ఒకప్పుడు ఆరోగ్యం కోసం చేసుకున్న అలవాటే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం, పొగాకు వినియోగించే వారిలో సగం మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది తనువు చాలిస్తున్నారు.
ఒక్క భారత్‌లోనే ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల మరో 9 లక్షల మంది మరణిస్తున్నారు.
అయితే, 16వ శతాబ్దంలో చాలా దేశాల్లో పొగాకు మొక్కను "పవిత్రమైన మొక్క" అని, దేవుడు ప్రసాదించిన "ఔషధ మొక్క"గా భావించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
విస్తృతంగా వ్యాపించిన ఆ నమ్మకానికి మరింత బలాన్ని చేకూరుస్తూ... "పొగాకులో ఉన్న ఔషధ గుణాల కారణంగా భవిష్యత్తులో వైద్యుల అవసరం తగ్గిపోవచ్చు" అని డచ్ వైద్య పరిశోధకుడు గైల్స్ ఎవెరార్డ్ వ్యాఖ్యానించారు.
"పొగాకు విషానికి చక్కని విరుగుడుగా పనిచేస్తుంది, ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తుంది" అని 1587లో ఆయన రాసిన పుస్తకం 'పనాకియా'లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పొగాకును వైద్య అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నించిన తొలి యూరప్ వ్యక్తి సముద్ర యాత్రికుడు క్రిస్టఫర్ కొలంబస్ అని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో ప్రొఫెసర్ అన్నే కార్ల్‌టన్ పేర్కొన్నారు.
1492లో క్యూబా, హైతీ, బహమాస్‌లో ఉన్న దీవులకు వెళ్లిన కొలంబస్, అక్కడి ప్రజలు సన్నని గొట్టాలలో పొగాకు పెట్టి పొగ పీల్చుతున్నారని గుర్తించారు.
కొన్ని రకాల రుగ్మతలను నయం చేసేందుకు కూడా అప్పట్లో పొగాకును వినియోగించేవారు.
కొన్ని ప్రాంతాల్లో సున్నం, పొగాకు పొడి మిశ్రమాన్ని టూత్‌పేస్ట్‌లా వినియోగించేవారు. ఇప్పటికీ భారత్‌లోనూ గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా ఈ అలవాటు ఉంది.

ఫొటో సోర్స్, Wellcome Collection
పుండ్లను మాన్పేందుకు, దీర్ఘకాలంగా వేధించే గడ్డలను నయం చేసేందుకు మందుగా పొగాకును వినియోగించేవారని 1500లో బ్రెజిల్‌కు వెళ్లిన పోర్చుగీసు యాత్రికుడు పెడ్రో అల్వారెస్ కాబ్రల్ చెప్పారు.
అంతేకాదు, ఉప్పు కలిపిన పొగాకు చూర్ణాన్ని రాస్తే గొంతులోని గ్రంథులపై ప్రభావం చూపే వ్యాధులను నయం చేయొచ్చని న్యూ స్పెయిన్ (ప్రస్తుత మెక్సికో)కు చెందిన మిషనరీ బెర్నార్డినో డే సహగున్ అప్పట్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Wellcome Collection
యూరోపియన్ వైద్యులు, ఔషధ వ్యాపారులకు పొగాకు మీద బాగా ఆసక్తి పెరిగింది.
'వెల్‌కం కలెక్షన్' అనే హెల్త్ మ్యూజియం ప్రకారం, అప్పట్లో వైద్యుల వద్ద, వైద్య విద్యార్థుల వద్ద ఉండాల్సిన ఒక ముఖ్యమైన వస్తువుగా పొగాకు చుట్టలు (సొంగలు) మారాయి.
శవాల దగ్గరకు వెళ్లినప్పుడు పొగ తాగాలని వైద్యులు సూచించేవారట. పొగాకు పొగ వల్ల ఆ శవం నుంచి సంక్రమించే వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వారి భావన.
1665లో లండన్‌లో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు పిల్లలు తరగతి గదుల్లో పొగతాగాలని టీచర్లు సూరించేవారు.

