ప్రజ్ఞానంద: అక్కను ఓడించాలని చెస్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు

ఫొటో సోర్స్, PRAGGNANANDHAA R. / FACEBOOK
- రచయిత, వివేక్ ఆనంద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చదరంగంలో భారత్‌కు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నై బాలుడు ప్రజ్ఞానంద 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులోనే గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. ప్రపంచంలో అతిచిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఇటలీలోని గ్రెడీన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రజ్ఞానంద తుది రౌండ్‌కు చేరుకోక ముందే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు.
టోర్నమెంటులో అతడు 16 ఏళ్ల ఇరానీ ఆటగాడు ఆర్యన్ ఘోలామీపై గెలుపొంది, ఎనిమిదో రౌండ్‌కు చేరుకున్నాడు. ఎనిమిదో రౌండ్‌లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్ మొరోని లూకా జూనియర్‌పై విజయం సాధించాడు.
గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకోవాలంటే 2482 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఆటగాడితో ఆడాల్సి ఉంటుంది. ప్రజ్ఞానంద 2,514 రేటింగ్ ఉన్న ప్రుజెసర్స్ రోల్యాండ్‌తో తలపడ్డాడు.
టీనేజీలోకి రాక ముందే గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించిన రెండో ఆటగాడు ప్రజ్ఞానందనే. 2002లో ఉక్రెయిన్ ఆటగాడు సెర్గీ కర్జాకిన్ 12 సంవత్సరాల ఏడు నెలల వయసులోనే ఈ హోదాను సాధించాడు.

ఫొటో సోర్స్, RB RAMESH/BBC
'గ్రాండ్‌మాస్టర్' సాధన దిశగా అక్క
ప్రజ్ఞానంద ఈ అరుదైన ఘనత సాధించడంలో అతడికి ఆది నుంచి అండగా నిలిచిన తండ్రి రమేశ్ బాబు ప్రధాన పాత్ర పోషించారు.
పోలియో వ్యాధి బారిన పడిన రమేశ్ బాబు చెన్నైలో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సహకార బ్యాంకులో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
చెస్ టోర్నమెంట్లలో పాల్గొనేటప్పుడు ప్రజ్ఞానంద వెంట అతడి తల్లి నాగలక్ష్మి, అక్క వైశాలి ఉంటారు.
వైశాలి కూడా చెస్ క్రీడాకారిణే. ఇటలీ టోర్నమెంట్లో ఆమె కూడా పాల్గొంది.
గ్రాండ్‌మాస్టర్ హోదాకు అర్హత సాధించాలంటే మూడు సెట్లలో విజయవంతం కావాల్సి ఉండగా, వైశాలి రెండు సెట్లలో విజయవంతమయ్యారు. ఏదైనా టోర్నమెంటులో ఈ మూడో సెట్‌ను అధిగమిస్తే తమ్ముడిలాగే అక్క కూడా గ్రాండ్‌మాస్టర్ అవుతారు.

ఫొటో సోర్స్, RB RAMESH/BBC
ప్రజ్ఞానంద ఆసక్తిని చూసి నిర్ణయం మార్చుకున్న తండ్రి
''వైశాలి పాఠశాల రోజుల్లో చెస్ తరగతులకు వెళ్లేది. తను చాలా బాగా ఆడుతుంది. ఈ ఆటలో ఉన్నత స్థాయికి చేరుకొనే క్రమంలో, సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆర్థిక పరిమితుల వల్ల నా కొడుకును చెస్ క్లాసులకు పంపొద్దని మొదట్లో అనుకున్నాను. అయితే నాలుగేళ్ల వయసు నుంచే ప్రజ్ఞానంద చెస్ బోర్డు ముందు, తన అక్కతో చెస్ ఆడుతూ చాలా సమయం గడిపేవాడు'' అని ప్రజ్ఞానంద తండ్రి రమేశ్ బాబు బీబీసీతో చెప్పారు.
తన వయసు పిల్లలతో ఇతర ఆటలు ఆడుకోవడం కంటే చెస్‌పై ప్రజ్ఞానంద చూపే అమితాసక్తిని గమనించి తన నిర్ణయాన్ని మార్చుకొన్నానని రమేశ్ బాబు తెలిపారు.
ప్రజ్ఞానంద కన్నా వైశాలి నాలుగేళ్లు పెద్దదని, అక్క నుంచే అతడు చదరంగం ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాడని ఆయన వివరించారు.
''ప్రజ్ఞానంద తన అక్కను ఓడించాలని చెస్ ఆడటం నేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ అవడం అతడి లక్ష్యం. ఇది చాలా పెద్ద లక్ష్యం'' అని ప్రజ్ఞానంద తండ్రి వ్యాఖ్యానించారు.
పోలియో వల్ల తాను సుదూర ప్రయాణాలు చేయలేనని, అందువల్ల టోర్నమెంట్లకు పిల్లల వెంట నాగలక్ష్మి వెళ్తుంటారని రమేశ్ బాబు చెప్పారు.

