సూపర్‌టెక్: నోయిడా ‘‘ట్విన్ టవర్స్’’ను పేలుడు పదార్థాలతో ఎలా కూలగొడుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీకి సమీపంలోని రెండు ఆకాశహర్మ్యాలను ఆదివారం మధ్యాహ్నం నేలమట్టం చేసేందుకు 12 సెకన్లు మాత్రమే పడుతుందని అంచనాలు ఉన్నాయి.
‘‘అపెక్స్’’, ‘‘సియానే’’గా పిలుస్తున్న ఈ జంట టవర్లను ప్రైవేటు డెవలపర్ సూపర్‌టెక్ నిర్మించింది. అయితే, ఇవి భవన నిర్మాణ నిబంధలకు విరుద్ధంగా ఉన్నాయని రుజువైంది. దీంతో వీటిని నేలమట్టం చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కూలగొట్టిన భవనాల్లో ఇవే అతిపెద్దవి.
వీటిని ‘‘ట్విన్ టవర్స్’’గా మీడియా అభివర్ణిస్తోంది. 30 అంతస్తుల్లో 320 అడుగుల ఎత్తు(97 మీటర్లు)లో నోయిడాలోని జనం ఎక్కువగా నివసించే ప్రాంతంలో వీటిని నిర్మించారు.
వీటిని పడగొట్టేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇవి ఈ భవనాలు ఉన్నచోటే నేలమట్టం అయ్యేందుకు ఉపయోగపడతాయి. అత్యంత నైపుణ్యంతో ఈ పని పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలో మూడు దేశాల ఇంజినీర్లు పాలుపంచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి కూల్చివేతలను సాధారణంగా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అనుమతించరు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. దీంతో ఆదివారం చేపట్టబోతున్న కూల్చివేతలో చాలా సవాళ్లు ఎదురుకావొచ్చు.
ఈ రెండు టవర్లకు కేవలం 30 అడుగులు (9 మీటర్లు) దూరంలో ఒక 12 అంతస్తుల భవనం ఉంది. దీనిలో దాదాపు 7,000 మంది జీవిస్తున్నారు. మరోవైపు ఈ చుట్టుపక్కలే మరో 45 భవనాలు కూడా ఉన్నాయి.
ఈ చుట్టుపక్కల భవనాల్లో జీవించే ప్రజలు, పెంపుడు జంతువులు ఆదివారం ఉదయమే ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కూల్చివేత పూర్తయిన ఐదు గంటల తర్వాత మాత్రమే మళ్లీ వారిని ఇక్కడికి అనుమతిస్తారు.
మరోవైపు వీధుల్లోని జంతువులను కూడా దూరంగా తీసుకెళ్లడమో లేదా జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించడమో చేస్తారు.
చుట్టుపక్కల రోడ్లతోపాటు ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను స్తంభింపచేస్తారు.
కూల్చివేత వల్ల నేలపై నుంచి 984 అడుగుల ఎత్తులో భారీ ధూళి మేఘం ఏర్పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో విమానాల విషయంలో ఎయిర్‌పోర్టులు, వైమానిక దళానికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడితో జాగ్రత్తలు అయిపోలేదు.
కూల్చివేత చేపట్టే ప్రాంతానికి 50 అడుగుల (15 మీటర్ల) దూరంలో ఒక భూగర్భ పైప్‌లైన్ కూడా ఉంది. ఇది దిల్లీకి వంట గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. ఈ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
మరోవైపు కూల్చివేత సమయంలో వచ్చే ప్రకంపనలతో చుట్టుపక్కల ఉండే తమ ఇళ్లు దెబ్బతినే ముప్పుందని అక్కడుండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరంలేదని కూల్చివేతపై పనిచేస్తున్న ఇంజినీర్లు చెబుతున్నారు.
నోయిడాలోని చాలా భవనాలను భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అయితే, ఈ జంట భవనాలను కూల్చేటప్పుడు వచ్చే ప్రకంపనలు.. రెక్టర్ స్కేలుపై నాలుగు తీవ్రతతో వచ్చే ప్రకంపనల్లో పదో శాతం మాత్రమే ఉంటాయని కూల్చివేతలో పాలుపంచుకుంటున్న బ్రిటిష్ ఇంజినీర్లు చెప్పారు.
మరోవైపు ప్రకంపనల తీవ్రతను తగ్గించేందుకు ఈ ట్విన్ టవర్ల బేస్‌మెంట్లను వ్యర్థాలతో నింపారు.
‘‘ఇదంతా చాలా సురక్షితంగా జరుగుతుంది’’అని సీనియర్ ఇంజినీర్ మయూర్ మెహ్తా చెప్పారు.
ఆదివారం ఉదయం ఈ కూల్చివేత కోసం ఆరుగురు సిబ్బంది ‘‘ఎక్స్‌క్లూజన్ జోన్’’లోకి వెళ్తారు. వీరిలో ముగ్గురు కూల్చివేతల నిపుణులు(బ్లాస్టర్లు), ఒక పోలీసు అధికారి ఉంటారు. వీరు పేలుడు పదార్థాలు విస్ఫోటం చెందేందుకు అంతా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భవనాలు నేలమట్టం అవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
పేలుడు కోసం భిన్న రకాల పేలుడు పదార్థాలను ఉపయోగించబోతున్నారు. మిల్లీ సెకన్ల వ్యవధిలో ఈ రెండు భవనాల్లోనూ పేలుళ్లు మొదలవుతాయి.
