క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?

ఫొటో సోర్స్, Huw Evans picture agency
- రచయిత, సి.వెంకటేష్
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
క్రికెట్ ప్రపంచ కప్ పోరు మొదలై వారం కావస్తోంది. కానీ పోటీలు ఇంకా వేడి అందుకున్నట్టు లేదు. ఇందుకు తొలి రౌండ్ మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడం ఒక కారణం కావచ్చు. అయితే ఇండియా ఎంట్రీ ఆలస్యం కావడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మిగతా అన్ని జట్ల కన్నా ఆలస్యంగా టోర్నమెంట్ ఏడో రోజున టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ ఆలస్యం అభిమానులకు ఇబ్బందిగా ఉన్నా జట్టుకు మాత్రం అది మంచిదే.
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల తీరుతెన్నులను బట్టి ఈ టోర్నమెంట్ తాలూకు ట్రెండ్స్‌ను అంచనా వేయడానికి, వ్యూహ రచనలో మార్పులు చేసుకోడానికి భారత జట్టుకు మంచి అవకాశం లభించింది.
ఇంగ్లండ్‌లోని పిచ్‌లకు, వాతావరణానికి అలవాటు పడటానికి కూడా ఈ ఎక్స్‌ట్రా టైమ్ పనికొస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పిచ్‌లు నేర్పిన గుణపాఠం
మరి మొదటి నాలుగైదు రోజుల మ్యాచ్‌లను బట్టి మనకు అర్థమైనదేంటి?
ముఖ్యంగా ముందుగా అనుకున్నట్టు ఇంగ్లండ్‌లోని పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తాయన్న అంచనా తప్పని తేలిపోయింది. వర్షంతో దోబూచులాట తప్పదని, స్వింగ్‌తో పాటు బౌన్సర్ కూడా ఇంగ్లండ్ పిచ్‌లపైన చాలా ముఖ్యమైన ఆయుధమని అర్థమయింది.
స్పిన్నర్లు కనీసం టోర్నమెంటు ప్రథమార్థంలో అంత ప్రభావం చూపక పోవచ్చునని కూడా తెలిసొచ్చింది. టీ20 స్టైల్లో ఆడితే లాభం లేదని, వికెట్లు చేతిలో ఉంచుకుని చివరి పదిహేను ఓవర్లలో జోరు పెంచడమే కరెక్టని టీమ్స్‌కు గుణపాఠం లభించింది కూడా.
ఈసారి వరల్డ్ కప్ గెలవగల సత్తా ఉన్న మూడు జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న టీమిండియా బలాబలాలు ఏమిటి, పైన ప్రస్తావించిన ట్రెండ్స్‌ను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
మన బలం.. బ్యాటింగా..? బౌలింగా..?
గతంలో ఎప్పుడూ కూడా బ్యాటింగే మన జట్టు ప్రధాన బలంగా ఉండేది. కానీ ఈసారి పరిస్థితి మారింది.
విరాట్ కోహ్లీ, ధోనీ మినహా మిగతా వారు కుదురుగా ఆడతారన్న నమ్మకం కలగట్లేదు.
ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఆరుగురు మ్యాచ్ విన్నర్లు కనిపిస్తున్నారు. వారిలో ఒకరు కాకున్నా మరొకరు జట్టును ఆదుకుంటారన్న భరోసా ఉంది.
కానీ మన టీమ్‌కు అంత బలమైన బ్యాటింగ్ లేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లది టాప్ క్లాస్ ఓపెనింగ్ జోడీనే కానీ ఇద్దరూ ఫామ్‌లో లేరు.
మిడిలార్డర్‌లో ధోనీ మినహా మిగతా వారి విషయంలో క్వశ్చన్ మార్కు వేలాడుతూ ఉంటుంది. అందుకే ఓపెనర్లు ఫామ్‌లోకి రావడంపైనే ఇండియా విజయావకాశాలు ఆధారపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
పవర్ ప్లే ఓవర్లలో వికెట్లు కాపాడుకోవాలి...
