కోవిడ్ 19-ఒమిక్రాన్: ఈ వైరస్‌లు శరీరంలోనే దాక్కుని పదేళ్ల తర్వాత కూడా సమస్యలు సృష్టిస్తాయి, మరి కరోనా కూడా అంతేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రీ బియెర్నాథ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వైరస్‌ను ఒక లక్షణం ద్వారా నిర్వచించాలంటే నిష్పాక్షికత అనే మాటను ఉపయోగించవచ్చు. ఎందుకంటే అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒక జీవి కణాలపై దాడి చేయడం, తనలాంటి కొత్త వైరస్‌లను సృష్టించడానికి దానిని ఉపయోగించుకోవడం, అలా పుట్టిన వైరస్‌లు మళ్లీ అదే ప్రక్రియను రిపీట్ చేయడం....ఇలా కొనసాగుతుంది.
ఇలా దాడి చేయడం, తనలాంటి వైరస్‌లను సృష్టించడం అనే ప్రక్రియ కొన్ని రోజులపాటు జరుగుతుంది. మన రోగనిరోధక శక్తి ఆ సమస్యను ఎదుర్కోలేకపోతే, పరిస్థితి తీవ్రంగా, ప్రాణాంతకంగా మారుతుంది.
కానీ, కొన్ని వైరస్ గ్రూపులు ఉంటాయి. అవి మరో వ్యూహాన్ని అనుసరిస్తుంటాయి. ఒక శరీరంలోకి వెళ్లిన వెంటనే అవి శరీరంలో ఎక్కడో ఒకచోట మారుమూల దాక్కుంటాయి. ఆ దశ నెలలు, ఏళ్లు, దశాబ్దాలపాటు కూడా ఉండవచ్చు. ఈ వైరస్‌లను ఎదుర్కొనే డిఫెన్స్ వ్యవస్థ గుర్తించలేనంతకాలం, లేదంటే అవి వీటి మీద పని చేయనంత కాలం అవి అలాగే ఉంటాయి.
రోగ నిరోధక వ్యవస్థ సైలెంట్ అయ్యాక ఇన్ఫెక్షన్ మళ్లీ మొదలవుతుంది. దానితోపాటే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ గ్రూప్ వైరస్‌లలో ఎయిడ్స్‌కు కారణయ్యే హెచ్ఐవీ నుంచి నోటి మూలల్లో, జననేంద్రియాల ప్రాంతంలో పుండ్లకు కారణమయ్యే హెర్పిస్ సింప్లెక్స్ 1, 2 వరకూ ఉంటాయి.
మరి అవి రోగ నిరోధక వ్యవస్థకు కనిపించకుండా ఎలా దాక్కుంటాయి? కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఎలా వస్తాయి? కరోనాకు కారణమైన SARS-CoV-2 వైరస్ విషయంలో కూడా ఇలా జరిగే అవకాశం ఉందా?
మన శరీరంలో వైరస్ దాక్కోడానికి నాలుగు మార్గాలు ఉంటాయి. వీటిలో మొదటిదాన్ని తరచూ హెర్పిస్ కుటుంబానికి చెందిన వైరస్‌లు ఉపయోగిస్తుంటాయి. వీటిలో హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1, 2తోపాటూ ఆటలమ్మ, కిస్సింగ్ డిసీజ్‌కు కారణమయ్యే ఎప్‌స్టైన్-బార్ లాంటి మరికొన్ని వైరస్‌లు కూడా ఉన్నాయి.
''వాటి డీఎన్ఏ జన్యు పదార్థంలా ఉంటుంది. అవి మన సొంత జెనెటిక్ కోడ్‌కు అనుబంధంగా కణాల కేంద్రకంలో ఉండగలుగుతాయి'' అని సావోపాలో ఇస్రేలిటా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆస్పత్రి వైరాలజిస్ట్ డిసియో డైమెంట్ వివరించారు.
