ఇమ్రాన్ ఖాన్: ‘ఇస్లాం మతాన్ని, ముస్లింలను, ప్రవక్త గొప్పతనాన్ని పశ్చిమ దేశాలు అర్థం చేసుకోలేవు’

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS/Lim Huey Teng

భావ ప్రకటనా స్వేచ్ఛకు ఒక హద్దుంటుందని, ఎదుటివారి మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడకూడదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

"ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్త విలువ, ప్రాధాన్యత గురించి పాశ్చాత్యులకు ఏమీ తెలీదు" అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

ఇది ఇస్లామిక్ దేశాల వైఫల్యమని, ప్రపంచవ్యాప్తంగా అల్లుకుంటున్న ఇస్లాం వ్యతిరేకత (ఇస్లామోఫోబియా) గురించి చర్చించాల్సిన బాధ్యత ఆ దేశ నేతలపై ఉందనీ అన్నారు.

అంతేకాకుండా, అవసరమైతే తాను ఈ సమస్యను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తుతానని తెలిపారు.

శుక్రవారం ఇస్లామాబాద్‌లో ఈద్-ఉల్-మిలాద్ సందర్భంగా ఏర్పాటైన ఒక సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు.

ఫ్రాన్స్, ఇస్లామిక్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి ఆయన మాట్లాడుతూ...

"పశ్చిమ దేశాల్లో ఇస్లామోఫోబియా రోజురోజుకూ పెరుగుతోందని, ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాలన్నీ కలిసి ఈ సమస్య గురించి చర్చించాలని ఇస్లామిక్ దేశాల నాయకులందరికీ చెప్పాను."

"ఇస్లామోఫోభియా కారణంగా వివిధ దేశాల్లో అల్ప సంఖ్యలో ఉన్న ముస్లింలు ఇబ్బందులకు గురవుతున్నారు."

"ఇస్లాం, ప్రవక్త, ముస్లింల మధ్య ఉన్న సంబంధాన్ని పశ్చిమ దేశాల్లోని ప్రజలు అర్థం చేసుకోలేరు. మన దగ్గరున్న ఉన్న పుస్తకాలు వారి వద్ద లేవు. అందుకే వారికి అర్థం కాదు."

"ముస్లింలు భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని, సంకుచిత మనస్త్వత్వం కలవారని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఆ దిశలో ప్రచారం జరుగుతోంది."

"ఇస్లాంకు వ్యతిరేకంగా ఒక చిన్న సమూహమే ఉంది. వీరు ముస్లింలను చెడ్డవాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. వీరి చర్యలు ముస్లింలకు ఇబ్బందికరంగా ఉన్నాయని మనం ప్రపంచానికి తెలియజెయ్యాలి."

"చార్లీ హెబ్డోలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా వీరు ముస్లింలందరినీ చెడ్డవాళ్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటారు" అని తెలిపారు.

పాఠశాలల్లో తొమ్మిది నుంచీ పన్నెండు తరగతుల విద్యార్థులకు ఇస్లాం మత ప్రవక్తల గురించి తెలిపే పాఠాలు చెప్పేట్లుగా ఒక చట్టాన్ని తీసుకు వస్తామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

ఈ సమావేశంలో పాకిస్తాన్ పాలనలోని కశ్మీర్ ప్రధానమంత్రి రాజా ఫరూక్ హైదర్ కూడా పాల్గొన్నారు. దేశంలోని ఫ్రెంచ్ ఉత్పత్తులన్నిటినీ బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫ్రాన్స్ వైఖరికి వ్యతిరేకంగా పాకిస్తాన్, భారత్‌లతో సహా అనేక దేశాల్లో నిరసనలు జరిగాయి.

పాకిస్తాన్‌లో ఫ్రాన్స్ వ్యతిరేక ప్రదర్శనలు

ఫొటో సోర్స్, EPA/ARSHAD ARBAB

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఫ్రాన్స్ వ్యతిరేక ప్రదర్శనలు
పాకిస్తాన్‌లో ఫ్రాన్స్ వ్యతిరేక ప్రదర్శనలు

ఫొటో సోర్స్, EPA/SOHAIL SHAHZAD

పాకిస్తాన్

ఇస్లాం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల ఆగ్రహం చెందుతూ శుక్రవారం నాడు పాకిస్తాన్‌లో పలుచోట్ల నిరసనలు తెలిపారు.

ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ముందు పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఫ్రెంచ్ ఉత్పత్తులన్నిటినీ బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వాడాల్సి వచ్చింది.

కరాచీలో కూడా శుక్రవారం ప్రార్థనల తరువాత దాదాపు 10,000 మంది నిరసనల్లో పాల్గొంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

భారత్

గురువారం నాడు మధ్య ప్రదేశ్‌లో భోపాల్‌లోని ఇక్బాల్ మైదానంలో వేలమంది ముస్లింలు గుమికూడి నిరసనలు తెలియజేసారు. ఫ్రాన్స్ జాతీయ జెండాను తగులబెట్టారు.

