కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీ... ప్రపంచ దేశాల మధ్య రాజకీయ యుద్ధంగా ఎందుకు మారింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, గోర్డన్ కొరెరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్పుత్నిక్-వి పేరుతో కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ విడుదల చేశామని ఆగష్టు 11న రష్యా చేసిన ప్రకటనను ఎవరూ మరిచిపోలేరు. సోవియట్ యూనియన్ 1957లో స్పుత్నిక్ సాటిలైట్‌ను ప్రయోగించి అంతరిక్ష పరిశోధనల రేసులో విజయం సాధించింది. ఇప్పుడు వైద్య పరిశోధన రంగంలో సరిహద్దులు చెరిపేస్తున్నట్లు రష్యా చెబుతోంది.
అందుకోసం రష్యా చాలా ప్రయాస పడుతోందని విమర్శకులు అంటున్నారు. రష్యా వ్యాక్సీన్ ప్రకటన పట్ల వెల్లువెత్తిన సందేహాలు చూస్తుంటే ఈ విషయంలో అంతర్జాతీయంగా పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ పోటీలో ప్రముఖంగా వినిపిస్తున్న " టీకా జాతీయవాదం" నేపథ్యంలో రష్యా దగ్గరి దారులు వెతికిందని, గూఢచర్యం చేసిందని, నైతిక విలువలు పాటించకుండా, అసూయతో వ్యవహరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆధునిక కాలంలో కోవిడ్ -19కి వ్యాక్సీన్ కనిపెడితే అది వైద్య రంగానికి లభించిన విలువైన బహుమతి అవుతుంది. ఇది ప్రాణాలను కాపాడటం మాత్రమే కాకుండా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని అంతం చేసి , ఇందులో విజయం సాధించిన వారికి కీర్తిని కూడా ఆపాదిస్తుంది.
“ఒక వైద్య ఉత్పత్తి కోసం రాజకీయంగా పందేలు పెట్టడం ఇప్పటి వరకు నేనెప్పుడూ చూడలేదు” అని అమెరికా జార్జి టౌన్ యూనివర్సిటీలో గ్లోబల్ హెల్త్, లా ప్రొఫెసర్ లారెన్స్ గోస్టిన్ అన్నారు. "కోవిడ్ 19 వ్యాక్సీన్ తయారీ ద్వారా సూపర్ పవర్ దేశాలు వారి శాస్త్రీయ నైపుణ్యాన్ని చూపించుకోవడానికి, వారి రాజకీయ విధానాలను అత్యుత్తమమైనవిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో వ్యాక్సీన్ తయారీ రాజకీయ మలుపులు తిరిగింది.”
ఇప్పటికే కనీసం ఆరు సంస్థలు వ్యాక్సీన్ తయారీకి ఆఖరి దశ ట్రయిల్స్ జరుపుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులో మూడు చైనాలో ఉండగా, ఒకటి బ్రిటన్‌లో, మరొకటి అమెరికాలో , ఇంకొకటి, జర్మనీ, అమెరికా కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీ ప్రపంచ దేశాల మధ్య ఎందుకు ఓ రాజకీయ యుద్ధంగా మారింది?భాగస్వామ్యంలో ఉన్నాయి.
ఒక వ్యాక్సీన్ తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వ్యాక్సీన్ తయారీదారులంతా దాన్ని తయారు చేయడానికి తొందర పడుతుంటే, రష్యా స్పుత్నిక్ పేరుతో వ్యాక్సీన్‌ను ప్రకటించడం పట్ల, వ్యాక్సిన్ తయారీకి అవలంబించాల్సిన సాధారణ విధానాన్ని కుదించడం పట్ల అనేక అనుమానాలు తలెత్తాయి.

ఫొటో సోర్స్, O’Neill Institute
రష్యా గూఢచార సంస్థలు వ్యాక్సీన్ పరిశోధన విధానాల గురించి హ్యాకింగ్ చేస్తున్నాయని యు కె, అమెరికా, కెనడా దేశాలు జూలై నెలలో ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను రష్యా ఖండించింది.
ఆ తరువాతి వారంలో ఇద్దరు చైనా హ్యాకర్లు బీజింగ్ ఇంటలిజెన్స్ సర్వీసెస్ తరపున వ్యాక్సీన్ అభివృద్ధిని హ్యాక్ చేసేందుకు లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. చైనా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించి విదేశీ భాగస్వాములకు సహకారం అందిస్తున్నామని చెప్పింది.
