యూఏపీఏ చట్టం: ఏ వ్యక్తినైనా ఉగ్రవాది అవునో కాదో ఇక ప్రభుత్వమే నిర్ణయిస్తుందా?

యూఏపీఏ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విభురాజ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“ఉగ్రవాదం మీద పోరాటం పేరుతో ప్రభుత్వం రాజ్య ఉగ్రవాదాన్ని ప్రజల మీద రుద్దుతోంది. నిరసనకారులను ఇప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఉగ్రవాదులుగా ప్రకటించవచ్చు.’’

రాజ్యసభలో 2019 ఆగస్టు 2న చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సవరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. సీపీఎం ఎంపీ ఇలారామ్‌ కరీం ఈ చట్టంపై ఆందోళన వ్యక్తం చేయగా, హోంమంత్రి అమిత్‌ షా దానికి సమాధానం ఇచ్చారు.

“మనం ఒక సంస్థను నిషేధించినట్లయితే, వారు ఇంకొక సంస్థను స్థాపిస్తారు. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను సంస్థలు చేయవు. వాటి వెనకున్న మనుషులు చేస్తారు’’ అన్నారు.

ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే యూఏపీఏ 6వ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఉద్దేశించిన ఈ చట్టంపై ఇప్పుడు మళ్లీ వివాదం రగులుకుంటోంది.

ఈ వివాదం మొదలుకాక ముందే ఉన్నత న్యాయస్థానంలో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. త్వరలో తీర్పు వెలువడనుంది.

యూఏపీఏ చట్టంపై వివాదం ఏంటి ?

ఒక వ్యక్తి లేదా సంస్థ ఉగ్రవాదానికి పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తే.. వారి మీద ఉగ్రవాదిగా, ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయగలదు.

ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడం, ఆ చర్యల్లో పాల్గొనడం, ఉగ్రవాదానికి సిద్ధం చేయడం, ప్రోత్సహించడంలాంటివన్నీ ఉగ్రవాదం కిందికి వస్తాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకరిపై ఉగ్రవాదిగా ముద్రవేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించి కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.

దీని కారణంగా రాజకీయ, సైద్ధాంతిక విభేదాల ఆధారంగా ప్రభుత్వం కొందరిని టార్గెట్‌ చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“యూఏపీఏ చట్టంలోని సెక్షన్‌ 35, 36 ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు, నిర్దేశించిన విధానం లేకుండా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. మరి ఎప్పుడు అతన్ని తీవ్రవాదిగా ప్రకటిస్తారు? విచారణ సందర్భంగానా, విచారణ పూర్తయ్యాకా? కోర్టు విచారణ జరుగుతున్నప్పుడా? అరెస్టుకు ముందా? అరెస్టు తర్వాతా? అన్న వివరాలు ఈ చట్టంలో ఎక్కడా కనిపించవు’’ అని దీనిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది సజల్ అవస్థి అన్నారు.

“మన న్యాయ వ్యవస్థలో ఒక నిందితుడు దోషిగా నిరూపణ అయ్యే వరకు నిర్దోషి కిందే లెక్క. కానీ ఇక్కడ విచారణకు ముందే ఉగ్రవాదిగా ముద్రవేస్తారు. అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధం’’ అని సజల్‌ అవస్థి అన్నారు.

యూఏపీఏ

ఫొటో సోర్స్, Getty Images

యూఏపీఏ చట్టంలో ఏముంది?

ఒక్కమాటలో చెప్పాలంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి 1967లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.

దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను సమర్ధవంతంగా అడ్డుకోడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.

అయితే భారత శిక్షా స్మృతి(ఐపీసీ) వీటిని అడ్డుకోవడంలో విఫలమైందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇది ప్రత్యేక పరిస్థితుల్లో అమలు చేయాల్సిన చట్టమని దక్షిణ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఈ చట్టంపై పరిశోధన చేస్తున్న రమీజుర్‌ రెహ్మాన్‌ అన్నారు.

“యూఏపీఏ చట్టం ప్రస్తుతం భారతదేశంలో చట్టవిరుద్ధమైన, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు వర్తించే ఏకైక చట్టం. ఐపీసీలో అనేక నేరాలు ప్రస్తావనకు రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1967లో ఈ చట్టం చేశారు ‘’

అక్రమం అంటే ఏంటి, ఉగ్రవాద కార్యకలాపాలు అంటే ఏంటి, ఉగ్రవాద ముఠాలు, సంస్థలు అంటే ఎవరు? ఇలాంటి వాటన్నింటికీ యూఏపీఏ చట్టం నిర్వచనం ఇస్తుంది

కశ్మీర్‌లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో రణ్‌బీర్‌ పీనల్‌ కోడ్‌ అమలులో ఉంది. అయితే యూఏపీఏ చట్టం దేశమంతటికీ వరిస్తుంది.