‘‘ఇవి వాటంతట అవిగా నేలమట్టం కావు. మొదట 18 అంతస్తులను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేస్తాం. దీంతో మిగతావి వాటంతట అవే కూలిపోతాయి. ఈ విధానాన్ని వాటర్‌ఫాల్ ఇంప్లోషన్‌గా పిలుస్తారు. దీనిలో గురుత్వాకర్షణ శక్తి కూడా సాయం చేస్తుంది’’అని దిల్లీకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ వ్యవస్థపాకుడు ఉత్కర్ష్ మెహతా చెప్పారు. దిల్లీలో భవనాల కూల్చివేత కోసం ఆయన సంస్థ పనిచేస్తుంది.
ఈ కూల్చివేతకు వారాల ముందు నుంచీ ఈ భవనాల్లోని 30 అంతస్తులను బ్లాస్టర్లు పరిశీలించారు. ఇక్కడ విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అనంతరం ఈ అంతస్తుల్లో పేలుడు పదార్థాలను నింపారు. పేలుడు పదార్థాలతో ఒక అంతస్తును మరో అంతస్తుతో అనుసంధానించారు. వీటిలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే మిగతా అంతస్తుల్లో పేలుడు జరగదు. అందుకే అన్నీ సవ్యంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే, ఇదేమీ మరీఅంత క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్న పని కాదని మెహతా భావిస్తున్నారు. ఆయన సంస్థ 11ఏళ్లుగా ఇలాంటి కూల్చివేతలు చేపడుతోంది. ఎయిర్‌పోర్టు టెర్మినళ్లు, క్రికెట్ స్టేడియం, బ్రిడ్జిలు, ఇండస్ట్రియల్ చిమ్నీలు లాంటి ప్రధాన నిర్మిణాలను కూల్చిన అనుభవం సంస్థకు ఉంది.
బిహార్‌లోని గంగా నదిపై ఒక పాత వంతెనను కూల్చేందుకు దాదాపు మూడేళ్లు కష్టపడాల్సి వచ్చిందని మెహతా చెప్పారు. ఆ వంతెన శిథిలాలు కిందనున్న నదిలో అసలు పడకుండా చూడాలని అప్పట్లో తమకు సూచించారని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
30,000 టన్నుల శిథిలాలు..
ఈ ట్విన్ టవర్ల కూల్చివేత తర్వాత దాదాపు 30,000 టన్నుల శిథిలాలు పోగవుతాయని అంచనా. ఇవి చుట్టుపక్కల చెల్లాచెదురై, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ శిథిలాలను తరలించేందుకు దాదాపు 1,200 ట్రక్కులు పనిచేస్తాయి. ఇవి దగ్గర్లోని ఒక రీసైక్లింగ్ ప్లాంట్‌కు శిథిలాలను తరలిస్తాయి. అక్కడ వీటిని రీసైక్లింగ్ చేసేందుకు మూడు నెలల సమయం పడుతుంది.
‘‘ధూళి సమస్య త్వరగానే సద్దుమణుగుతుంది. కానీ, శిథిలాలను వదిలించుకోవడానికి కాస్త సమయం పడుతుంది’’అని మెహతా చెప్పారు.
చాలా అరుదు
భారత్‌లో ఇలాంటి కూల్చివేతలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2020లో కేరళలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను అధికారులు కూల్చివేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి వీటిని కట్టారని చర్యలు తీసుకున్నారు. వీటిలో దాదాపు 2,000 మంది ఉండేవారు. అయితే, నోయిడా కూల్చివేతలు ప్రత్యేకమైనవి. ఇవి చాలా పెద్దవి, వీటి విషయంలో ఆందోళన కూడా ఎక్కువగా కనిపించింది.
నోయిడా ట్విన్ టవర్లకు సమీపంలోని భవనాల్లో జీవించేవారు ఇప్పటికే తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
‘‘తమ ఇంటి తలుపులు, కిటికీలను ప్రజలు సీల్ చేసుకుంటున్నారు. ఎయిర్ కండీషనర్లు, టీవీలు, క్యాబినెట్లను గోడలపై నుంచి తీసి కింద పెడుతున్నారు. ఇలాంటివి ఇక్కడ ముందెన్నడూ జరగలేదు’’అని సమీపంలోని భవనాలను పర్యవేక్షించే అసోసియేషన్ ప్రతినిధి ఎస్ఎన్ బైరోలియా చెప్పారు.
ఒకప్పుడు అద్భుతమైన, విలాసవంతమైన సదుపాయాలను కల్పిస్తామని ఈ ట్విన్ టవర్ల నిర్మాతలు ప్రజలకు చెప్పారు.
‘’37 అంతస్తుల ఎత్తులో గొప్పగా సియానేను నిర్మిస్తున్నాం. మీరు అపెక్స్ బాల్కనీలో నుంచి చూస్తూ నగరం వెలుగులను ఆస్వాదించొచ్చు’’అని ఈ టవర్లను నిర్మించిన సూపర్‌టెక్ ప్రజలకు హామీ ఇచ్చింది.
అయితే, ఆ హామీలన్నీ ఆదివారం నేలమట్టం కాబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















