‘కార్లను అమ్మడం మొదలుపెట్టి నెల కూడా కాలేదు.. కానీ మార్కెట్ విలువలో ఫోర్డ్ మోటార్స్‌ను దాటేసింది’

ఫొటో సోర్స్, Reuters
ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. అక్టోబర్ చివరి నాటికి కొన్ని కార్లను వినియోగదారులకు అందించింది. కానీ ఎంతోకాలంగా మార్కెట్‌లో ఉన్న ఫోర్డ్ మోటర్స్ లాంటి కొన్ని కార్ల కంపెనీల మార్కెట్ విలువను దాటేసింది. ఆ కార్ల కంపెనీ పేరు లూసిడ్ మోటర్స్.
ఈ కంపెనీ సిలికాన్ వ్యాలీకి చెందినది. ఇది ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. సంస్థ మార్కెట్ విలువ ఇప్పటికే 85,000 మిలియన్ డాలర్లు దాటింది.
ఈ కంపెనీ తయారు చేసిన తొలి మోడల్ 'ది లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్'ను మోటార్ ట్రెండ్ అనే పత్రిక "కార్ ఆఫ్ ది ఇయర్"గా గుర్తించింది.
ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 852 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదని యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సమాచారం చెబుతోంది.
ఈ కారులోని సీట్లు ప్రయాణానికి సౌకర్యంగా ఉండటమే కాదు.. ప్రయాణీకులకు మసాజ్ చేసే ఆప్షన్ కూడా వీటిలో ఉంది. కారుకు గ్లాస్ పై కప్పు ఉంది. ఇదొక విలాసవంతమైన కారు.
ఈ సంస్థ తయారు చేసే అత్యంత శక్తివంతమైన వెర్షన్ కార్లు ఫెరారీ కంటే వేగంగా ప్రయాణిస్తాయి.
ది ఎయిర్ గ్రాండ్ టూరింగ్ ధర సుమారు కోటి రూపాయలు. ఇక టూరింగ్ రూ.71 లక్షలు, ది ఎయిర్, ఎయిర్ ప్యూర్ కార్ల ధర రూ.57 లక్షలుగా ఉంది.
చివరి రెండు కార్లు మొదటిదానితో పోలిస్తే కాస్త చౌకగా దొరుకుతాయి. కానీ ది ఎయిర్, ఎయిర్ ప్యూర్ 2022 వరకు మార్కెట్‌లోకి రావు.
ఇప్పటివరకు 17,000 మంది ఈ కార్లను ముందుగానే బుక్ చేసుకున్నట్లు లూసిడ్ మోటార్స్ చెబుతోంది. వచ్చే ఏడాది మరో 20,000 కార్లను డెలివరీ చేస్తామని అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
లూసిడ్ వ్యాపార రహస్యమేంటి?
మార్కెట్‌లో తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పర్చుకోవడానికి తమ మొదటి మోడల్ కారును ఉపయోగించుకుంటామని సంస్థ సీఈఓ పీటర్ రాలిన్సన్ మీడియా సంస్థలకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
"సాంకేతికంగా అద్భుతాలు సృష్టించాల్సిన అవసరముంది. లూసిడ్ ఎయిర్ ఉత్పత్తుల ద్వారా అది సాధించామనే అనుకుంటున్నాం. మేము మా బ్రాండును, భవిష్యత్తును నిర్వచిస్తాం" అని ఆయన అన్నారు.
పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావడానికి రాలిన్సన్‌కున్న కీర్తి కూడా ఒక ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు.
టెస్లా మోడల్ ఎస్ కారు రూపకల్పనలో ఈయనకు భాగం ఉంది. కానీ, వ్యక్తిగత కారణాలతో పాటు, ఎలాన్ మస్క్‌తో సంబంధాలు దెబ్బతినడంతో ఆయన ఆ సంస్థను వదిలిపెట్టారు. అంతకుముందు ఆయన జాగ్వర్ సంస్థలో పని చేశారు. లోటస్ సంస్థలో చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించారు.

ఫొటో సోర్స్, Reuters
కారు ఇంజిన్, ఇతర భాగాల బరువు, సైజును తగ్గించడం కూడా లూసిడ్ ఎయిర్ మోడల్ విజయానికి దారి తీసిందని చెప్పవచ్చు. దీంతో కారులో ఇతర సౌకర్యాల కోసం తగినంత ఖాళీ ప్రదేశం ఉంటుంది.
తన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో లగ్జరీ కార్ మార్కెట్‌లో అడుగుపెట్టడం ముందడుగు అయితే, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను విస్తృతం చేయడం, తక్కువ ధరలో కార్లను తయారు చేయగలిగే సంస్థలకు సాంకేతికతను అమ్మడాన్ని తర్వాత దశల్లో లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాలిన్సన్ చెప్పారు.
ఆ దశకు చేరుకోవాలంటే సంస్థ ముందుగా విజయవంతం కావాలి. కొంతకాలం లాభాలు రాకపోవచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
ఎదురయ్యే సవాళ్ల గురించి పెట్టుబడిదారులకు స్పష్టంగా చెప్పారు. ఈ బిజినెస్‌లో ఉన్న రిస్క్ కూడా వారికి తెలియజేసినట్లు ఆయన వివరించారు.
ఈ సంస్థకు భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే అనుభవం లేదని, కస్టమర్ సర్వీస్ నెట్‌వర్క్ లేదని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన 44 పేజీల నివేదిక చెబుతోంది.
దీనికి తోడు, చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో అడుగు పెడుతున్నాయి. వాటిలో కొన్నింటికి భారీ స్థాయిలో కార్లను తయారు చేయడంలో దశాబ్దాల అనుభవం కూడా ఉంది.
లూసిడ్ మోటర్స్.. సూపర్ లగ్జరీ కార్లను తయారు చేసే స్థాయి నుంచి తక్కువ ధరలో, భారీ స్థాయిలో వాహనాలను తయారు చేయగలిగే స్థాయికి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ జగన్: ‘అమరావతి అంటే నాకు వ్యతిరేకత లేదు.. నా ఇల్లూ ఇక్కడే ఉంది’
- కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మే బెటరా? ఈ పోలిక ఎందుకు?
- వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: ప్రధాని మోదీ
- అమెరికాను అధిగమించి అత్యంత సంపన్న దేశంగా అవతరించిన చైనా -మెకెన్సీ రిపోర్ట్
- ‘చేసింది కొంతే.. చేయాల్సింది చాలా ఉంది’
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- విశాఖ నుంచి గంజాయి స్మగ్లింగ్.. అమెజాన్ ఉద్యోగులపై పోలీసు కేసు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్‌గంజ్ స్టేషన్‌కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఆల్బర్ట్ ఎక్కా: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్లోకి వెళ్లి దాక్కున్న స్పేస్ స్టేషన్ సిబ్బంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