ఉగ్రవాదం అంటే ఏంటి ? ఎవరు ఉగ్రవాదులు ?

యూఏపీఏ చట్టం చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం, బీభత్సం వ్యాప్తి చేయడానికి, భారతదేశంలో లేదా విదేశాలలో లేదా ప్రజలలో ఏ విభాగంలోనైనా భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశపు ఐక్యత, సమగ్రత, వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత, సార్వభౌమత్వాన్ని హాని చేసే ప్రమాదకరమైన చర్యలను 'ఉగ్రవాద చర్యలు' అంటారు.

బాంబు పేలుళ్ల నుంచి నకిలీ నోట్ల చెలామణి వరకు ప్రతిదీ ఇందులో పేర్కొన్నారు.

ఉగ్రవాదం, ఉగ్రవాదికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడానికి బదులుగా, యూఏపీఏ చట్టం సెక్షన్‌ 15లో ఇచ్చిన 'ఉగ్రవాద చర్య'కు అనుగుణంగా వాటి అర్ధాలను మాత్రమే చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేసు విచారణకు ముందే ఒక వ్యక్తి లేదా సంస్థపై 'ఉగ్రవాద' ముద్రను వేయడానికి ఈ చట్టంలోని సెక్షన్ 35 ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది.

“ఒక వ్యక్తికి ఉగ్రవాది అన్న ముద్రవేయాలా వద్దా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) ట్రైబ్యునల్‌ ముందు మాత్రమే వారు నిర్ణయం తీసుకోవాలి’’ అని ఈ తరహా కేసులను వాదించే న్యాయవాది పారి వేందన్‌ అన్నారు.

యూఏపీఏ

ఫొటో సోర్స్, Getty Images

యూఏపీఏకు ముందు టాడా, పోటా

టెర్రరిస్ట్ అండ్‌ డిస్ట్రప్టివ్‌ యాక్టివిటీస్‌ (ప్రివెన్షన్‌)యాక్ట్‌ చట్టం ‘టాడా’, ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ చట్టం ‘పోటా’ ఇప్పుడు ఉనికిలో లేవు. అవి అమలులో ఉన్నప్పుడు చాలా దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి.

టాడా చట్టంలో ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు పేలుళ్లకు కూడా నిర్వచనం ఇచ్చారు. విధ్వంసక చర్యల కోసం ఒకరిని రెచ్చగొట్టడం, వాదించడం లేదా సలహా ఇవ్వడం కూడా నేరం. అలాగే పోలీసు అధికారి ముందు ఇచ్చిన సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతుందని ఈ చట్టంలో ఉంది.

కానీ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సెక్షన్‌ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలమే చెల్లుబాటు అవుతుంది.

వేలి ముద్రల ఆధారంగా నిందితుడు పట్టుబడ్డప్పుడు, ఇంట్లో ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి నేరానికి పాల్పడినట్లు టాడా చట్టం నిర్ణయిస్తుంది. ఇక తాను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది.

ఇక పోటా చట్టంలో ఎలాంటి ఆరోపణలు చేయకుండానే ఒక వ్యక్తిని 180 రోజులపాటు కస్టడీలో ఉంచడానికి నిబంధనలున్నాయి. కానీ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఇది 90 రోజులకే పరిమితమైంది.

ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం కోసం కొందరు వ్యక్తులపై ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనల కింద చాలాసార్లు జర్నలిస్టులను కూడా అరెస్టు చేశారు.

ఉగ్రవాద కార్యకలాపాల కోసం డబ్బును సేకరించడం కూడా ఒక నేరంగా ‘పోటా’లోని పలు సెక్షన్లు చెబుతున్నాయి. దాని ఆధారంగా కూడా శిక్షలు విధించవచ్చు. అయితే ఈ చట్టం 2004లో రద్దయింది.

యూఏపీఏ

ఫొటో సోర్స్, Getty Images

గతంలో కూడా సవరణలు

2019 ఆగస్టులో చేసిన వివాదాస్పద సవరణలకు ముందు యూఏపీఏ చట్టంలో ఐదుసార్లు మార్పులు చేర్పులు చేశారు.

"1995లో టాడా, 2004లో పోటా చట్టాలు రద్దయ్యాక, అదే సంవత్సరం నుంచి యూఏపీఏ చట్టంలో గణనీయమైన మార్పులు జరిగాయి. పోటాలోని కొన్ని నిబంధనలను ఇందులో చేర్చారు. టెర్రర్‌ నిధులకు సంబంధించి చార్జ్‌షీట్ వేయకుండానే 180 రోజులు నిర్బంధంలో ఉంచేలా ఈ చట్టంలో నిబంధనలు చేర్చారు’’ అని రీసెర్చ్‌ స్కాలర్‌ రమీజుర్ రెహ్మాన్ అన్నారు.

