అమెజాన్ అడవుల్లో రెచ్చిపోతున్న గోల్డ్ మైనర్లు... బ్రెజిల్ అధ్యక్షుడే స్మగ్లర్లకు సహకరిస్తున్నారా?

ఫొటో సోర్స్, CHRISTIAN BRAGA/GREENPEACE
- రచయిత, హ్యూగో బచేగా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది మే 11, 2021 మధ్యాహ్నం. స్థానిక గిరిజన తెగకు చెందిన నాయకుడు డరియో కొపెనవాకు బ్రెజిల్ అమెజాన్ అడవులలోని మారుమూల గ్రామం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
'పాలిము' అనే ఆ మారుమూల గ్రామంలో వెయ్యి మంది ప్రజలు నివసిస్తుంటారు. సమీపంలోనే ఉరారి కొయెరా అనే నది ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే హెలికాప్టర్‌లో లేదంటే గంటల తరబడి బోట్‌లో ప్రయాణించి మాత్రమే వెళ్లగలరు.
యనోమామి తెగ ప్రజలకు కొపెనవా నాయకుడు. వారి సమస్యలను ఆయన వింటుంటారు. వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్నం అలా సాయం కోరుతూ పాలిము గ్రామం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది.
''వాళ్లు దాడికి సిద్దంగా ఉన్నారు. మమ్మల్ని ఇక చంపేసినట్లే'' అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. 'వాళ్లు' అంటే ఈ ప్రాంతంలో అక్రమంగా బంగారాన్ని తవ్వి తీసేవారు అని అర్ధం.
బ్రెజిల్ అటవీ ప్రాంతంలో ఈ స్మగ్లర్లను 'గారింపీర్స్' అని పిలుస్తుంటారు.
ఏడు మోటార్ బోట్లలో గారింపీర్స్ ఇక్కడి చేరుకున్నారని, వాళ్లలో కొందరి దగ్గర ఆటోమేటిక్ గన్‌లు ఉన్నాయని, విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారని ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కొపెనవాకు వివరించారు.
యనోమామి తెగకు చెందిన పాలిము గ్రామస్థులు తమపై దాడికి దిగిన మైనింగ్ స్మగ్లర్లపై ఎదురు దాడి చేశారు. చెట్ల చాటు నుంచి బాణాలు వదులుతూ వారిని తీవ్రంగా గాయపరిచారు.
అరగంటపాటు సాగిన పోరాటం తర్వాత బాణాల ధాటికి తట్టుకోలేక స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే, వాళ్లు తిరిగి వచ్చి ప్రతీకారానికి దిగుతారని పాలిము గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.
స్మగ్లర్ల దాడికి భయపడిన మహిళలు పిల్లలను తీసుకుని దట్టమైన అడవిలోకి పారిపోయారు. బ్రెజిల్‌లోని రొరాయిమా స్టేట్‌లో అతి పెద్ద అటవీ రిజర్వ్ ప్రాంతంలో పాలిము గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో 27,000 మందికి పైగా ఆదివాసీలు నివసిస్తున్నారు.

ఫొటో సోర్స్, CHRISTIAN BRAGA/GREENPEACE
మైనింగ్ ఎందుకు జరపకూడదు?
బ్రెజిల్‌లోని ఈ అటవీ ప్రాంతంలో మైనింగ్ నిర్వహించడం అక్రమం. కానీ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు పాల్పడేందుకు స్మగ్లర్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ''ఈ ప్రాంతంలో ఎక్కడికెళ్లినా గారింపీర్స్ ఉంటారు'' అన్నారు కొపెనవా.
తెగ నాయకుడు కావడం వల్ల తనపై హత్యాయత్నాలు జరిగే ముప్పుందని కొపెనవా ఈ ప్రాంతంలో సంచరించడం లేదు. అయితే, పాలిము గ్రామంపై కొందరు దాడి చేశారని తెలిసిన వెంటనే ఆయన అధికారులను అలర్ట్ చేశారు.