ఇక్కడ ఆ డీఎన్ఏను జన్యువును రూపొందించే ఒక అక్షరాల సెట్‌గా గుర్తుంచుకోవాలి (సైన్స్‌లో దీన్నే నైట్రోజన్ బేసెస్ అంటారు) అవి సాధారణంగా డబుల్ హెలిక్స్ ఆకారంలో రెండు పోగుల వరుసగా ఉంటాయి.
ఈ హెర్పిస్ కుటుంబానికి చెందిన వైరస్‌లు మళ్లీ మళ్లీ తీవ్రంగా రాకుండా....చాలా కాలంపాటు నిద్రాణంగా ఉండిపోతాయి. కణాల అంతర్గత రక్షణను అడ్డుకోగలిగిన ఈ వైరస్ రోగనిరోధక శక్తికి కనిపించకుండా అదృశ్యంగా ఉంటాయి అని డైమెంట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎన్ఏ వైరస్‌లు
రెండో మెకానిజంను సాధారణంగా హెచ్ఐవీ, హెచ్‌టీఎల్వీ లాంటి మరో వైరస్ కుటుంబం ఉపయోగిస్తుంది. ఈ రెండింటికీ డీఎన్ఏకు బదులు ఆర్ఎన్ఏ ఉంటుందనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి.
మరోమాటలో చెప్పాలంటే మన జన్యు సమాచారం ఒక సరళమైన పద్ధతిలో నైట్రోజన్ ఆధార శ్రేణుల్లో ఒకే పోగుగా ఉంటుంది. రెట్రోవైరస్‌లు మన జెనెటిక్ కోడ్‌తో కలిసిపోగలవు. మన రోగనిరోధక శక్తిలోని రెండు ముఖ్యమైన భాగాలైన టీ సెల్స్, మాక్రోఫేజ్‌లలో ఈ ఏకీకరణ తరచూ జరుగుతుంటుంది.
హెచ్ఐవీ, హెచ్‌టీఎల్‌వీ వైరస్‌లకు రివర్స్ ట్రాన్‌స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అంటే ఈ వైరస్‌ల జెనెటిక్ కోడ్‌లను ఆర్ఎన్ఏ నుంచి డీఎన్ఏగా మార్చగలదు. దీని ద్వారా అవి మనిషి జన్యువులో కలిసిపోగలుగుతాయి. చాలా కాలంపాటు కనిపించకుండా ఉండిపోతాయి.
''దీనిని తొలగించడం చాలాకష్టం. అందుబాటులో ఉన్న మందులతో కూడా పనికాదు'' అని రియోడీ జెనీరోలోని ఐఎన్ఐ-ఫియోక్రజ్ ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ క్లినిక్‍లో సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్టీవావ్ పొర్టెలా నూన్స్ చెప్పారు.
మరో మాటలో చెప్పాలంటే హెచ్ఐవీ రోగులు వాడే యాంటీ రిట్రోవైరల్ మందుల వైరల్ రెప్లికేషన్‌ను కూడా ఇది నిరోధించగలదు. రోగి మందులు తీసుకోవడం ఆపేస్తే హెచ్ఐవీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
రహస్య ప్రాంతాలు
కొన్ని వైరస్‌లు దాక్కోవడానికి ఉన్న మూడో దారి ఇమ్యునోప్రివిలేజ్డ్ సైట్స్. శరీరంలోని ఈ ప్రాంతాల్లోకి రోగనిరోధక శక్తి అంత సులభంగా చేరుకోలేదు. వీటిలో వృషణాలు, కళ్లు, కేంద్ర నాడీ వ్యవస్థ (వెన్నెముక, మెదడు) లాంటివి ఉంటాయి.
నరాలు, పునరుత్పత్తి అవయవాల వంటి సున్నితమైన ప్రాంతాలలో ఇవి దాక్కుంటాయి. ఇక్కడ రోగ నిరోధక కణాలు తక్కువగా పని చేస్తాయి. ఒకవైపు ఇది శరీరానికి స్వయంగా ఒక రక్షణ రూపంలా మారితే, మరోవైపు ఇది వైరస్‌లు కొంతకాలంపాటు వృద్ధి చెందడానికి ఒకరకమైన అభయారణ్యం లాంటి ప్రాంతాన్ని సృష్టిస్తుంది.
