అఫ్గానిస్తాన్‌: ఖైదీలను వదిలేస్తే కాల్పుల విరమణ చేస్తామన్న తాలిబన్‌లు, వారు దేశంలో ఎంత భాగాన్ని ఆక్రమించారు?

అఫ్గాన్ భద్రతా బలగాలు

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, బీబీసీ మానిటరింగ్
    • హోదా, న్యూస్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్

అఫ్గానిస్తాన్ కనుక తమ ఖైదీలు 7,000 మందిని విడుదల చేస్తే మూడు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని తాలిబన్లు ప్రతిపాదన చేశారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

"ఇది చాలా పెద్ద డిమాండ్" అని అఫ్గాన్ ప్రభుత్వం మధ్యవర్తి నాదర్ నాదరీ అన్నారు.

దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. అయితే, ఇది ఎంతవరకు వాస్తవమన్నది స్వతంత్రంగా నిర్ధరించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది.

అయితే, మొత్తం 400 జిల్లాల్లో మూడో వంతు మీద తాలిబన్లు పట్టు సాధించారనే అంచనాలు వినిపిస్తున్నాయి.

తమ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించాలని కూడా తాలిబన్లు డిమాండ్ చేశారని నాదరీ తెలిపారు.

గత ఏడాది 5,000 మంది తాలిబన్లను విడుదల చేశారు. వారిలో చాలా మంది మళ్లీ యుద్ధంలో చేరారాని, ఫలితంగా హింస మరింత పెరిగిందని బీబీసీ ప్రతినిధి లైసీ డౌసెట్ అభిప్రాయపడ్డారు.

కాబూల్‌కు ఉత్తరాన ఉన్న ఒక కీలక లోయను కూడా తాలిబన్‌లు స్వాధీనం చేసుకోవడంతో దేశ రాజధానికి ముప్పు పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాబూల్‌కు ఉత్తరాన ఉన్న ఒక కీలక లోయను కూడా తాలిబన్‌లు స్వాధీనం చేసుకోవడంతో దేశ రాజధానికి ముప్పు పెరిగింది.

తాలిబన్‌లు దేశంలో ఎంత భాగాన్ని ఆక్రమించారు?

గత కొద్ది వారాలుగా అఫ్గానిస్తాన్‌ తూర్పు, దక్షిణ ప్రావిన్సులలో తాలిబన్‌లు దాడులను ఉధృతం చేశారు. గతంలో వారి దృష్టి ఉత్తర ప్రాంతాలపై ఉండగా, ఇప్పుడు దేశంలోని 34 ప్రావిన్సుల రాజధానులలో 20 రాజధాని ప్రాంతాల మీద వీరి ప్రభావం కనిపిస్తోంది.

ఈ తాజా దాడులలో కాబూల్‌కు ఉత్తరాన ఉన్న ఒక కీలక లోయను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధానికి ముప్పు పెరిగింది.

కాబూల్‌ను నాలుగు దిక్కులను కలిపే హైవేలపై ఉన్న ఈ రాజధానులు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి.

కొన్ని ప్రాంతాలలో తీవ్రవాదులను తరిమికొట్టామని ప్రభుత్వం ప్రకటించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని ప్రాంతాలలో తీవ్రవాదులను తరిమికొట్టామని ప్రభుత్వం ప్రకటించింది

ప్రధాన నగరాలు స్వాధీనం

తాలిబన్లు ఇప్పటికే అనేక ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు ఇప్పటి వరకు ముట్టడించిన నగరాలు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇవి అఫ్గానిస్తాన్‌కు, మధ్య ఆసియా దేశాలకు సరిహద్దులలో ఉన్నాయి.

అయితే, గత వారం నుంచి దక్షిణ, తూర్పు ప్రాంతాలపై కూడా తాలిబన్లు గురి పెట్టారు. దీంతో దేశ రాజధాని కాబూల్‌ సహా సమీపంలోని ఉన్న ప్రాంతాలకు ప్రమాదం కనిపిస్తోంది.

