భారత్-చైనా ఘర్షణలు ప్రధాని మోదీ "స్టార్టప్ ఇండియా" కలలపై ప్రభావాన్ని చూపుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పటికే కోవిడ్-19 వ్యాప్తితో సవాళ్లు ఎదుర్కొంటున్న భారతీయ స్టార్టప్‌లకు మరో కొత్త సవాలు ఎదురవుతోంది. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న 'స్టార్టప్ ఇండియా' ప్రయత్నాలకు భారత-చైనాల మధ్య ఘర్షణలు విఘాతం కలిగిస్తాయా అనేది చర్చనీయాంశమైంది.
ఇటీవల లద్దాఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ రెండు దేశాలూ తాజాగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
భారత్‌లోని మొత్తం 30 యునికార్న్స్‌లో 18 వాటిల్లో చైనా పెట్టుబడులు పెట్టింది. యునికార్న్ అంటే 7,000 కోట్ల రూపాయల ($1 బిలియన్) కన్నా ఎక్కువ విలువ చేసే ప్రైవేటు కంపెనీ.
చైనా పెట్టుబడులు పెట్టినవాటిల్లో ఫుడ్ డెలివరీ యాప్స్, టాక్సీ ఆగ్రిగేటర్స్, హోటల్ చైన్స్, ఈ-లెర్నింగ్ యాప్స్ కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణల దృష్ట్యా ఈ కంపెనీల భవిష్యత్తే కాకుండా, రాబోయే స్టార్టప్ కంపెనీల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో ఉంది.
ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ 'ట్రూ నార్త్ భాగస్వామి హరీష్ చావ్లా మాట్లాడుతూ "కచ్చితంగా మూలధన వనరులకు నష్టం వాటిల్లింది. వృద్ధి మందగిస్తూ, డీల్స్ పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మొబైల్, వినియోగదారుల విభాగాల్లో చైనా కంపెనీలు చురుకుగా ఉండేవి" అన్నారు.
ఇప్పటికే భారత ప్రభుత్వం..టిక్‌టాక్, పబ్ జీ లాంటి పాపులర్ యాప్‌లతోసహా 200 పైగా చైనా యాప్‌లను నిషేధించింది. అంతేకాకుండా కొన్ని హైవే ప్రోజెక్టులు, చిన్న, మధ్య తరహా సంస్థలలో చైనా పెట్టుబడులను నిలిపివేసింది. చైనాను బహిష్కరించాలన్న నినాదం ఊపందుకుంటోంది.
ఏప్రిల్‌లో కోవిడ్-19 వ్యాపిస్తున్న సమయంలో కంపెనీలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కఠినమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాన్ని ప్రవేశపెట్టింది.
విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్టప్‌లకు ఇది ఎదురుదెబ్బే.

ఫొటో సోర్స్, Getty Images
ఒక దశాబ్దానికి ముందు భారతదేశంలో చైనా కంపెనీల పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. అయితే స్టార్టప్ రీసెర్చ్ సంస్థ ట్రాక్షన్ గణాంకాల ప్రకారం.. 2010 నుంచీ 35 చైనా కంపెనీలు, 85 వెంచర్ క్యాపిటల్, ప్రైవైట్ ఈక్విటీ సంస్థలు...పేటీఎం, స్నాప్ డీల్, స్విగ్గీ లాంటి కంపెనీలతో సహా అనేక పెద్ద పెద్ద స్టార్టప్‌లలో 4 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి.
ఈ మధ్య కాలంలో భారతీయ ఎఫ్‌డీఐలో చైనా పెట్టుబడులు 5 నుంచీ 11 శాతానికి పెరిగాయి.
చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆరై)లో చేరడానికి భారత్ నిరాకరించినప్పటికీ వాస్తవానికి గత ఐదేళ్లుగా భారత్ అందులో భాగం అవ్వకనే అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సరిహద్దు సంఘర్షణలు, భారత ప్రభుత్వం చైనా యాప్‌ల మీద విధించిన నిషేధాలు ఇండియా స్టార్టప్‌ల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాన్నది చర్చనీయాంశంగా మారింది.
