‘ద వారియర్' మూవీ రివ్యూ: డాక్టర్ చేసిన `పోలీస్` ట్రీట్‌మెంట్

ఫొటో సోర్స్, Facebook/Ram Pothineni
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
మనకున్న కథలు చాలా తక్కువ అని.. దర్శకులు పదే పదే చెబుతుంటారు. అందుకే ఎంత `రొటీన్` అని అరిచి గీ పెట్టినా వాటినే తిప్పి తిప్పి చూపిస్తుంటారని ప్రేక్షకులూ... ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ప్రేక్షకుల్ని అలా... ప్రిపేర్ చేసేస్తే.. తెరపై మనం ఎన్ని`రొటీన్` వేషాలేసినా నడిచిపోతుందనే ఆత్మ విశ్వాసంతో.. పాత కథలనే మళ్లీ వండి వార్చేస్తుంటారు. చూసిన కథే మళ్లీ చూడ్డానికి ప్రేక్షకులూ పెద్దగా నొచ్చుకోరు. కానీ... వాళ్లు అడిగేది ఒక్కటే.. `కనీసం పాత కథని కొత్తగా చెప్పండి` అని. కొన్నిసార్లు... ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది కూడా. ఇంకొన్నిసార్లు... రొటీన్ కథ మరింత సాదా సీదాగా తయారైపోతుంది.
`ద వారియర్` కూడా నూటికి నూరుపాళ్లూ.. తెలిసిన కథే. దాన్ని లింగుస్వామి ఎలా ట్రీట్ చేశాడు. కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడా? లేదంటే రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలాగానే వదిలి పారేశాడా?

ఫొటో సోర్స్, Facebook/Ram Pothineni
డాక్టర్ నుంచి.. పోలీస్ వరకూ!
సత్య (రామ్) ఎంబీబీఎస్ పూర్తి చేసి, కర్నూల్‌లో డాక్టర్‌గా అడుగుపెడతాడు. ఓ డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు బాగా తెలుసు. అందుకే... కళ్లముందు ఎవరి ప్రాణాలు పోయినా చూస్తూ ఊరుకోడు.
అయితే తాను కాపాడిన ఓ ప్రాణం.. కర్నూలులోని గురు (ఆది పినిశెట్టి) మనుషుల వల్ల పోతుంది. కర్నూలుని తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతుంటాడు గురు. తన మాటే అక్కడ వేదవాక్కు. పోలీసు స్టేషన్‌లో గురుపై కంప్లైంట్ ఇచ్చినందుకు.. సత్యని నానా రకాలుగా హింసిస్తాడు. భయపెడతాడు. చంపడానికి ప్రయత్నిస్తాడు.
అయితే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్యని...డీన్ (జేపీ) కాపాడతాడు. సత్యని కుటుంబంతో సహా మరో ఊరు పంపించేస్తాడు. అయితే రెండేళ్ల తరవాత అదే ఊరికి... సత్య డీఎస్‌పీగా ఎంట్రీ ఇస్తాడు. ఓ డాక్టర్ పోలీస్ ఎలా అయ్యాడు? డాక్టర్‌గా సాధించలేనిది..పోలీసోడిగా ఎలా సాధించాడు? గురు ఆగడాలకు ఎలా అడ్డుకట్ట వేశాడు..? అనేదే మిగిలిన కథ.