ఫొటో సోర్స్, Facebook/Praggnanandhaa R.
'పిల్లలకు ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనుకున్నాను'
ప్రజ్ఞానంద, వైశాలి ఇద్దరూ బాగా ఆడతారని, ఇద్దరూ తమిళనాడు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చాలా విజయాలు సాధించారని, దీంతో వారికి భారత ప్రభుత్వం, చెస్ అకాడమీ సాయం అందించాయని రమేశ్ బాబు తెలిపారు. ఈ తోడ్పాటుతో ఇద్దరూ ఆసియా స్థాయిలో మంచి ప్రదర్శన చేశారని చెప్పారు.
''మొదట్లో ఆర్థికంగా ఇబ్బంది ఎదురయ్యేది. తర్వాత బ్యాంకు రుణాలు తీసుకొని సమస్యను అధిగమించాం. నా పిల్లలకు వారి కలలను సాకారం చేసుకోవడంలో ఆర్థిక సమస్యలను అడ్డంకులుగా మారనివ్వకూడదనుకున్నాను'' అని ఆయన వివరించారు.
రమేశ్ బాబు కుటుంబం చెన్నై శివార్లలో నివసిస్తోంది. అక్కాతమ్ముడు గెలిచిన అనేక ట్రోఫీలు ఇంటి నిండా కనిపిస్తాయి.
2015 చెన్నై వరదల్లో కొన్ని ట్రోఫీలు పోయాయని రమేశ్ బాబు చెప్పారు.
ప్రజ్ఞానంద ఐదేళ్లకే ఆడటం మొదలుపెట్టాడు. 2013లో అండర్-8 ఛాంపియన్‌షిప్ టైటిల్, 2015లో అండర్-10 ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
పదేళ్ల వయసులో 2016లో యువ అంతర్జాతీయ మాస్టర్(ఐఎం) టైటిల్ సాధించాడు. అప్పటికి ప్రపంచంలో ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన అతిపిన్న వయస్కుడు అతడే.
కోచ్ నుంచి మెలకువలు
భారత చెస్ జట్టు కోచ్ ఆర్‌బీ రమేశ్ నుంచి ప్రజ్ఞానంద మెలకువలు నేర్చుకున్నాడు.
ఐఎం హోదా సాధించాక తర్వాత జరిగే మూడు టోర్నమెంట్లలో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధనపై ప్రజ్ఞానంద దృష్టి పెట్టాడని బీబీసీతో రమేశ్ చెప్పారు.
నిబంధనల ప్రకారం నిర్దిష్ట రేటింగ్‌ను సాధించడంతోపాటు మూడు వేర్వేరు టోర్నమెంట్లలో సర్టిఫై అయితేనే గ్రాండ్‌మాస్టర్ హోదా వస్తుందని ఆయన తెలిపారు.
''ప్రజ్ఞానంద నిరుడు నవంబరులో ఇటలీలో జరిగిన టోర్నమెంటులో ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. తద్వారా గ్రాండ్‌మాస్టర్ హోదా సాధనలో తొలి సెట్‌ను అధిగమించాడు. టోర్నమెంటులో సర్టిఫెకెట్లు పొందాడు. 2018లో హెరాక్లియోన్ టోర్నమెంటులో రెండో సెట్‌ను అధిగమించాడు. ఇప్పుడు గ్రెడీన్ టోర్నమెంటులో మూడో సెట్‌ను కూడా అధిగమించాడు. అతడికి 2500 ఎఫ్‌ఐడీఈ(ప్రపంచ సమాఖ్య) రేటింగ్ కూడా ఉంది. దీంతో గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు'' అని కోచ్ వివరించారు.

ఫొటో సోర్స్, RB RAMESH / BBC
ప్రజ్ఞానంద ఆట ప్రత్యేకత ఏమిటి?
ప్రజ్ఞానంద ఆట ప్రత్యేకత గురించి అడగ్గా- ''క్రికెట్‌లో మాదిరే చెస్‌లోనూ ప్రారంభ దశ(ఓపెనింగ్), మధ్య దశ(మిడిల్), చివరి దశ(ఫినిషింగ్) అని మూడు దశలు ఉంటాయి. మధ్య దశ, చివరి దశ ఆటలో అతడు సిద్ధహస్తుడు. ఆట ప్రారంభంలోనూ అంతే ప్రతిభను కనబరిస్తే అతడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు గ్రెడీన్ టోర్నమెంట్లో అతడు ఇదే చేశాడు'' అని రమేశ్ చెప్పారు.
'ఇది చెస్‌లో పీహెచ్‌డీ'
గ్రాండ్‌మాస్టర్ అవ్వడం అంటే చెస్‌లో పీహెచ్‌డీ సాధించడం లాంటిదని కోచ్ వ్యాఖ్యానించారు. ''ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించడం తేలిక కాదు. ప్రజ్ఞానంద ఇలాగే బాగా ఆడితే ఏదో రోజు భారత్ గర్వించే విజయాలు సాధిస్తాడు'' అని శిష్యుడిపై విశ్వాసం వ్యక్తంచేశారు.
''చెస్ గేమ్‌లు రెండు రకాలుగా ఉంటాయి. వీటిని ఓపెన్ గేమ్స్, క్లోజ్డ్ గేమ్స్ అని వ్యవహరిస్తారు. ప్రపంచ చెస్ సమాఖ్య సభ్యులు ఎవరైనా ఓపెన్ టోర్నమెంట్లలో ఆడొచ్చు. కానీ క్లోజ్డ్ టోర్నమెంట్లలో మాత్రం నిర్దేశిత రేటింగ్ ఉన్న ఆటగాళ్లే పాల్గొంటారు. ఇప్పుడు ప్రజ్ఞానంద గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించినందున అతడితో ఆడేందుకు ప్రపంచంలోని చాలా మంది ఆటగాళ్లు ముందుకొస్తారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అతడికి ఇది మంచి అవకాశం'' అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