కొందరు రోగుల వీర్యంలో జికా, ఎబోలా వైరస్‌లను కనుగొన్నట్టు ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
''నిజానికి వైరస్ వీర్యం లేదా శరీరంలోని ఇతర భాగాల్లో కనిపించినంత మాత్రాన అది యాక్టివ్‌గా ఉందని, భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుందని మనం అనుకోలేం. ఆ వైరస్ నిలకడ ప్రభావం గురించి ఇంకా స్పష్టత లేదు'' అని అమెరికాలోని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ డేనియెల్ ముసీడా చెప్పారు.
మనకు తెలిసినంత వరకూ అలాంటి అభయారణ్యాల్లో వైరస్‌ల శాశ్వతత్వం అంత ఎక్కువకాలం ఉండదు. వాటిని చేరుకోవడంలో పరిమితులు ఉన్నప్పటికీ, రోగనిరోధక శక్తి కొన్ని నెలల్లోనే దాడి చేసి ఆ వైరస్‌లను తొలగిస్తుంది.
మన శరీరంలో ఎక్కువకాలం దాక్కోగల నాలుగో గ్రూప్ వైరస్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్ బయట కూడా అలా ఉండగలవు. రెస్పిరేటరీ సిన్కైషియల్ వైరస్ ఇలాంటి వాటిలో ఒకటి. ఆ వైరస్ ఊపిరితిత్తుల్లో ఉండిపోతుంది. ముఖ్యంగా పిల్లల్లో దీర్ఘకాలికంగా కనిపించే మంటకు, దీనికి సంబంధం ఉంటుంది. ఇక చికున్ గున్యా వైరస్ కండరాలు, కీళ్లలో ఉంటుందని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇమ్యునాలజిస్ట్ కరోలినా లూకాస్ అన్నారు.
కొంతమంది రోగుల్లోనే ఇది ఎందుకు జరుగుతుంది అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోగ నిరోధక శక్తి చేసే పొరపాట్లు
ఈ వైరస్‌లన్నీ నిద్రాణంగా ఉంటూ పెద్దగా ఆందోళన కలిగించేవి కావని అనిపించినా, వాటిలో కొన్ని కొన్నేళ్ల తర్వాత లేదా దశాబ్దాల తర్వాత మళ్లీ యాక్టివ్ అవుతాయి. ఏదో ఒక కారణంతో రోగ నిరోధక వ్యవస్థ ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఈ వ్యాధికారకాలు మళ్లీ చురుగ్గా మారి సమస్యలు సృష్టిస్తాయి అని డైమెంట్ చెప్పారు.
ఈ పొరపాటు ఏంటి అనేది ఇన్ఫెక్షన్‌కు, ఇన్ఫెక్షన్‌కు భిన్నంగా ఉంటుంది. హెర్పెస్ సింప్లెక్స్ విషయానికి వస్తే, దీనితో ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి ఎక్కువ గంటలు ఎండలో గడిపినా, ఒత్తిడికి గురైనా ఇది బైటపడటానికి అవకాశం ఏర్పడుతుంది.
వయసు పెరగడం కూడా కొన్ని అంటువ్యాధులు మళ్లీ రావడానికి కారణమవుతుంది. దీనికి మంచి ఉదాహరణ వరిసెల్లా-జోస్టర్. ఇది ఆటలమ్మకు కారణమయ్యే వైరస్(సాధారణంగా పిల్లల్లో) దశాబ్దాలపాటు శరీరంలో దాగుంటుంది.