చారికర్ (పర్వాన్ ప్రావిన్స్):

పర్వాన్‌ ప్రావిన్స్‌లోని ఘోర్భంద్ వ్యాలీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైంది. ఈ వ్యాలీకి, ప్రావిన్స్ రాజధాని చారికర్‌కు మధ్య దూరం 60 కి.మీ.లు.

ఈ ప్రాంతంలో మిలిటెంట్ల పట్టు పెరగడంతో దేశ రాజధాని కాబూల్‌తోపాటు ఇటీవల అమెరికా మిలిటరీ ఖాళీ చేసిన బగ్రామ్ ఎయిర్‌ బేస్ కూడా ముప్పు పొంచి ఉంది.

కాందహార్ సిటీ (కాందహార్ ప్రావిన్స్):

కాందహార్‌లోని షోర్బాక్, అర్జెస్తాన్, మైవాండ్, ఖాక్రెజ్, పంజ్‌వై, మారుఫ్, షా వాలి కోట్, ఘోరాక్ జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రావిన్స్ రాజధాని కాందహార్ నగరం చుట్టూ ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి.

ఇక్కడ వీరి ఆధిపత్యం కొనసాగితే పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ను, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ను కలిపే స్పిన్ బోల్డాక్-చమన్ సరిహద్దు క్రాసింగ్‌ ప్రమాదంలో పడవచ్చు.

ఘజ్ని నగరం (ఘజ్ని ప్రావిన్స్):

వివిధ తెగలకు కేంద్రమైన ఘజ్నీ ప్రావిన్స్‌లో తాలిబన్లుచాలా సంవత్సరాల నుంచి యాక్టివ్‌గా ఉన్నారు. 2018లో రాజధానిలోని చాలా భాగాన్ని తాలిబన్‌లు తమ నియంత్రణలో ఉంచుకున్నారు.

ప్రస్తుతం ఘజ్ని నగరానికి సమీపంలో తాలిబన్, అఫ్గాన్ సైన్యాల మధ్య పోరాటం తీవ్రంగా జరుగుతోంది. ఇప్పటికే 50శాతం నగరాన్ని తాలిబన్‌లు ఆధీనంలోకి తెచ్చుకోగలిగారని జులై 12న ఓ టీవీ ఛానల్ వెల్లడించింది.

ఘజ్ని ప్రావిన్స్ ఎనిమిది ప్రావిన్సులకు సరిహద్దులో ఉంది. రాజధానిని దక్షిణ అఫ్గానిస్తాన్‌ను కలిపే కాబూల్-కాందహార్ రహదారి ఈ ప్రావిన్స్ గుండా వెళుతుంది.

జరాంగ్( నిమ్రౌజ్ ప్రావిన్స్):

ఇరాన్‌తో సరిహద్దు ఉన్న ఈ ప్రావిన్స్‌పై తాలిబన్‌లు ద‌ృష్టి పెట్టారు. దాని చుట్టుపక్కల ఉన్న ప్రావిన్స్‌లు వారి చేతికి చిక్కడంతో ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ప్రమాదంలో ఉంది.

కాలాఈ నవ్ (బాడ్ఘిస్ ప్రావిన్స్):

వాయవ్య ప్రావిన్సును చేజిక్కించుకున్నాక బాడ్ఘిస్ ప్రావిన్స్ రాజధానిని ఆక్రమించేందుకు తాలిబన్లు అవిశ్రాంతంగా పోరాటం జరుపుతున్నారు. బాడ్ఘిస్ మీ దాడితో ఇక్కడున్న తాలిబన్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.

కాలా-ఈ నవ్ పట్టణంలోని జైలులో ఉన్న తాలిబన్ ఖైదీలను విడుదల విడుదల చేసి వారిని సిటీలోకి ఆహ్వానించారు.

