క్రయానిక్స్: చనిపోయాక కూడా బతకొచ్చా? మృత్యువును మోసం చేయడం ఎలా?

- రచయిత, ఎలియనార్ లారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీకు మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా? మృతదేహం పక్కన పనిచేసే ధైర్యం ఉందా? ఒత్తిడిలో కూడా లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారా?
ఇవేవో మార్చురీలో పనిచేయడానికి కావాల్సిన అర్హతలు కావు. క్రయానిక్స్ టెక్నీషియన్ ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు.
ఇంతకూ వీళ్లు ఏం చేస్తారననేనా మీ సందేహం?
అప్పుడే మరణించిన వారి శరీరాలను భద్రపరిచి, భవిష్యత్తులో వారికి ప్రాణం పోసే అవకాశం కల్పించడం వీళ్ల పని.
మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందేకొద్దీ, జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందని విశ్వసించే వాళ్ల కోసం, ఈ క్రయానిక్స్ టెక్నీషియన్స్ ఆసుపత్రుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తారని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Cryonics Institute
క్రయానిక్స్ అంటే ఏమిటి?
మరణించిన వారి శరీరం, మెదడు పాడవకుండా వాళ్ల శరీరాలను ఫ్రీజ్ చేసి భద్రపరచడమే క్రయానిక్స్.
పేషెంట్ ఏ కారణంతో అయితే చనిపోయాడో, భవిష్యత్తులో మెడికల్ సైన్స్ దానికి పరిష్కారాన్ని కనుగొని, వాళ్లను తిరిగి బతికించడానికి క్రయానిక్స్ ఉపయోగపడుతుందని క్రయానిక్స్ టెక్నీషియన్స్ అంటున్నారు.
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది.
సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, శరీరం పాడవడాన్ని అరికట్టడానికి శరీరానికి ఐస్ బాత్ చేయించాలి.
ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు.
ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, లిక్విడ్ నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు.

ఫొటో సోర్స్, Cryonics Institute
2 వేల మంది క్యూలో ఉన్నారు
నిజానికి 1970ల నుంచే క్రయానిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం అమెరికా, రష్యాలలో మాత్రమే ఇలా శరీరాలను భద్రపరిచే సదుపాయాలున్నాయి.
అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఉన్న క్రయానిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇందుకోసం ఇప్పటికే 2 వేల మంది సంతకాలు చేయగా, 165 మంది శరీరాలను ఇప్పటికే ఇలా భద్రపరిచారు.
పారామెడిక్‌గా పని చేసే డెన్నిస్ కోవాల్‌స్కీ ఈ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు. ఇక్కడ క్రయానిక్ కార్యకలాపాలు ఆయనే నిర్వహిస్తారు.
తన పని గురించి వివరిస్తూ.. ''క్రయానిక్ టెక్నీషియన్ కోసం ఫ్యునరల్ డైరెక్టర్ లైసెన్స్, పెర్‌ఫ్యూజన్ పంపును నడపడంలో అనుభవం, కొన్ని ప్రాథమిక సర్జికల్ నైపుణ్యాలు అవసరం. కృత్రిమ మేధస్సు, జెనెటిక్ మార్పులు, స్టెమ్ సెల్ ఇంజనీరింగ్ - ఇవన్నీ కూడా మా పని సరైనదేనని నిరూపిస్తున్నాయి'' అని డెన్నిస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Fisher Studios
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం కేవలం ముగ్గురే సిబ్బంది ఉన్నారు. కానీ మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ తమ సంఖ్యను పెంచుకుంటామని డెన్నిస్ తెలిపారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇలా 5 వేల మంది తమ శరీరాలను భద్రపరచాలని సంతకాలు చేశారని ఆయన తెలిపారు.
ఇలా తన శరీరాన్ని భద్రపరచాలంటూ ఒప్పందం కుదుర్చుకున్న వారిలో డాక్టర్ ఆండర్స్ సాండ్‌బర్గ్ ఒకరు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఉన్నారు.
బ్రెయిన్ ప్రిజర్వేషన్ ఫౌండేషన్ బోర్డు సభ్యుడైన సాండ్‌బర్గ్, తన మరణాంతరం కేవలం తన తలను మాత్రమే భద్రపరచాలని ఒప్పందం చేసుకున్నారు.
డెన్నిస్‌లాగే సాండ్‌బర్గ్ కూడా ఆశావాది. భవిష్యత్తులో ప్రతి ఆసుపత్రిలోను ఒక క్రయానిక్స్ టెక్నీషియన్ ఉంటాడని ఆయన భావిస్తున్నారు.
''గుండె లేదా బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు మరింత సమయం కోసం డాక్టర్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. శరీరాన్ని మొత్తం భద్రపరచడం కూడా ఇలాంటిదే'' అని సాండ్‌బర్గ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రయానిక్స్, క్రయోజెనిక్స్
ఈ రెండూ ఒకే విధంగా కనిపించినా, నిజానికి శాస్త్ర పరిభాషలో ఈ రెండూ వేర్వేరు.
క్రయానిక్స్ మరణాంతరం శరీరాన్ని భద్రపరచడానికి సంబంధించిన సబ్జెక్ట్. క్రయానిక్స్‌ను సమర్థించే వాళ్లలో చాలా మంది - మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి సాధ్యమవుతుందో తమకు ఖచ్చితంగా తెలీదని అన్నారు.
ఇలా శరీరాన్ని భద్రపరిచే సాంకేతిక పరిజ్ఞానం నిజంగా పని చేస్తుందో లేదో కూడా వాళ్లకు తెలీదు.

ఫొటో సోర్స్, Getty Images
అదే సమయంలో క్రయోజనిక్స్‌ను ఇప్పటికే అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. దీనిలో భవిష్యత్ అవసరాల కోసం వీర్యం, అండాలు, చర్మం మొదలైన వాటిని మైనస్ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.
అయితే లండన్‌లోని కింగ్స్ కాలేజిలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న క్లైవ్ కోయెన్ ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయానిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అన్నారు. అవయవ మార్పడిలో మాత్రం దీని వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సైన్స్ కాంగ్రెస్‌కు దలైలామా ఎందుకు హాజరుకాలేదు?
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
- రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- మీకు హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉందో లేదో ఇది చెప్పేస్తుంది
- కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా?
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








