ఎలాన్ మస్క్: ట్విటర్‍ను ఎలాగైనా కొనాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు... పాయిజన్ పిల్ ఆయన కలకు గండి కొడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
స్పేస్-ఎక్స్ వ్యవస్థాపకుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన దృష్టినంతా ప్రస్తుతం సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌పై పెట్టినట్లు కనిపిస్తోంది. ట్విటర్‌ను ఎలాగైనా కొనుగోలు చేసే ఉద్దేశాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. మరోవైపు ఆయన్ను అడ్డుకునేందుకు ట్విటర్ యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విటర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు ట్విటర్ బోర్డు ప్రయత్నిస్తోంది. బలవంతంగా మస్క్ కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఆఖరి అస్త్రమైన పాయిజన్ పిల్ వ్యూహాన్ని ట్విటర్ బోర్డు తెరపైకి తీసుకొచ్చింది.
బలవంతంగా కంపెనీని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాయిజన్ పిల్ వ్యూహం పనిచేస్తుంది. ఇది అమలు చేసి కొత్త వ్యక్తులు 15 శాతానికి మించి సంస్థలో వాటా కొనుగోలు చేయకుండా అడ్డుకోవచ్చు.
ఈ వ్యూహాన్ని అమలుచేస్తే ప్రస్తుతమున్న వాటాదారులే తక్కువ ధరకు షేర్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్‌కు ట్విటర్ బోర్డు తెలియజేసింది. సంస్థను కొనుగోలు చేసేందుకు మస్క్ మంకుపట్టు పట్టుకుని కూర్చోవడంతో తాము ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ట్విటర్ బోర్డు పేర్కొంది.
సంస్థ మేనేజ్‌మెంట్ ఇష్టానికి వ్యతిరేకంగా సంస్థను నియంత్రణలోకి తీసుకోవడాన్ని బలవంతంగా సంస్థను కొనుగోలు చేయడంగా చెప్పుకోవచ్చు. ట్విటర్ విషయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ విక్రయాన్ని వ్యతిరేకిస్తోంది.
ఈ విషయంపై సెక్యూరిటీ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ మాజీ ఆర్థిక వేత్త జోష్ వైట్ బీబీసీతో మాట్లాడారు. ‘‘తమకు ఇష్టంలేని వ్యక్తులు సంస్థను టేకోవర్ చేసేసమయంలో ఉపయోగించే ఆఖరి అస్త్రమే పాయిజన్ పిల్’’అని వైట్ చెప్పారు.
‘‘దీన్ని అత్యంత అరుదైన చర్యగా చెప్పుకోవచ్చు.’’
‘‘తమ సంస్థకు వారు కడుతున్న విలువ సరిపోదని ట్విటర్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది’’అని వైట్ వివరించారు.
అయితే, ఇంతకుమించి ధర చెల్లించేందుకు తాను సిద్ధంగా లేనని ఇప్పటికే ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు. దీంతో ట్విటర్ బోర్డు తాజా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది.
వాటా కొనుగోలు నుంచి మొత్తం కంపెనీ వరకు..
మొదట సోషల్ మీడియాలో ఓటింగ్ నిర్వహించడం ద్వారా ట్విటర్‌ను కొనుగోలుచేసే ఉద్దేశాన్ని ఎలాన్ మస్క్ బయటపెట్టారు.
‘‘మీకు ఎడిట్ బటన్ కావాలా? వద్దా?’’అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు గత వారం 73.5 మిలియన్ల డాలర్లు(రూ.561.03 కోట్లు) షేర్లు కొనుగోలు చేయనున్నట్లు మస్క్ వెల్లడించారు. ఇది ట్విటర్‌లో 9.2 శాతం. దీంతో ట్విటర్‌లో ఆయన వాటా 25 శాతానికి పెరుగుతుంది.
దీని ద్వారా ఎలాన్ మస్క్ సంపదతోపాటు ట్విటర్ షేర్ల విలువ కూడా పెరిగింది.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ దగ్గరున్న ట్విటర్ షేర్లు, ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ దగ్గరున్న షేర్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది నవంబరులో జాక్ డోర్సీ ట్విటర్ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పరాగ్ అగర్వాల్ ఈ పదవిలోకి వచ్చారు.
ట్విటర్‌లో షేర్లను ఎలాన్ మస్క్ కొన్నప్పటి నుంచీ మస్క్, ట్విటర్ బోర్డుల మధ్య వివాదం మొదలైంది. మొదట్లో ట్విటర్ బోర్డులో మస్క్ కూడా చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై మస్క్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
ఈ వివాదంపై గత మంగళవారం ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ‘‘నేను ఇటీవల ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. ఆయన రాకతో బోర్డు విలువ పెరుగుతుంది’’అని పరాగ్ కూడా ట్వీట్ చేశారు.
