నందిగం సురేశ్: అమరావతి భూసేకరణ కేసుతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. నేడు లోక్‌సభలో అడుగు పెడుతున్నా

ఫొటో సోర్స్, NADIGAM SURESH/FB
- రచయిత, బళ్ల సతీశ్, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ తెలుగు
రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో క్రీయశీలకంగా పాల్గొన్న నందిగం సురేశ్... ఎంపీ అవుతానని కలలో కూడా ఊహించి ఉండరు.
వైసీపీ నుంచి ఎన్నికైన ఈ బాపట్ల ఎంపీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల్లో అతి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల్లో సురేశ్ కూడా ఒకరు.
గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలేనికి చెందిన నందిగం సురేశ్ అరటి రైతు. దాంతో పాటూ అప్పుడప్పుడూ ఫొటోగ్రాఫర్‌గా కూడా చేస్తుంటారు.
ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌కు శ్రీకారం చుట్టడం, దీనిని పలువురు రైతులు వ్యతిరేకించడం తెలిసిందే. కొందరు న్యాయపోరాటం కూడా చేశారు. అయినా ప్రభుత్వం 34 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించి సీఆర్డీఏకి అప్పగించింది.
నాడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతంలో కొందరు రైతులు ఆందోళన కు దిగారు. వైసీపీ కార్యకర్తగా సురేశ్ కూడా పార్టీ తరఫున అమరావతి భూసేకరణ వ్యతిరేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో విపక్ష నేతలు వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కూడా రైతులకు మద్దతు తెలిపారు.
2011 నుంచే సురేశ్ రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతూ ఉండేవారు. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఢీలా పడ్డారు. అయినా వైసీపీ యువజన విభాగం నాయకుడిగా జిల్లా అంతటా తిరిగేవారు.

ఫొటో సోర్స్, NADIGAM SUREDH/FB
జగన్ అభిమానం చూరగొని..
2015లో అరటితోటలు తగులబెట్టిన కేసు ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ సంఘటన ఆయనను జగన్‌కు సన్నిహితుడిగా మార్చేసిందని సురేశ్ స్నేహితుల అభిప్రాయం. 2017లోనే బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ గా సురేశ్‌ను నియమించారు. దాంతో ఈసారి ఆ సీటు కేటాయించేందుకు జగన్ సంసిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగింది. అందుకనుగుణంగానే వైసీపీ అధినేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా, చివరకు పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా సురేశ్ ద్వారానే జగన్ ప్రకటించారు.
25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను జగన్ సమక్షంలో నందిగం సురేశ్ ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. స్వయంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. సురేశ్ తన సోదరుడితో సమానం అంటూ చెప్పుకొచ్చారు. వాటన్నింటి ఫలితం కనిపించింది.
ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ ఎంపీ సీటు మాత్రం వైసీపీ కైవసం చేసుకుంది. సురేశ్ ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, NADIGAM SURESH/FB
‘ఎంపీ అవడం మా గ్రామానికి గర్వకారణం’
సురేశ్ మొదటి నుంచి గ్రామంలో ఉత్సాహంగా ఉండేవాడు, అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉండేవాడని ఉద్దండరాయుడి పాలెం గ్రామ వాసి వెంకటేశ్వరరావు అన్నారు.
ఆయన బీబీసీ తో మాట్లాడుతూ ‘‘గ్రామంలో అన్ని సందర్భాల్లోనూ సురేశ్ చొరవ తీసుకునేవాడు. ఏ చిన్న పండుగ జరిగినా, ఎవరింట్లో సమస్య వచ్చినా సురేశ్ పాత్ర ఉండేది. అరటి తోట కాల్చిన కేసులో పోలీసులు తీసుకెళ్లినప్పుడు చాలా బాధపడ్డాం. రాజకీయంగా ఎవరు ఎటు ఉన్నా అతడిని ఇబ్బంది పెట్టిన తీరు ఊరిలో చాలామందికి నచ్చలేదు. చివరకు ఇప్పుడు మా గ్రామవాసి పార్లమెంట్ కి వెళుతుండడం మా అందరికీ గర్వకారణం’’ అని చెప్పుకొచ్చారు.
స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి సురేశ్ అని ఆయన మిత్రుడు కిరణ్ చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసినా, ఫొటోగ్రఫీ వృత్తిని చేపట్టినా సురేశ్ మాత్రం అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పదేళ్లుగా రాజకీయంగా చురుగ్గా తిరిగారు. ఆటంకాలను లెక్కచేయలేదు. జగనన్న మాట ప్రకారం పనిచేసిన సురేశ్‌కు తగిన స్థానం ఇచ్చారు. మా మిత్రబృందం అందరికీ సురేశ్ ఎదుగుదల ఆనందాన్నిస్తోంది’’ అని బీబీసీకి చెప్పారు.
అఫిడవిట్ ప్రకారం నందిగం సురేశ్ చదువు, ఆస్తులు
- 2017 -18 ఆర్థిక సంవత్సరానికి గానూ 3 లక్షల 40 వేల ఆదాయం.
- ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.
- 7 లక్షల ఖరీదైన సెకండ్ హ్యాండ్ కారు, ఒక సెకండ్ హ్యాండ్ బైకు ఉంది.
- తన దగ్గర, భార్య దగ్గర కలిపి రూ.5 లక్షల నగదు, బ్యాంకుల్లో లక్ష రూపాయల వరకూ నగదు ఉంది.
- కుటుంబం మొత్తానికి కలపి 450 గ్రాముల బంగారం ఉండగా, దానిపై రూ.2 లక్షల 69 వేల రుణం ఉంది.
- రెండెకరాలు భూమి, అందులో ఎకరా అసైన్డ్ భూమి. దీంతో పాటు అమరావతి మండలం కర్లపూడిలో 177 గజాల స్థలం ఉంది. ప్రస్తుతం 870 చ. అడుగుల స్థలంలో ఉన్న ఇంట్లో ఉంటున్నారు.
- 1991లో ఖమ్మం జిల్లాలో 9వ తరగతి వరకూ చదివారు.

ఫొటో సోర్స్, SURESH/FB
‘జగన్ నన్ను తమ్ముడిలా చూసుకున్నారు’
ఇటీవల జరిగిన వైయస్సార్సీఎల్పీ సమావేశంలో జగన్ సమక్షంలో సురేశ్ కన్నీటిపర్యంతం అయ్యారు. తాను ఇదే అమరావతి భూముల్లో కూలీ పనులు చేశాననీ, ఇప్పడు ఇక్కడ మీ దయ వల్లే ఎంపీగా ఉన్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు.
సామాన్యుడినైన తనకు జగనన్న ఇచ్చిన అవకాశానికి రుణపడి ఉంటానని అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘అమరావతి భూసేకరణ విషయంలో నాపై తప్పుడు కేసులతో వేధించినప్పుడు నాకు జగన్ తోడుగా నిలిచారు. ఆయన అందించిన సహకారం వల్లే ఒకనాడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న నేను నిలబడ్డాను. పోలీసుల వేధింపులను తట్టుకోగలిగాను. ’’
‘‘నన్ను బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ చేసినప్పుడే ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా నాతో ప్రకటించడం నా జీవితంలో మరచిపోలేను. ఆ లిస్టులో నా పేరు ఉండడంతో నా నోటి నుంచి మాట రాలేదు. జగన్ అడుగుజాడల్లో బాపట్ల అభివృద్ధి కోసం పాటుపడతాను. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న సామాన్య రైతు కుటుంబానికి చెందిన నన్ను పార్లమెంట్ సభ్యుడిని చేసిన జగన్ సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చుశారు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








