35ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నారా? పిల్లలకు ఈ అనారోగ్య ముప్పు ఉంది జాగ్రత్త

వీర్యం

ఫొటో సోర్స్, FITOPARDO/GETTYIMAGES

    • రచయిత, ఆండ్రీ బీర్నథ్
    • హోదా, బీబీసీ న్యూస్

35ఏళ్ల వయసులో తండ్రి కావాలని అనుకునే వారికి నెలలు నిండకుండా శిశువులు పుట్టడం లేదా ఆటిజం పిల్లలు పుట్టే ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది.

వయసు పైబడేకొద్దీ శుక్రకణాల నాణ్యత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

ఇటీవల చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. వీటిలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా పరిశోధన గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీనిలో భాగంగా 4 కోట్ల మంది పిల్లల జననాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు.

మహిళల్లోనూ యవ్వనంలో ఉండేవారికి పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఒకసారి 35 లేదా 40ఏళ్లు వచ్చేస్తే, సంతాన సమస్యలు వారిలోనూ మొదలవుతాయి.

అయితే, తల్లిదండ్రుల వయసు ఎక్కువైనప్పుడు పుట్టే పిల్లలకు అనారోగ్యాలు చుట్టుముట్టకుండా చాలా చికిత్సా విధానాలు, వ్యాధులను తొలి దశలోనే గుర్తించే పరీక్షలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటితో పిల్లల అనారోగ్య ముప్పులను మనం గణనీయంగా తగ్గించొచ్చు.

వీర్యం

ఫొటో సోర్స్, Getty Images

సర్వసాధారణం అయిపోతోంది

పిల్లలను కనడంలో జాప్యం చేయడం అనేది ప్రస్తుతం పురుషుల్లో సర్వసాధారణం అయిపోతోందని సవ్‌పాలోలోని హాస్పిటల్ సవ్ లీజ్ ఇటాయిమ్ పరిశోధకురాలు డాక్టర్ కార్లా గీస్టి జచారియస్ చెప్పారు.

''50లు లేదా 60ల వయసులో ఉండేవారు యవ్వనంలో ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకొని.. పిల్లలను కనేందుకు సాయం చేయాలని రావడం ఎక్కువైంది''అని ఆమె చెప్పారు.

ఇంతకీ, తండ్రి వయసు పైబడటంతో పిల్లలకు వచ్చే ప్రధాన అనారోగ్య ముప్పులు ఏమిటి?

నిజానికి పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మహిళల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

మహిళల్లో అండాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. కానీ, పురుషుల్లో మాత్రం యవ్వనంలో మొదలయ్యే వీర్య ఉత్పత్తి.. జీవితాంతం కొనసాగుతుంది.

వీర్యం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, పురుషుల్లో వీర్యం నిరంతరంగా ఉత్పత్తి అయ్యేటప్పుడు.. దీని నాణ్యత మాత్రం వయసు బట్టీ మారుతూ ఉంటుంది.

వయసు పైబడేటప్పుడు ఈ శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది, పైగా వీటిలో లోపాలు కూడా పుట్టుకొస్తాయి.

ఈ లోపాల వల్ల అండం ఫలదీకరణం చెందడం కష్టం అవుతుంది.

కొన్ని ప్రయత్నాల తర్వాత పిల్లలు పుట్టొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, అలా పుట్టిన పిల్లలకు శ్వాస కోశ వ్యాధులు, ఆటిజం, ఇతర అనారోగ్య ముప్పులు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నాయి.

వీర్యం

ఫొటో సోర్స్, JILL LEHMANN PHOTOGRAPHY/GETTYIMAGES

పరిశోధనల్లో ఏం తేలింది?

తల్లిదండ్రుల వయసు పెరగడంతో పిల్లలకు వచ్చే ముప్పులపై 2018లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేపట్టింది. తల్లిదండ్రుల వయసు పెరిగేకొద్దీ పిల్లలకు వచ్చే అనారోగ్య ముప్పులు కూడా పెరుగుతాయని దీనిలో వెల్లడైంది.

ముఖ్యంగా 35ఏళ్ల తర్వాత పిల్లలను కనే పురుషులకు పుట్టే పిల్లలు బరువు తక్కువగా ఉండడం, మూర్ఛపోవడం, కృత్రిమ శ్వాస అవసరం పడటం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధనలో తేలింది.

ఒకవేళ తండ్రి వయసు 45ఏళ్లకు మించివుంటే.. నెలల నిండకుండా పిల్లలు పుట్టే ముప్పు 14 శాతం ఎక్కువని, ఒకవేళ తండ్రి వయసు 50 దాటిపోతే ఈ ముప్పు కూడా 28 శాతానికి మించి ఉంటుందని వెల్లడింది.

