తెలంగాణ: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి, అసలేం జరిగింది?

బాధితురాలు
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ కోసం

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న 34 మందిలో నలుగురు మరణించారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేరువేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

బాధితులు కడుపు నొప్పితో ఆసుపత్రుల్లో చేరినట్లు ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు.

మృతి చెందిన నలుగురు మహిళలు 22 నుంచి 32ఏళ్ల మధ్య వయసు వారే.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మమతా, సుష్మలు ఆదివారం సాయంత్రమే మృతి చెందారు. మౌనిక సోమవారం చనిపోయారు. లావణ్య అనే 26 ఏళ్ల మహిళ మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు.

ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అక్టోబర్ 10వ తేదీలోగా సమగ్ర నివేదికను అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి

ఇబ్రహీంపట్నంలోని సీతారాంపేటకు బీబీసీ వెళ్లగా, లావణ్య కుటుంబ సభ్యులు అక్కడ ఒక ఖాళీ స్థలంలో టెంట్ వేసుకొని కనిపించారు. లావణ్య బంధువుల దగ్గర ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు ఆరు, ఐదేళ్ల వయసున్న పిల్లలతోపాటు తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుకు లావణ్య బంధువు ఒకరు పాల సీసాతో పాలు పడుతూ కనిపించారు.

"అద్దె ఇంట్లో ఉంటున్నాం కదా. ఇక్కడకు మృతదేహాన్ని తీసుకురానివ్వరు. అందుకే మేం ఇల్లు కట్టించుకుందాం అనుకున్న స్థలంలోనే లావణ్యకు అంత్యక్రియలు జరిపాం"అని లావణ్య భర్త శివ చెప్పారు.

లావణ్య కుటుంబ సభ్యులు బీబీసీతో మాట్లాడుతూ.. ''ఉదయం ఆమె ఆరోగ్యంగానే ఆసుపత్రికి వెళ్లింది. తొమ్మిది గంటలకు లైనులో నిలబడాలని అక్కడి సిబ్బంది సూచించారు. 12 గంటలకు ఆపరేషన్ జరిగింది. అక్కడుండే వారు మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ, మా కోడలు నాలుగు గంటలైనా మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఏమయింది అని అడిగితే, కడుపులో నొప్పిగా ఉందని, వాంతులు అయ్యేటట్టు అనిపిస్తోందని చెప్పింది. కానీ, అక్కడ వారు మాత్రం, ఏమీ కాదు అందరికి చేసిందే ఆమెకు కూడా చేశామని అన్నారు. ఇంటికి తీసుకువెళ్లి పెరుగన్నం పెట్టండని చెప్పారు. కానీ ఆ రోజు రాత్రి అంతా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతూనే ఉంది. మరుసటి రోజు ఉదయం మొత్తంగా నాలుగు ఆసుపత్రులు తిప్పాం. అయినా ఆమె బతక లేదు. ఈ పిల్లల పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలియడం లేదు''అని ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ఇబ్రహీంపట్నంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మరణాలు... ఎవరిదీ పాపం?

అందరినీ వెనక్కి పిలిపించారు

హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న ఇబ్రహీంపట్నంలో 25న ఈ ఆపరేషన్లు జరిగాయి. అయితే మృతుల వార్తలు మీడియాలో కనిపించడంతో ఆసుపత్రి యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్న మిగితా మహిళలను కూడా మళ్లీ ఆసుపత్రికి రావాలని సూచించింది. కొంతమందిని అంబులెన్సులు పంపి మరీ వెనక్కి రప్పించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నామని చెప్పినప్పటికీ అందరికి సెలైన్ ఎక్కించారు. వీరిలో కొందరిని వేర్వేరు ఆసుపత్రులకు పంపించారు.

"ఉదయం రమ్మని చెప్పారు. మాకు ఈ సంఘటన తెలిసినప్పటినుంచి చాలా భయంగా ఉంది. అసలు ఈ ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నామా అని భయమేస్తోంది. నాకు కూడా మొదటి రోజు జ్వరం, వాంతులు అయ్యాయి. ఆ తరువాత తగ్గిపోయాయి"అని ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్న శోభ చెప్పారు. ఆమెను కూడా సీహెచ్‌సీకి రమ్మని వైద్యులు సూచించారు.

