లక్ష్మీకుట్టీ అమ్మ: ‘విషానికి విరుగుడు ఈ బామ్మ నాటువైద్యం.. కేరళలో అడవుల్లో ప్రాణాలు కాపాడే జంగిల్ బామ్మ’

ఫొటో సోర్స్, PIB
ఆమె 75 ఏళ్ల బామ్మ. కేరళలోని కల్లార్ అటవీ ప్రాంతంలో ఓ గిరిజన తెగలో పుట్టారావిడ. దాదాపు అయిదు దశాబ్దాలుగా వనమూలికలతో చికిత్స చేస్తున్నారు. పాముకాటుకు వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. జంగిల్ బామ్మగా పేరుగాంచిన లక్ష్మీకుట్టీపై బీబీసీ ప్రతినిధి జయకుమార్ సుదందిరపాండియన్ అందిస్తున్న కథనం.
‘‘మేమంతా అడవి తల్లి బిడ్డలం. మేమందరం ఒకే తల్లి బిడ్డలం.
దక్షిణమైనా, ఉత్తరమైనా మేమంతా ఒక్కటే.
ఈ అడవి తల్లి ఒడిలో చెట్టుచెట్టుకో కథ.
పచ్చివి, పండినవి ఎన్నో పళ్లు. మేలు చేసే వేళ్లు మరెన్నో.
వసంతకాల పువ్వులు, వానాకాల చినుకులు, చలికాల రాత్రుళ్లు.. ఇలా రుతువులు ఇంకెన్నో.
చెంగుచెంగున దూకే జింకలు, నాట్య మయూరాలు, నక్కలు, పులులు, చిరుతలు.. మరెన్నో.
మేమంతా అడవి తల్లి బిడ్డలం. మేమందరం ఒకే తల్లి బిడ్డలం.’’
‘‘ఈ అడవే నాకు పాఠశాల. ఈ చెట్లు, పుట్టలే నా గురువులు. ప్రతి విషయాన్ని ఇక్కడే నేర్చుకున్నా. ఆ నేర్చుకున్నదాన్నే సమాజానికి పంచుతున్నా. ఎవరో ఒకరిని ప్రత్యేకంగా నా గురువని చెప్పలేను.
చీమ కుట్టిన వాళ్ల నుంచి పాము కాటుకు గురయిన వాళ్ల వరకూ.. అందరూ నా వద్దకు వస్తారు. చికిత్స చేయించుకుంటారు.
ఈ కథ ఏనాడో మొదలైంది. 28 ఏళ్ల వయసు నుంచి నేను ఈ పని చేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా ఎందరికో చికిత్స అందిస్తున్నాను.’’

తిరువనంతపురం జిల్లా, కల్లార్ అటవీ ప్రాంతంలో నివసించే కానీ అనే గిరిజన తెగలో లక్ష్మీ కుట్టీ జన్మించారు. ఆమె అయిదు వందలకు పైగా మూలికలు, మొక్కలను గుర్తించగలరు.
ఇక్కడి గిరిజన సముదాయంలో బడికి పోయిన తొలి మహిళ కూడా ఈ బామ్మే. 1950లో ఆమె తొలిసారిగా పాఠశాలకు వెళ్లారు.
ఇప్పటి వరకు ఆమె పాము కాటు నుంచి ఎందరినో కాపాడారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.

‘‘కేరళ ప్రభుత్వం 1995లో నాకు 'నాట్టు వైద్యరత్నం' అనే బిరుదును ప్రదానం చేసింది.
అయిదు వేల ఒక్క రూపాయి నగదు, ధన్వంతరి కాంస్యం విగ్రహంతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
బొటానికల్ గార్డెన్, పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలకు... ఔషధ మొక్కలు, మూలికలు ఏరి ఇస్తుంటాను. వారి ఆహ్వానిస్తే వెళ్లి ప్రసంగిస్తుంటాను. అలాగే కొన్ని కళాశాలల్లో బోధిస్తుంటాను.
నేను ప్రధానంగా విషానికి విరుగుడు ఇస్తాను. ఇందుకే నాకు పురస్కారాలు వచ్చాయి.
నా బాధ్యతను నేను నిర్వర్తించడం. ఇతరులకు సాయం చేయడం. రేపటి గురించి ఆలోచించకపోవడం... ఇదే నా సిద్ధాంతం. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది.’’

భారతదేశం నలుమూలల నుంచీ ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.
బామ్మ చికిత్సపై ఎంతో నమ్మకం ఉందని, ఆమె మందులిస్తే తప్పక నయమవుతుందని వారు చెబుతుంటారు.
ఇవి కూడా చదవండి:
- క్రయానిక్స్: చనిపోయాక బతకొచ్చా? మృత్యువును కూడా మోసం చేయొచ్చా?
- సోషల్ మీడియా హీరోగా మారిన నిరసనకారుడు
- బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. అమ్మగా మరో ఫైనల్లో
- నొక్కువిద్య పవక్కలీ: ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- భారత్: ‘ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం‘
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










