కరోనావైరస్: వుహాన్‌లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ & విన్సెంట్ ని
- హోదా, బీబీసీ న్యూస్
కరోనావైరస్ వ్యాప్తికి భావిస్తున్న వుహాన్ నగరంలో మొత్తం జనాభాకు 10 రోజుల్లో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది చైనా.
ఏప్రిల్ తొలివారం తర్వాత మొదటి సారిగా ఒకేసారి ఆరు కొత్త కేసులు వుహాన్లో బయటపడటంతో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మొత్తం కోటి పది లక్షల మంది జనాభాకు పది రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని అధికారవర్గాలు చెప్పాయి. కానీ ప్రస్తుతం ఆ పని జరుగుతున్న తీరును చూస్తుంటే లక్ష్యాన్ని వారు నిర్దేశించుకున్న గడువులోగా చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు.
అందరికీ పరీక్షలు నిర్వహించడానికి ఎంత కాలం పడుతుంది?
ఏప్రిల్ నెల చివర్లో వూహాన్లో రోజుకి 63 వేల మందికి పరీక్షలు నిర్వహించామని అప్పట్లో హూబే ప్రావిన్షియన్ ప్రభుత్వం తెలిపింది.
కానీ, మే 10 ఆదివారం నాటికి ఆ సంఖ్య 40వేలకు పడిపోయింది. హుబే అధికారిక దినపత్రిక అందించిన వివరాల ప్రకారం నగరం మొత్తం మీద సుమారు 60కిపైగా పరీక్షా కేంద్రాలున్నాయి.
చైనా ప్రభుత్వం అనుకున్న ప్రకారం పది రోజుల్లో కోటి పది లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలంటే రోజుకు కనీసం లక్ష మందికి కోవిడ్-19 టెస్టులు నిర్వహించాలి.
ప్రస్తుతం ఉన్న అరవైకి పైగా పరీక్షా కేంద్రాల్లో రోజుకు 40 వేల మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు 10 రోజుల్లో వూహన్ మొత్తం జనాభాకు ఎలా పరీక్షలు నిర్వహించగలరన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
దీంతో అధికార వర్గాలు వూహన్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి కోవిడ్-19 పరీక్షలు ప్రారంభమై పది రోజుల్లో ముగియవని స్పష్టం చేశారు.
వుహాన్ నగరంలోని కొన్ని జిల్లాల్లో మే 12 నుంచి ప్రారంభమయ్యాయని, మరి కొన్ని జిల్లాల్లో మే 17 నుంచి ప్రారంభం కానున్నాయని వుహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ప్రారంభమైన నాటి నుంచి పది రోజుల్లో ఆ జిల్లాలో అందరికీ టెస్టులు పూర్తి చేస్తామన్నారు అధికారులు.
అయితే, రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన కథనం ప్రకారం మే 13 నాటికి మొత్తం 13 జిల్లాలకు గాను కేవలం 2 జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటి వరకు ఏ స్థాయిలో పరీక్షలు జరిగాయి?
నగరంలో ప్రస్తుతానికి 30 లక్షల మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
వుహాన్ నగరంలో సుమారు 30 నుంచి 50 లక్షలమందికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించారని భావిస్తున్నట్లు వుహాన్ విశ్వవిద్యాలయంలోని పేతోజెన్ బయాలజీ విభాగం డైరెక్టర్ యాంగ్ జాన్ క్యూ, గ్లోబల్ టైమ్స్ దిన పత్రికతో అన్నారు.
నిజానికి వుహాన్ జనాభా సుమారు కోటి పది లక్షలు. ఇప్పుడు వాళ్లంతా నగరంలోనే ఉన్నారని కూడా చెప్పలేం.
ఎందుకంటే జనవరి 23 లాక్ డౌన్ ప్రకటించకముందు చైనా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సుమారు 50 లక్షల మంది నగరం విడిచి వెళ్లిపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అప్పటి నుంచి ఏప్రిల్ 8 వరకు అక్కడ లాక్‌డౌన్ కొనసాగింది.
ఆ తరువాత తిరిగి స్వస్థలానికి ఎంత మంది చేరుకున్నారన్న విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలా?
చుట్టుపక్కల కరోనావైరస్ కేసులు లేనప్పుడు ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాల్సిన పని లేదని వుహాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పేతోజెన్ బయాలజీ విభాగం డైరక్టర్ యాంగ్ ఝాన్‌క్యూ అన్నారు.
అటు అధికారులు కూడా వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే అంటే వృద్ధులకు, అత్యధిక జనసాంద్రత కల్గిన ప్రాంతాల్లో నివసించేవారికి అలాగే ఆ ప్రాంతాల్లో పని చేసే వైద్య సిబ్బందికి మొదట పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే గడిచిన ఏడు రోజుల్లో ఇప్పటికే పరీక్షలు చేయించుకున్న వారిని కూడా మరోసారి పరీక్ష చేయాల్సినవసరం లేదన్నారు.
కానీ వ్యాధి నిరోధకత తక్కువ ఉన్న వారిలో ఈ వ్యాధి బయటపడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని, అలాంటి వారిలో వ్యాధి లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయని చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ వు “షున్ యు” అధికార టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- కరోనావైరస్: కోవిడ్ పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం?
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన ఐదు ఫుడ్ టిప్స్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








