ప్రాణాలు తీస్తున్న అంతుచిక్కని వ్యాధి.. కాపాడేందుకు వ్యాక్సిన్ కూడా లేదు

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, డాక్టర్ చార్లీ వెల్లర్
- హోదా, వెల్‌కమ్ ట్రస్ట్ వ్యాక్సిన్స్ విభాగం అధిపతి
ఈ ఏడాది ప్రారంభం నుంచి నైజీరియాలో ప్రాణాంతక వ్యాధి విజృంభిస్తోంది. లసా వైరస్ ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఇది మరెన్నో వ్యాధులకు కారణం అవుతోంది. కానీ ఈ వ్యాధికి ఇంత వరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు.
లసా జ్వరం కొత్తదేం కాదు. కానీ ప్రస్తుతం ఇది గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రబలుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తోంది.
రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతోంది. ఇప్పటికే పలువురు వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు.
ఈ వ్యాధి వైరల్ హెమరాజిక్ జ్వరంగా మారి శరీరంలో అనేక భాగాలపై ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రక్తనాళాలను ధ్వంసం చేస్తుంది.
చికిత్సకు ఈ వ్యాధి లొంగడం లేదు.
లసా జ్వరం లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పితో పాటు కాస్త బలహీనంగా ఉంటారు. కొందరికి ఇవేవీ ఉండకపోవచ్చు.
కానీ వైరల్ హెమరాజిక్ జ్వరం, ఎబోలా వంటి వ్యాధులకు ఇది కారణం అవుతోంది. ఫలితంగా ముక్కు, నోరు, శరీరంలోని ఇతర భాగాల నుంచి రక్తం కారడం వంటివి జరుగుతున్నాయి.
ఒక శాతం కేసులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
గర్భిణులకు ఈ వ్యాధి సోకితే కడుపులోని బిడ్డ చనిపోవడమో, లేదంటే వారే మృతి చెందడమో జరుగుతోంది.
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం.. గత జనవరి నుంచి ఇప్పటి వరకు నైజీరియాలో 1000 లసా జ్వరం కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Science Photo Library
కారణాలేంటి?
ఈ వ్యాధితో ఇప్పటి వరకు 90 మంది చనిపోయారు. కానీ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే లసా జ్వరాన్ని గుర్తించడం అంత సులువు కాదు.
మొదట్లో ఈ వ్యాధిని గుర్తించడం అసాధ్యంగా ఉండేది. ఈ వ్యాధి లక్షణాలు కూడా అచ్చం మలేరియా, డెంగ్యూ వ్యాధి లక్షణాల మాదిరిగానే ఉండేవి.
లసా జ్వరాన్ని గుర్తించడానికి కచ్చితమైన పరీక్ష కూడా ఏదీ లేదు. రక్త పరీక్ష లేదా కణజాల పరీక్ష వల్ల మాత్రమే ఇది నిర్ధరణ అవుతుంది. అయితే, ఈ పరీక్ష చేసే ల్యాబ్‌లు చాలా పరిమితంగా ఉన్నాయి.
1969లో లసా పట్టణంలో ఈ వ్యాధి తొలిసారిగా బయటపడింది.
ఆ తర్వాత పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి తరచుగా కనిపిస్తోంది.
కానీ ఈసారి కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
దీనికి కారణాలు ఏమిటన్నది వైద్యులకు అంతుచిక్కడం లేదు.
వాతావరణ మార్పుల వల్ల ఇది మరింత విస్తరిస్తోందని అంచనా వేస్తున్నారు.
ఎలుకలు, ఇతర క్షీరదాల వల్ల ఇది మనుషులకు ఎక్కువగా సోకుతోంది.
ఎలుక మల, మూత్రాలు, రక్తం లేదా లాలాజలం అంటిన ఆహారం తినడం వల్ల చాలా మందికి లసా జ్వరం వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎబోలా మాదిరిగానే..
వైరస్‌లో రోగనిరోధక శక్తి పెరగడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
అందుకే రోగి బంధువులు, చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతోంది.
లసా జ్వరానికి మూడు వారాల వరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
ఎబోలా మాదిరిగానే లసా వైరస్ జ్వరం తగ్గిన తర్వాత కూడా శరీరంలోనే ఉండి, సెక్స్ సమయంలో ఇతరులకు వ్యాపిస్తుందా లేదా అన్న విషయంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ఈ వ్యాధిని నియంత్రించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, నైజీరియా అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తోంది.
బ్రిటన్ కూడా తన వైద్య బృందాన్ని నైజీరియాకు పంపించింది.

ఫొటో సోర్స్, EPA
దీన్ని ఎలా నిరోధించొచ్చు?
ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎలుకలు ఇంట్లోకి రాకుండా అన్ని రంధ్రాలను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆహారంపై మూతలు పెట్టాలని, వ్యర్థాలను మూత ఉన్న డస్ట్‌బిన్లలో మాత్రమే వేయాలని సూచించారు.
ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి.
(బీబీసీ విజ్ఞప్తి మేరకు వెల్‌కమ్ ట్రస్ట్ వ్యాక్సిన్స్ విభాగం అధిపతి డాక్టర్ చార్లీ వెల్లర్ ఈ కథనం రాశారు.)
ఇవి కూడా చదవండి:
- శ్రీదేవికి ఆస్కార్ నివాళి
- సెక్స్‌కూ గుండెపోటుకు సంబంధముందా?
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- ‘‘నాగాలాండ్ దాటి ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు’’
- సిరియా: అసలేం జరుగుతోంది? ఎవరు ఎవరి వైపు?
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
- అతి పేద సీఎం మాణిక్ సర్కార్ స్థానాన్ని భర్తీ చేసేది ఈయనే!!
- ‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి? ఇది మోదీని పడగొట్టడానికా? మరింత బలపర్చడానికా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








