రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?

పుతిన్ చిత్రాన్ని చూస్తున్న హ్యాకర్

ఫొటో సోర్స్, Getty Images/ BBC

    • రచయిత, జో టైడీ
    • హోదా, సైబర్ ప్రతినిధి

అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య జెనీవాలో జరిగిన సమావేశాల్లో ర్యాన్సమ్‌వేర్ దాడుల గురించి చర్చకు వచ్చింది. ఈ చర్చల తర్వాత, ఈ దాడులను అరికట్టేందుకు ఇరు దేశాల మధ్య సైబర్ సెక్యూరిటీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అంగీకారం కుదిరింది.

ఇటీవల కొన్ని కీలకమైన అమెరికా సంస్థల పై జరిగిన హై ప్రొఫైల్ సైబర్ దాడుల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పుతిన్‌తో సంప్రదింపులు మొదలుపెడతామని బైడెన్ అన్నారు.

కానీ, పెరుగుతున్న సైబర్ దాడులకు మూలమెవరనే అంశం పై ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో ఈ చర్చలు క్లిష్టంగానే ఉండే అవకాశం ఉంది.

ఇటీవల అమెరికాలో అతి పెద్ద ఇంధన పైప్‌లైన్ వ్యవస్థ పై సైబర్ దాడి వల్ల జరిగిన నష్టం గురించి ఈ చర్చల్లో బైడెన్ పుతిన్‌తో చర్చించారు.

ఈ దాడులను డార్క్ సైడ్ అనే సైబర్ ముఠా చేసినట్లు అమెరికా ధ్రువీకరించింది. ఆ బృందం రష్యాకు చెందిందనే అనుమానం ఉంది.

16 కీలకమైన సంస్థల పై భవిష్యత్తులో సైబర్ దాడులు జరగకుండా చూడాలని, ఆ సంస్థల జాబితాను కూడా పుతిన్‌కి ఇచ్చినట్లు బైడెన్ చెప్పారు.

అయితే, అమెరికాలో జరిగిన కొలోనియల్ పైప్‌లైన్ దాడితో కానీ, ఇతర దాడులతో కానీ రష్యాకు సంబంధం లేదని పుతిన్ విలేఖరులకు చెప్పారు.

అమెరికా నుంచే చాలా సైబర్ దాడులు జరుగుతాయని అమెరికాకు చెందిన కొంత మంది వ్యక్తులు చెప్పినట్లు పుతిన్ చెప్పారు.

అమెరికా నుంచి జరిగే దాడుల గురించి రష్యా ఇచ్చే సమాచారాన్ని విస్మరిస్తారని అన్నారు.

రష్యాలో ర్యాన్సమ్‌వేర్ ముఠాలున్నాయా?

సైబర్ ప్రపంచమే అజ్ఞాతంగా పని చేస్తుంది. దాంతో, ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం.

అయితే, ఇవన్నీ ఒక ప్రత్యేక ప్రాంతం నుంచి జరుగుతున్నాయని చెప్పడానికి కాదనలేని ఒక సరళిని నిపుణులు గమనించారు.

"ఈ దాడులన్నీ మునుపటి సోవియెట్ యూనియన్‌లో దేశాలైన రష్యా, యుక్రెయిన్ లాంటి దేశాల నుంచి జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ బృందం భావిస్తోంది" అని మాజీ రష్యా హ్యాకర్ డిమిట్రీ స్మిల్యానెట్స్ అన్నారు .

దీనిని నిరూపించడానికి చాలా ఆధారాలు ఉన్నాయని డిమిట్రీతో పాటు ఇతర నిపుణులు నాలుగు ప్రత్యేక ఆధారాలను వివరించారు.

1. చాలా బృందాలు హానికారకమైన సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను డార్క్‌వెబ్‌లో ప్రత్యేకంగా రష్యా మాట్లాడే హ్యాకర్ గ్రూఫుల్లోనే ప్రకటన చేస్తారు.

2. చాలా హ్యాకర్ బృందాలు మాస్కో సమయానికనుగుణంగా పని చేస్తాయి. సాధారణంగా రష్యాలో పబ్లిక్ సెలవులున్న రోజుల్లో ఈ బృందం నిశ్శబ్దంగా ఉంటుంది.

3. చాలా కేసుల్లో రష్యా కీ బోర్డుతో పని చేసే కంప్యూటర్ వ్యవస్థల పై దాడులను నిరోధించే విధంగా, ర్యాన్సమ్ వేర్ కోడ్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన సూచనలు పొందుపరుస్తారు.