అయితే, ఈ అధ్యయన ఫలితాలను చూసి గందరగోళం పడాల్సిన అవసరంలేదని పరిశోధనకు నేతృత్వం వహించిన మైఖెల్ ఇసెన్‌బర్గ్ చెప్పారు. ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకోవడానికి ఇలాంటి పరిశోధనలు తోడ్పడతాయని ఆయన అన్నారు.

''పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా తల్లి ఆరోగ్యాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ, ఇక్కడ తండ్రి వయసు కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి''అని ఆయన వివరించారు.

వీర్యం

ఫొటో సోర్స్, Science Photo Library

ఈ అధ్యయనంలోనే తండ్రి వయసు ఎక్కువైతే.. పిల్లలకు ఆటిజం ముప్పు కూడా వెంటాడుతుందని పేర్కొన్నారు.

30ఏళ్ల తర్వాత తండ్రి వయసు ప్రతి పదేళ్లు పెరిగేటప్పుడు పిల్లలకు ఆటిజం వచ్చే ముప్పు 21 శాతం ఎక్కువని అధ్యయనంలో హెచ్చరించారు. ఆటిజం పిల్లల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి. ఇతరులతో కలవడంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిలో ప్రవర్తన పరమైన సమస్యలూ కనిపిస్తాయి.

ప్రస్తుతం ఈ వ్యాధులు మాత్రమే పిల్లలకు ఎందుకు వస్తున్నాయనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉందని బ్రిజిలియన్ సొసైటీ ఆఫ్ యూరోలజీ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో కనలినీ చెప్పారు. ''పురుషుల్లో శుక్రకణాల నాణ్యత వయసు పెరిగేకొద్దీ పడిపోయే మాట వాస్తవమే. అయితే, అండం ఫలదీకరణకు మంచి శుక్రకణాలను ఎంచుకోవడం ద్వారా పిల్లల్లో వచ్చే ముప్పులను తగ్గించొచ్చు''అని కనలినీ వివరించారు.

వీడియో క్యాప్షన్, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 9 మార్గాలు

ఏం చేయాలి?

అయితే, తల్లిదండ్రుల వయసు పైబడటంతో పిల్లలకు వచ్చే ముప్పులను పూర్తిగా అడ్డుకునేందుకు ఎలాంటి చికిత్సా లేదని కనలినీ చెప్పారు.

''పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రతి వ్యక్తికీ భిన్నంగా ఉంటుంది. అందుకే ఎవరికివారే వైద్యులను సంప్రదించాలి. ఇక్కడ ఏ కేసుకు ఆ కేసును విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది''అని ఆయన వివరించారు.

మొదట జనరల్ ప్రాక్టీషనర్ లేదా యూరోలజిస్టును మనం సంప్రదించాలి. అక్కడ అంగ స్తంభన సమస్యలు, లైంగిక కోరికలు లేకపోవడం, సెక్స్ చేసేటప్పుడు ఇబ్బంది లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుంటారు. ముఖ్యంగా ఎన్నేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కనుక్కుంటారు.

''సంతాన సమస్యలు ఉన్నప్పుడు మొత్తం శరారీన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్సలు సూచిస్తుంటారు. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, ధూమపానాన్ని వదిలిపెట్టడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం.. లాంటి సూచనలు ఇందులో ఉంటాయి''అని కనలినీ వివరించారు.

జీవన శైలిలో మార్పులతో ఎలాంటి ఫలితమూ లేదని భావించినప్పుడు.. కొన్ని ప్రత్యేకమైన టెస్టులు, చికిత్సలను ఆశ్రయించాలని వైద్యులు సూచిస్తారని కార్లా వివరించారు.

వీడియో క్యాప్షన్, మహిళలకు శరీరంలో వీర్యం నిల్వ చేసుకునే సామర్థ్యమే ఉంటే...

''ఒకవేళ వీర్యం నాణ్యత మరీ పడిపోతే.. శుక్రకణాల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు చికిత్సలు సూచిస్తారు''అని ఆమె చెప్పారు.

అయితే, పిల్లలను పెంచడంలో వచ్చే ఒత్తిడి వయసు పైబడిన వారికి మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

''ఎందుకంటే మగవారి వయసు పెరిగినప్పుడు.. అప్పటికే వారు జీవితంలో చాలా పని చేసుఉంటారు. చాలా అలసిపోయి ఉంటారు. ఆ సమయంలో పిల్లలను పెంచడం మరింత కష్టం అవుతుంది''అని కార్లా తెలిపారు.

''ముఖ్యంగా పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపడం, వారి డైపర్లు మార్చడం లాంటి చిన్న చిన్న పనులను కూడా మనం దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది''అని ఆమె అన్నారు.

''ఈ విషయంలో జంటలు ముందు కూర్చొని మాట్లాడుకోవాలి. తమ కుటుంబంతోపాటు తమకూ మేలు చేసే ఒక మంచి నిర్ణయాన్ని వారు తీసుకోవాలి''అని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)