కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు: భారత ప్రజాస్వామిక సంస్కృతిపై దాడి' - విపక్ష నేత; 'ఇది అభివృద్ధికి నాంది' - బీజేపీ నేత..

ఫొటో సోర్స్, Alamy
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని ప్రభుత్వం సవరించడంపై భారత్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలక ప్రతిపక్షాలైన బీజేపీ సీనియర్ నాయకుడు వైజయంత్ జయ్ పాండా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ నిర్ణయంపై తమ ఆలోచనలను బీబీసీతో పంచుకున్నారు. వీరి అభిప్రాయాలు వేరు వేరుగా చెప్పినవే. ఒకరి అభిప్రాయానికి మరొకరు స్పందించి చెప్పినవి కాదు.
ఇప్పుడిక కశ్మీర్ చాలా బాగుపడే అవకాశముంది: వైజయంత్ పాండా
''కశ్మీర్ అంశంలో ప్రభుత్వ చర్యను బీజేపీ మద్దతుదారులే కాదు, చాలా మంది భారతీయులు హర్షిస్తున్నారు. దీనికి చాలా మంది విపక్ష నాయకులు కూడా మద్దతు పలికారు'' అని బీజేపీ ఉపాధ్యక్షుడు, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన వైజయంత్ జయ్ పాండా చెప్పారు. బైజయంత్ అభిప్రాయం ఆయన మాటల్లోనే:
''ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ప్రతికూల ఫలితాలు ఇస్తుందని కశ్మీరీ వేర్పాటువాదులు, దేశంలోని కొందరు విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఆర్టికల్ 370 సవరణకు ముందు దశాబ్దాల్లోని పరిస్థితులతో పోలిస్తే, సవరణ తర్వాత పరిస్థితులు దిగజారొచ్చని చెప్పలేం.
ఆర్టికల్ 370 ఉన్న కాలంలో కశ్మీర్‌లో 40 మందికి పైగా చనిపోయారు. కశ్మీర్‌పై భారత్, పాకిస్తాన్ మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. మరో పరిమిత స్థాయి యుద్ధం జరిగింది.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో మైనారిటీలైన పండిట్లను పీడించారు. ఇస్లామిక్ మిలిటెన్సీ పెరుగుతూ వచ్చింది. 1990ల్లో వేల మంది పండిట్లను కశ్మీర్ వదిలివెళ్లేలా చేశారు.
ఆర్టికల్ 370 సవరణతో కశ్మీర్లో పరిస్థితులు అసాధారణ స్థాయిలో మెరుగుపడే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక ప్రగతిశీల తీర్పులు, భారత పార్లమెంటు చేసిన చట్టాలు ఆర్టికల్ 370, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా జమ్మూకశ్మీర్‌కు వర్తించలేదు. బాల్య వివాహాల నివారణ చట్టం, దళితుల హక్కుల చట్టం, మహిళలపై, ఎల్‌జీబీటీ వర్గాలపై వివక్ష నిర్మూలన, అవినీతి నిర్మూలన, ఇతర అంశాలకు సంబంధించినవి ఈ జాబితాలో ఉన్నాయి.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 1949లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో అధికరణ 370ని చేర్చింది. కానీ, ఇది దీర్ఘకాలం కొనసాగించగలిగేది కాదు. ఈ విషయాన్ని స్వయంగా నెహ్రూయే చెప్పారు. 'ఆర్టికల్ 370'ని తాత్కాలిక వెసులుబాటు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు కూడా.
ఇతర సంస్థానాలకు వర్తించే నిబంధనల ప్రకారమే కశ్మీర్ 1947 అక్టోబరులో భారత్‌లో విలీనమైంది.
ఆర్టికల్ 370 తీసుకురావడం, దానిని సవరించడం పూర్తిగా భారత పార్లమెంటు పరిధిలోని వ్యవహారాలు. పాకిస్తాన్‌కుగాని, మరోదైనా సంస్థకుగాని ఇందులో చట్టపరమైన పాత్ర ఏదీ లేదు.
భారత్‌లోని ఇతర ప్రాంతాల పౌరుల మాదిరే కశ్మీరీలకు కూడా ఇంతకుముందున్నట్లే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి. కశ్మీర్లో ఎన్నికలు కూడా జరుగుతాయి. 20 కోట్ల మందికి పైగా ముస్లింలు సహా దేశంలోని మొత్తం 136 కోట్ల మందిలాగే వారికి కూడా సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులు ఉంటాయి.
జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల రాష్ట్రాలతో పోలిస్తే పరిపాలనాపరమైన అధికారాలు తక్కువగా ఉంటాయి. ఈ చర్యతో భద్రతా పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర వనరులను మరింత బాగా సమన్వయ పరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.

ఫొటో సోర్స్, ABID BHAT
1948 నుంచి జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. తలసరి ప్రాతిపదికన చూస్తే దేశంలోని మిగతా ప్రాంతం కన్నా ఇక్కడ నాలుగు రెట్లు అధికంగా అందిస్తోంది. ఇంతగా నిధులు వెచ్చిస్తున్నా, తగిన ఫలితం రావడం లేదు.
పలు సామాజిక, ఆర్థిక కొలమానాల ప్రకారం- భారత సగటుకు జమ్మూకశ్మీర్ దగ్గరగా ఉండటానికి కారణం జమ్మూకశ్మీర్ సొంతంగా అభివృద్ధి చెందడం కాదు, జమ్మూకశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం భారీగా అందిస్తున్న నిధులే.
ప్రత్యేక ప్రతిపత్తి ఆర్థిక అవకతవకలకు తావిచ్చింది. దీనివల్ల భారత ప్రభుత్వ ఖజానాకు పెద్దయెత్తున నష్టం వాటిల్లింది. దీనికి భద్రతా కారణాలు తోడవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు కూడా విఘాతం కలిగింది.
ఆర్టికల్ 370 సవరణతో ఈ పరిస్థితులు సమూలంగా మారిపోనున్నాయి. అక్టోబరులో ఒక పెద్ద వాణిజ్య సదస్సు జమ్మూకశ్మీర్లో జరుగనుంది. జమ్మూకశ్మీర్లో పెద్దయెత్తున పెట్టుబడులు పెడతామని భారత భారీ కంపెనీలు కొన్ని ఇప్పటికే సంకేతాలిచ్చాయి. ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇతర కంపెనీలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి.
భారత ఉపఖండమంతటా భూమి ఓ ఉద్వేగభరితమైన అంశం. ఇందుకు జమ్మూకశ్మీర్ మినహాయింపు కాదు. ఆర్టికల్ 370 భారత్‌లోని ఇతర ప్రాంతాల వారు ఇక్కడ భూమి కొనడానికి వీల్లేకుండా చేసింది. కశ్మీరీయేతరులను పెళ్లాడే కశ్మీరీ మహిళలకు ఇక్కడి భూమిపై హక్కులు కోల్పోయేలా చేసింది. ఆధునిక, ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి వివక్షకు తావు ఉండదు.
కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటికీ, జమ్మూకశ్మీర్లో పరిస్థితికీ మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంది.
ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్‌నే తీసుకోండి. భారత్‌లోని ఇతర ప్రాంతాల వారు హిమాచల్‌లో భూమి కొనాలంటే నిర్దేశిత కాలం వారు ఈ రాష్ట్రంలోనే నివసించి ఉండాలి. ఫలానా ప్రాంతంలో భూమిని కొనాలంటే అక్కడ నిర్దేశిత కాలం నివసించి ఉండాలనే నిబంధన ఒక విధంగా మంచిదే. కానీ ప్రాంతీయవాదంతో లేదా స్త్రీ, పురుషులనే తేడాతో భూమి కొనుగోలుపై పూర్తి నిషేధం అమలు చేయడం వెలివేత ధోరణులకు ఊతమిస్తుంది.

ఫొటో సోర్స్, ABID BHAT
భారత్‌లో ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్మూకశ్మీర్ జనసంఖ్యలో వర్గాల వారీ మార్పులు రాకుండా చూడాలనే వాదనలు కూడా ఉన్నాయి.
ద్విజాతి సిద్ధాంతం పునాదిగా ఉన్న పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో మైనారిటీల పరిస్థితి మెరుగ్గా ఉంది.
పాకిస్తాన్లో మైనారిటీల శాతం తగ్గిపోతుండగా, భారత్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. దేశ విభజన తర్వాత భారత్‌లో 10 శాతానికి లోపున్న మైనారిటీల జనాభా, ఇప్పుడు 14 శాతానికి పైగా ఉంది.