తనతోపాటు ఆపరేషన్ చేయించుకున్న మహిళల్లో నలుగురు చనిపోయారని తెలిసినప్పటి నుంచి తనలో ఆందోళన ఎక్కువైందని ప్రశాంతి అనే మరో మహిళ బీబీసీ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు.

"నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లలకు తల్లి లేకుంటే ఎలా? ఎన్ని లక్షల నష్ట పరిహారం ఇచ్చినా తల్లి ప్రేమను వారికీ అందించగలమా? ఉదయం ఇక్కడకి రమ్మని చెప్పినప్పటి నుండి మాకు చాలా భయముగా ఉంది. అసలు మాకు ఏం చెబుతారోనని ఆందోళనగా ఉంది"అని ప్రశాంతి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరోగ్య శాఖ డైరెక్టర్

ఫొటో సోర్స్, TELANGANA HEALTH DEPARTMENT

''మిగిలిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం''

ఈ ఘటనపై ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడారు. ''ఈ నెల 25న జాతీయ స్థాయిలో నిర్వహించిన శిబిరాల్లో భాగంగా ఇక్కడ కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేపట్టాం. 34 మందికి డబుల్ పoక్చర్ లాప్రోస్కాపీ చేశాం. ఈ ఆపరేషన్లు ఇబ్రహీంపట్నంలోని సీహెచ్‌సీలో జరిగాయి. దురదృష్టవశాత్తూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మిగిలిన 30మందిని మళ్లీ స్క్రీన్ చేశాం. వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్సల కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాం. ఏడుగురిని నిమ్స్‌లో కూడా చేర్పించాం''అని ఆయన చెప్పారు.

''చనిపోయిన నలుగురు మహిళలకు రూ. 5 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాకు టార్గెట్లేమీ ఉండవు. మహిళలు స్వచ్ఛందంగా సర్జరీ చేయించుకోవడానికి వస్తారు. ఇబ్రహీంపట్నంలో సర్జరీ చేసిన వైద్యులకు వేల సంఖ్యలో ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఎక్కడ లోపం జరిగిందో తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశాం. సర్జరీ చేసిన వైద్యులపై కూడా చర్యలు తీసుకున్నాం. అయితే, ఇప్పుడే వారిది తప్పని చెప్పలేం. శవపరీక్షా నివేదికలు వస్తేనే వాస్తవాలు తెలుస్తాయి"అని ఆయన చెప్పారు.

''ప్రభుత్వం విచారణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీ వేసింది. ఈ విచారణకు ఇన్‌ఛార్జిగా నేనే కొనసాగుతున్నాను. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేస్తాం. మేం కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఆపరేషన్‌లు చేస్తున్నాం''అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఈ ఆపరేషన్లు చేయడానికి రాష్ట్ర మొత్తంలో నలుగురు డాక్టర్లే ఉన్నారని, వారు రోజుకి 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలని కూడా శ్రీనివాస్ వివరించారు.

గతంలోనూ సూర్యపేట్‌లో వంద మందికి ఒకే రోజు పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. నిజామాబాద్‌లోనూ ఆపరేషన్లలో నిర్లక్ష్యం జరిగినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై ప్రశ్నించగా.. ''అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా పరిశీలిస్తాం''అని శ్రీనివాస్ రావు అన్నారు.

చిన్నారి

నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు...

ఆపరేషన్లలో స్టెరిలైజ్ చేసిన వైద్య పరికరాలు వాడారా? లేదా ఏమన్నా నిర్లక్ష్యం చోటు చేసుకుందా? వైద్యుల తప్పులు ఏమైనా ఉన్నాయా? మృతి చెందిన మహిళలు తీసుకున్న ఆహారంలో ఏమైనా తప్పు జరిగిందా?అనే కోణాల్లో విచారణ జరుపుతామని శ్రీనివాస్ వివరించారు.

మృతి చెందిన నలుగురి మహిళల పిల్లలు చిన్నవారు కావడంతో వారి చదువుల బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

లావణ్య పిల్లలు తమ అమ్మ ఎప్పుడు తిరిగి వస్తుందని పదేపదే అడుగుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తొమ్మిది నెలల కొడుకు అయితే, నాన్నమ్మ పట్టే డబ్బా పాలు తాగనని మారాం చేస్తున్నాడు.

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతి చెందారని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని పలు దినపత్రికలు, ఛానల్ లలో ప్రచురితమైన వార్తల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. దీని పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అక్టోబర్ 10వ తేదీలోగా సమగ్ర నివేదికను అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)