పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మనోజ్ చతుర్వేది
    • హోదా, బీబీసీ కోసం

టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత బృందంలో పతకం తీసుకురావచ్చని ఎక్కువ ఆశలు పెట్టుకోగల వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా పీవీ సింధు మాత్రమే. ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఆమె రజత పతకం గెలుచుకున్నారు. అలా, ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం అందించిన మొదటి క్రీడాకారిణిగా నిలిచారు.

కానీ, కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన కఠిన పరిస్థితుల మధ్య టోక్యో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో మిగతా క్రీడాకారుల్లాగే సింధు ఒలింపిక్ సన్నాహాలపై కూడా ప్రభావం పడింది.

ఈ ఒలింపిక్స్‌లో సింధు తన పతకం రంగును మార్చగలరా? అంటే స్వర్ణ పతకం గెల్చుకోగలరా అనేదే ప్రశ్న. సింధు సత్తా చూస్తుంటే, ఈసారీ ఆమె బంగారాన్ని సొంతం చేసుకోవడం ఖాయమే అనిపిస్తోంది.

సింధు గత ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి, ఈసారీ పాల్గొనడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంతకు ముందు ఆమె అండర్ డాగ్‌గా బరిలోకి దిగారు. కానీ, ఈసారీ సింధు గత ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన ప్లేయర్‌గా పోటీపడనున్నారు. అందుకే దేశమంతా ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది. అది సింధుకు కూడా బాగా తెలుసు.

"నేను ఎప్పుడైనా, ఏదైనా మేజర్ టోర్నమెంటులో కోర్టులోకి అడుగుపెడితే, పతకం గెలవాలనే ఆశతోనే దిగుతాను. కానీ, ఆ అంచనాలను అందుకునేలా ఆడడం అంత సులభం కాదు. ఆ ఆశల ఒత్తిడికి గురికాకుండా నేను నా ఆటపై ఫోకస్ చేస్తుంటాను" అన్నారు.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

బాగా ఆడుతుందనే ఆశ

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు పతకం అవకాశాల గురించి ఆరు సార్లు నేషనల్ చాంపియన్‌గా నిలిచిన మంజూషా కన్వర్ బీబీసీతో మాట్లాడారు.

"రియో ఒలింపిక్స్ ఫైనల్లో కెరోలిన్ మారిన్ చేతిలో సింధు ఓటమి పాలవడం ఇప్పటికీ గుర్తుంది. కానీ, సింధు కచ్చితంగా పతకం గెలవగలిగే ఒక బలమైన పోటీదారు. కానీ అందుకు ఆమె మొత్తం టోర్నమెంట్ సాగే సమయంలో తనను తాను 150 శాతం ఫిట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. గత మూడు నాలుగు నెలలుగా సింధఉ కొరియా కోచ్ పార్క్ తెయీ సెంగ్ పర్యవేక్షణలో కఠినంగా శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం అందాలి" అన్నారు.

జపాన్ క్రీడాకారుల మీద పీవి సింధుకు మెరుగైన రికార్డ్ ఉంది. కానీ, ఈసారీ జపాన్ షటిలర్లు స్వదేశంలోనే ఆడుతుంటారు. దానివల్ల వారికి ప్రయోజనం లభించడం ఖాయం.

"జపాన్ షటిలర్లను వారి దేశంలో ఓడించడం సింధుకు కాస్త కష్టమే. సింధు ప్రారంభ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్లను ఎదుర్కోకుండా డ్రా వస్తే బాగుంటుంది. సింధుకు కచ్చితంగా ప్రాక్టీస్ లోటు ఉంది" అని కన్వర్ అన్నారు.

