దుబాయిలో రానున్నది పైలట్ లేని స్కై ట్యాక్సీల కాలమేనా?

ఫొటో సోర్స్, RTA/VOLOCOPTER
నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు టెక్ కంపెనీలు సరికొత్త పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. గగనతలంలో రివ్వున దూసుకెళ్లే స్కై ట్యాక్సీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు దుబాయి సిద్ధమవుతోంది.
ఈ ఏడాది ఆఖరులోగా పైలట్ రహిత ఎయిర్ ట్యాక్సీలను గగన తలంలో పరీక్షించేందుకు జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ వోలోకాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు దుబాయి రవాణా శాఖ అనుమతులు ఇచ్చింది.
ఇద్దరు ప్రయాణికులను సులువుగా తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్ క్రాఫ్ట్‌లను వోలోకాప్టర్ తయారు చేస్తోంది. ఈ స్కై ట్యాక్సీలు గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించగలవని ఆ సంస్థ చెబుతోంది. అరగంట సేపు గాలిలో తిరిగేందుకు వీలుగా తొమ్మిది బ్యాటరీలు ఉంటాయి. ఈ ట్యాక్సీల్లో భద్రతకు ఢోకా ఉండదని తయారీ సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, RTA/EHANG
అలాగే.. చైనాకు చెందిన డ్రోన్ తయారీ సంస్థ ఇహంగ్‌తోనూ దుబాయి రవాణా శాఖ కలిసి పనిచేస్తోంది. ఒక్కరిని తీసుకెళ్లగలిగే ఇహంగ్ 184 పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. ఇది ఎక్కడైనా సులువుగా ల్యాండవుతుందని చెబుతున్నారు.
ప్రాజెక్ట్ ఎలివేట్ పేరుతో ఉబర్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించింది. 2023లోగా తొలి 50 ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.
వాహన పేరుతో ఎయిర్‌బస్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. ఇవి నాలుగు నుంచి ఆరుగురిని మోసుకెళ్లగలవు. 2017 ఆఖరులో పరీక్షలు ప్రారంభించి.. 2020లోగా మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రత్నాలు చేస్తోంది.
ధరలు భరించగలమా?
గగన తలంలోనైనా ట్యాక్సీలో ఛార్జీలు తక్కువేనని ఉబర్ చెబుతోంది. ప్రస్తుతం ఉబర్ ఎక్స్ క్యాబ్ ఛార్జీలతో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే బ్యాటరీలతో ఈ ట్యాక్సీలు ఎంత దూరం నడుస్తాయన్న విషయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. మెరుగైన బ్యాటరీలతో సమస్య ఉండదని ఉబర్ ప్రతినిధులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, A3/AIRBUS

ఫొటో సోర్స్, Getty Images
ఈ గగనతల ట్యాక్సీలు వస్తే ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ ఓ సవాల్‌గా మారుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలూ మెరుగు పడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం... సెన్స్ అండ్ అవైడ్ అనే సాంకేతికతను నాసా అభివృద్ధి చేస్తోంది. దాంతో పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్‌ల మధ్య సమాచార మార్పిడి జరుగుతుందని.. ప్రమాదాలను నివారించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరో మూడు నాలుగేళ్లలో ఈ గగనతల ట్యాక్సీలను అందరూ చూసే అవకాశం రావచ్చు.
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)








