పాస్‌పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!

ఫొటో సోర్స్, iStock
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత విదేశాంగశాఖ తీసుకున్న పాస్‌పోర్ట్ రంగు మార్పిడి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం చదువు, డబ్బులేని కార్మికులను వేరు చేసి చూపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి.
భారత్‌లో పాస్‌పోర్టులు మూడు రకాలు.
ప్రభుత్వ పనిమీద విదేశాలకు వెళ్లేవారికి తెల్లరంగులో ఉండే అఫీషియల్ పాస్‌పోర్ట్ ఇస్తారు.
ఉన్నతాధికారులు, జాయింట్ సెక్రటరీ కంటే పెద్ద ర్యాంకులో ఉన్న వారికి కుంకుమ రంగులో ఉండే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇస్తారు.
మిగిలిన పౌరులందరికీ నీలం రంగులో ఉండే పాస్‌పోర్టు ఉంటుంది.
10వ తరగతి పాస్ కాని వారు, గల్ఫ్‌లోని 18దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి పాస్‌పోర్టుల మీద 'ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్' అనే ముద్ర ఉంటుంది.
గల్ఫ్ వెళ్లే వారు అక్కడ చిక్కుల్లో పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
మిగిలిన వారి పాస్‌పోర్టులపై 'ఇమ్మిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్' అని ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరమైన వారి పాస్‌పోర్టు రంగు మారబోతోంది.
వారికి నారింజ రంగులో ఉండే పాస్‌పోర్టు ఇస్తారు. ఇప్పటికే ఉన్న పాస్‌పోర్టులు మార్చుకోవాల్సిన అవసరం లేదు.
కొత్తగా ఇచ్చేవారికి మాత్రం రంగు మారుతుంది.
అంటే సదరు వ్యక్తి పాస్‌పోర్టు రంగు చూడగానే అతను వలస కార్మికుడని, తక్కువ ఆదాయం ఉన్నవాడనీ, పదో తరగతి కూడా చదువుకోలేదని తెలిసిపోతుంది.
ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
భారత పౌరులను రెండో తరగతి వారిగా చూపే ప్రయత్నమనీ, ప్రజలను విడదీసే బీజేపీ బుద్ధికి ఇది నిదర్శనమని ఆ పార్టీ విమర్శించింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

అయితే, పాస్‌పోర్ట్ రంగు మార్చడంలో తప్పు ఏమీ లేదని, దానివల్ల లాభం కానీ, నష్టం కానీ లేవని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు చూస్తోన్న ఒక ఉన్నతాధికారి.
ఒకవేళ ఈసీఆర్ కేటగిరీ పాస్‌పోర్ట్ రంగు మార్చడం వివక్ష అయితే, అసలు ఈసీఆర్ కేటగిరీ ఉండటం కూడా వివక్షే అవుతుందన్నారు.
విదేశాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదుకునేందుకు పాస్‌పోర్టు రంగు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం జెడ్డాలో చిక్కుకున్న ముగ్గురు తెలుగువారికి మాతృభాష మినహా మరే భాషా రాదు. భారత ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడటానికి వారికి హిందీ కూడా రాదు. అందుకే వారి సమస్య చక్కదిద్దడం కష్టమవుతోంది.
ఒకవేళ అటువంటి కార్మికుల పాస్‌పోర్ట్ రంగు వేరే ఉంటే, అప్పుడు వారి పాస్‌పోర్టు చూడగానే, వారిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు ఆ అధికారి.

ఫొటో సోర్స్, Getty Images
తూర్పు గోదావరి జిల్లా మల్కిపురం గ్రామం నుంచి కువైట్ వెళ్లి అక్కడ 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న కొల్లాబత్తుల వీర్రాజుతో బీబీసీ మాట్లాడింది.
"ఇప్పటి వరకూ ఇమ్మిగ్రేషన్, నాన్ ఇమ్మిగ్రేషన్ అంటూ పెద్ద తేడా లేదు. కాకపోతే ఇమ్మిగ్రేషన్ వాళ్లు స్టాంపు వేయించుకునే ప్రక్రియ ఉంటుంది. ఒకప్పుడు ఇమ్మిగ్రెంట్‌గా గల్ఫ్ వెళ్ళి, కనీసం 4 సంవత్సరాలు ఆ దేశంలో ఉంటే నాన్ ఇమ్మిగ్రెంట్ కేటగిరీ ఇచ్చేవారని వీర్రాజు చెప్పారు.
‘‘ప్రభుత్వం తెస్తున్న కొత్త నిబంధన చాలా తప్పు. చదువుకోని వారిని అపరాధ భావనకు గురిచేసే నిబంధన ఇది. పాస్‌పోర్ట్ రంగు మార్చాల్సిన అవసరం లేదు.
ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అతను ఏ కేటగిరీలో గల్ఫ్ వచ్చాడన్న ప్రశ్న వస్తుంది.
అంతగా కావాలంటే, చదువుకోని వారికి లేదా ఇమ్మిగ్రెంట్ కేటగిరీ వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పంపించాలి. అంతేకానీ ఇలాంటి తేడాలు చూపించడం సరికాదు.
ప్రభుత్వం చదువుకున్న వారిని వీఐపీలుగా చూడాలనుకుంటుందేమో. నేను ఇమ్మిగ్రెంట్‌గానూ, నాన్ ఇమ్మిగ్రెంట్‌గానూ గల్ఫ్ వెళ్లి వచ్చాను. తేడా కనిపించలేదు" అని కొల్లాబత్తుల వీర్రాజు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మసీదు కట్టించిన హిందూ వ్యాపారవేత్త
- దుబాయ్: మీరు చూడని కోణాలు.. కొత్త మంత్రిత్వ శాఖలు
- సౌదీలో భారీ కుంభకోణం
- జెరూసలెంలో భారత సంతతి సంగతేంటి?
- అమెరికా: రెండు లక్షల మంది సాల్వెడార్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి డెడ్‌లైన్ పెట్టిన ట్రంప్
- బానిసలుగా వచ్చినోళ్లు బాద్‌షాలయ్యారు!!
- అమెరికాలో 10శాతం మందికే పాస్‌పోర్టులు.. నిజమేనా?
- అమెరికా వీసా విధానంతో భారతీయులకు ఎంత నష్టం?
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








