బిపిన్ రావత్‌ - Mi-17 V5: వీవీఐపీలు వాడే హెలికాప్టర్ ఇది, దీని ప్రత్యేకతలేంటి? దేశంలో జరిగిన ప్రధాన వైమానిక ప్రమాదాలేంటి?

Mi-17V5 హెలికాప్టర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, Mi-17V5 హెలికాప్టర్

Mi-17 V5 హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించారు.

Mi-17 V5 హెలికాప్టర్ భారత వైమానిక దళానికి చెందినది. ఇది రష్యాలో తయారైంది.

వీటిని ప్రధానంగా సైనిక రవాణా కోసం వినియోగిస్తారు.

భారతదేశం మాత్రమే కాకుండా ఇరాన్, మియన్మార్, ఇరాక్, అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు Mi-17 హెలికాప్టర్లను వాడుతున్నాయి.

కొన్నేళ్లుగా ఈ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతుండడం చర్చనీయాంశంగా మారింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్

Mi-17V5 ప్రత్యేకతలేంటి?

Mi-17 V5 హెలికాప్టర్‌కు రెండు ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలోని అధునాతన రవాణా హెలికాప్టర్లలో ఇది ఒకటి.

సైనిక దళాలను, ఆయుధాలను మోసుకెళ్లడంతోపాటు, అగ్నిమాపక సిబ్బంది తరలింపు, పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు.

సముద్రాలు, ఎడారి ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ హెలికాప్టర్‌ను రూపొందించారు.

భారత వైమానిక దళం దీనిని వీఐపీ చాపర్‌గా ఉపయోగిస్తుండగా, భారత ప్రభుత్వం వీవీఐపీ చాపర్‌గా వినియోగిస్తుంటుంది. ఎయిర్ స్ట్రిప్ లేని ప్రదేశాలకు ఈ హెలికాప్టర్‌లో వీవీఐపీలను తీసుకెళ్తూ ఉంటారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఈ హెలికాప్టర్ ద్వారా లద్ధాఖ్, కేదార్‌నాథ్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. రక్షణ మంత్రి వంటి వీవీఐపీలు ఈ హెలికాప్టర్‌లో మారుమూల ప్రాంతాలకు వెళుతుంటారు.

సంజయ్ గాంధీ

ఫొటో సోర్స్, NEHRU MEMORIAL LIBRARY

ఫొటో క్యాప్షన్, సంజయ్ గాంధీ

భారతదేశంలో జరిగిన విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాలు

భారతదేశంలో జరిగిన విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు.

సంజయ్ గాంధీ

జూన్, 1980: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ గాంధీ మరణం విమాన ప్రమాదం వల్లే జరిగింది. ఈ ప్రమాదం అత్యంత వివాదాస్పదం కావడంతోపాటు, చర్చనీయాంశంగా కూడా మారింది.

సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం జూన్ 23, 1980న దిల్లీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.

మాధవరావు సింధియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాధవరావు సింధియా

మాధవరావు సింధియా

సెప్టెంబరు 2001: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా భోగావ్ తహసీల్ సమీపంలో మోటా వద్ద జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా మరణించారు.

ఒక సభలో పాల్గొనేందుకు సింధియా కాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో ఆయనతోపాటు మరో ఆరుగురు కూడా ఉన్నారు.

జిందాల్ గ్రూప్‌కు చెందిన 10 సీట్ల చార్టర్డ్ విమానం, న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఆగ్రాకు 85 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. అందులో ఉన్న వారంతా మరణించారు.

అప్పట్లో మాధవరావు సింధియా కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరు. యువ నాయకుడిగా, ప్రజాదరణ ఉన్న నేతగా ఆయనకు పేరుంది.

జీఎంసీ బాలయోగి

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, జీఎంసీ బాలయోగి

జీఎంసీ బాలయోగి

మార్చి 2002 - ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ 206 హెలికాప్టర్ కూలిపోవడంతో లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు.

బెల్ 206 అనేది ఒక ప్రైవేట్ హెలికాప్టర్. అందులో బాలయోగి, ఆయన సెక్యురిటీ గార్డ్, ఒక సహాయకుడు ఉన్నారు. హెలికాప్టర్‌ కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని గుర్తించారు.

ఓపీ జిందాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓపీ జిందాల్

ఓపీ జిందాల్

ఏప్రిల్ 2005 - సుప్రసిద్ధ ఉక్కు వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఓపీ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురీందర్ సింగ్, పైలట్ కూడా మరణించారు. చండీగఢ్ నుంచి దిల్లీకి వస్తుండగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.

మరణించేనాటికి ఓపీ జిందాల్ హరియాణ విద్యుత్ శాఖమంత్రిగా పని చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఆయనకు పేరుంది.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

వై.ఎస్. రాజశేఖర రెడ్డి

సెప్టెంబర్ 2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్‌లో నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన హెలికాప్టర్ కూలిపోయింది.

ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మరణించారు. మొదట హెలికాప్టర్ కనిపించకుండా పోయిందని ప్రకటించారు. తర్వాత కూలిపోయినట్లు నిర్ధరించారు.

సైన్యం సహాయంతో అటవీ ప్రాంతంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. కర్నూలుకు 74 కిలోమీటర్ల దూరంలోని రుద్రకొండ కొండపై హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి.

దోర్జీ ఖండూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దోర్జీ ఖండూ

దోర్జీ ఖండూ

ఏప్రిల్ 2011: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఖండూ నాలుగు సీట్ల సింగిల్ ఇంజన్ పవన్ హన్స్ హెలికాప్టర్ AS-B350-B3లో ప్రయాణించారు. తవాంగ్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే ఆయన హెలికాప్టర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల పాటు హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదు. అయిదవ రోజున సెర్చ్ టీమ్‌లు హెలికాప్టర్ శకలాలు, అయిదుగురి మృతదేహాలను కనుగొన్నాయి.

మోహన్ కుమార మంగళం

మే 1973- ఇనుము, ఉక్కు, గనుల శాఖా మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం కూడా విమాన ప్రమాదంలో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)