ఇంగ్లండ్‌లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మొదటి పది పవర్ ప్లే ఓవర్లలో పెద్ద షాట్లకు వెళ్ళకుండా వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
బ్యాటింగ్ ఆర్డర్లో మొదటి ముగ్గురు మంచి పునాది ఏర్పరిస్తే ఫినిషింగ్ టచ్ ఇచ్చే పని ధోనీ, హార్దిక్ పాండ్యా చూసుకుంటారు.
గత రెండు మూడేళ్ళగా భారత జట్టు సాధించిన విజయాల్లో రోహిత్, ధవన్, కోహ్లీనే ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అందుకే ఓపెనర్ల ఫామ్ చాలా కీలకం.

ఫొటో సోర్స్, Getty Images
మిడిల్ ఓవర్లలో వికెట్లు కూల్చాలి...
బ్యాటింగ్‌లో కన్నా బౌలింగ్‌లోనే మన టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. వన్‌డేల్లో నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మన తురుపుముక్క. షమీ కూడా గత ఏడాదిన్నరగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
మిడిల్ ఓవర్లలో (11 నుంచి 40) వీలైనన్ని వికెట్లు పడగొట్టడం చాలా అవసరం. స్పిన్ ద్వయం కుల్‌దీప్, చాహల్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో సిద్ధహస్తులు.
థర్డ్ సీమర్ పాత్రను పాండ్యా సమర్ధంగా నిర్వహించగలడు. ఎటొచ్చీ భువనేశ్వర్ కుమార్ ఫామ్ ఒకటే కొంత ఆందోళన కలిగిస్తోంది.
కరణ్ జోహార్ పుణ్యమాని వివాదాల్లో ఇరుక్కున్న రాహుల్, పాండ్యా ఆ మచ్చను కడిగేసుకోడానికి ఈ ప్రపంచ కప్‌ను వాడుకుంటారేమోననిపిస్తోంది.
ఇద్దరికీ బోలెడంత టాలెంట్ ఉంది గానీ జల్సా లైఫ్ స్టైల్ వల్ల వారికి ఆటపై ఫోకస్ తప్పింది. ఇప్పుడు కొన్ని గుణపాఠాలు నేర్చుకుని గాడిన పడ్డట్టే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పోటీ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
మొత్తం మీద ఈ ప్రపంచ కప్ మూడు ముక్కలాటగానే కనిపిస్తోంది. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్యనే అసలు పోటీ ఉండే సూచనలున్నాయి.
ఇంగ్లండ్‌ను చాలామంది హాట్ ఫేవరెట్ అనుకున్నారు కానీ ఆరంభంలోనే పాకిస్థాన్ చేతిలో వారు ఖంగు తిన్నారు. ఫ్లాట్ పిచ్‌లపైన వారి బౌలింగ్ తేలిపోవడం స్పష్టంగా కనిపించింది.
మరి ఈ మూడు జట్లతో పాటు సెమీస్‌కు వెళ్ళగల జట్లలో వెస్టిండీస్ ముందు వరసలో ఉంది. న్యూజీలాండ్, పాకిస్థాన్ కూడా ఆ నాలుగో స్థానం కోసం పోటీ పడొచ్చు.
మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన దక్షిణాఫ్రికా, గత వైభవమే మిగిలిన శ్రీలంక రేసులో లేనట్టే.
అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లది జెయింట్ కిల్లర్ పాత్రే తప్ప అన్ని మ్యాచ్‌ల్లో కుదురుగా ఆడతాయన్న నమ్మకం లేదు.
వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదృష్టం కలిసిరావడం కూడా టీమ్స్‌కు ముఖ్యమే.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...
- విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
- విరాట్ కోహ్లీ: ప్రపంచ నం. 1 టెస్ట్ బ్యాట్స్‌మన్
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









