ఇథియోపియా విమానం పడిపోతుంటే పైలెట్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు : దర్యాప్తు నివేదిక

బోయింగ్ 737 మ్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

మార్చిలో కూలిపోయిన ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానం నేలను ఢీకొట్టే ముందు చాలాసార్లు వాలిపోయి కిందికి దూసుకొచ్చిందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

ఈ ప్రమాదం తర్వాత వచ్చిన తొలి అధికారిక నివేదికను బట్టి ఆ విమానం కూలిపోవడానికి ముందు బోయింగ్ సూచించిన పద్ధతులను పైలెట్లు మళ్లీ మళ్లీ ప్రయత్నించారు.

"కానీ ఎంత ప్రయత్నించినా పైలెట్లు విమానాన్ని అదుపు చేయలేకపోయారు" అని ఆ దేశ రవాణా మంత్రి డగ్మవిట్ మోజెస్ చెప్పారు.

అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన తర్వాత ఫ్లైట్ ఈటీ 302 కూలిపోవడంతో 157 మంది ప్రయాణికులు మృతిచెందారు.

ఐదు నెలల్లో బోయింగ్ 737 మాక్స్ విమానం కూలిపోవడం అది రెండోసారి

2018 అక్టోబర్‌లో లయన్ ఎయిర్ ఫ్లైట్ జేటీ 610 ఇండోనేసియా దగ్గర సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 189 మందీ మరణించారు.

అడిస్ అబాబాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డగ్మవిట్ "బోయింగ్ అందించిన అన్ని పద్ధతులను పైలెట్లు చాలా ప్రయత్నించి చూశారు. కానీ విమానాన్ని అదుపు చేయలేకపోయారు" అన్నారు.

బోయింగ్ 737 మ్యాక్స్

విమానం కూలిన ఘటనపై వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇంకా ప్రచురించలేదు. కానీ వాటిని ఈ వారాంతంలోపు విడుదల చేయవచ్చు.

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలడంతో 737 మాక్స్ సంస్థకు చెందిన విమానాలన్నింటినీ ఎగరకుండా విమానాశ్రయాల్లోనే ఆపేశారు. 300 పైగా విమానాలపై ఈ ప్రభావం పడింది.

నివేదికలో కూలడానికి కారణం ఏముంది?

అధికారుల ప్రాథమిక నివేదికలో విమానం కూలిపోవడానికి కారణం ఏంటనేది వివరంగా చెప్పలేదు.

కానీ ఆ నివేదికలో బోయింగ్ సంస్థ తమ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టంను సమీక్షిస్తోందని సూచించారు. 737 మాక్స్ విమానాలు తిరిగి గాల్లోకి ఎగిరేముందు ఆ సమస్యను పరిష్కరించినట్లు విమానయాన అధికారులు ధ్రువీకరించాలన్నారు.

ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెవోల్డే జీబ్రెమరియమ్ ఒక ప్రకటనలో "మా పైలెట్ల అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్ ప్రదర్శనకు నేను చాలా గర్విస్తున్నా" అన్నారు.

బోయింగ్ 737 మ్యాక్స్

"నిటారుగా కిందికి దూసుకెళ్తున్నప్పుడు విమానాన్ని అదుపు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం" అని ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు 737 మాక్స్‌ విమానం వాలిపోకుండా అడ్డుకోడానికి బోయింగ్ రూపొందించిన 'మనూవరింగ్ కారెక్టర్ స్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టం(ఎంసీఏఎస్)' అనే సాఫ్ట్‌వేర్‌పై దృష్టిపెట్టారు.

విమానం ముక్కు దగ్గర ఉండే సెన్సర్లు అది ఎక్కువగా వాలిపోయినట్టు చూపించినపుడు ఈ సాఫ్ట్‌వేర్ స్పందిస్తుంది. విమానం తిరిగి నిలకడగా ఉండేలా చేస్తుంది.

