ఇథియోపియా విమాన ప్రమాదం: నలుగురు భారతీయులు మృతి.. ఒకరు తెలుగు వైద్యురాలు

నూకారపు మనీషా

ఫొటో సోర్స్, NukarapuFamily/Eenadu

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి రాజధాని నగరం అడ్డిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్నవారంతా మృతి చెందారు.

ఈటీ 302 నంబరు గల ఈ విమానం 149 మంది ప్రయాణీకులు, ఎనిమిది మంది సిబ్బందితో ఈనెల 10వ తేదీ ఆదివారం కెన్యా రాజధాని నైరోబి నగరానికి బయలుదేరినప్పుడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాణం ప్రారంభించిన ఆరు నిమిషాల్లోనే ఈ విమానం కూలిపోయింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 మాక్స్ 8 మోడల్ అయిన ఈ విమానం కొన్ని నెలల కిందటే సేవలు ప్రారంభించింది.

ప్రయాణీకుల్లో 32 మంది కెన్యా, 18 మంది కెనడా, 9 మంది ఇథియోపియా, 8 మంది చైనా, 8 మంది ఇటలీ, 8 మంది అమెరికా, ఏడుగురు ఫ్రాన్స్, ఏడుగురు బ్రిటన్, ఆరుగురు ఈజిప్ట్, ఐదుగురు జర్మనీ, నలుగురు భారత జాతీయులని, మొత్తం 35 దేశాలకు చెందిన ప్రయాణీకులు విమానంలో ఉన్నారని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ధృవీకరించారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయులు.. వైద్య పన్నగేశ్ భాస్కర్ వైద్య హన్సిన్ అన్నగేశ్, నూకవరపు మనీష, శిఖా గార్గ్‌ అని సుష్మా స్వరాజ్ తెలిపారు.

మృతుల కుటుంబాలకు తగిన సహాయం, మద్దతు అందించాలని ఇథియోపియాలోని భారత హై కమిషనర్‌ను కోరినట్లు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలు సహాయం, మద్దతు కోసం అడ్డిస్ అబాబాలోని భారత ఎంబసీకి చెందిన అధికారులు వి సురేశ్, సెకండ్ సెక్రటరీ (కాన్సులర్), మొబైల్ నంబర్ +251 911506852, మోహన్ లాల్, హెడ్ ఆఫ్ ఛాన్సరీ, మొబైల్ నంబర్ +251 911506851లను సంప్రదించాలని ఇథియోపియాలోని భారతీయ రాయబార కార్యాలయం కోరింది.

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం

ఫొటో సోర్స్, Getty Images

ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్తూ..

మృతుల్లో ఒకరైన శిఖా గార్గ్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆమె నైరోబీలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు నాలుగో సెషన్‌కు హాజరు కావాల్సి ఉంది.

ఈనెల 11వ తేదీ సోమవారం నుంచి 15వ తేదీ శుక్రవారం వరకూ ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ శిఖా గార్గ్ విమాన ప్రమాదంలో చనిపోయారని సుష్మా స్వరాజ్ ప్రకటించారు.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ శిఖ గార్గ్ మృతి దురదృష్టకరమని, ఆమెతో పాటు ఇతర ప్రయాణీకుల మృతికి తన సంతాపం ప్రకటించారు.

ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం
ఫొటో క్యాప్షన్, బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 మాక్స్ 8 విమానం ఊహాచిత్రం

అక్క పిల్లల్ని చూసేందుకు వెళ్తూ..

ఇథియోపియన్ విమాన ప్రమాదంలో చనిపోయిన నూకవరపు మనీషా స్వస్థలం గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు అని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె మనీషా. గుంటూరు వైద్య కళాశాలలో నాలుగేళ్ల క్రితం ఆమె వైద్యవిద్య అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మనీషా అక్క లావణ్య నైరోబీలో నివాసముంటున్నారు.

10 రోజుల క్రితం లావణ్య ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా బయలుదేరారు. అమెరికా నుంచి ఇథియోపియాకు వెళ్లి, అక్కడి నుంచి నైరోబీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

మనీషా తల్లిదండ్రులు నెలరోజులుగా పెద్ద కుమార్తె వద్దే ఉంటున్నారని ఈనాడు దినపత్రిక ఆ కథనంలో పేర్కొంది.

వ

ఫొటో సోర్స్, Reuters

ఏం జరిగింది? ఎందువల్ల విమానం కూలిపోయింది?

ఈ దుర్ఘటనకు కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై విచారణ జరిపేందుకు ఇథియోపియా ఒక కమిటీని నియమించింది.

అయితే, కొన్ని ఇబ్బందులు తలెత్తాయని పైలట్ చెప్పారని, విమానాన్ని తిరిగి అడ్డిస్ అబాబాకు మళ్లించాలని కోరారని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

విమానం ప్రయాణిస్తున్న సమయంలో విజిబులిటీ (ఆకాశం) బాగానే ఉందని, కానీ.. టేకాఫ్ అయిన తర్వాత విమానం పైకి ఎగురుతున్నప్పుడు వేగం నియంత్రణలో లేదని ఫ్లైట్‌రాడార్24 అనే ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించింది.

విమానం నేలను తాకినప్పుడు తీవ్రమైన మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి తెలిపారు.

పేలుడు, మంటల తీవ్రత కారణంగా విమానం సమీపానికి కూడా తము చేరుకోలేకపోయామని, విమానం పూర్తిగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)