"ప్రారంభ దశలో ఆ ప్రభావం మనకి పెద్దగా కనబడకపోవచ్చు" అని చావ్లా అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో పేటీఎం, స్నాప్ డీల్, బిగ్ బాస్కెట్ లాంటి కొన్ని యునికార్న్‌లను బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ విషయం చాలా తీవ్రమైనది కావడం వలన వీరిలో ఏ ఒక్కరూ ఆన్-రికార్డ్ మాట్లాడడానికి నిరాకరించారు.
అయితే, చైనా నుంచి వచ్చే నిధులను ఆపడం భారత ప్రభుత్వ ఉద్దేశం కాదని పరిశ్రమకు చెందిన కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత ఈక్విటీ సంస్థల్లో, సాంకేతిక రంగ సంస్థల్లో చైనా బలోపేతం అవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని వీరు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శివనాడార్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ జాబిన్ టీ జాకబ్ మాట్లాడుతూ "ప్రభుత్వం చైనా పెట్టుబడులను పూర్తిగా నిషేధించదు. నిబంధనలను కట్టుదిట్టం చేస్తూ స్టార్టప్‌లలో ఒక స్థాయి దాటిన తరువాత చైనా పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా చేస్తుంది" అని అభిప్రాయపడ్డారు.
పెట్టిన పెట్టుబడుల నుంచీ బయటకు రప్పించే కంటే 5 జీ ట్రయల్స్ వేస్తున్నప్పుడు పెద్ద పెద్ద టెలికాం కంపెనీలను దూరంగా ఉంచడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నిపుణులు అంటున్నారు.
భారతదేశంలో చైనా పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక లా ఫర్మ్ భాగస్వామి అతుల్ పాండే మాట్లాడుతూ "ఇండియాలో చైనా కంపెనీల భారీ పెట్టుబడులు చూస్తే, ఇప్పటికిప్పుడు వాటిని తొలగించి వేరే దేశాల నుంచీ పెట్టుబడులు సమకూర్చగలిగే అవకాశం తక్కువగా ఉంది" అంటున్నారు.
తమకు చైనా పెట్టుబడిదారుల నుంచి 12 - 14 దరఖాస్తులు వచ్చాయని, సాధారణ పరిస్థితుల్లో అవన్నీ నిస్సందేహంగా ఆమోదించబడతాయని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని అతుల్ పాండే చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో దాన్నిబట్టీ పెట్టుబడుల పరిస్థితులు ఏమిటో తెలుస్తాయని ఆయన అన్నారు.
చైనా మొబైల్ ఫాస్ట్ ట్రెండ్ నుంచీ భారత స్టార్టప్‌లు పాఠాలు నేర్చుకుంటున్నాయని, చైనా యాప్స్ నిషేధించగానే అనేక కొత్త భారతీయ యాప్స్ తెరపైకి వచ్చాయని, కోవిడ్-19 ప్రభావం నెమ్మదించగానే మిగతా దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంటర్నెట్ కంపెనీలకు ఇప్పటికీ భారత్‌లో అతి పెద్ద మార్కెట్ ఉందని వారంటున్నారు.
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో కూడా గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సిలికాన్ వ్యాలీ సంస్థల నుంచి ఏఐడీఏ, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్ లాంటి సంస్థల నుంచీ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, అయితే అవన్నీ ముఖేష్ అంబానీ జియో వంటి ప్లాట్‌ఫారంలలోకి వెళ్లాయని నిపుణులు అంటున్నారు.
చైనా పెట్టుబడులను తగ్గించాలంటే స్వదేశీ పెట్టుబడులు పెరగాలని, స్టార్టప్‌ల మూలధనానికి ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే చైనా పెట్టుబడులు లేకుండా స్టార్టప్‌లను భారత్ నిలబెట్టగలదా లేదా అనేది తెలుస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- 10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








