కేరళ సేల్స్ విమెన్ కూర్చునే హక్కు ఇలా సాధించుకున్నారు

కేరళలో సేల్స్ గర్ల్స్ కూర్చునే హక్కును సాధించుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రైట్ టు సిట్... అంటే కూర్చునే హక్కు. మహిళలు ఇటీవలే పోరాడి సాధించుకున్న హక్కు. దేశమంతా కానప్పటికీ.. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో సేల్స్ విమెన్ తమ పని వేళల్లో కూర్చునే హక్కును సాధించుకున్నారు. ఇటీవల కేరళకు వెళ్లిన బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య.. ఈ ప్రాథమిక హక్కు మహిళలకు ఇంతకాలం లభించకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నారు.

సేల్స్ విమెన్‌కు పరుగులతోనే రోజు ప్రారంభమవుతుంది. ఆపై పది గంటలు డ్యూటీ. అందులో ఎక్కువ సమయం నిలబడే ఉండాలి.

వీరు కూర్చునేందుకు చాలా మంది దుకాణాల యజమానులు అనుమతివ్వరు.

ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వం ఈ పద్ధతికి ముగింపు పలకడానికి అంగీకరించింది. కానీ పరిస్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు.

వీడియో క్యాప్షన్, కేరళ మహిళలు కూర్చునే హక్కు ఎలా సాధించారు?

‘‘ఈ షోరూమ్‌లలో పని చేసే మహిళలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి నిరాకరించారు. నేను వారితో విడిగా మాట్లాడినపుడు.. ఉద్యోగం పోతుందన్న భయం తమను వెంటాడుతోందని వారు అన్నారు.

పని వేళల్లో కొద్ది సేపు కూర్చునే తమ హక్కు కోసం మేనేజర్ల ముందు గొంతు విప్పే ధైర్యం చేయలేకపోతున్నారు’’ అని బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య చెప్పారు.

ఈ హక్కు కోసం అడిగినందుకు మాయను ఉద్యోగంలోంచి తొలగించారు. నాలుగేళ్ల క్రితం ఆమె ఒక పేరున్న చీరల షోరూమ్‌లో పని చేస్తుండేది. పనితో ఆమె బాగా అలసిపోయేది. కానీ తన పని పట్ల గర్వపడుతుండేది.

మిగతా సేల్స్ విమెన్ లాగానే ఆమెకు కూడా కనీసం టాయిలెట్‌ సౌకర్యం కూడా ఉండేది కాదు.

మాయ
ఫొటో క్యాప్షన్, హక్కుల గురించి ప్రశ్నించినందుకు మాయ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది

‘మాకు కాళ్ల నొప్పులు, వెరికోస్ వెయిన్స్, గర్భాశయ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యేవి. హక్కులు సాధించుకోవాలంటే లేచి నిలబడాల్సిందేనని నాకర్థమైంది. అందుకే నేను రైట్ టు సిట్ ఉద్యమంలో చేరాను’ అంటారు మాయ.

ఈ ఉద్యమ నాయకురాలైన విజ్జీ నుంచి మాయ ప్రేరణ పొందారు. వృత్తిరీత్యా దర్జీ పని చేసే విజ్జీ మహిళలు కూర్చునే హక్కు కోసం పేరున్న ట్రేడ్ యూనియన్ల నేతలను కలిసి మద్దతు కోరారు.

కానీ.. ఇదంత ప్రధానమైన సమస్య కాదని ఆ సంఘాల నేతలు అనడంతో, విజ్జీ స్వయంగా తమ సొంత కార్మిక సంఘాన్ని ప్రారంభించారు.

‘వస్త్ర పరిశ్రమలో పని చేసే ఈ మహిళలకు కార్మిక చట్టాల గురించి అవగాహన లేదు. ఎవరైనా తమకెదురవుతున్న ఇబ్బందుల గురించి భర్తలతో చెప్పుకుంటే వారు వీళ్లనే తప్పుపడతారు. ఈ కారణాల వల్లనే వీరి సమస్యల పరిష్కారం కోసం నేను గొంతు విప్పాల్సి వచ్చింది’ అని విజ్జీ వివరించారు.

'కూర్చునే హక్కు' కోసం విజి సమావేశం( నిలబడిన మహిళ)

ఫొటో సోర్స్, Image copyrightCOURTESY VIJI PALITHODI

ఫొటో క్యాప్షన్, 'కూర్చునే హక్కు' కోసం విజ్జీ సమావేశం( నిలబడిన మహిళ)

మరోవైపు వ్యాపార సంఘాల నేతలు మాత్రం పని వేళల్లో మహిళలకు కూర్చునేందుకు చాలానే అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు.

‘‘కేరళలో వేలాది మంది దుకాణదారులున్నారు. ఒకరో, ఇద్దరో లేదా కొద్ది మందో తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారంటే దానర్థం అందరూ చెడ్డవారని కాదు’’ అని ఓ దుకాణ యజమాని చెప్పారు.

కానీ, వ్యాపారుల అనుచిత వైఖరి గురించి తమకు సేల్స్ విమెన్ నుంచి చాలా ఫిర్యాదులొచ్చాయని కేరళ ప్రభుత్వం చెబుతోంది.

అలాంటి వారికి జరిమానా విధించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. కానీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేంత వరకు.. సేల్స్ విమెన్‌ తమ హక్కుల కోసం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)