యూఏఈ: సంతోషం, భవిష్యత్తు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) మంత్రిత్వ శాఖలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో సంతోషాన్ని పెంచేందుకు ఓ మంత్రిత్వ శాఖ, కృత్రిమ మేధస్సు అభివృద్ధికి మరోటి, భవిష్యత్తు అవసరాలను మెరుగు పరిచేందుకు 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యూచర్' .. ఇలా ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోనివి అయ్యుంటాయి అనుకుంటున్నారా? అలా ఏమీ కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంలో ఈ శాఖలన్నీ ఉన్నాయి.
గత నెలలో యూఏఈ పర్యటనకు వెళ్లాను.
ఇన్నాళ్లూ.. దుబాయిలో నింగిని తాకే ఎత్తైన భవంతులు, వ్యాపార సముదాయాలు తప్ప మరేవీ ఉండవన్న అభిప్రాయం నాకుండేది.
యూఏఈ గురించి అదో క్రూడాయిల్ ఉత్పత్తి కేంద్రం అన్న కోణంలోనే ఆలోచించేవాణ్ని. అరబ్ వాసులంతా సంపాదన గురించి మాత్రమే ఆలోంచించే గడుసు వ్యక్తులన్న చెడు అభిప్రాయం ఉండేది.
కానీ, పది రోజుల పర్యటన నా కళ్లు తెరిపించింది. ఇన్నాళ్లూ చాలా పరిమితంగా ఆలోచించానన్న విషయాన్ని గ్రహించేలా చేసింది.


ఫొటో సోర్స్, Getty Images
అరబ్‌లు చాలా 'స్మార్ట్'
సంప్రదాయ వస్త్రధారణలో అరబ్‌లు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ, వాళ్లు 'స్మార్ట్'.
ఇప్పటికే చాలా సంతోషకర జీవితాన్ని గడుపుతున్న వాళ్లు, భవిష్యత్తును మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవడంలో బిజీగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా దేశాలు కనీసం కలలోనైనా ఊహించలేని హైటెక్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అంగారక గ్రహంపై సొంతంగా ఓ నగరాన్ని నిర్మించేందుకు కూడా యూఏఈ కసరత్తులు చేస్తోంది. ప్రపంచానికే ఐటీ హబ్‌గా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది.

ఫొటో సోర్స్, RTA/VOLOCOPTER

ఊహకందని హైటెక్ సేవలు
ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయిలో పైలట్ రహిత స్కై ట్యాక్సీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే, డ్రోన్ల రేసింగ్ పోటీలు నిర్వహించేందుకూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఇలా సామాన్యులకు అర్థం కాని ఎన్నో రకాల హైటెక్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చే దిశగా దూసుకెళ్తోంది.
పొరుగున ఉన్న చాలా దేశాలూ ఉగ్రవాదం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి.
ఈ ఎడారి దేశం మాత్రం ఆకాశమే హద్దు అన్నట్టుగా ముందుకెళ్తోంది.

ఫొటో సోర్స్, EPA
ప్రపంచ దేశాలు అసూయపడే స్థాయిలో 90 లక్షల మంది ప్రజల భవిష్యత్తును మరింత ఉత్తేజితం చేసేందుకు కృషి చేస్తోంది.
అత్యంత సహనశీల సమాజం కలిగిన దేశాల్లో యూఏఈ ఒకటి. అయినా, వాళ్లు సామరస్యతను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాపారాల్లో ఎలా విజయం సాధించారో, ఆధ్యాత్మికంగానూ అలాగే ముందుకెళ్లాలన్న తపన వారిలో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, OMAR BIN SULTAN AL OLAMA/TWITTER
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) శాఖ
రానున్న కొద్దికాలంలో ఒమర్ బిన్ సుల్తాన్ ఏఐ ఒలామా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవచ్చు. ఎందుకంటే యూఏఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) శాఖా మంత్రి ఆయన!
27 ఏళ్ల ఒలామా రెండు నెలల క్రితమే మంత్రిగా నియమితులయ్యారు. గతంలో ఆయన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యూచర్' డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రధాని కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ సదస్సుకు నాయకత్వం వహించారు.
సరికొత్త సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు అభివృద్ధి కోసం ఒలామా పనిచేయాల్సి ఉంటుంది. దాంతో దేశ ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు, ప్రభుత్వ పనితీరును మెరుగు పరిచాలన్నది ప్రభుత్వ ఆలోచన.


ఫొటో సోర్స్, UAE govt website
'హ్యాపీనెస్' మంత్రిత్వ శాఖ
ఆర్థికంగా సుసంపన్నమైన దేశాల్లో యూఏఈ ఒకటి. 2016లో ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం దాదాపు రూ. 47 లక్షలు.
ఇక్కడ అందరూ సంతృప్తికరంగానే కనిపిస్తుంటారు. కానీ, వారిలో మరింత సంతోన్ని నింపేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తోంది! అందుకోసమే 'హ్యాపీనెస్' మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
ప్రజల్లో ఆనందాన్ని ప్రభుత్వం ఎలా పెంపొందిస్తుందన్న విషయంలో స్పష్టత లేదు. కానీ, ఆ శాఖ అధికారిక వెబ్‌సైట్ చూశాక 'ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో చేరడమే' లక్ష్యం అన్న విషయం మాత్రం అర్థమైంది.

ఫొటో సోర్స్, UAE govt website
నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం లేనంత వరకూ సంతోషంగా జీవించడం అసాధ్యం. కానీ, యూఏఈలో ప్రజాస్వామ్యం లేదు, వాక్ స్వాతంత్ర్యమూ లేదు.
అందుకే, తమ పౌరులకు స్వాతంత్ర్యం కల్పిస్తేనే యూఏఈ ప్రభుత్వం అనుకుంటున్న 'హ్యాపీనెస్' లక్ష్యం నెరవేరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