మరోవైపు ‘‘పరాగ్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. రానున్న రోజుల్లో ట్విటర్ సేవలు మరింత మెరుగుపరచబోతున్నాం’’అని మస్క్ కూడా ట్వీట్ చేశారు. అయితే, బోర్డులో చేరుతున్నట్లు ఆయన సంకేతాలేమీ ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, ISHARA S. KODIKARA/AFP via Getty Images
సౌదీ ప్రిన్స్‌తో చర్చ
ట్విటర్‌ను పూర్తిగా కొనుగోలుచేసే ఉద్దేశాన్ని ఎలాన్ మస్క్ బహిరంగంగానే వెల్లడించారు. ఈ విషయంలో ట్విటర్‌లో భారీగా షేర్లున్న సౌదీ యువరాజు అల్‌వలీద్ బిల్ తలాల్‌తో ఆయన చర్చలు కూడా జరిపారు.
గత మంగళవారం ప్రిన్స్ అల్‌వలీద్‌కు ఎలాన్ మస్క్ ఒక ఆఫర్ ఇచ్చారు. తమ షేర్లను తనకు బదిలిచేస్తే 41.39 బిలియన్ డాలర్లు (3.2 లక్షల కోట్లు) ఇస్తామని ప్రిన్స్‌తో మస్క్ అన్నారు.
అయితే, మస్క్ ఆఫర్‌ను ప్రిన్స్ అల్‌వలీద్ తిరస్కరించారు. ‘‘ట్విటర్ వృద్ధి అంచనాలను దృష్టిలో పెట్టుకుంటే మస్క్ ఇచ్చిన ఆఫర్ అంత గొప్పగా ఏమీలేదు. ఆయన ఆఫర్‌ను మేం తిరస్కరిస్తున్నాం’’అని ప్రిన్స్ అల్‌వలీద్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, ప్రిన్స్ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ సమాధానం కూడా ఇచ్చారు. ‘‘నేను మీకు రెండు ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ట్విటర్‌లో సౌదీకి ఎన్ని షేర్లు ఉన్నాయి? జర్నలిజంలో భావప్రకటన స్వేచ్ఛపై మీ అభిప్రాయం ఏమిటి’’అని మస్క్ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎలాన్ మస్క్ అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోందని వైట్ అన్నారు. ‘‘ఆయన అంతిమ లక్ష్యం ట్విటర్‌ను కొనుగోలు చేయడమే అయితే, ఆయన అనుసరిస్తున్న విధానం మాత్రం సరైనది కాదు’’అని వైట్ వ్యాఖ్యానించారు.
‘‘నాకు తెలిసి కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ చాలా సీరియస్‌గా ఉన్నారు. మొదట ఆయన తను అనుకున్న ధరను వెల్లడించారు. ఇప్పుడు చర్చలకు ద్వారాలు తెరిచారు.’’
ఇప్పుడు ఏం జరుగుతుంది?
ట్విటర్ యాజమాన్యం అనుసరిస్తున్న పాయిజన్ పిల్ వ్యూహం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటుంది.
అయితే, ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘‘తమ సంస్థను ఎవరూ బలవంతంగా టేకోవర్ చేయలేరు’అని అన్నారు.
తమ వేదికపై భావ ప్రకటన స్వేచ్ఛను ట్విటర్ అడ్డుకుంటోందని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. సంస్థ తమ ఆధీనంలోకి వచ్చిన వెంటనే భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిని విస్తరించేలా చర్యలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు.
బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, అమెరికన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఎలాన్ మస్క్‌కు సాయం చేస్తోంది. మరోవైపు గోల్డ్‌మెన్ సాక్స్, జేపీ మోర్గాన్ ట్విటర్‌కు సాయం చేస్తున్నాయి.
ట్విటర్ అనుసరిస్తున్న పాయిజన్ పిల్ వ్యూహం పనిచేస్తుందా? లేక ఎలాన్ మస్క్ ఈ సంస్థను చేజిక్కించుకుంటారా? అనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- రూ. 2 కోట్ల లాటరీ తగిలింది, బ్యాంకు ఖాతా లేదని డబ్బులు ఇవ్వడం లేదు
- రాత్రయితే చాలు మొదలయ్యే రుగ్మత, నూటికి పది మందిలో కనిపించే దీనికి మీరూ బాధితులేనా
- అంబేడ్కర్ రెండో పెళ్ళి కథ: 'ప్రియాతి ప్రియమైన షారూ... ప్రేమతో నీ రాజా'
- మానవ హక్కులపై అమెరికాకు జైశంకర్ దీటైన జవాబు: మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం మారిందా?
- మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..
- గవర్నర్‌కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













