతి అలవాటున్న వారికి మధ్య తేడాలున్న ప్రాంతాలను గుర్తించింది.

ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా 44వ అధ్యక్షుడు ఒబామాది కూడా ఎడమ చేతి వాటమే

''కుడి, ఎడమ చేతి అలవాట్లను నిర్ణయించే ఓ జన్యు పదార్థం ఉందని మనకు ఇప్పుడే తెలిసింది'' ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ గ్వానెల్లే డావుడ్ అన్నారు.

శరీరంలోని కణాల అంతర్గత నిర్మాణంలో సైటోస్కెల్టన్‌ అనే పదార్థం కీలకపాత్ర పోషిస్తుందని, ఏ చేతి అలవాటన్నది నిర్ణయించే జన్యు పరివర్తనాలు దీనిలోనే కనిపించాయని పరిశోధకులు చెప్పారు.

మెదడులో ఉండే వైట్ మ్యాటర్ నిర్మాణంలో మార్పులకు సైటోస్కెల్టన్ కారణమవుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించారు.

నత్తల్లోనూ ఎడమ, కుడివి ఉంటాయి. వాటిలోని సైటోస్కెల్టన్‌ను ఇలాంటి పరివర్తనాలే మార్చుతున్నాయి.

''సైటోస్కెల్టన్ వల్ల వచ్చే తేడాలు మెదడులో కనిపిస్తున్నాయి. మొదటి సారి వీటికీ, చేతి అలవాటుకు మధ్య సంబంధాన్ని గుర్తించాం'' అని ప్రొఫెసర్ డావుడ్ అన్నారు.

కుడి చేతి అలవాటు వారితో పోలిస్తే ఎడం చేతి అలవాటున్న వారిలో మెదడులోని కుడి, ఎడమ భాగాలు మెరుగ్గా అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

మెదడులో భాషా జ్ఞానానికి సంబంధించి ప్రాంతాలూ మెరుగ్గా అనుసంధానమై ఉన్నాయని, అందుకే ఎడం చేతి అలవాటున్న వారికి మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు.

కుడి చేతి అలవాటున్న వారి కన్నా ఎడం చేతి అలవాటున్న వారికి షిజోఫెర్నియా అనే వ్యాధి వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వివరించారు.

నత్త

ఫొటో సోర్స్, Getty Images

సమాజంలో ఎడం చేతి అలవాటున్నవారికి ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు.

''చాలా సంస్కృతుల్లో ఎడం చేతి అలవాటున్న వారిని కాస్త హీనంగా చూస్తారు. వారిని దురదృష్టవంతులుగా భావిస్తారు. ఆ వివక్ష ఆనవాళ్లు భాషలోనూ కనిపిస్తుంటాయి'' అని శస్త్ర చికిత్స నిపుణుడైన ప్రొఫెసర్ డొమినిక్ ఫర్నీస్ చెప్పారు.

ఫ్రెంచ్ పదం gaucheకు రెండు అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎడమ అయితే, రెండోది అయోమయం. ఇక ఇంగ్లీష్‌లో right అంటే కుడితోపాటు సరైనది అనే అర్థం ఉంది.

''ఎడం చేతి అలవాటు మన మెదడు వృద్ధి చెందే క్రమంలో వచ్చే పరిణామం అని ఈ అధ్యయనం చెబుతోంది. దురదృష్టం, దుష్టశక్తులతో దానికి ఎలాంటి సంబంధమూ లేదు'' అని ఫర్నీస్ అన్నారు.

ఈ అధ్యయనంలో కేవలం ఎడం చేతి అలవాటుతో సంబంధం ఉన్న జన్యు పదార్థంలో ఒక్క శాతం గురించి మాత్రమే సమాచారం తెలిసింది. పైగా బ్రిటన్‌లో ఉండేవారి జన్యు సమాచారంపైనే పరిశోధకులు దృష్టి సారించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారి జన్యు సమాచారాన్ని విశ్లేషించినా.. ఎడం చేతి అలవాటుకు కారణాలు పూర్తిగా తెలియవు.

ఎందుకంటే, ఈ అలవాటుకు పూర్తిగా జన్యువులే కారణం కాదు. వాటి ప్రభావం 25 శాతం మాత్రమే.

మరో 75 శాతం వరకూ మనుషులు పెరిగిన వాతావరణం లాంటి ఇతర కారణాలే ఏ చేతి అలవాటన్నది నిర్ణయిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)