కూలీలకు బిజినెస్ సూట్లు - ఎందుకంటే..

కార్మికుడు

ఫొటో సోర్స్, OASYS LIFESTYLE GROUP

ఫొటో క్యాప్షన్, కిందిస్థాయి కార్మికుల కోసం బరువు తక్కువ ఉండి, తొందరగా ఆరిపోయే సూట్లు తయారు చేసినట్టు ఒయాసిస్ సంస్థ చెబుతోంది.

పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా జపాన్‌కు చెందిన ఓ సంస్థ బిజినెస్ సూట్లు తయారు చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే శ్రామికుల కోసం తక్కువ బరువు కలిగిన, తొందరగా ఆరిపోయే సూట్లను రూపొందించినట్టు జపాన్ రాజధాని టోక్యోలోని ఒయాసిస్ స్టైల్ వేర్ అనే కంపెనీ తెలిపింది.

పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికుల నుంచి ఈ సూట్లకు మంచి ఆదరణ లభిస్తోందని జపాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

'వాళ్లను ప్రోత్సహించేందుకే'

బ్లూ- కాలర్ కార్మికుల్లో ఆత్మవిశ్వాసం పెంచే ఆలోచనతో ఈ సూట్లు రూపొందించామని తయారీ సంస్థ చెబుతోంది.

"వ్యవసాయం, పారిశుద్ధ్యం, భవన నిర్మాణం తదితర రంగాల్లోకి కార్మికులుగా వెళ్లే క్రమంలో 20, 30 ఏళ్ల జపాన్ యువత తీవ్రమైన న్యూనతా భావానికి లోనవుతున్నారు. సంప్రదాయంగా కార్మికులు వేసుకునే దుస్తులు కూడా ఆ న్యూనత పెరగడానికి ఓ కారణం. ఈ విషయాన్ని గ్రహించిన మా ఇంజినీర్లు, ఆ కార్మికుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ సూట్లను రూపొందించారు" అని ఆ సంస్థ వివరించింది.

కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'నీళ్లు పడ్డా తడవదు'

దేశంలో పెరిగిన డిమాండ్‌ని భర్తీ చేసేందుకు.. భూకంపాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది, భవన నిర్మాణ కార్మికుల అవసరం భారీగా పెరుగుతోందని, అందుకే ఈ రంగాల్లో యువత ప్రవేశించేలా ప్రోత్సహించాలన్నది కూడా తమ ఆలోచన అని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

"నేను పొలంలో పనిచేసేటప్పుడు కూడా ఇలాంటి సూట్లు వేసుకుంటాను. ఇది నీళ్లు పడ్డా తొందరగా తడవదు. దాంతో కొద్దిపాటి వర్షం వచ్చినప్పుడు నాకు రెయిన్ కోటు కూడా అవసరం ఉండదు" అని కియోటో సైటో అనే రైతు జపాన్ టైమ్స్ పత్రికతో చెప్పారు.

ఈ తరహా వస్త్రధారణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీల ఆలోచనా తీరులోనూ మార్పు వస్తుందని ఒయాసిస్ సంస్థ చెప్పినట్టు ఆ పత్రిక రాసింది.

ఈ ఏడాది మార్చి నుంచి సూట్ల అమ్మకాలు ప్రారంభించగా, ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఒయాసిస్ సంస్థ చెబుతోంది.

తమ వ్యాపార క్లయింట్లతో పాటు, తోటి కంపెనీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి హయాటో సుహారా తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)