ఫొటో సోర్స్, Facebook/Ram Pothineni
ట్విస్టు చెప్పేస్తే ఎలా?
ప్రతీ కథకూ.. ట్విస్టులాంటిది ఒకటుంటుంది. మాస్, కమర్షియల్ సినిమాల్లో అది చాలా ముఖ్యం. ఓ డాక్టర్ పోలీస్‌గా ఎంట్రీ ఇవ్వడమే ఈ కథలో ట్విస్టు. అయితే.. దాన్ని చిత్ర బృందం ఎప్పుడూ దాచిపెట్టలేదు. ముందు నుంచీ... రామ్ ఓ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపిస్తాడని చెబుతూ వచ్చింది. రామ్‌ని ఓ పోలీస్ గా చూస్తాం... అనే ఆలోచనతోనే థియేటర్లో కూర్చుంటాడు ప్రేక్షకుడు. అయితే... రామ్ డాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.
డాక్టర్‌గా సత్యని చూడగానే ప్రేక్షకులు కాస్త షాక్ అయిన మాట వాస్తవం. అయితే మరు క్షణంలో.. కథంతా తెలిసిపోతుంది. కర్నూలులోని గురు ఆగడాలకు అడ్డు కట్ట వేయడానికి సత్య పోలీస్‌గా ఎప్పుడు మారతాడా? అని ప్రేక్షకులంతా ఎదురు చూడడం మొదలెడతారు.
డాక్టర్ నుంచి పోలీస్ అయ్యే మధ్యలో సాగేవన్నీ రొటీన్ సీన్లే.
అలా కాకుండా... ఈ సినిమాలో రామ్ ఓ డాక్టర్‌గా కనిపిస్తాడని ప్రచారం చేసి, పోలీస్ గెటప్ దాచి పెడితే బాగుండేది. అప్పుడు డాక్టర్ పోలీస్ అవ్వడం చూసి జనాలు షాక్ అయ్యుండేవాళ్లు.అది సినిమాకి ఎగస్ట్రా మైలేజీ ఇచ్చేది. అలా కాకుండా.. పోలీస్ అని ముందే చెప్పడం వల్ల.. ఇంటర్వెల్‌లో రామ్ పోలీస్ అవతారం ఎత్తినప్పుడు ప్రేక్షకులు పెద్దగా స్పందించరు. `దీని కోసమే కదా.. చూస్తూ కూర్చున్నాం..` అనే ఫీలింగ్‌లోకి వస్తారు.
ప్రతి కథలోనూ.. ఓ దుర్మార్గుడిని ఎదిరించడానికి ఒకడు వస్తాడు. వాడు హీరో అవుతాడు. అలానే ఈసినిమాలోనూ గురు అనే దుర్మార్గుడ్ని ఎదిరించడానికి సత్య వచ్చాడు. అంతే. కాకపోతే చిన్న తేడా.. ఒకే సినిమాలో హీరోని డాక్టర్ గానూ, పోలీస్ గానూ చూసే అవకాశం వచ్చింది. అంతే తేడా.

ఫొటో సోర్స్, Facebook/Ram Pothineni
కలగూర గంప
హోలీ పాటతో కలర్ ఫుల్‌గా సినిమా మొదలవుతుంది. ఆ తరవాత హీరో హైదరాబాద్ నుంచి కర్నూల్ రావడం, ఇక్కడ గురు ఆగడాల్ని చూసి తట్టుకోలేకపోవడం....ఇలా సినిమా అంతా చాలా రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇప్పటి వరకూ వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ కలగలిపి ఓ కిచిడీ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
మధ్యమధ్యలో... `నేనూ ఉన్నా..` అనుకుంటూ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు పని దొరుకుతుంది. ఇంటర్వెల్ వరకూ ఇదే తంతు. ఆ తరవాత పోలీస్ వచ్చాక కూడా.. అదే రొటీన్ ఫార్ములా. హీరో వెళ్లి... విలన్ గ్యాంగ్‌ని కొట్టుకుంటూ వెళ్లడం, దానికి గురు ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, ఆ ప్రయత్నాల్ని హీరో తిప్పికొట్టడం... చివర్లో విలన్‌ని చంపేసి.. శుభం కార్డు వేసుకోవడం.. అంతే.
ఎంత రొటీన్ కథే అయినా, ఎక్కడో ఓ చోట.. కొత్తదనం కనిపిస్తుంది. ఏదో ఓ సీన్‌లో.. బ్రహ్మాండం అనిపిస్తుంది. పాత కథల్ని హీరోలు ఒప్పుకోవడానికి కారణం అదే. ట్రీట్‌మెంట్ పై భరోసా.
కానీ... ఈ సినిమాలో లింగుస్వామి ట్రీట్ మెంట్ విషయంలోనూ తేలిపోయాడు. హీరోయిన్‌ను విలన్ కిడ్నాప్ చేసే సీన్‌లో.. ఏదో డ్రామా పండుద్ది.. హీరో తన తెలివితేటల్ని చూపించి, హీరోయిన్‌ని దక్కించుకొంటాడు.. అనుకుంటారంతా. దానికి తెరపైనా అలాంటి బిల్డప్పే ఇచ్చుకుంటూ పోయాడు దర్శకుడు. తీరా చూస్తే... హీరో ఏం చేయకుండానే, విలన్ భయపడిపోయి, హీరోయిన్‌ని వదిలేస్తాడు.
`కొన్నిసార్లు కొన్నిజబ్బులకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వకపోవడమే మందు` అని హీరో చేత చెప్పిస్తారు. ఇదేం మాస్ ట్రీట్‌మెంటో అర్థం కాదు. పోలీస్ అయ్యాక.. సత్యకు ఎదురు లేకుండా పోతుంది. అంతవరకూ భీకరంగా చూపించిన గురు పాత్రనీ... టోన్ డౌన్ చేశారు. ఎక్కడా ఎమోషన్ లేకుండా కేవలం ఎలివేషన్ల కోసమే సినిమాని నడుపుకొంటూ వెళ్లారు. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్‌గా సాగింది.