శ్రద్ధగా, నిశితంగా జరగాల్సిన వైద్య పరీక్షల్లో అవసరమైన విధానాలను పాటించకపోవడం పట్ల ఎక్కువ విచారం వ్యక్తం అవుతోంది.
"రష్యా వ్యాక్సీన్ విషయంలో సాధారణ విధానాలను కుదించడం జరిగిందని , కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ లో గ్లోబల్ హెల్త్ ప్రోగ్రాం డైరెక్టర్ థామస్ బోలికి చెప్పారు.
"ఒక వ్యాక్సీన్ అభివృద్ధి చేయడం కష్టం కాదు. కానీ, ఆ వ్యాక్సీన్ సురక్షితమో కాదో, ప్రభావవంతంగా పని చేస్తుందో లేదో నిరూపించడం కష్టం. దేశాలు కేవలం వ్యాక్సీన్ మాత్రమే కావాలనుకుంటే మొదటి పద్ధతిని అనుసరించవచ్చు" అని బోలికి అన్నారు.
ఆఖరి దశ ట్రయిల్స్ జరగకుండానే, పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించకుండా స్పుత్నిక్ వ్యాక్సీన్‌ను తొలి టీకాగా నమోదు చేయాలనే రష్యా నిర్ణయం పశ్చిమ దేశాల నుంచి అనేక విమర్శలను ఎదుర్కొంది. ఈ వ్యాక్సీన్ సురక్షితమైనది, ప్రభావవంతమైనదని రష్యా నిరూపించిందో లేదోననే విషయం పై అనుమానాలున్నాయని వైట్ హౌస్ కరోనా టాస్క్ ఫోర్స్ లో ముఖ్య సభ్యుడు ఆంథోని ఫాసీ అన్నారు.
ఇవన్నీ అసూయతో చేస్తున్న వ్యాఖ్యలని రష్యా కొట్టి పడేసింది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్ తయారీలో ప్రధాన పాత్ర పోషించిన వారు త్వరలోనే ఒక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ లో పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, చైనా కూడా వ్యాక్సీన్ తయారీని వేగవంతం చేసింది.
చైనా తయారు చేస్తున్న వ్యాక్సీన్ ని పరీక్షించేందుకు కొంత మంది సీనియర్ ఉద్యోగుల పై ప్రయోగించినట్లు చైనా ఫార్మాస్యూటికల్ కంపెనీలు చెబుతున్నాయి. రష్యా లో పుతిన్ కుమార్తె కి స్పుత్నిక్ టీకా ఇచ్చినట్లు ప్రకటించారు.
రష్యా, చైనా దేశాలు రెండూ తమ వ్యాక్సీన్‌ను దేశ సైనిక సిబ్బందిపై ప్రయోగించాలనే ఆలోచన నైతిక ప్రశ్నలను లేవనెత్తింది. వారు దీనికి పూర్తి అంగీకారాన్ని ఇవ్వకపోవచ్చు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో కలిసి పని చేస్తున్న చైనా సంస్థ కాన్ సినో వ్యాక్సీన్ మూడవ దశ ట్రయిల్స్ మొదలవక ముందే జూన్ నెలలో మిలిటరీ సిబ్బంది పై వాడటానికి ఆమోదించారు.
"వ్యాక్సీన్ ని దుర్వినియోగం చేయకుండా రక్షించేందుకు ఈ పరిశోధనలో పాల్గొనే వ్యక్తుల గురించి కొన్ని నైతిక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది” అని ప్రొఫెసర్ గోస్టిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Council on Foreign Relations
వ్యాక్సీన్ కి ఉన్న భారీ పబ్లిక్ డిమాండ్ దృష్ట్యా కొంత సడలింపు ఆశించవచ్చా?
పూర్తిగా ట్రయిల్స్ నిర్వహించకుండా టీకా విడుదల చేయడమనేది ప్రజల్లో అనవసరమైన నమ్మకాలు కలిగించి కోవిడ్ మరింత వ్యాప్తి చెందేందుకు తోడ్పడడమే అవుతుంది.
ఒక వేళ దుష్ప్రభావాలు ఏమన్నా తలెత్తితే వ్యాక్సీన్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.
