బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం.. 144 సెక్షన్ విధింపు.. అసలేం జరిగింది?

శివాజీ విగ్రహం వివాదం

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుకోవడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్ విధించారు. ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు.

10 మందితో కూడిన ఇరు వర్గాల ప్రతినిధుల బృందాన్ని పోలీసులు చర్చలకు ఆహ్వానించారు. పోలీసుల ఆహ్వానంపై ఇరు వర్గాలు స్పందించాల్సి ఉంది.

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ రోజు (ఆదివారం) స్థానిక బీజేపీ, శివసేన కార్యకర్తలు శివాజీ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

అయితే అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఓ సందర్భంలో ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఇరు వర్గాలు ఆందోళనకు దిగడం, ర్యాలీలకు సమాయత్తం కావడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. బ్యారీకేడ్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిర్మల్ జిల్లాల నుండి అదనపు పోలీసు బృందాలను రప్పించారు.

శివాజీ విగ్రహం వివాదం

ఫొటో సోర్స్, ugc

ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఏమన్నారంటే..?

''విగ్రహ ఏర్పాటుకు కేవలం బోధన్ మున్సిపాలిటీ నుండి అనుమతులు ఉన్నాయంటున్నారు. అయితే పద్ధతి ప్రకారం కలెక్టర్, ఆర్డీవోల పర్మిషన్ అవసరం. అనుమతి వచ్చేంత వరకు ఆగాలని పోలీస్, రెవెన్యూ అధికారులం కోరాం. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకే లాఠీఛార్జ్ చేశాం. ఇందులో ఎవరికీ గాయాలు కాలేదు. ఇరు వర్గాలను చర్చలకు ఆహ్వానించాం. వారి నుండి స్పందన లేదు.

బోధన్‌లో 144 సెక్షన్ అమలవుతోంది. పట్టణ ప్రధాన మార్గాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశాం. నిర్మల్, కామారెడ్డి జిల్లాల నుండి అదనపు బలగాలను రప్పించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఆందోళనకు కారణమైన వారిపై కేసులు పెడతాం' అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగారాజు తెలిపారు.

అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి, ఐజీ కమలాసన్ రెడ్డిలు బోధన్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు, బోధన్ బయలుదేరిన నిజామాబాద్ బీజేపీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్యను సారంగాపూర్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.

శివాజీ విగ్రహం వివాదం

ఫొటో సోర్స్, ugc

శివాజీ విగ్రహ ఏర్పాటుకు ఎప్పుడో అప్లికేషన్ పెట్టాం.. ఎంపీ అర్వింద్

ఈ ఘటనపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ వీడియో రూపంలో ప్రకటన విడుదల చేశారు.

''శివాజీ జాతీయ హీరో. విగ్రహ ఏర్పాటుకు బోధన్ మున్సిపాలిటిలో ఎప్పుడో అప్లికేషన్ పెట్టుకున్నాం. అక్కడి ఎంఐఎం వారు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని కాంపిటీషన్ తీసుకొచ్చారు. టిప్పు సుల్తాన్ ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అతనికి శివాజీకి పోలికేంటీ? నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం విగ్రహాన్ని పక్కనపెట్టి తర్వాత పెట్టుకోమని అంటున్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి, టీఆర్ఎస్ పార్టీకి కాదు' అని అర్వింద్ అన్నారు.

ఈ విషయమై ఎంపీ ఆర్వింద్ నిజామాబాద్ కలెక్టర్‌కు లేఖ రాశారు.

'విగ్రహ ఏర్పాటుకు గతంలో బోధన్ మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. ఇప్పుడు విగ్రహ ఏర్పాటును స్థానిక టీఆర్ఎస్, ఎంఐఎం అడ్డుకోవడం దారుణం. ఈ విషయంలో జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి' అని అర్వింద్ తన లేఖలో కోరారు.

మరోవైపు, సోమవారం బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు ఇచ్చింది.

శివాజీ విగ్రహం వివాదం

ఫొటో సోర్స్, ugc

శివాజీ, అబ్దుల్ కలాం, చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు తీర్మానం

విగ్రహ ఏర్పాటు అనుమతులపై బీబీసీ బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగంను వివరణ కోరింది.

'ఈ ఏడాది జనవరిలో కాన్సిల్ సమావేశంలో బోధన్ అంబేద్కర్ చౌక్‌లో అబుల్ కలాం, బసవేశ్వరుడు, చాకలి ఐలమ్మ, శివాజీ విగ్రహాల ఏర్పాటు తీర్మానంపై చర్చ జరిగి ఆమోదం లభించింది. తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపాం. అయితే ఆ తర్వాత ఇది కమ్యూనల్ ఇష్యూగా మారడంతో తీర్మానం పక్కన పెట్టాం. తీర్మానం పాస్ చేయడం వరకే మా బాధ్యత. విగ్రహం ఏర్పాటుకు అనుమతులు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి రావాలి అని బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగం చెప్పారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 124 రూపాయలతో పెళ్లి

'శివాజీ విగ్రహం ఏర్పాటుపై మాకు అభ్యంతరం లేదు, కానీ.. '

మరోవైపు ఈ అంశంపై నిజామాబాద్ జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ బీబీసీతో మాట్లాడారు.''శివాజీ విగ్రహ ఏర్పాటుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేస్తే బాగుండేది. రాత్రిపూట దొంగల్లా బ్యాక్‌ డోర్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, పోలీస్ ఎవరిని అడిగినా పర్మిషన్ గురించి తెలియదంటున్నారు. విగ్రహాల ఏర్పాటుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారి విగ్రహాలు కూడా పెట్టండి. ప్రశాంతంగా ఉన్న బోధన్‌లో కలహాలు రెచ్చగొట్టాలని కొందరు చూశారు. ప్రతి కమ్యునిటీలో ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. పరిస్థితులను తప్పుడు దారిలో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చూస్తారు అని మహ్మద్ అబ్దుల్ ఫహీమ్ అన్నారు.

వీడియో క్యాప్షన్, అంకాపూర్ చికెన్‌‌కు అంత రుచి ఎలా వస్తుందో ఫార్ములా చెప్పేశారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)