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
రెండు పాటలు ఓకే...!
దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్‌లో ఎప్పుడూ అన్ని పాటలూ బాగుంటాయి. ఇందులో రెండు పాటలు మాస్‌కి నచ్చుతాయి. ఓ మెలోడీ ఆకట్టుకుంటుంది. బుల్లెట్ పాటతో థియేటర్‌కి కాస్త ఊపొస్తుంది. విజిల్ పాటలో... రామ్ స్టెప్పులు బాగున్నాయి. నేపథ్య సంగీతంతో నిరుత్సాహ పరిచాడు దేవిశ్రీ ప్రసాద్. కొన్నిసార్లు... తెరపై ఉన్న సీన్‌కీ, ఆర్.ఆర్ కీ సింక్ లేనట్టు అనిపించింది.
బుర్రా సాయిమాధవ్ డైలాగులంటే... ఎంతో కొంత అభిమానం ఉంటుంది ప్రేక్షకులకు. తను ఎమోషన్ డైలాగులు బాగా రాస్తాడు. వాటికి ఈ సినిమాలో అవకాశం లేదు. అసలు బుర్రా మార్క్ ఒక్క చోట కూడా కనిపించలేదు.
లింగుస్వామి తీసినవన్నీ యాక్షన్ చిత్రాలే. అయితే.. అందులో కొంత థ్రిల్ మిక్స్ చేస్తాడు. `ఆవారా`లో అది కనిపిస్తుంది. ఆ సినిమాతోనే లింగుస్వామికి అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే ఈ సినిమాలో ఆ థ్రిల్ మిస్సయ్యింది. యాక్షన్ కోసం యాక్షన్ అన్నట్టు ఫైట్లు సాగాయి. అందులోనూ హీరో ఒంటిచేత్తో వంద మందిని తుక్కు తుక్కు చేయడం తప్ప... ఇంకేం కనిపించలేదు.
కెమెరా పనితనం రిచ్‌గా ఉంది. తొలి పాటని చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు. సెట్లు కూడా రిచ్‌గానే కనిపించాయి. సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. కానీ దర్శకుడు మాత్రం కథపై దృష్టి పెట్టలేదు. అందుకే తేడా కొట్టేసింది.

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
రామ్ డబుల్ డోస్
ఒకే సినిమాలో డాక్టర్‌గా, పోలీస్‌గా కనిపించే అవకాశం చాలా తక్కువమందికి వస్తుంది. అక్కడే రామ్ థ్రిల్ ఫీలై ఉంటాడు. రామ్ పోలీస్‌గా ఎప్పుడూ నటించలేదు. డాక్టర్‌గానూ కనిపించలేదు. రెండు ఆఫర్లూ ఒకేసారి వస్తున్నాయని... ఈ సినిమా ఓకే చేసేసి ఉంటాడు. డాక్టర్‌గా రామ్ చాలా కూల్ గా, పద్ధతిగా ఉన్నాడు. తన ఎనర్జీ లెవిల్స్ తగ్గించి మరీ నటించాడు. అదే పోలీస్ యూనిఫామ్ వేసేసరికి.... తన మునిపటి ఎనర్జీ తనకు వచ్చేసింది.
నటుడిగా రామ్ తక్కువ చేయలేదు. కాకపోతే... కథలో, ఆ పాత్రలో కొత్తదనం లేకుండా పోయింది. అందుకే రామ్ శ్రమ వృథా అయ్యింది. విజిల్ మహాలక్ష్మిగా కృతిశెట్టి పాత్ర కేవలం పాటలకే పరిమితం అయ్యింది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఇంతకంటే ప్రాధాన్యం ఆశించలేం కూడా.
ఆది పినిశెట్టి ప్రెజెన్స్ చాలా బాగుంది. గురుగా.. నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. మాటలతోనే కాదు, కళ్లతోనూ క్రూరత్వం ప్రదర్శించాడు. సరిగా వాడుకోవాలే గానీ.. తన నుంచి ఎంతైనా రాబట్టుకోవచ్చు. నదియా.. అమ్మ పాత్రలో మరోసారి అల్లుకుపోయింది.
లింగుస్వామి రొటీన్ కథలే ఎంచుకొన్నా.. తన ట్విస్టులతో, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తుంటాడు. అది..ఈ సినిమాలో పూర్తిగా మిస్సయ్యింది. ఒకే సినిమాలో హీరో డాక్టర్‌గా, పోలీస్‌గా అవతారాలు ఎత్తినా.. ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో మాత్రం విఫలమయ్యాడు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