చాలా వరకు వ్యాక్సీన్ తయారీ కార్యక్రమాలు ఆర్ధిక ప్రయోజనాల కోసం అంతర్జాతీయ సహకారంతో పని చేస్తున్నాయి. కానీ, దానిని ప్రభుత్వాలు ఒక జాతీయ గర్వంగా, తమ శాస్త్రీయ అధికారాన్ని చాటుకోవడానికి, ఈ విపత్తుని ఎదుర్కోవడానికి తాము ఎలా కృషి చేసామో చెప్పుకోవడానికి ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తున్నాయి.
“మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎలా పని చేశాయో నిరూపించుకునేందుకు కొన్ని దేశాలలో ఈ వ్యాక్సీన్ తయారీకి పోటీ పడటానికి ఒక కారణం” అని బోలీకి అన్నారు.
అమెరికాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
బ్రిటన్‌లో తయారు చేసే వ్యాక్సీన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి బలాన్ని ఇస్తుంది. “వ్యాక్సీన్ తయారీలో బ్రిటన్ ప్రపంచానికి మార్గదర్శకత్వం వహిస్తుందని” బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్‌కోక్ ప్రకటించారు.
"పశ్చిమ దేశాలలో టీకా జాతీయవాదం ఉందని, థామస్ బోలికి అన్నారు. "తొలి దశలో తయారు చేసిన వ్యాక్సీన్ సరఫరాలను అధిక మొత్తంలో యుఎస్, యూకేలలో ఉంచవచ్చు. కరోనావైరస్ ప్రబలక ముందే ఈ జాతీయ భావాలు తలెత్తడం మొదలయింది. కానీ, ఈ మహమ్మారి జాతీయ వాదాన్ని మరింత బలపరిచింది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
కరోనావైరస్ ప్రబలుతున్న తొలి దశలో వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చుకోవడం కోసం ఎయిర్పోర్ట్ ల దగ్గర డబ్బులు పట్టుకుని వేచి చూడటం అంతర్జాతీయ సరఫరా పై దేశాలు ఎంతగా ఆధారపడ్డాయో తెలియచేస్తున్నాయి. దీంతో దేశీయంగా వీటిని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా దేశాలు గుర్తించాయి.
వ్యాక్సీన్ ని త్వరగా తయారు చేసిన వారు తమ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకుని వారి వారి ఆర్ధిక వ్యవస్థలను పునరుద్ధరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే, తమకు కావాల్సిన వ్యాక్సీన్ ఉత్పత్తులను సమకూర్చుకోలేకపోతే ప్రజల ఆగ్రహానికి గురై వారి సామర్ధ్యానికి ప్రశ్నలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది.
ప్రపంచంలో ధనిక దేశాలు వ్యాక్సీన్లను పేద దేశాల వారికి అందివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత ఆగష్టు 18 వ తేదీన పిలుపునిచ్చారు.
"టీకా జాతీయవాదాన్ని మనం అరికట్టాలని" ఆయన అన్నారు.
దౌత్య వ్యవహారాల్లో భాగంగా దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడానికి కొన్ని దేశాలు ఇతర దేశాలకు వ్యాక్సీన్ అందించవచ్చు.
"వ్యాక్సీన్ ని ముందుగా తయారు చేసిన ప్రభుత్వాలు కొంత మేరకు వాటి నిల్వలను దౌత్య వ్యవహారాల కోసం పక్కన పెట్టే అవకాశం ఉంది" అని బోలికి అన్నారు.
మార్కెట్ లో ముందుగా వ్యాక్సీన్ విడుదల చేసినంత మాత్రాన అది ప్రభావవంతంగా పని చేస్తుందని అనుకోవడానికి లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎవరో ఒకరే విజయం సాధించడానికి ఇదేమి పరుగు పందెం కాదని అన్నారు.
అంటే, వ్యాక్సిన్ తయారీలో, అభివృద్ధిలో, సరఫరాలో చోటు చేసుకుంటున్న శత్రుత్వాలకు ఇది కేవలం ఆరంభం మాత్రమే!
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- మోదీ చెప్పినట్లు దేశంలో రోజుకు 10 లక్షల టెస్టులు చేయడం సాధ్యమేనా...
- కరోనావైరస్ ఆదివాసీ తెగలను అంతం చేస్తుందా...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- ఎక్స్ పొనెన్షియల్ గ్రోత్ బయాస్: కోవిడ్-19 కేసులు లెక్కించడంలో జరుగుతున్న కామన్ తప్పిదం ఇదే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