2008లో ఉగ్రవాదం అనే మాటకు విస్తృతమైన అర్ధాన్ని నిర్వచిస్తూ ఈ చట్టంలో మార్పులు చేశారు.

యూఏపీఏ అనుకూల, వ్యతిరేక వాదనలు

ఈ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్బంగా దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా వాదనలు జరిగాయి. ఎన్‌ఐఏ ఏ రాష్ట్రానికైనా వెళ్లి సొంతంగా పని చేసుకునేందుకు అధికారమిచ్చారని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చాలామంది వాదించారు.

కేంద్ర, రాష్ట్ర పోలీసు శాఖల మధ్య ఘర్షణ జరిగే అవకాశం కూడా ఉంది. న్యాయమూర్తి కానటువంటి ఒక అధికారి ఎవరినైనా ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. దీని కోసం ముందస్తుగా ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.

అయితే గతంలో ఉన్న యూఏపీఏలో నిబంధనలను, నిర్వచనాల నుంచి కొందరు తప్పించుకుంటున్నారని, అందుకే మార్పులు చేర్పులు అవసరమని ప్రభుత్వం వాదించింది.

“రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌ఐఏ రెండూ ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి. ఎన్‌ఐఏ 2078 కేసులు నమోదు చేసింది. 204 కేసుల్లో చార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పటి వరకు 54 కేసుల్లో తీర్పులు వచ్చాయి. 48 కేసుల్లో శిక్షలు ప్రకటించారు. ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుల్లో 91శాతం కేసులు శిక్షార్హంగా ఉన్నాయి’’ అని హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

“ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎన్‌ఐఏ దాఖలు చేసిన కేసులు చాలా క్లిష్టంగా ఉంటాయి. సాక్ష్యాలను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే వాటి పరిధి రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను దాటి ఉంటుంది’’ అని అమిత్‌ షా అన్నారు.

యూఏపీఏ

ఫొటో సోర్స్, Getty Images

తాజా స్థితి

ఉగ్రవాదాన్ని అరికట్టే లక్ష్యంతో 1967లో UAPA, 1987లో TADA, 1999లో MCOCA, 2002లో POTA, 2003లో GUJCOCA అనే పేర్లతో చట్టాలు వచ్చాయి.

MCOCAను మహారాష్ట్ర, GUJCOCA ను గుజరాత్‌ రూపొందించాయి. వాటి మీద ఎలాంటి వివాదాలు లేవు.

" ఉగ్రవాద నిరోధక చట్టాలలో ప్రధానంగా కనిపించేది పౌర హక్కుల ఉల్లంఘన, అక్రమ నిర్బంధం, హింస, తప్పుడు కేసులు, సుదీర్ఘ కస్టడీలు, శిక్షలు. టాడా అయినా, పోటా అయినా, యూఏపీఏ అయినా జరిగేది ఇదే’’ అని రీసెర్చ్‌ స్కాలర్‌ రమీజుర్ రెహ్మాన్ అన్నారు.

టాడా కింద అరెస్టయిన 76,036 మందిలో ఒకశాతం మందిపై మాత్రమే అభియోగాలు మోపారు. 2004లో పోటా చట్టం రద్దయ్యే సమయానికి 1031మందిని అరెస్టు చేశారు. వీరిలో 18మందిపై మాత్రమే విచారణ జరిగింది. 13మందిని దోషులుగా నిర్ధారించారు’’ అని ఆయన వెల్లడించారు.

యూఏపీఏ చట్టం కూడా ఇలాంటిదేనా?

నేషనల్ క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో డేటా ప్రకారం 2016 సంవత్సరంలో 33 కేసుల్లో 22 కేసులకు సంబంధించి నిందితులను నిర్దోషులుగా ప్రకటించగా, 2015లో 76 కేసులకుగాను 65కేసుల్లో ఆరోపణలు రుజువు కాలేదు.

2014 నుండి 2016 వరకు గణాంకాల ప్రకారం 75% కేసుల్లో నిందితులను విడుదల లేదా నిర్దోషులుగా ప్రకటించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

2018 టెర్రర్‌ గ్లోబల్‌ ఇండెక్స్ ప్రకారం టెర్రరిస్ట్‌ చట్టాల ద్వారా పాశ్చాత్య దేశాలు ఉగ్రవాదాన్ని చాలావరకు నియంత్రించగలిగాయి. అయితే భారతదేశంలో మాత్రం వాటి ఫలితాలు తారుమారవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)