భారత ముస్లింలు సర్వతోముఖంగా రాణిస్తున్నారు. రాజకీయ, న్యాయ, సైనిక రంగాల్లో ఉన్నతస్థాయి పదవులు చేపట్టారు. దేశంలోని బిలియనీర్లలో ముస్లింలు కూడా ఉన్నారు.
కశ్మీరీలు కోరుకొన్న స్వయంప్రతిపత్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత సమాఖ్య వ్యవస్థలో ఇమిడి ఉంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లేదా భవిష్యత్తులో తిరిగి రాష్ట్రంగా భారత్‌లో పూర్తిగా అంతర్భాగమైన ప్రాంతంగా జమ్మూకశ్మీర్ కొనసాగుతుంది. భారత సమాఖ్య వ్యవస్థ పరిధిలోని స్వయం ప్రతిపత్తితో జమ్మూకశ్మీర్ ప్రజల జీవనం మెరుగుపడుతుంది.
ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పినట్లు ఆర్టికల్ 370 సవరణతో ఇతర దేశాలకు, విదేశీ సంస్థలకు ఎలాంటి సంబంధమూ లేదు.
ఆర్టికల్ 370 సవరణ దృష్ట్యా జమ్మూకశ్మీర్లో చేపట్టిన తాత్కాలిక భద్రతా చర్యలు హింసను, మరణాలను నివారించాయి.
ఇక పాకిస్తాన్‌తో చర్చల విషయానికి వస్తే- సిమ్లా ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకొనేందుకు, వివాదానికి ముగింపు పలికేందుకు ఉభయ దేశాలూ చర్యలు చేపట్టాలని ఈ ఒప్పందం చెబుతోంది.''

కశ్మీర్ చర్య ప్రజాస్వామ్యానికి ద్రోహం: శశి థరూర్
''కశ్మీర్ తన 'శాశ్వత నివాసుల'ను నిర్వచించటానికి ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ వీలుకల్పించాయి. ఇవి కశ్మీరీలను ప్రత్యేకంగా గుర్తిస్తాయి. ఇతరులు అక్కడ ఆస్తులు సంపాదించకుండా నిరోధించటం వంటి పలు ముఖ్యమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ అధికరణలను రద్దు చేయటం ఓ సాహసోపేతమైన చర్యగా చెప్తున్నారు'' అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశిథరూర్ పేర్కొన్నరు.
శశి థరూర్ అభిప్రాయం ఆయన మాటల్లోనే:
''ఈ స్వయంప్రతిపత్తి అనేది కశ్మీర్ లోయలో వేర్పాటు భావనను పెంచిందని, ఈ ప్రాంతంలో భారీ స్థాయి వేర్పాటు వాద హింసను నిరోధించలేదని ప్రభుత్వాన్ని సమర్థించేవారు వాదిస్తున్నారు.
ఇది ఇస్లామీకరణకు తోడ్పడిందని, దానివల్ల కశ్మీరీ పండిట్లను (అగ్రకుల హిందువులను) లోయలోని తమ సంప్రదాయ ఇళ్ల నుండి కిరాతకంగా హింసించి తరిమివేయటానికి దారితీసిందని వారు అంటారు. ప్రగతిశీల భారత చట్టాలు, కోర్టు తీర్పులు (షెడ్యూల్డు కులాలు, దళిత సమాజానికి హక్కులు, రిజర్వేషన్లు వంటివి) ఈ రాష్ట్రానికి వర్తించకుండా ప్రత్యేక ప్రతిపత్తి నిరోధించిందని అంటున్నారు.
అదంతా నిజమే. కానీ, ఆర్టికల్ 370 అందుకు కారణం కాదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటం వల్ల కశ్మీరేతరులు ఇక్కడ భూమి కొనటానికి స్వేచ్ఛ ఉంటుందని, మరింత స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టగలరని కాబట్టి రాష్ట్రంలో మరింత ఆర్థికాభివృద్ధి జరిగే వీలు కల్పిస్తుందని దీనిని సమర్థించేవారు వాదిస్తున్నారు.
నిజానికి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కొన్ని వారాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ ఇతర రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడిదారులను ఒక సదస్సుకు ఆహ్వానించారు. భారతదేశపు అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అయిన రిలయన్స్ సహా బడా కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులు ప్రారంభించాలన్న తమ ఆసక్తిని తెలియజేశాయి. ఈ రాష్ట్రంలోపల, రాష్ట్రం గురించి భవిష్యత్ బ్లాక్‌బస్టర్లను రూపొందించటానికి అవకాశమున్న అన్ని టైటిల్స్‌నూ బుక్ చేయటానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్లు పోటీపడుతున్నారు.
