పాకిస్తాన్‌: హిందూ ఆలయం రామ్‌ పీర్ మందిరంలో విగ్రహాల ధ్వంసం

రామ్ పీర్ మందిరం
    • రచయిత, రియాజ్ సొహైల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఒక హిందూ దేవాలయాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.

శనివారం జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.

సింధ్ ప్రావిన్స్‌లోని బాదిన్ జిల్లా కడియూ ఘనోర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. కడియూ ఘనోర్‌లో కోలీ, మేఘవాడ్, గువారియా, కారియా వంటి హిందూ వర్గాలవారు ఉన్నారు. వారంతా అక్కడున్న రామ్ పీర్‌గా పిలిచే రామ్‌దేవ్ పీర్ మందిరంలో పూజలు చేస్తుంటారు.

స్థానిక ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మనూ లాంజర్ 'బీబీసీ'తో మాట్లాడుతూ దాతల సహాయంతో మందిరం నిర్మించుకున్నామని.. రెండేళ్ల కిందటే ఆలయ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

ఆలయంలోని విగ్రహాలు ధ్వంసమైనట్లు ప్రధాని పూజారి తనకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసిందని.. పోలీసులు, స్థానికుల సహాయంతో ఒక అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేశారని మనూ లాంజర్ చెప్పారు.

కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ కుమార్ మాట్లాడుతూ.. శనివారం తాను, మరికొందరు కలిసి ఆలయ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఉదయం 10 గంటల సమయంలో మొహమ్మద్ ఇస్మాయిల్ షాహిదీ అనే వ్యక్తి వచ్చాడని.. ఆయన అప్పుడప్పుడూ ఆలయం వద్దకు వస్తుంటాడని.. అలా వచ్చిన ఇస్మాయిల్ లోనికి వెళ్లి విగ్రహాలను ధ్వంసం చేశాడని.. పూజారి కేకలు వేయడంతో పారిపోయాడని చెప్పారు.

కాగా విగ్రహాల ధ్వసంపై కడియూ ఘనోర్ పోలీసులు పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295(ఎ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్మాయిల్‌ను అరెస్ట్ చేశారు.

''ఇస్మాయిల్ ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలను ధ్వంసం చేశాడా.. ఆయన మానసిక పరిస్థితి సక్రమంగానే ఉందా'' అనేది ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు.

నిందితుడికి తీవ్రవాద గ్రూపులతో సంబంధం లేదని ప్రాథమికంగా గుర్తించామని.. కోర్టులో ప్రవేశపెట్టి విచారణ కోసం రిమాండ్ కోరుతామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అస్గర్ తెలిపారు.

రామ్ పీర్ విగ్రహం

తెలంగాణలోనూ రామ్ పీర్ ఆలయాలు

భారత్‌లోని రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌కి 150 కిలోమీటర్ల దూరంలోని రానో జయ్ పట్టణంలో 500 ఏళ్ల కిందట రామ్ పీర్ జన్మించినట్లు చెబుతారు.

భారత్‌లో తెలంగాణ, రాజస్థాన్, హరియాణా, దిల్లీ, గుజరాత్, అస్సాం, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో రామ్ పీర్ ఆలయాలున్నాయి.

తెలంగాణలో హైదరాబాద్, మంచిర్యాల, ఖమ్మం తదితర ప్రాంతాల్లో రామ్ పీర్ ఆలయాలున్నాయి.

పాకిస్తాన్, కెన్యాల్లోనూ..

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే టండవాలియాలో భారీ రామ్ పీర్ ఆలయం ఉంది. పాకిస్తాన్‌లోని హిందువులకు అది రెండో అతిపెద్ద తీర్థయాత్రా స్థలం.

ఏటా భాద్రపద మాసంలో అక్కడ మూడు రోజుల పాటు భారీ ఉత్సవం జరుగుతుంది.

కాగా ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ స్థానిక పోలీసులను బాదిన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షబ్బీర్ సెతార్ ఆదేశించారు.

పాకిస్తాన్‌లో హిందువులు మైనారిటీలు.. అక్కడ సుమారు 75 లక్షల మంది హిందువులు ఉన్నట్లు అంచనా. ఎక్కువగా సింధ్ ప్రావిన్స్‌లోనే హిందూ జనాభా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)