మరుసటి రోజు కొందరు పోలీసులు చిన్న విమానంలో పాలిము గ్రామానికి చేరుకున్నారు. డాక్టర్ హెకుకారి కూడా పోలీసులను కలిశారు. హెకుకారి ఈ ప్రాంతపు హెల్త్ కౌన్సిల్‌కు హెడ్‌గా పని చేస్తున్నారు.
కాసేపటి తర్వాత ఆ గ్రామం నుంచి వెళ్లిపోతున్నసమయంలో నదిలో కొన్ని మెషిన్ బోట్లను హెకుకారి గుర్తించారు. వీళ్ల కంటబడకుండా స్మగ్లర్లు బోట్ ఇంజిన్లను ఆపేశారు. వారికి దగ్గరగా వెళ్లడానికి కొందరు ప్రయత్నించినప్పుడు దుండగులు గ్రామంపై కాల్పులు జరిపారు.
''వారి ఏజెంట్లు పోలీస్, పోలీస్ అని అరుస్తున్నారు. అయినా వాళ్లు కాల్పులు ఆపలేదు. వారికి పోలీసులంటే భయం కూడా లేదు'' అన్నారు హెకుకారి.
''ఇక్కడ పోలీసులకే ఎవరూ భయపడటం లేదు. ఇక ప్రజలకు భద్రత ఎక్కడ ఉంది'' అన్నారు కొపెనవా.

ఫొటో సోర్స్, CHRISTIAN BRAGA/GREENPEACE
'స్మగ్లర్లకు ధైర్యం వచ్చింది'
ప్రస్తుత అధ్యక్షుడు బోల్సనారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్మగ్లర్ల కదలికలు ఎక్కువయ్యాయి. ఈ రిజర్వ్‌లో కొంత భాగంలో మైనింగ్, వ్యవసాయానికి అనుమతి ఇచ్చే ఉద్దేశంలో బోల్సనారో ప్రభుత్వం ఉంది.
బంగారం ధరలు పెరగడంతో ఇక్కడ మైనింగ్‌పై స్మగ్లర్ల కన్నుపడిందని అలీసన్ మరుగల్ అనే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు.
''మహమ్మారికి స్మగ్లర్లు ఏమాత్రం భయపడలేదు. పైగా వారి కార్యకలాపాలు ఇంకా పెరిగాయి'' అని మరుగల్ వ్యాఖ్యానించారు.
గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడంలో అమెజాన్ అడవులు ఎంతో ఉపయోగపడుతుండగా, ఆ అడవులను కాపాడటంలో రిజర్వ్ ప్రాంతాలు కీలకంగా మారాయి.
అయితే, వ్యవసాయ వ్యాపారవేత్తల నుంచి మద్ధతు పొందుతున్న అధ్యక్షుడు బోల్సనారో ఈ ప్రాంతంలో నివసించే వారికన్నా భూమి ఎక్కువగా ఉందని, వ్యవసాయానికి, మైనింగ్‌కు ఇందులో కొంత కేటాయించాలని భావిస్తున్నారు.
బోల్సనారో తండ్రి కూడా ఒకప్పటి గారింపీరో అని స్థానికులు చెబుతారు. భారీ ఖనిజ నిల్వలున్న ఈ ప్రాంతాన్ని 1992లో బ్రెజిల్ ప్రభుత్వం రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించింది.
అయితే, ఈ విషయంలో బోల్సనారో మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
''బోల్సనారో గారింపీరోలకు మద్ధతిస్తారు. ఆయనకు ఈ ప్రాంతాన్ని రక్షించాలన్న పట్టింపేమీ లేదు. మా ప్రాంతమంటే ఆయనకు చులకన. మేం కష్టాల్లో ఉన్నామంటే ఎవరూ పట్టించుకోరు'' అన్నారు కొపెనవా.
ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా, అమెజాన్ అడవులలో నివసించే ఆదివాసి తెగల మనుగడపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునేందుకు బోల్సనారో సిద్ధమయ్యారు.