కానీ, ప్రస్తుత స్థితిలో దాదాపు ఆటగాళ్లందరి పరిస్థితీ అలాగే ఉంది. కానీ, ఈసారీ పతకం గెలవగలిగే క్రీడాకారుల్లో సింధు ఉంటారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

పీవీ సింధుకు గత ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా, ఈసారీ ఆమె ప్రపంచ చాంపియన్ హోదాలో పాల్గొనబోతున్నారు. సింధు 2019 ఆగస్టులో బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జపాన్ ప్లేయర్ నోజోమీ ఒకుహారాను 21-7, 21-7తో ఓడించి ఈ టైటిల్ గెలిచారు.

ఆమె క్వార్టర్ ఫైనల్లో తైవాన్ షట్లర్ తైయీ యూ జింగ్‌ను ఓడించారు. ఈ మ్యాచుల్లో సింధు ఆటలో ఒక తేడా కనిపించింది. ప్రత్యర్థి ఆటకు భిన్నంగా తన ఆటను మార్చుకోవడం ఆమె నేర్చుకున్నారు. అంతకు సింధు దూకుడు విధానం అవలంబిస్తూ, ఆట మొదట్లోనే తన బలమంతా కోల్పోయేవారు. దాంతో, చాలాసార్లు ప్రత్యర్థి ప్లేయర్లు ఆమె శక్తి తగ్గిపోవడాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఆటతీరు మార్చుకున్నారు.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

సన్నాహాల తీరు మారింది

కరోనా మహమ్మారి వల్ల చాలా టోర్నమెంట్లు రద్దయిన విషయం మనందరికీ తెలుసు. దానివల్ల ఆటగాళ్ల సన్నాహాలు కష్టం అయ్యాయి. దాంతో, సింధు మరో రకంగా ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో, సుచిత్రా అకాడమీ సహకారంతో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఈ ట్రైనింగ్ దక్షిణ కొరియా కోచ్ పార్క్ తెయీ పర్యవేక్షణలో జరుగుతోంది. భిన్నమైన ఆటతీరు ప్రదర్శించే ఒకహారా, యామాగూచీ, రత్చానోక్ లాంటి ఆటగాళ్లను సమర్థంగా ఎదుర్కోగలిగేలా ఈ ట్రైనింగ్ సాగుతోంది. ఆ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుని సింధు ప్రతి రోజూ ఎంతోమంది క్రీడాకారులతో ఆడుతున్నారు.

ఈ ట్రైనింగ్‌లో ఒక్కోసారి కుడిచేతి వాటం ఆటగాళ్లతో, ఇంకోసారి ఎడమచేతి వాటం ఆటగాళ్లతో ఆడడంతోపాటు దూకుడుగా, డిఫెన్సివ్‌గా ఆడే ఆటగాళ్లతో కూడా సింధు ప్రాక్టీస్ చేస్తున్నారు.

శిక్షణలో టోక్యోలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆ ఏర్పాట్లు కూడా చేశారు. ట్రైనింగ్ సమయంలో చాలామంది ఆటగాళ్లతో ఆడడం వల్ల తన ఆటతీరులో ఒక కొత్తదనం వచ్చినట్లు సింధు చెప్పారు.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

కరోనా కాలం పనికొచ్చింది

కరోనా మహమ్మారి సమయాన్ని సింధు సద్వినియోగం చేసుకున్నారు. మార్చిలో స్విస్ ఓపెన్ ఫైనల్ వరకూ పోటీ ఇచ్చిన సింధు, తర్వాత ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొని మ్యాచ్ ప్రాక్టీస్ లోటును ఒక స్థాయి వరకూ భర్తీ చేశారు. కానీ, ఆ అవకాశాన్ని అందుకుని ఆల్ ఇంగ్లండ్ టైటిల్ మాత్రం సొంతం చేసుకోలేకపోయారు.

ఒలింపిక్ క్వాలిఫయర్‌లో లేకపోవడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనలేదు. బ్రిటన్‌లో కరోనా వల్ల ఇండోనేషియా కూడా దీన్నుంచి తప్పుకుంది.