తర్వాత 50 లేదా 60 ఏళ్లు పైబడిన తర్వాత వ్యాధికారకాలు చురుగ్గా మారుతాయి. హెర్పిస్ జోస్టర్ లేదా షింగిల్స్ అనే పరిస్థితి కారణమవుతాయి. ఇవి శరీరంపై(సాధారణంగా నడుము, పొత్తికడుపుపై) పొక్కుల్లాంటి గాయాలను ఏర్పరుస్తాయి. ఇక అక్కడ రోగ నిరోధక వ్యవస్థ చర్యలను బలహీనపరిచే, వైరస్‌లకు అవకాశాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి.
వీటిలో తీవ్రమైన ప్రమాదాలు, గాయాలు, పెద్ద సర్జరీలు, ట్రాన్స్‌ప్లాంట్స్, ట్యూమర్స్, డ్రగ్ ట్రీట్‌మెంట్‌లు, మరికొన్నితీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నాయని డైమెంట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సంగతేంటి?
వైరస్‌లో ఇన్ని వైవిధ్యాలను చూపిస్తూ, కోవిడ్‌కు కారణమయ్యే SARS-CoV-2 కూడా ఇలాగే శరీరంలో కొనసాగుతుందా అనే సందేహం వస్తుంది. ''SARS-CoV-2 అనేది ఒక ఆర్ఎన్ఏ. ఇందులో హెచ్ఐవీలా ఎలాంటి రివర్స్ ట్రాన్‌స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉండదు. అంటే ఇది మన జన్యువుతో కలిసిపోదు'' అని మాలిక్యులర్ బయాలజిస్ట్ కార్లోస్ మెంక్ అన్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ సావోపోలో పని చేస్తున్నారు.
''ప్రజలు చాలామంది ఇప్పుడు రెండోసారి కూడా కోవిడ్‌కు గురవుతున్నారు. అయితే ఇది వారి శరీరంలో వైరస్ నెలలపాటు దాగి ఉండటం వల్ల కాదు'' అని కార్లోస్ మెంక్ అన్నారు. ''కోవిడ్ నుంచి మనం ఏదైనా భిన్నమైనది గుర్తిస్తే అది పెద్ద సర్‌ప్రైజే'' అన్నారాయన.
అయితే, కరోనా వైరస్ ఎటాక్ చేసినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే తీరుతో దీనికి సంబంధం ఉంటుందని డైమెంట్ చెప్పారు.
''కొన్ని కేసుల్లో కోవిడ్ కారణంగా ఏర్పడిన అలసట, వాసన కోల్పోవడం, దేని మీదా ఏకాగ్రత చూపలేకపోవడంలాంటివి కొన్ని నెలలపాటు కొనసాగుతాయి. దీనికి కారణం, కోవిడ్ సోకిన తొలిరోజుల్లో రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియాపై తీవ్రస్థాయిలో యుద్ధం చేయడమేనని చెబుతారు. దీనివల్ల దీని ప్రభావాలు ఎక్కువ రోజులు కొనసాగుతాయి'' అని డైమెంట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
అయితే శరీరంలో ప్రొటీన్, ఆర్ఎన్ఏ లాంటి వైరస్ అవశేషాలు ఉండటం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చన్న విషయాన్ని కొట్టి పారేయలేమని లూకాస్, ముసిడా అంటారు.
''రెండింటికీ అవకాశం ఉంది. వైరల్ ఆర్ఎన్ఐ పొట్టలోని కొన్ని భాగాల్లో ఎక్కువ కాలం ఉండొచ్చు. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను నిరంతరం అలర్ట్ చేస్తూ ఉండొచ్చు'' అని వారు అన్నారు.
''వ్యాక్సినేషన్ వల్ల ఇటువంటి సమస్యల కొంత వరకు బయటపడవచ్చు'' అని పోర్టెలా నూన్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- #KashmirFiles: కశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిన రాత్రి అసలేం జరిగింది?
- ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి.. 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?
- 10th క్లాస్, బీటెక్ ఫెయిల్ అయ్యారా? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదా? ఈ ట్రైనింగ్‌తో జాబ్ గ్యారెంటీ..
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం.. రేపు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














