క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నీరజ్ ఝా
- హోదా, బీబీసీ కోసం
క్రికెట్‌లోని మహామహా ఆటగాళ్లనందరినీ నాలుగేళ్లకోసారి ఒక్కచోటుకు తీసుకువచ్చే పండుగ వరల్డ్ కప్. గత కొన్నేళ్లలో క్రికెట్ ఫార్మాట్‌లో చాలా మార్పులు వచ్చాయి. టీ-20లు ప్రవేశంతో ఆట ఆడే తీరుతోపాటు చూసే తీరూ మారిపోయింది.
అయితే, 50 ఓవర్ల ఫార్మాట్‌కు మాత్రం భారతీయుల మదిలో ఇప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకు అతిపెద్ద కారణం.. 1983 వరల్డ్ కప్.
అప్పుడు ఫైనల్ లార్డ్స్ మైదానంలో జరిగింది. వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ చేరుకోవడం భారత్‌కు అదే మొదటిసారి. కపిల్ దేవ్ నాయకత్వంలోని ఆ జట్టు కప్ కొడుతుందని కనీసం కలలోనైనా ఎవరూ ఊహించి ఉండరు.
ఫైనల్‌లో ప్రత్యర్థి పటిష్ట వెస్టిండీస్ జట్టు. వరుసగా మూడో సారి కప్‌ను సాధించాలన్న లక్ష్యంతో బరిలో నిలిచింది ఆ జట్టు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, కపిల్ దేవ్ సేన సర్జికల్ స్ట్రైక్ చేసి విండీస్ వీరులను చిత్తు చేసింది.
భారత్‌లోని కోట్ల మంది మనుసులను గెలవడమే కాదు, క్రికెట్‌కు విపరీతంగా జనాదరణను పెరిగేలా చేసింది ఆ విజయం.
రాత్రికి రాత్రి కపిల్ దేవ్ సూపర్ స్టార్ అయ్యాడు. వందల మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా మారాడు. క్రికెట్‌ను కూడా కెరీర్‌గా మార్చుకోవచ్చన్న విషయాన్ని తెలియజెప్పాడు.
ఆ విజయం తర్వాత భారత్‌లో స్టార్ క్రికెటర్లు అవతరించారు. 90ల్లో సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ వచ్చారు. నేటి తరంలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ స్టార్లుగా వెలుగొందుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
'ధోని యుగం’లో శిఖరాలు చేరిన టీమ్ ఇండియా
ఈ స్టార్ల జాబితాలో ధోని పేరు రాగానే భారత క్రికెట్ ప్రేమికులు చూపు కాసేపు అక్కడే ఆగుతుంది. అది సహజమే. గొప్ప విషయం ఏంటంటే, ప్రస్తుత సమయాన్ని అభిమానులు 'ధోని యుగం'గా పిలుచుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు ముందెన్నడూ సాధించని ఘనతలను అతడి సారథ్యంలోనే సాధించింది.
2007లో మొట్టమెదటి టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ధోని సారథ్యంలోనే సాధించింది. 2011 వన్డే వరల్డ్ కప్‌ను అందించి రెండోసారి టీమ్ ఇండియాను విశ్వవిజేతగా అతడు నిలిపాడు.
2013లో ధోని జట్టు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఈ విజయంతో ఐసీసీ ట్రోఫీలన్నింటినీ అందుకున్న తొలి కెప్టెన్‌గా ధోని ఘనత సాధించాడు.
ధోని సారథ్యంలో అన్ని ఫార్మాట్‌లలోనూ అత్యున్నత శిఖరాలను చవిచూసింది భారత జట్టు. 2011 నుంచి వరుసగా మూడేళ్లు 'ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని కూడా అందుకుంది.
అందుకే ఎంతో మంది దిగ్గజాలు ధోనీని ఆకాశానికెత్తుతుంటారు.
''ధోని ఓ ఆటగాడు కాదు. క్రికెట్‌లో అతడో యుగం. ధోనీలో గల్లీ క్రికెట్ జట్టు కెప్టెన్ లక్షణాలు చాలా కనిపిస్తాయి. అతడూ మనలో ఒకడే. జట్టు కోసం ఏదైనా చేస్తాడు'' అని అన్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడెన్.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో పాత్రేంటీ?
ధోనీకిదే ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు. అయితే, జట్టులో అతడికి స్థానం ఇవ్వడంపై ఎవరికీ సందేహాలు లేవు. ధోని లేకపోతే మిడిలార్డర్ అసంపూర్ణమే. వికెట్ల ముందే కాదు, వెనకాలా అతడు ప్రతిభ చూపుతాడు. జట్టు కోసం వికెట్లు తీయడంలో అతడిది ముఖ్య పాత్ర.
ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా కోహ్లీ మన్ననలు అందుకుంటున్నాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాకింగ్స్‌లోనూ అతడిదే మొదటి స్థానం. అయితే, కెప్టెన్సీ విషయంలో కోహ్లీ కన్నా ధోని చాలా ముందున్నాడు.
కెప్టెన్సీపై సమగ్ర అవగాహన కలిగిన ఆటగాళ్లలో ధోని తర్వాతి స్థానం రోహిత్ శర్మదేనని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు తాజా ఐపీఎల్ సీజన్ మంది ఉదాహరణ. బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ పూర్తిగా విఫలం కాగా, రోహిత్ ముంబయికి టైటిల్ అందించాడు.

