అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యకేసులో దోషికి పాకిస్తాన్ మరణశిక్ష రద్దు చేయడంపై తల్లిదండ్రుల అపీల్

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యకేసులో ఓ దోషికి విధించిన మరణశిక్షను, మరో ముగ్గురిపై అభియోగాలను పాకిస్తాన్‌లోని సింధ్ హైకోర్టు రద్దుచేయడంపై ఆయన తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో అపీల్ చేశారు.
అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యకేసులో ఓ దోషికి విధించిన మరణశిక్షను సింధ్ హైకోర్టు ఏప్రిల్‌లో రద్దు చేసింది. 2002 నుంచి జైలులో ఉన్న అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది.
పెర్ల్ హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తున్న మరో ముగ్గురిని నిర్దోషులని పేర్కొంటూ, వారిని విడుదల చేయాలని సింధ్ హైకోర్టు ఆదేశించింది.
షేక్ శిక్ష రద్దు విషయంలో తాము అపీల్ చేస్తామని ప్రాసిక్యూటర్లు తీర్పు వెలువడిన వెంటనే రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.
డేనియల్ పెర్ల్ తలను షేక్ నరికి ఉండకపోవచ్చని భావిస్తున్నామని పెర్ల్ సహోద్యోగులు, ఇతర అమెరికా జర్నలిస్టులతో కూడిన బృందం 2011లో పేర్కొంది. అతడిని చంపింది ఖలీద్ షేక్ మొహమ్మద్ అని, అతడు ప్రస్తుతం గ్వాంటనామో బే జైల్లో ఉన్నాడని, 9/11 దాడుల వెనక కూడా అతడి హస్తం ఉందనే ఆరోపణలున్నాయని "ది పెర్ల్ ప్రాజెక్ట్" ఆరోపించింది.
మరి కొన్ని రోజుల్లో తన క్లైంట్ విడుదలవుతాడని కోర్టు తీర్పు అనంతరం అహ్మద్ తరపు లాయర్ ఖవాజా నవీద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డేనియల్ పెర్ల్‌కు ఏం జరిగింది?
వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో పనిచేసే డేనియల్ పెర్ల్ 2002 జనవరిలో కనిపించకుండా పోయారు.
కరాచీలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ కార్యకలాపాలకు, బూట్లలో బాంబులు దాచిపెట్టుకుని ఓ విమానాన్ని పేల్చేందుకు ప్రయత్నించిన రిచర్డ్ రీడ్‌కు ఏమైనా సంబంధాలున్నాయేమోననే విషయంపై ఆ సమయంలో పెర్ల్ పరిశోధన చేస్తున్నారు.
ఇస్లామిక్ మతపెద్ద ఒకరితో మాట్లాడిస్తానని పెర్ల్‌కు ఒమర్ సయీద్ షేక్ ఆశ చూపాడని ప్రాసిక్యూటర్లు అంటున్నారు. వారిద్దరి మధ్య కొంత స్నేహం ఏర్పడింది. అప్పట్లో గర్భవతులుగా ఉన్న తమ భార్యల గురించి కూడా వీరు చర్చించుకునేవారు.
ఓ నెల తర్వాత, కరాచీలోని అమెరికా రాయబార కార్యాలయానికి 38ఏళ్ల వ్యక్తి తలను నరుకుతున్నట్లు చూపించే ఓ వీడియో అందింది.
2002 మేలో పెర్ల్ కుమారుడు ఆడమ్ జన్మించాడు. అదే సంవత్సరం జులైలో పెర్ల్ హత్యకేసులో షేక్ దోషి అని యాంటీ-టెర్రరిజం కోర్టులో నిరూపణైంది. అతడికి మరణశిక్ష విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ ఎవరు?
1973లో లండన్‌లో పుట్టిన షేక్ అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చేరాడు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేయలేదు.
ఆ తర్వాత దిల్లీలో 1994లో నలుగురు పర్యటకులను అపహరించిన కేసులో అరెస్టయ్యాడు.
1999లో విమానాన్ని మిలిటెంట్లు హైజాక్ చేసి, జైలు నుంచి విడిపించుకున్నవారిలో ఇతడు కూడా ఉన్నాడు.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడికి పాల్పడ్డ మిలిటెంట్లకు డబ్బు సమకూర్చడంలో ఇతడి పాత్ర కూడా ఉందని భారత పోలీసులు ఆరోపించారని రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Joyce Tenneson
షేక్ పాత్రపై ప్రశ్నలు
ఎం.ఇలియాస్ ఖాన్, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్
ఈ కేసులో ప్రాసిక్యూషన్ విఫలమైందని డిఫెన్స్ లాయర్లు అంటున్నారు. వాళ్లనేది కూడా నిజమే కావచ్చు. అపహరణకు సంబంధించి షేక్ ప్రమేయం ఉందనే కొన్ని సాక్ష్యాలున్నప్పటికీ, డేనియల్ పెర్ల్ హత్యతో ఈ నలుగురికీ నేరుగా సంబంధం ఉందా అనే దానిపై ఎన్నో ప్రశ్నలున్నాయి.
షేక్‌కు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో, అల్ ఖైదాతో సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. 1990ల్లో కశ్మీర్‌లో దాడులకు పాల్పడిన జైషే మొహమ్మద్ మిలిటెంట్ గ్రూప్ స్థాపనలో కూడా ఇతడికి పాత్ర ఉంది.
పాకిస్తాన్ తమ భూభాగంలో అన్ని రకాల మిలిటెంట్ కార్యకలాపాలను అణచివేయాలంటూ అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 2002లో అతడి అరెస్టు, దోషిగా నిరూపణ కావడం వేగంగా జరిగిపోయాయి.
రెండు దశాబ్దాల పాటు అతడి అపీల్‌పై పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోలేదు. అయితే, ప్రస్తుతం అమెరికా, ఇతర దేశాలేవీ పాత టెర్రరిస్టుల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేవు. అందుకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని పాకిస్తాన్ భావించి ఉండొచ్చని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు
- నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?
- కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం
- కరోనావైరస్తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