4. పశ్చిమ దేశాలతో పోలిస్తే, రష్యాలో గాని, లేదా మునుపటి సోవియెట్ దేశాల్లో గానీ వ్యవస్థలు ఈ వైరస్ దాడులకు గురైన సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి.

"ర్యాన్సమ్‌వేర్ నిర్వాహకులను, వాటి అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకునే రహస్య కార్యకలాపాలు కూడా అనూహ్యమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తున్నాయి" అని సైబర్ ఢిఫెండర్స్ రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థకు పని చేసే స్మిల్యానెట్స్ చెప్పారు.

మ్యాక్సిమ్ యకూబెట్స్ , ఐగోర్ తురాషే

ఫొటో సోర్స్, US Department of Justice

ఫొటో క్యాప్షన్, రష్యాకు చెందిన మ్యాక్సిమ్ యకూబెట్స్ , ఐగోర్ తురాషే ఎవిల్ కార్ప్ ర్యాన్సమ్ వేర్ బృందాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

"వారికున్న పరిజ్ఞానం, మూలాలు చాలా కచ్చితంగా ఉండి, ఈ రంగం పై దృష్టి పెట్టిన సైబర్ పరిశోధకులు కనుగొన్న ఫలితాలను సమర్ధిస్తున్నాయి" అని అన్నారు.

2019లో అమెరికా, యూకే అధికారులు ఇద్దరు రష్యా వ్యక్తుల పై ఎవిల్ కార్ప్ అనే ర్యాన్సమ్‌వేర్ ముఠాను నడుపుతున్నారనే ఆరోపణలు చేశారు. కానీ, రష్యాలో ఈ ఇద్దరు వ్యక్తులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు.

రష్యా కూడా ర్యాన్సమ్‌వేర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు పుతిన్ చెబుతున్నారు.

ఇటీవల రష్యా ఆరోగ్య రంగం పై జరిగిన సైబర్ దాడులను ప్రస్తావిస్తూ, రష్యా కూడా తరచుగా ఈ దాడులను ఎదుర్కొంటోందని సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పుతిన్ చెప్పారు.

ఈ దాడులను అమెరికాకు చెందిన హ్యాకర్లు చేశారని ఆయన ఆరోపించారు.

అయితే, ఇది హ్యాకింగ్ అయి ఉండదని డిమిట్రీ అంటున్నారు.

ఎందుకంటే, శత్రువు భూభాగంలో అయితేనే ఎవరి మీదైనా దాడి చేయడానికి ఆస్కారం ఉండటం వల్ల రష్యాలో ర్యాన్సమ్‌వేర్ దాడులు జరిగే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు.

అంతర్జాతీయ వ్యాపారం

ఈ ర్యాన్సమ్‌వేర్ ముఠాలు చాలా దేశాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఉదాహరణకు 2017లో యూకేలో కొన్ని వందల ఆసుపత్రుల పై ప్రభావం చూపించిన చరిత్రలోనే అత్యంత దారుణమైన ర్యాన్సమ్‌వేర్ దాడికి ఉత్తర కొరియాలోని హ్యాకర్లు బాధ్యులు.

అరెస్టయిన హ్యాకర్లు

ఫొటో సోర్స్, npu.gov.ua

ఫొటో క్యాప్షన్, అరెస్టయిన హ్యాకర్లు

జెనీవా సమావేశం జరిగిన రోజే, యుక్రెయిన్‌లో ఆరుగురు అనుమానితులను క్లోప్ అనే ర్యాన్సమ్‌వేర్ బృందంతో సంబంధాలున్నాయనే ఆరోపణల పై అరెస్టు చేశారు.

అమెరికా, దక్షిణ కొరియా సంస్థల పై జరిగిన దాడుల్లో వీరికి పాత్ర ఉందనే అభియోగాలు వీరి పై ఉన్నాయి.

కెనడాలో ఈ జనవరిలో నెట్‌వాకర్ అనే హ్యాకర్ బృందంతో సంబంధం ఉందనే అనుమానంతో మరో హ్యాకర్‌ను అరెస్టు చేశారు.

అయితే, ఇటీవల జరిగిన అరెస్టుల వల్ల ర్యాన్సమ్‌వేర్ హ్యాకింగ్ నెట్ వర్కులకు నిధులను సరఫరా చేసే కీలకమైన నేర సంస్థలకు పెద్దగా హాని చేకూర్చలేదు.

ప్రపంచాన్ని చీలుస్తున్నఈ వినాశకరమైన లాభదాయకమైన క్రిమినల్ పరిశ్రమకు కేంద్రం మాత్రం రష్యా, మునుపటి సోవియెట్ బ్లాక్‌కి చెందిన దేశాల్లోనే ఉన్నాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)