ఇక హరియాణాకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తమ లింగ నిష్పత్తి అసమతౌల్య సమస్యలను కశ్మీరీ యువతులను దిగుమతి చేసుకోవటం ద్వారా మరింత సులభంగా అధిగమించవచ్చునని అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు.
అయితే, ఈ నిర్ణయం వల్ల జరిగిన తక్షణ, మధ్యకాలిక నష్టం... ఊహాజనితమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా చాలా అధికంగా ఉంటుందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
అన్నిటికన్నా ప్రధానమైనది... భారత ప్రజాస్వామిక సంస్కృతి మీద హింస: భారత గణతంత్రంతో జమ్మూకశ్మీర్ ప్రజల ప్రాథమిక రాజ్యాంగ సంబంధాన్ని అక్కడి ప్రజలు లేదా వారు ఎన్నుకున్న ప్రతినిధులను సంప్రదించకుండానే భారత ప్రభుత్వం మార్చేసింది.
ఇక్కడ ఉపయోగించిన చట్టపరమైన గారడీ... ఇతర భారత రాష్ట్రాలకు అశుభ సంకేతాలు పంపిస్తోంది: జమ్మూకశ్మీర్ విషయంలో ఇలా చేయగలిగితే... భవిష్యత్‌లో మీ రాష్ట్రాల విషయంలో కూడా ఇలా చేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్ ప్రత్యక్ష కేంద్ర పాలనలో ఉన్నపుడు ఆ రాష్ట్ర సమ్మతిని తీసుకున్నామని (భారత రాజ్యాంగానికి అవసరమైన విధంగా) ప్రకటించటం ద్వారా 'రాష్ట్రం' అంటే అర్థం దిల్లీ తాను స్వయంగా నియమించిన గవర్నరే అని చెప్పినట్లయింది. తద్వారా రాజ్యాంగాన్ని సవరించటానికి ప్రభుత్వం నిజానికి తన సొంత సమ్మతినే పరిగణనలోకి తీసుకుంది.
రాష్ట్ర శాసనసభ ఆరు నెలలకు పైగా సస్పెన్షన్‌లో ఉండగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాజకీయ నాయకులు 'ముందస్తు' అరెస్టులో ఉన్నపుడు, స్థానిక రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఈ నిర్ణయాన్ని పార్లమెంటు (ఇక్కడ అధికార పార్టీకి ఉన్న మెజారిటీ దీనిని తక్షణం ఆమోదించటానికి గ్యారంటీ ఇచ్చింది) ముందుకు తీసుకువచ్చారు.
ఈ కుట్రను అమలు చేసినపుడు కశ్మీర్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది: విద్యా సంస్థలు మూసివేశారు. పరీక్షలు వాయిదా వేశారు. దుకాణాలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. టెలివిజన్ నెట్‌వర్క్‌లను సస్పెండ్ చేశారు. సమాచార వ్యవస్థలను కత్తిరించారు. లాండ్‌లైన్లను బ్లాక్ చేశారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.
మన కశ్మీరీ పౌరుల్లో అత్యధికుల. వారి హోదా మారుతుండగా దాదాపు పూర్తిగా బలవంతపు దిగ్బంధంలో ఉండేలా చేశారు.
ప్రభుత్వం చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తోందని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఒప్పించగలిగినప్పటికీ, ఈ చర్య భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని వంచిస్తోంది. ప్రభుత్వ చర్యను ''సైనిక పాలన'' అని అభివర్ణించటం సరైనదే.
ఆర్థిక నష్టం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్‌కు జీవనాడి అయిన పర్యాటక రంగం ధ్వంసమైంది. ఇక్కడ సాధారణ పరిస్థితులు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పటానికి.. కశ్మీర్‌కు వెళ్లవద్దంటూ విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులకు హెచ్చరికలు ఇవ్వటాన్ని తిప్పికొట్టటం కోసం ఈ రాష్ట్రం సంక్షోభంలో లేదని, సందర్శించటానికి సురక్షితమైనదేనని విదేశీయులకు భరోసా ఇవ్వటానికి భారత ప్రభుత్వాలన్నీ శతాబ్దాలుగా చేసిన కృషి ఈ చర్యతో నిష్ఫలమైంది.