ఈ నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్...ఫ్రాన్స్‌నుంచీ భారత రాయబారిని వెనక్కు పిలిపించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు బీబీసీ ప్రతినిధి షురై నియాజీ తెలిపారు.

ఈ నిరసన ప్రదర్శనలపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మధ్య ప్రదేశ్ శాంతియుత రాష్ట్రమని, ఇక్కడి శాంతికి భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ, ఈ సంఘటనపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని, దీనికి కారకులయినవారిని ఎవ్వర్నీ వదిలిపెట్టమని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, EPA/MONIRUL ALAM

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో నిరసన ప్రదర్శనలు

బంగ్లాదేశ్

శుక్రవారం బంగ్లాదేశ్‌లో ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వందలాదిమంది పాల్గొన్నారు.

రాజధాని ఢాకాలో బైతుల్ ముకర్రం మసీదు వద్ద జరిగిన నిరసనల్లో అధిక సంఖ్యలో ప్రజలతో పాటూ పలు రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కు వ్యతిరేకంగా "శాంతికి శత్రువు" అని రాసి ఉన్న ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేసారు.

వార్తా సంస్థ ఏఎఫ్‌పీ సమాచారం ప్రకారం ఈ నిరసనల్లో 12,000 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇందులో 40,000 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.

పాలస్తీనా

పాలస్తీనాలోని అల్ అక్సా మసీదు ఎదుట వేలమంది నిరసనల్లో పాల్గొన్నారు. గాజాలో ఫ్రాన్స్ అధ్యక్షుడి దిష్టి బొమ్మను తగులబెట్టారు.

అల్ అక్సా ముందు ఒక నిరసనకారుడు వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ "ఫ్రాన్స్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు బాధ్యత వహించాలి. ఇస్లాంకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలవల్లే ఇవన్నీ జరుగుతున్నాయని" అని అన్నారు.

ఇస్లామిక్ సంస్థ హమాస్ అధికారి నాసిం యాసిన్ మాట్లాడుతూ "మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడినవారికి కఠిన శిక్షలు విధించాలని" అన్నారు.

పాలస్తీనాలో నిరసన ప్రదర్శనలో భాగంగా మేక్రాన్ చిత్రపటానికి నిప్పు పెట్టిన నిరసనకారులు

ఫొటో సోర్స్, EPA/ABED AL HASHLAMOUN

ఫొటో క్యాప్షన్, పాలస్తీనాలో నిరసన ప్రదర్శనలో భాగంగా మేక్రాన్ చిత్రపటానికి నిప్పు పెట్టిన నిరసనకారులు

అసలు ఈ వివాదం ఏమిటి? ఫ్రాన్స్‌లో ఏం జరిగింది?

ఈ నెల ప్రారంభంలో, ఫ్రాన్స్‌లో మహమ్మద్ ప్రవక్తపై వచ్చిన కార్టూన్లను తన విద్యార్థులకు చూపించిన ఉపాధ్యాయుడు శామ్యూల్ ప్యాటీపై కొందరు దాడి చేసి శిరఛ్చేదానికి పాల్పడ్డారు.

మరణించిన ఉపాధ్యాయునికి నివాళులు అర్పిస్తూ కార్టూన్ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తెలిపారు. ముస్లిం ఛాందసవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫ్రాన్స్‌లోని 60 లక్షల ముస్లిం జనాభాలో కొంతమంది కలిసి "కౌంటర్ సొసైటీని" తయారుచేసే అవకాశాలున్నాయని అన్నారు.

కౌంటర్ సొసైటీ లేదా కౌంటర్ కల్చర్ అంటే దేశంలో విస్తృతంగా ఉన్న సంస్కృతికి భిన్నమైన సమాజాన్ని సృష్టించడం.

ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన పలు ఇస్లామిక్ దేశాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

పాకిస్తాన్, ఇరాన్, టర్కీ వంటి పలు దేశాలు తమ నిరసనలు తెలియజేసాయి.

ఫ్రాన్స్‌నుంచీ తమ రాయబారిని వెనక్కు రప్పించాలంటూ పాకిస్తాన్ పార్లమెంట్, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

భావ ప్రకటనా స్వేచ్ఛతో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఫ్రాన్స్ ప్రభుత్వ వైఖరిని ఇరాన్ ప్రభుత్వం ప్రశ్నించింది.

ఫ్రెంచ్ ఉత్పత్తులను బహిష్కరించాలని పలు ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి.

టర్కీ అధ్యక్షుడు రిసిప్ తయ్యిప్ ఎర్దోవాన్ మాట్లాడుతూ "ఫ్రాన్స్‌లో ముస్లింల అణిచివేతకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు రావాలి, ఫ్రెంచ్ లేబుల్ ఉన్న వస్తువులను కొనరాదు" అని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)