విమానం ఎంసీఏఎస్ సిస్టం

లయన్ ఎయిర్ విమానానికి ఏమైంది

లయన్ ఎయిర్ విమాన ప్రమాదంపై చేసిన దర్యాప్తులో సిస్టమ్ సరిగా పనిచేయలేదని, దాంతో విమానం సముద్రంలో కూలిపోయేముందు 20 సార్లకు పైగా ముందుకు వాలిందని చెప్పారు.

ఇండోనేసియా దర్యాప్తు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో "విమానంలో ఉన్న తప్పుడు సెన్సర్ పైలెట్లకు తెలీకుండానే పొరపాటుగా ఎంసీఏఎస్‌ను యాక్టివేట్ చేసింది" అని తెలిపారు.

లయన్ ఎయిర్ విమానం కూలిపోయినప్పటి నుంచి బోయింగ్ తమ ఎంసీఏఎస్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో ఉంది.

కానీ ఇథియోపియా అధికారుల తాజా వ్యాఖ్యలతో బోయింగ్ రెకమండ్ చేసిన పద్ధతులు అనుసరించినప్పటికీ, పైలెట్లు విమానంపై అదుపు సాధించలేకపోయినట్లు తెలుస్తోంది.

బోయింగ్ 737 మ్యాక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ నివేదిక బోయింగ్‌కు ఎంత ముఖ్యం

టామ్ బరిడ్జ్, బీబీసీ ప్రతినిధి విశ్లేషణ

ఐదు నెలల్లో జరిగిన రెండు విమాన ప్రమాదాల్లో మొత్తం 346 మంది మృతిచెందారు.

రెండు ప్రమాద ఘటనలపై వచ్చిన ప్రాథమిక నివేదికలు 737 మాక్స్ 8కు ఇచ్చిన కొత్త డిజైన్ సరిగా పనిచేయలేదని సూచించాయి. దీనిపై ఒక కేసు కూడా నమోదైంది.

ఈ రెండు ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన వారి బాధలు తీర్చలేనివి. కానీ ఈ విమానాలు కూలిపోవడం వల్ల వాణిజ్యపరంగా జరిగిన నష్టం బోయింగ్ ప్రతిష్టనే దెబ్బతీసింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది 737 మాక్స్ విమానాలు నిలిచిపోయాయి. కొన్ని వేల ఆర్డర్లు ఆగిపోయాయి.

'ఎయిర్ బస్ ఏ320'కి పోటీగా బోయింగ్ 'మాక్స్' విమానం తయారు చేసింది. కానీ అనుభవజ్ఞుడైన ఒక 737 పైలెట్ అభిప్రాయం ప్రకారం "కొత్తగా జోడించిన యాంటీ-స్టాల్ సిస్టమ్‌లో లోపం ఉండడంతో రెండు విమానాలు కూలిపోవడానికి అది కారణం అయ్యింది".

బోయింగ్ ఇప్పుడు దాన్ని సరిచేసే పనిలో ఉంది. వీలైనంత త్వరగా తమ విమానాలు సురక్షితం అని ధ్రువీకరణ పొందాలనుకుంటోంది.

ఇథియోపియా విమానం

ఫొటో సోర్స్, Ethiopian airlines

ఫొటో క్యాప్షన్, ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిన ప్రదేశం

ప్రమాదాల తర్వాత బోయింగ్ ఏం చేసింది

ఎంసీఎఎస్‌ను ఎలా ఆపరేట్ చేయాలనేదానిపై బోయింగ్ పైలెట్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.

అన్ని 737 మాక్స్ విమానాల్లో అదనపు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా బోయింగ్ భావిస్తోంది. ఇంతకు ముందు అది ఒక ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్‌లా ఉండేది.

737 మాక్స్ ఫ్లైట్ సిస్టమ్, క్రూ విధానాలు గురించి మరింత బాగా తెలుసుకోడానికి వీలుగా ఆ సంస్థ మళ్లీ పైలెట్లకు శిక్షణను అందిస్తోంది.

అప్‌గ్రేడ్స్ చేస్తున్నంత మాత్రాన ఆ ప్రమాదాలకు ఎంసీఏఎస్ కారణమని తాము అంగీకరించినట్లు కాదని బోయింగ్ సంస్థ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)