జార్జ్ ఫ్లాయిడ్ హంతకునికి 22 ఏళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో దోషిగా తేలిన మిన్నియాపోలిస్ మాజీ భద్రతాధికారి డెరెక్ చావిన్‌కు 22 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
"అధికార దుర్వినియోగం, ముఖ్యంగా ఈ కేసులో చూపించిన దుర్మార్గం" ఆధారంగా శిక్ష విధించామని జడ్జి తెలిపారు.
2020 మే నెలలో 48 ఏళ్ల ఫ్లాయిడ్ మెడపై చావిన్ తొమ్మిది నిముషాల పాటు మోకాలు నొక్కి పెట్టడంతో ఆయన మరణించారు.
ఫ్లాయిడ్ మరణంతో జాత్యహంకారానికి, పోలీసుల దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
కోర్టు గత నెలలోనే సెకండ్ డిగ్రీ మర్డర్ సహా ఇతర నేరాల్లో చావిన్‌ను దోషిగా నిర్ధరించింది.
కాగా, "మంచి చేసే ఉద్దేశంలోనే తప్పు జరిగిందని" చావిన్ తరపు లాయర్ వాదించారు.
ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈ తీర్పును స్వాగతించారు.
"పోలీసుల దుర్మార్గాన్ని తీవ్రంగా పరిగణిస్తారని ఈ తీర్పు నిరూపించింది" అంటూ ఫ్లాయిడ్ సోదరి బ్రిడ్జెట్ ఫ్లాయిడ్ హర్షం వ్యక్తం చేశారు.
"ఈ తీర్పు సముచితంగానే ఉంది" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
విచారణ ఎలా సాగింది?
ఫ్లాయిడ్ మరణానికి కారకులైనవారికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ సందర్భంగా ఫ్లాయిడ్ సోదరుడు టెరెన్స్ ఫ్లాయిడ్ కోరారు.
"మా నాన్నను నేను చాలా మిస్ అవుతున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం" అని ఫ్లాయిడ్ కుమార్తె ఏడేళ్ల జియానా వీడియోలో కనిపించి చెప్పారు.
ఈ ఘటన ఫ్లాయిడ్ వర్గానికి, ఈ దేశానికి, ముఖ్యంగా ఆయన కుటుంబానికి ఎంతో బాధాకరమని జడ్జి అన్నారు.
"ఈ తీర్పు భావోద్వేగాలతో, సానుభూతితో ఇచ్చింది కాదు. కానీ, ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు" అని జడ్జి పీటర్ కాహిల్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చావిన్ కోర్టులో చెప్పారు. కానీ, ఆయన క్షమాపణ అడగలేదు.
"చావిన్ మంచి వ్యక్తి. ఆయన అమాయకుడనే ఎప్పుడూ నమ్ముతాను" అని చావిన్ తల్లి కోర్టులో చెప్పారు.
జార్జి ఫ్లాయిడ్ ఎవరు? ఏం జరిగింది?
మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన కొద్ది సమయం తర్వాత చనిపోయారు.
మే 25న సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నారు. అందుకు ఆయన 20 డాలర్ల నోటు ఇచ్చారు. షాపులో పని చేసే ఉద్యోగి దాన్ని నకిలీ నోటుగా భావించి, పోలీసులకు ఫోన్ చేశారు.
తర్వాత కొద్దిసేపటికే ఇద్దరు పోలీసు అధికారులు కప్ ఫుడ్స్ వద్దకు వచ్చారు. అక్కడే ఓ పక్కన ఉన్న కారులో ఫ్లాయిడ్ కూర్చుని ఉన్నట్లు గుర్తించారు.

ఫొటో సోర్స్, AFP
అధికారుల్లో ఒకరైన థామస్ లేన్ ఆ కారు దగ్గరికి వెళ్లి, తుపాకీ బయటకు తీశారు. ఫ్లాయిడ్‌ను చేతులు బయటకు చాచమని ఆదేశించి, సంకెళ్లు వేశారు.
‘నకిలీ నోటు ఇచ్చినందుకే’ ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను స్క్వాడ్ కారులోకి ఎక్కించేందుకు వాళ్లు ప్రయత్నించారు. దీంతో పెనుగులాట మొదలైంది.
ఫ్లాయిడ్ నేలపై పడిపోయారు. తనకు క్లాస్ట్రోఫోబియా ఉందని అధికారులకు చెప్పారు.
ప్యాసింజర్ సీటు వైపు నుంచి చావిన్ లాగేందుకు ప్రయత్నించారు. దీంతో ఫ్లాయిడ్ కింద పడిపోయారు. ఆయన ముఖం నేల వైపు ఉంది. చేతులకు సంకెళ్లు అలాగే ఉన్నాయి.
అప్పుడే అక్కడున్నవాళ్లు ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీయడం మొదలుపెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియో క్లిప్పుల్లో ఫ్లాయిడ్ నిస్సహాయ స్థితిలో కనిపించారు. ఫ్లాయిడ్ మెడపై చావిన్ తన ఎడమ మోకాలిని మోపారు.
‘‘ఊపిరి అందటం లేదు’’ అని ఫ్లాయిడ్ పదేపదే పోలీసులకు మొరపెట్టుకున్నారు. ‘‘ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్’’ అంటూ ప్రాధేయపడ్డారు.
ఎనిమిది నిమిషాల 46 సెకన్ల పాటు చావిన్ తన మోకాలితో ఫ్లాయిడ్ మెడను నొక్కిపట్టి ఉంచారని విచారణలో తేలింది.
అయితే, ఫ్లాయిడ్ మెడను నొక్కి పెట్టిన ఆరు నిమిషాల్లో ఆయనలో కదలికలు ఆగిపోయాయి.
ఫ్లాయిడ్ కుడి చేతి మణికట్టు పట్టుకుని ఓ అధికారి నాడి పరీక్షించారు. స్పందన తెలియనప్పటికీ పోలీసులు కదల్లేదు.
మరి కొన్ని క్షణాల తర్వాత ఏ కదలికలూ లేకుండా ఉన్న ఫ్లాయిడ్‌ను హెనేపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తరలించారు.
ఆ తర్వాత ఓ గంటకు ఫ్లాయిడ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీరీ నేతలతో సమావేశం వెనుక మతలబు ఏమిటి...నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందా?
- బ్రెజిల్ అధ్యక్షుడే బంగారం స్మగ్లర్లకు సహకరిస్తున్నారా? అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనర్లు ఎందుకు రెచ్చిపోతున్నారు?
- కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?
- 'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- అఫ్గానిస్తాన్ నుంచి ప్రాణభయంతో పారిపోవడం నుంచి ఒలింపిక్స్‌లో కరాటే పోటీల్లో పాల్గొనే దాకా...
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- ఇరాన్ ఎన్నికలు: ఇబ్రహీం రైసీ ఎన్నిక ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