ఫొటో సోర్స్, Reuters
వరల్డ్ కప్‌లో భారత్‌కు కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు. కానీ, సరైన సలహాలు ఇచ్చేవారుంటే అతడు జట్టును మరింత సమర్థంగా నడిపించగలడు. డీఆర్ఎస్ నిర్ణయాలు, ఫీల్డింగ్ మోహరింపులు, బౌలింగ్ మార్పుల వంటి విషయాల్లో ఇప్పటివరకూ కోహ్లీకి ధోని అత్యుత్తమ సలహాదారుడిగా ఉన్నాడు. రోహిత్ జట్టులో ఉండటం కూడా కోహ్లీకి లాభిస్తుంది.
డీఆర్ఎస్ సమీక్షల్లో ధోనీకి సాటి లేదు. మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేస్తూ అతడు జట్టుకు ఉపయోగపడతాడు. ధోని లాంటి అనుభవజ్ఞుడు యువ ఆటగాళ్లకు స్ఫూర్తి కలిగిస్తాడు. ముఖ్యంగా తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్నవారికి అతడి వల్ల ఎంతో ప్రయోజనం.
ధోని వికెట్ కీపింగ్ నైపుణ్యాలను అందరం చూశాం. పరిస్థితులకు తగ్గట్లు స్పిన్నర్లు, పేసర్లకు అతడు మార్గనిర్దేశం చేస్తూ వికెట్లు పడగొట్టడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంటాడు. ఇన్నర్ రింగ్‌లో ఫీల్డింగ్ మోహరింపులు చేస్తుంటాడు.
విరాట్ చాలా మంచి ఫీల్డర్. అందుకే, అతడు ఎక్కువగా బౌండరీ దగ్గర ఉంటుంటాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్, పాయింట్‌ల దగ్గరి నుంచి ఫీల్డింగ్‌ను మార్చడం కష్టం అవుతుంది. అందుకే కోహ్లీని సంప్రదించి ధోనీనే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉండటం వల్ల ఇది సాధ్యమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అందుకే ప్రత్యేకం
వరల్డ్ కప్‌లో ధోని 'ఇంద్రజాలం' భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి ఐపీఎల్‌లో ధోని చెన్నై తరఫున 12 ఇన్నింగ్స్‌ల్లో 416 పరుగులు సాధించాడు.
ధోని బ్యాటింగ్ నైపుణ్యాలతో పాటు అనుభవమూ జట్టుకు కీలకమవుతుందని గావస్కర్ అన్నారు.
''భారత్‌కు టాప్-3 బ్యాట్స్‌మెన్ బాగున్నారు. కానీ, వారు విఫలమైతే లోయర్ ఆర్డర్‌లో ధోని జట్టును ఆదుకోగలడు. 2011 వరల్డ్ కప్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చిన అనుభవం ఉండటం అతడిని ఎంతో విలువైన ఆటగాడిని చేసింది. ఉత్కంఠ పరిస్థితుల్లో మ్యాచ్‌లను గెలిపించిన ఆటగాళ్లు జట్టుకు బలాలుగా మారుతారు. అందుకే, ధోని భాగస్వామ్యం చాలా పెద్దది'' అని గావస్కర్ పీటీఐ వార్తాసంస్థతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జట్టులో ధోని చేర్పుపై కొందరు మాజీ ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను తీసుకుని ఉంటే జట్టు మరింత మెరుగ్గా ఉండేదని అన్నవారు ఉన్నారు. ధోని గాయాలపాలైతే కీపర్ పాత్ర పోషించేందుకు బ్యాకప్ ఆటగాడు ఉండాలని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఉన్న కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలడు.
''ధోనీతో కలిసి ఆడేవాణ్ని కాబట్టి అతడి ఫిట్‌నెస్ సమస్యలు నాకు తెలుసు. అలాంటి సమస్యలున్నా, ఎలా ఆడాలన్న విషయం ధోనీకి కొట్టిన పిండి'' అని హర్భజన్ అన్నాడు.
భారత వరల్డ్ కప్ జట్టులో దినేశ్ కార్తీక్‌కు రెండో వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. గాయాల కారణంగా ధోని ఆడలేకపోయినప్పుడు, అతడికి అవకాశం రావొచ్చు. ఆ విషయం దినేశ్‌కు కూడా తెలుసు.
ధోనీని అందరూ 'కెప్టెన్ కూల్' అని పిలుస్తుంటారు. తన ఫామ్ కన్నా జట్టుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ధోని కన్నా మెరుగైన కెప్టెన్‌ని చూడటం చాలా అరుదు.
2011 వరల్డ్ కప్‌కు ముందు అతడు జట్టులోని సహచరులతో విడివిడిగా మాట్లాడేవాడు. సౌకర్యవంతంగా ఆడేలా వారికి తోడ్పడేవాడు. ప్రస్తుత వరల్డ్ కప్ జట్టులో అతడి స్థానం ఓ మైలు రాయి కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- ధోని పొరపాటు చెన్నైకి ఐపీఎల్ టైటిల్‌ను దూరం చేసిందా?
- ఆఖరు బంతికి సిక్సర్: మియాందాద్ నుంచి దినేశ్ కార్తీక్ దాకా
- కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. ఏర్పాట్లు మొదలైపోతున్నాయ్
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- అమ్మలు లేని ఊళ్లు: 'అమ్మా నిన్ను చూసి తొమ్మిదేళ్లవుతోంది, ఒకసారి వస్తావా...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