విషాదం ఏమిటంటే, ప్రధానమంత్రి 2017లో ఈ రాష్ట్రాన్ని సందర్శించినపుడు.. టెర్రరిజం - టూరిజంలో ఏది కావాలో ఎంచుకోవాలని కశ్మీరీ యువతకు (ఇక్కడ నిరుద్యోగిత 24.6 శాతంగా ఉంది.. అది మిగతా భారతదేశంలో నిరుద్యోగం కన్నా రెట్టింపు) పిలుపునిచ్చారు.
ఈ నిరుద్యోగ యువతలో చాలా మందికి టూరిజం ఉపాధి కల్పించి ఉండేది. కానీ ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో విధించిన దిగ్బంధం వల్ల పర్యాటకులను విసిరికొట్టారు. విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులకు మళ్లీ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సుప్రసిద్ధమైన హౌస్‌బోట్లు వ్యాపారం లేక బోసిపోతున్నాయి. కశ్మీరీ గొప్ప కళాకారులైన హస్తకళలు, తివాచీ తయారీదారులు దివాళా తీశారు.
భారత లౌకికత్వానికి సగర్వ చిహ్నమైన అమర్‌నాథ్ యాత్రను - రాష్ట్రంలో మంచుతో నిండిన ఉత్తర ప్రాంతంలో గల ఆలయానికి ఏటా వేలాది మంది హిందూ తీర్థయాత్రికులను తీసుకు వెళ్లే యాత్రను - మూర్ఖంగా అర్థంతరంగా అడ్డుకున్నారు.

ఫొటో సోర్స్, ABID BHAT
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రజాస్వామిక పార్టీలు, వాటి నాయకులను బంధించటం ద్వారా ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక శక్తులకు చోటు కల్పిస్తోంది.
ప్రత్యేక ప్రతిపత్తి అన్నది అనేక మంది కశ్మీరీ నాయకులు భారతదేశంలో అంతర్గతంగా స్వయం ప్రతిపత్తిని సమర్థించే వారిగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు ఒక అవకాశంగా పనిచేసింది.
కానీ, ఇప్పుడు ఈ అవకాశాన్ని తొలగించారు. ఈ రాష్ట్ర ప్రధాన రాజకీయ నాయకులను నిమిత్తమాత్రులుగా, తీవ్రవాదాన్ని నిలువరించే శక్తి లేని వారిగా మార్చేసింది.
ఉగ్రవాదం మీద పోరాటంలో గెలుస్తున్నామని దిల్లీ పీఠం చెప్పుకుంటోంది. కానీ, ఇప్పుడది ఉగ్రవాదానికి కొత్త ఊపిరి పోసి ఉండొచ్చు. తీవ్రవాదులు చూపించటానికి కొత్త అన్యాయాన్ని అందించి ఉండొచ్చు. కశ్మీరీ యువత ఇంతకుముందు కన్నా మరింత ఎక్కువ సంఖ్యలో పెడదారిపట్టి వారితో కలిసేలా ఇది ప్రేరేపించవచ్చు. భారతదేశపు సాహసోపేత సైనికులను మరింత ఎక్కువగా ముప్పు ముంగిట పెట్టవచ్చు.
దిల్లీ సర్కారు చర్యలను ఇప్పటివరకూ శాంతియుతంగా ఆహ్వానించినప్పటికీ... ఈ దిగ్బంధాన్ని సడలించి, తొలగించిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి చెప్పటం కష్టం. ఆ దిగ్బంధాన్ని ఏదో ఒక రోజు తొలగించి తీరాల్సిందే కదా.''
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది...
- ‘శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారో కూడా ఫేస్‌బుక్‌కు తెలిసిపోతోంది’
- బిజినెస్ ట్రిప్‌లో శృంగారం చేస్తూ ఉద్యోగి మరణం... ఇది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్, పరిహారం చెల్లించాలన్న కోర్టు
- పాకిస్తాన్లో లీటర్ పాలు రూ. 140.. పెట్రోలు కంటే ఎక్కువ ధర.. కారణమేంటి?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
- కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్ష విజయవంతం... డీఆర్డీవోను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