అయితే, ప్రభుత్వ సైన్యం తీవ్రవాదులపై దాడి చేసిందని, వారిని వెనక్కి తరిమిందని ప్రావిన్స్ గవర్నర్ వెల్లడించారు.

మజార్-ఈ-షరీఫ్(బాల్ఖ్ ప్రావిన్స్):

అఫ్గానిస్తాన్ ఉత్తర, ఈశాన్య ప్రావిన్సులలోని కొన్ని ఇతర ప్రాంతాలను నియంత్రించిన తరువాత, జూన్ చివరలో తాలిబాన్లు ఉజ్బెకిస్తాన్ ప్రక్కనే ఉన్న బాల్ఖ్ ప్రావిన్స్‌లోని మజార్-ఇ-షరీఫ్ నగరంతోపాటు అనేక జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే, మాజీ జిహాదీలు, తాలిబాన్ వ్యతిరేక కమాండర్లు, చట్టసభ సభ్యులతో కలిసి ప్రభుత్వ సైన్యానికి సహాయం చేయడానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఒక చోటుకు చేరుకున్నారని అఫ్గాన్ మీడియా తెలిపింది.

34 ప్రావిన్సులలో 20 ప్రావిన్సుల రాజధానులపై తాలిబన్‌ ప్రభావం కనిపిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 34 ప్రావిన్సులలో 20 ప్రావిన్సుల రాజధానులపై తాలిబన్‌ ప్రభావం కనిపిస్తోంది

ముప్పులో మరిన్ని ప్రాంతీయ రాజధానులు

ఇవి కాక, ఇంకా అనే ప్రాంతీయ రాజధానుల శివార్లలో తాలిబన్‌లు మోహరించి ఉన్నారు. దేశానికి ఉత్తరాన ఉన్న సర్-ఎ-పుల్ ప్రావిన్స్‌లోని రాజధాని నగరం సర్-ఎ-పుల్, బాల్క్‌హాబ్ జిల్లా మినహా మిగతావన్నీ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

జూన్ 10న ఈశాన్య ప్రాంతంలోని అర్గంజ్ఖ్వా జిల్లాను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్ దళాలు బడాఖాన్ రాజధాని ఫైజాబాద్ శివార్లకు చేరుకున్నాయి.

పశ్చిమాన ఫరా నగర శివార్లకు తాలిబన్ దళాలు జూన్‌లోనే చేరుకున్నాయి. దక్షిణ, పశ్చిమ అఫ్గానిస్తాన్‌ను కలిపే కాందహార్-హెరాత్ రహదారి ఈ నగరం గుండా వెళుతుంది.

అదే సమయంలో, అఫ్గానిస్తాన్-ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కోహ్సాన్ జిల్లాలోని ఇస్లాం కలాన్‌లో తరచూ ప్రభుత్వ దళాలకు, తాలిబన్ మిలిటెంట్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఇటీవల ఇక్కడ టెలీ కమ్యూనికేషన్స్‌కు అంతరాయం కలిగింది. హెరాత్‌లో ఇంటర్నెట్ సేవ నిలిచిపోయాయి.

కాబూల్ సరిహద్దులో ఉన్న మేడాన్ వార్దాగ్ ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్‌లు మూడు వైపుల నుంచి రాజధాని మేడాన్ షార్‌ను ముట్టడిస్తున్నారు.

ప్రభుత్వ దళాలను వెనక్కి నెట్టిన తర్వాత ఉరుజ్గాన్ రాజధాని తారిన్ కోట్ శివార్లలో కూడా తాలిబన్ దళాలు మకాం వేశాయి.

దౌలత్ షా జిల్లా, అలీషెంగ్, అలీగర్ జిల్లాల్లోని మూడు సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్లు లాగ్మాన్ ప్రావిన్స్‌కు తూర్పు భాగంలో ఉన్న రాజధాని మెహతార్లామ్ శివార్లకు చేరువయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)