ఫొటో సోర్స్, Wellcome Collection
కంటికి కనిపించని విషయ వాయువుల నుంచి పొగాకు రక్షణ కల్పిస్తుందని ప్రజలు భావించేవారు.
అయితే, అప్పట్లోనూ పొగాకును ఔషధంగా వినియోగించడాన్ని కొందరు తప్పుబట్టేవారు.
అయినా, దానికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. చాలామంది ఔషధ వ్యాపారులు పొగాకును నిల్వ చేసుకుని ఉంచేవారు.

ఫొటో సోర్స్, Wellcome Collection
ప్రమాద వశాత్తు ఎవరైనా నీటిలో మునిగిపోతే, వారిని బయటకు తీసుకొచ్చాక వారి మలద్వారంలోకి పైపు ద్వారా పొగాకు పొగను ఊదేవారు.
శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేందుకు, ఉత్తేజం కలిగిచేందుకు పొగ ఉపయోగపడుతుందని అప్పట్లో వైద్యులు నమ్మేవారు. ఇలా పొగను ఊదేందుకు ప్రత్యేక కిట్లను ఉపయోగించేవారు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు థేమ్స్ నది వద్ద ఉచిత కిట్లను అందుబాటులో ఉంచేవారు.
18వ శతాబ్దంలో చెవినొప్పిని తగ్గించేందుకు కూడా పొగాకును వినియోగించేవారు. చెవిలోకి పొగాకు పొగను ఊదితే నొప్పి తగ్గుతుందని అప్పట్లో చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
1828లో పొగాకు ఆకుల్లో నికోటిన్ అనే పదార్థాన్ని కనుగొన్న తర్వాత పొగాకును ఔషధంగా వినియోగించడంపై చాలామంది శాస్త్రవేత్తల్లో అనుమానాలు మొదలయ్యాయి.
అయినప్పటికీ మలబద్ధకం, రక్త స్రావం, నట్టలు పడటం వంటి రుగ్మతలను నయం చేసేందుకు చాలాకాలం పాటు పొగాకును వాడేవారు.
అంతేకాదు, "గొంతులోని సున్నితమైన కణజాలం మీది మలినాలను తొలగించేందుకు పొగ తాగాలి" అని గాయకులు సూచించేవారట.
కానీ, 1920, 30లలో పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై చర్చ ఎక్కువైంది.

ఫొటో సోర్స్, Getty Images
ధూమపానం ఎంత హానికరమో గడచిన మూడు దశాబ్దాల కాలంలో ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది.
దాంతో, భారత్ సహా అనేక దేశాలు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించాయి. సిగరెట్ల మీద హెచ్చరిక గుర్తులతో, ప్రకటనలు ఇస్తూ ధూమపానం మానేందుకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
సిగరెట్ డబ్బాల మీద తప్పనిసరిగా హెచ్చరికలు ముద్రించాలని కొన్నిప్రభుత్వాలు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
2018 సెప్టెంబర్ 1 నుంచి సిగరెట్ డబ్బాల మీద 'ఈరోజే మానేయండి, కాల్ చేయండి- 1800-11-2356' అని తప్పనిసరిగా ముద్రించాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే(2016-17) ప్రకారం భారతదేశంలో సిగరెట్ తాగేవారి సంఖ్య 10 కోట్లకు పైనే ఉంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా 2006లో సిగరెట్ డబ్బాల మీద ఇలాంటి ఒక హెల్ప్ లైన్ నంబర్ ముద్రించడం ప్రారంభించింది.
అయితే, సంప్రదాయ పొగాకు సిగరెట్లు ప్రమాదకరమన్న విషయం తెలిసిన తర్వాత కొంతకాలంగా ఈ-సిగరెట్ల వాడకం పెరిగిపోతోంది.
సంప్రదాయ సిగరెట్ల కంటే ఈ-సిగరెట్లు చాలా తక్కువ హానికరమైనవని తేలినట్లు ఇంగ్లండ్ ప్రజారోగ్య విభాగం పేర్కొంది.
కానీ, తక్కువ హానికరమని చెబుతూ ధూమపానం అలవాటు లేని యువతకు కూడా సంస్థలు ఈ- సిగరెట్లను అమ్ముతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు
- వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?
- ఆస్ట్రియా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన రహస్య వీడియో
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మోనా లీసాకు ప్రాణం పోశారు
- ‘‘అమరావతి భూసేకరణ కేసుతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








