సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..

అలుపు లేకుండా రోజుల తరబడి ఎగరుతూ ప్రయాణించడంలో ఎల్బట్రాస్ దిట్ట

ఫొటో సోర్స్, JOHN STILLWELL/PA

ఫొటో క్యాప్షన్, అలుపు లేకుండా రోజుల తరబడి ఎగరుతూ ప్రయాణించడంలో అల్బట్రాస్ దిట్ట
    • రచయిత, సమంతా పాట్రిక్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ఇదొక అద్భుతమైన పక్షి. దీని శక్తి నమ్మడానికి, ఊహించడానికి వీలు లేకుండా ఉంటుంది. గాలిలో ఎక్కువసేపు ఎగరడంలో ఇది దిట్ట. భూమి మీద వాలకుండా నెలరోజుల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు ప్రయాణించినా అలసిపోదు. తన జీవిత కాలంలో ఇది దాదాపు 85 లక్షల కిలోమీటర్ల దూరం ఎగురుతూ ప్రయాణిస్తుంది. అంటే పదిసార్లు చంద్రుడిపైకి వెళ్లి వెనక్కు వచ్చినంత దూరం.

మూడు మీటర్ల పొడవైన దాని రెక్కలు దానికి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. అది ఒక విమానంలాగా సముద్రాన్ని చుట్టేయగలదు. అదే అల్బట్రాస్‌. ఒక ప్రత్యేకమైన సముద్రపు పక్షి. ఇది ఇప్పుడు ఒక కొత్త బాధ్యతను కూడా నిర్వహించబోతోంది.

కేవలం సముద్రంలో చేపలను వేటాడటంలోనే కాదు, సముద్రపు దొంగలను అధికారులకు పట్టించడంలో కూడా అల్బట్రాస్‌ సహాయ పడుతుంది.

సముద్రంలో చేపలు పట్టుకోడానికి మత్స్యకారులు వలలు వేస్తారు. అయితే ఈ వలల్లో చేపలే కాకుండా అనేక పక్షులు, సముద్ర జీవులు కూడా చిక్కుకుని మరణిస్తుంటాయి. దీనినే బై క్యాచింగ్‌ అంటారు. ఈ బైక్యాచింగ్‌ కారణంగా ఏటా కొన్ని వేలపక్షులు, సముద్ర జీవులు చనిపోతున్నాయి.

చేపల వేట సందర్భంగా పక్షుల మరణాలలో పెరుగుదల, ముఖ్యంగా అల్బట్రాస్‌ మరణాల మీద గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి సముద్రంలో అక్రమ వేటను నిరోధించే ప్రయత్నాలు చేయడంతో అల్బట్రాస్‌తోపాటు ఇతర సముద్ర జంతువుల మరణాలు క్రమంగా తగ్గు ముఖం పట్టాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాలకు తోడు సముద్రం మీద మిలిటరీ గస్తీ నౌకలు ఏర్పాటు చేసి అక్రమంగా చేపలను పట్టేవారిపై నిఘా పెట్టారు.

అయితే ఈ అక్రమ నౌకలను పర్యవేక్షించడం, ఏ చట్టం ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధమో నిరూపించడం కష్టం కావడంతో, అల్బట్రాస్‌ మరణాలు తగ్గాయి అనుకోడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది.

వీడియో క్యాప్షన్, సముద్రపు దొంగల్ని పట్టుకునే విమానం లాంటి పక్షి

నిఘా అధికారులకు అల్బట్రాస్ సహకారం

వివిధ దేశాలకు తమ సమీపంలో ఉన్న సముద్రం మీద అధికారం ఉంటుంది. కానీ సుదూర ప్రాంతాలలో అంతర్జాతీయ సముద్ర జలాలపై ఎవరి ఆధిపత్యం ఉండదు. ఈ జలాలపై పర్యవేక్షణ చాలాకష్టం. అయితే ఈ పనిని అల్బట్రాస్‌ చేస్తున్నాయి.

30 రోజుల్లో 10వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే అల్బట్రాస్‌ పక్షులు అక్రమంగా చేపల వేట సాగిస్తున్న వారి సమాచారాన్ని అధికారులకు అందిస్తున్నాయి.

ఫిషింగ్‌ ఏరియాలో తిరుగుతున్న సమయంలో వలల్లో చిక్కుకుని తరుచూ అల్బట్రాస్‌ మరణిస్తున్నాయి. దీంతో అల్బట్రాస్‌కు, ఫిషింగ్‌ బోట్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.

ముందు సముద్ర పక్షులు ఏ రకమైన చేపలను తినడానికి ఇష్టపడతాయో గమనించారు. అలాగే ఏ రకమైన పడవల వెంట ఎక్కువగా వెళతాయో కూడా పరిశీలించారు.