సాధారణ ప్రజలు కూడా అక్కడ భూములను కొనేందుకు అవకాశం కల్పించే బిల్లు ఒకటి కాంగ్రెస్ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టి మరో బిల్లు, అక్కడ అస్తిత్వంలో ఉన్న ఆదివాసి ప్రాంతాల సైజును తగ్గించేందుకు ప్రతిపాదనలు చేసింది.
''వారి కార్యకలాపాలకు చట్టం నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే స్మగ్లర్లకు ధైర్యం వచ్చింది'' అని ప్రాసిక్యూటర్ మరుగల్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, CHRISTIAN BRAGA/GREENPEACE
'రాజకీయ పక్షాల్లో చిత్తశుద్ధి లేదు'
యనోమామి రిజర్వ్ కోసం పోరాడి సాధించిన వ్యక్తిగా కొపెనవా తండ్రి డేవిడ్ కొపెనవాకు పేరుంది. ఆయన్ను అందరు దలైలామా ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అంటారని 2014లో కొపెనవా నాకు చెప్పారు.
''తెల్ల ప్రజలకు డబ్బు కావాలి. అందుకోసం వాళ్లు దేనినయినా ధ్వంసం చేస్తారు'' అన్నారు కొపెనవా.
గత ఏడాది సుమారు 500 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో యనోమామి ప్రాంతంలో భూమి ఆక్రమణకు గురైందని ఐఎస్ఏ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది కూడా ఈ ఆక్రమణ కొనసాగుతూనే ఉందని తెలిపింది.
స్మగ్లర్లు ఇప్పటికే నదిని పాదరసంతో కలుషితం చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారాన్ని సేకరించడంలో పాదరసాన్ని ఉపయోగిస్తారు.
ఇదికాక ఇక్కడికి భారీ ఎత్తున మద్యం, డ్రగ్స్ స్మగ్లర్లు సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వారి కారణంగానే ఈ ప్రాంతంలో కరోనా వైరస్ కూడా వ్యాపించింది.
''వాళ్లు ఎక్కుడ ఉంటారో, ఏం చేస్తారో అందరికీ తెలుసు. వారికి అంత ధైర్యం ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు'' అని ఓ మాజీ అధికారి అన్నారు.
''కొందరు బలమైన వ్యక్తులకు ఈ అక్రమ మైనింగ్‌లో భాగస్వామ్యం ఉంది. వారిని ఏ చర్యలు ఆపలేవు'' అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Christian Braga/Greenpeace
కరోనా మహమ్మారి యానోమామి ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ ప్రాంతంలోకి బోట్లు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
గతంలో ఇక్కడి వచ్చిన బోట్లను వెంటాడి తరిమి కొట్టినందుకు ప్రతీకారంగానే మే నెలలలో స్మగ్లర్లు ప్రతిదాడికి దిగి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ ప్రాంతంలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే ఓ భారీ క్రిమినల్ నెట్‌వర్క్‌కు ఈ దాడిలో ప్రమేయం ఉందని వాట్సప్ ఆడియోల రూపంలో ఆధారాలు బయటపడ్డాయి.
ఇక్కడున్న బంగారపు గనులను రక్షించే బాధ్యతను మైనింగ్ ముఠాలు ఈ నేరగాళ్లకు అప్పజెప్పినట్లు అనుమానించాల్సి ఉందని ప్రాసిక్యూటర్ మరుగల్ వ్యాఖ్యానించారు.
''వాళ్ల దగ్గర భారీ ఆయుధాలు ఉన్నాయి. దీనినిబట్టి పెద్ద ముఠాల హస్తం ఉందని అనుమానించవచ్చు'' అన్నారు మరుగల్.
మొదటి దాడి జరిగిన అయిదు రోజుల తర్వాత మళ్లీ పాలిము గ్రామంపై దుండగులు దాడికి దిగారు. పాలిము గ్రామంపై జరుగుతున్న దాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు కూడా బోల్సనారో ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కానీ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న ఆశ కొపెనవాలో కనిపించడం లేదు. ''మేం ప్రమాదంలో ఉన్నాం. మాలో సహనం చచ్చిపోయింది'' అన్నారు కొపెనవా.
ఇవి కూడా చదవండి:
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








