బరువు తగ్గారా... అయితే, కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిందే

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ ప్రయాణం చేసే ముందు మీరు ఎన్నిసార్లు మీ పాస్‌పోర్ట్ చెల్లుతుందని మరీ మరీ చెక్ చేసుకున్నారు?
ఈ క్షణంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ పని చేస్తుండొచ్చు.
పాస్‌పోర్టులు ఏ రంగులో ఉన్నా, వాటిపై ఎలాంటి స్టాంపులున్నా, అవన్నీ ఒకే కథను చెబుతాయి.
ప్రపంచాన్ని చుట్టి రావడానికి అవసరమైన ఈ ముఖ్యమైన పత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
1.స్కాండినేవియన్ పాస్‌పోర్టుల మీద ఉత్తర ధ్రువ ప్రభ
స్కాండినేవియన్ పాస్‌పోర్టులకు ఒక ప్రత్యేకత ఉంది.
వాటిని గనుక అల్ట్రావయోలెట్ లైట్ కింద పెడితే, కాగితం మీద ఉత్తర ధ్రువ ప్రభ కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. బైబిల్‌లో మొదటి పాస్‌పోర్టు
మొదటి పాస్‌పోర్టు వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.
హీబ్రూ బైబిల్ ప్రకారం, 16వ శతాబ్దంలో పర్షియాకు చెందిన మొదటి అర్టాజెర్క్సిస్ జుడియాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఒక అధికారిత పత్రాన్ని జారీ చేశాడు.
దాన్నే మొట్టమొదటి పాస్‌పోర్టుగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3.మొదటి ప్రపంచయుద్ధం తర్వాత పాస్‌పోర్టుల మీద ఫొటోలు
మొదట్లో పాస్‌పోర్టుల మీద ఫొటోలు ఉండేవి కావు.
మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గూఢచర్యం కొరకు నకిలీ పాస్‌పోర్టులతో బ్రిటన్‌లోకి ప్రవేశించడంతో వాటిపై ఫొటోలను ఉపయోగించడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
4.బరువు తగ్గిందా? కొత్త పాస్‌పోర్టు తీసుకోండి
అమెరికాలో మీ బరువు తగ్గినా, పెరిగినా లేదా మొహం మీద ఉన్న పచ్చబొట్లు తొలగించుకున్నా లేదా ఫేషియల్ సర్జరీ చేయించుకున్నా, తప్పకుండా మీ పాస్‌పోర్టును అప్‌డేట్ చేసుకోవాల్సిందే.

ఫొటో సోర్స్, Getty Images
5. పాస్‌పోర్టులపై కుటుంబ ఫొటోలు
పాస్‌పోర్టులు వచ్చిన కొత్తలో ఇష్టం వచ్చిన ఫొటోలను పాస్‌పోర్టులో అతికించే వీలుండేది. మొత్తం కుటుంబం ఫొటోలను కూడా అనుమతించేవారు.
అయితే తర్వాత కాలంలో కేవలం ఒక్కరి ఫొటో మాత్రమే ఉండే పాస్‌పోర్టులు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
6. గడువు తీరడానికి ఆరునెలల ముందే రెన్యువల్
బయటి దేశాలకు వెళ్లే ముందు పాస్‌పోర్టు ముగిసే గడువును సరి చూసుకోండి. చాలా యూరప్ దేశాలు ఆ దేశంలో ప్రవేశించాక 90 రోజుల పాటు పాస్‌పోర్టు చెల్లుబాటు కావాలని షరతు విధిస్తాయి.
అయితే, మరింత జాగ్రత్త కోసం అవి 6 నెలల పాటు చెల్లుబాటయ్యేలా చూసుకోండి. చైనా, ఇండోనేషియా, రష్యా, సౌదీ అరేబియాలు ఈ 6 నెలల గడువు కోరతాయి.

ఫొటో సోర్స్, Getty Images
7.క్వీన్స్‌ల్యాండ్ నుంచి ఆస్ట్రేలియాలో ప్రవేశిస్తే పాస్‌పోర్టు అవసరం లేదు
అయితే ఈ షరతు మీరు కేవలం పపువా న్యూ గినీకి చెందిన తొమ్మిది ప్రత్యేక తీర గ్రామాలకు చెందిన వారైతే మాత్రమే వర్తిస్తుంది.
పపువా న్యూ గినీ స్వాతంత్ర్యం పొందినపుడు జరిగిన ఒప్పందంలో ఇలా పాస్‌పోర్టు లేకుండా ఆస్ట్రేలియాలో ప్రవేశించవచ్చనే నిబంధన చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
8. ఇటలీలోకి ప్రవేశిస్తే వాటికన్‌లోకీ ప్రవేశించొచ్చు
వాటికన్‌లో ప్రవేశించడానికి ఎలాంటి పాస్‌పోర్టు నియంత్రణలూ లేవు. మీరు ఇటలీలో ప్రవేశించగలిగితే, వాటికన్ సిటీలోకీ ప్రవేశించవచ్చు.
వాటికన్‌కు వెళ్లినట్లు మీ పాస్‌పోర్టుపై ఎలాంటి అధికారిక ముద్రా ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
9. చాలా మంది అమెరికన్లకు పాస్‌పోర్టులు లేవు
ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా భావించే అమెరికాలో ఎంత మంది పౌరుల వద్ద పాస్‌పోర్టులు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం 321,362,789 మంది అమెరికా పౌరుల వద్ద కేవలం 121,512,341 పాస్‌పోర్టులు మాత్రమే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
10. ఫోర్జరీ చేయడానికి అత్యంత కష్టమైన పాస్‌పోర్టు
నికరాగువా పాస్‌పోర్టుపై హోలోగ్రామ్‌లు, వాటర్ మార్కులులాంటి 89 వేర్వేరు సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి.
అందువల్ల ఆ దేశం పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం దాదాపు అసాధ్యమంటారు.

ఫొటో సోర్స్, Getty Images
11. టోంగాలో పాస్‌పోర్టుల విక్రయం
టోంగా ఒక్కో పాస్‌పోర్టును సుమారు రూ.14 లక్షలకు విక్రయించేది.
గతంలో టోంగా రాజైన నాలుగో తౌఫాఅహౌ తుపోవ్ పాలనలో దేశం ఆదాయం పెంచే లక్ష్యంతో టోంగా పాస్‌పోర్టులను భారీ ధరకు విక్రయించే వారు.

ఫొటో సోర్స్, Getty Images
12. ఫ్లికర్ బుక్స్‌లా ఉపయోగపడే పాస్‌పోర్టులు
మీ వద్ద ఫిన్లాండ్, స్లొవేనియా పాస్‌పోర్టులు గనుక ఉంటే, మీకు ఎక్కడైనా ఎయిర్‌పోర్టులో బోర్ కొడుతుంటే, మీరు సరదాగా ఓ ఆటాడుకోవచ్చు.
ఆ రెండు దేశాల పాస్‌పోర్ట్ పేజీలను గనుక వేగంగా ముందుకు తిప్పితే, ఆ పేజీలపై ఉన్న బొమ్మలు కదులుతున్న భ్రాంతిని కలిగిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
13. రాణికి పాస్‌పోర్టు లేదు
రెండో ఎలిజబెత్ రాణికి పాస్‌పోర్ట్ తీసుకోవాలనే బెంగ లేదు.
ఎందుకంటే యూకే పౌరుల పాస్‌పోర్టులన్నీ ఆమె పేరిటే మంజూరు అవుతాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