ఎల్బట్రాస్ పక్షులను రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, అల్బట్రాస్ పక్షులను రక్షించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి

సముద్రపు దొంగలపై కన్ను

చేపల వేట సమయంలో ఈ పక్షులు ఎక్కువగా ఏ ప్రాంతంలో చనిపోతున్నాయో తెలుసుకునేందుకు ఈ పరిశీలన చాలా ఉపయోగపడింది.

సముద్రం మీద నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోడానికి ఆన్‌బోర్డ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ నుంచి తీసుకున్న సమాచారం బాగా ఉపయోగపడింది. కానీ ఈ రికార్డ్‌లు రియల్‌ టైమ్‌ కావు.

గతంలో పరిశోధకులకు సముద్ర పక్షులు ఫిషింగ్‌ బోట్లతో ఎంతసేపు గడుపుతాయి, మిగతా ప్రదేశాలలో ఎంత సేపు ఉంటాయి అన్నది తెలిసేది కాదు.

ఇప్పుడు అవి గడిపే సమయంపై అవగాహన వచ్చాక, డేటా లాగర్‌ను అల్బట్రాస్‌ పక్షులకు అనుసంధానం చేశారు. ఈ లాగర్‌ నౌకల రాడార్‌ను గుర్తిస్తుంది. అనేక ఇతర సమాచారాలను కూడా అందిస్తుంది.

ఫిషింగ్‌ బోట్లతో సంబంధం ఉన్న ప్రతి పక్షి లింగం, వయసు కూడా ఈ డేటాలో ఉంటుంది. ఉదాహరణకు మగ పక్షులు అంటార్కిటికాకు దక్షిణ భాగంలో ఎక్కువగా తిరుగుతాయి. అక్కడ ఫిషింగ్‌ బోట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఆడపక్షులు ఫిషింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఉత్తర ప్రాంతంలో తిరుగాడుతుంటాయి. ఈ తేడాను గమనించడమే ఈ పరిశోధన మొదటి లక్ష్యం.

లాగర్‌ నుంచి పొందిన డేటా అదనపు సమాచారాన్ని అందించింది. ఇది ఓపెన్ సీ ఫిషింగ్ కార్యకలాపాల నిర్వహణకు సహాయపడింది.

ఎల్బట్రాస్ పక్షులకు ఏర్పాటు చేసిన డేటా ట్రాకర్ల ద్వారా అక్రమ చేపల వేటను అధికారులు గుర్తించవచ్చు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, అల్బట్రాస్ పక్షులకు ఏర్పాటు చేసిన డేటా ట్రాకర్ల ద్వారా అక్రమ చేపల వేటను అధికారులు గుర్తించవచ్చు

వాస్తవానికి ఫిషింగ్ బోట్లు, సాధారణ బోట్ల మధ్య వ్యత్యాసం తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం జరిగింది. అలాగే పక్షులు ఫిషింగ్‌ బోట్లవైపు ఆకర్షితులవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి.

ఈ లాగర్‌ డేటాను గ్లోబల్‌ మ్యాప్‌తో అనుసంధానించారు. దీంతో అన్ని బోట్ల లొకేషన్‌ను యాక్టివ్‌ ఆటోమేటిక్ డిటెక్షన్ సిస్టమ్‌లో చూడవచ్చు. ఈ రాడార్‌ బోట్లు ఒకదాన్ని ఒకటి ఢీకొనకుండా చేసేందుకు సహాయపడుతోంది.

అల్బట్రాస్‌ అందించిన డేటా అంటార్కిటిక్ మహాసముద్రంలో అక్రమంగా చేపల వేటను అనుకోకుండా బైటపెట్టింది. విస్తారమైన సముద్రంలో చేపలు, ఇతర సహజ వనరులను కేవలం నిఘా పడవల ద్వారానే అడ్డుకోవడం చాలా కష్టం. కానీ అల్బాట్రాస్ ఒంటరిగా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది.

అల్బట్రాస్‌లు అందించే డేటా ఆధారంగా ఫిషింగ్ పడవలను గుర్తించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నౌకలు లాగర్ సహాయంతో అక్రమ వేట పడవలను గుర్తిస్తాయి. విచారణ ప్రారంభమవుతుంది. డేటా సేకరణ సకాలంలో, పెద్ద ఎత్తున జరిగితే సముద్రపు దొంగలను సులభంగా పట్టుకోవచ్చు. ఇది అల్బట్రాస్‌ను, ఇతర సముద్ర జీవులను కాపాడటానికి ఉపయోగ పడుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)