అలాంటి పరిస్థితుల్లో అందరికీ, ఈసారీ సింధు టైటిల్ కల నెరవేరినట్టే అనిపించింది. కానీ థాయ్‌లాండ్ షట్లర్ పోర్నపావీ సెమీ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి సింధు ఆశలపై నీళ్లు చల్లింది. కానీ, సింధు మాత్రం తాను ఆ సమయాన్ని టెక్నిక్, నైపుణ్యం మెరుగుపరుచుకోడానికి ఉపయోగించుకున్నానని చెప్పారు.

"సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనం టోర్నీలో ఆడి తిరిగి వచ్చాక పొరపాట్లను సరిదిద్దుకుంటాం. మన టెక్నిక్ మీద వర్క్ చేయడానికి పెద్దగా సమయం దొరకదు. కానీ, నేను ఈసారీ ఆ పనిని పూర్తి చేయగలిగాను" అన్నారు సింధు.

వీడియో క్యాప్షన్, పీవీ సింధు: ‘‘నా గేమ్ నేను ఆడాలి, వంద శాతం బెస్ట్ ఇవ్వాలి, అప్పుడే గెలుపు సాధ్యం’’

సింధు దారిలో అవరోధాలు

రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కెరోలిన్ మారిన్ ఈసారీ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదనేది నిజం. అయినప్పటికీ సింధు స్వర్ణ పతకం అందుకోవడం అంత సులభంగా జరిగేలా లేదు.

పీవీ సింధు స్వర్ణ పతకం అందుకునే దారిలో జపాన్ షట్లర్లు నోజోమీ ఒకుహారా, యామాగూచీతోపాటూ ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ చెన్ యూ ఫెయీ, నంబర్ టూ తైవాన్‌కు క్రీడాకారిణి తై యూ జింగ్, థాయ్‌లాండ్ రత్చానోక్ ఇంతానోన్ అతిపెద్ద అవరోధాలుగా నిలవచ్చు.

వీరందరి మీదా సింధుకు మెరుగైన రికార్డ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ యామాగూచీ, ఒకుహారాకు స్వదేశంలో ఆడడం ప్లస్ అవుతుంది. స్టేడియంలో ప్రేక్షకులు ఉండరు కాబట్టి అంత ఎక్కువ ప్రయోజనం కూడా లభించకపోవచ్చు.

చెన్ యూ ఫెయీ మీద కూడా సింధుకు 6-4 రికార్డ్ ఉంది. కానీ ఈ యువ చైనా షట్లర్ 2019లో బీడబ్ల్యుఎఫ్ ఫైనల్లో సింధును ఓడించిన తర్వాత చాలా పురోగతి సాధించారు. ఆమె ఈసారీ సింధుకే కాదు, ఒలింపిక్స్‌లో అందరికీ ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

పురుషుల పతకాల ఆశలు తక్కువే

సింధుతోపాటూ బ్యాడ్మింటన్ పురుషుల్లో బి.సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

2019 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన ప్రణీత్ ఒలింపిక్ పతకం గెలుస్తానని చెప్పాడు. కానీ పురుషుల విభాగంలో దిగ్గజాలు ఉండడం, డబుల్స్ జోడీకి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం తక్కువగా ఉండడంతో వారు పతకం తీసుకువస్తారనే ఆశలు పెట్టుకోవడం సరికాదు.

"ప్రణీత్ 2017లో చాలా అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ, గత కొంతకాలంగా అతడి ప్రదర్శన పతకం తీసుకువచ్చే స్థాయిలో లేదు. అయినా, పురుషుల డ్రా చాలా కఠినంగా ఉంటుంది. ఇక డబుల్స్ విషయానికి వస్తే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం వల్ల అందులో ప్రయోజనం లభిస్తుంది. కానీ, మన జోడీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోవడం వల్ల వారిని బలమైన పోటీదారులుగా భావించలేం. వారు ఆ స్థాయికి రావడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది అని మంజూషా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)