టోక్యో ఒలింపిక్స్: క్రీడల ప్రారంభానికి ముందే నగరంలో అత్యవసర పరిస్థితి - Newsreel

ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్ ప్రభుత్వం టోక్యోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఒలింపిక్ క్రీడలు ఆరంభమైన తరువాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.

జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.

కానీ ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

ఒలింపిక్స్ ముగిసిన తరువాత కూడా ఆగస్టు 26వ తేదీ వరకు నగరంలో అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా విలేఖరుల సమావేశంలో తెలిపారు.

మరోపక్క జపాన్‌లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించకూడదంటూ అనేకమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఆటలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జపాన్‌లో ఏప్రిల్ నెలలో కరోనా కొత్త వేవ్ ప్రారంభమైంది. అయితే ఇంఫెక్షన్ సోకినవారి సంఖ్య తక్కువగానే ఉంది.

జపాన్‌లో కోవిడ్‌తో ఇప్పటివరకు 14,900 మంది చనిపోయారు.

బుధవారం జపాన్‌లో 2180 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 920 కేసులు టోక్యోలోనే నమోదయ్యాయి. గతవారం నమోదైన 714 కేసుల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. మే 13 (1010 కేసులు) తరువాత టోక్యోలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

జాకబ్ జుమా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జాకబ్ జుమా

జాకబ్ జుమా: జైలుకు వెళ్లి లొంగిపోయిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కోర్టు ధిక్కరణ కేసులో జైలు అధికారులకు లొంగిపోయారు.

తన ఇంటికి సమీపంలోని ఓ జైలుకు బుధవారం సాయంత్రం ఆయనే స్వయంగా వెళ్లి లొంగిపోయారని ఆయనకు చెందిన ఫౌండేషన్ తెలిపింది.

బుధవారం రాత్రిలోగా లొంగిపోకపోతే అరెస్ట్ తప్పదని పోలీసులు హెచ్చరించడంతో 79 ఏళ్ల జుమా నేరుగా జైలుకు వెళ్లారు.

అవినీత కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో వారం రోజుల కిందట దక్షిణాఫ్రికాలోని ఒక కోర్టు ఆయనకు 15 నెలల జైలు శిక్ష వేసింది.

ఈ జైలు శిక్ష దక్షిణాఫ్రికాలో ముందెన్నడూ లేని రీతిలో నాటకీయ పరిణామాలకు తెరతీసింది.

మాజీ అధ్యక్షుడు ఒకరు జైలు పాలు కావడం దక్షిణాఫ్రికా చరిత్రలో ఇదే ప్రథమం.

జుమా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వ్యాపారవేత్తలు కీలక నిర్ణయాలలో నేతలను ప్రభావితం చేసేవారన్నది ఆరోపణ. కానీ, జుమా మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అని, తనను బలి పశువు చేసేవారని చెబుతుండేవారు.

జుమా తొమ్మిదేళ్ల పాలనలో అవినీతికి సంబంధించిన కేసు దర్యాప్తులో ఓ అంశానికి సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ఆయన పాటించకపోవడంతో ధిక్కరణ కింద జూన్ 29న ఆయన 15 నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)