Virata Parvam సినిమా రివ్యూ: సాయి పల్లవి, రానాలతో డైరెక్టర్ వేణు హిట్ కొట్టారా?

ఫొటో సోర్స్, facebook.com/SLVCinemasOfficial
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కమర్షియాలిటీ... బాక్సాఫీస్ లెక్కల కంటే కూడా నవతరం దర్శకులు రియాలిటీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎంచుకున్న కథలో నిజాయతీ ఉన్నప్పుడు అంతకుమించిన కమర్షియాలిటీ ఇంకేం అవసరం లేదనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం ప్రేక్షకుడి ఆలోచనలు కూడా అదేలా ఉన్నాయి.
`నీదీ నాదీ ఒకే కథ`తో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగుల తొలి చిత్రంతోనే తన పంథాని చాటి చెప్పారు. రెండోసారి కూడా వాస్తవికతతో కూడిన కథనే ఎంపిక చేసుకున్నారు.
దీనికి 1990 దశకంలో చోటు చేసుకున్న నిజ జీవిత ఘటనలే స్ఫూర్తి. నక్సలైట్, పోలీసుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో అణువణువునా ప్రేమని నింపుకున్న ఓ నవ మీరాబాయి జీవితం ఎలాంటి సంఘర్షణకి గురైందనే అంశం ఆధారం.
నక్సలైట్, పోలీస్ మధ్య పోరు నేపథ్యం అంటేనే అదొక సాహసోపేతమైన ప్రయత్నం. మరి ఆ సాహసాన్ని తూకం చెడకుండా... ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా వేణు ఊడుగుల ఎలా చేశాడు? ఆ కథేమిటో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, facebook.com/SLVCinemasOfficial
వెండితెరపై వెన్నెల కథ..
‘నా పేరు వెన్నెల. ఇది నా కథ’ అంటూ ట్రైలర్‌లో వినిపించే డైలాగ్ తగ్గ కథే ఇది. సాయిపల్లవి పోషించిన వెన్నెల కథే ఇది. అందులో రానా దగ్గుబాటి, ఇతర నటులు భాగమయ్యారంతే.
1970వ దశకం నుంచి ఈ కథ మొదలవుతుంది. వెన్నెల (సాయిపల్లవి) వరంగల్ జిల్లా మారుమూల గ్రామానికి చెందిన ఒగ్గు కథ కళాకారుడి (సాయిచంద్) కూతురు. చిన్నప్పట్నుంచీ మొండితనం ఎక్కువ. మనసులో గట్టిగా ఒకటి అనుకుందంటే దాన్ని పూర్తి చేసేవరకు నిద్రపోదు.
ఊళ్లో ఆడుతూ పాడుతూ పెరిగిన వెన్నెలకి అరణ్య పేరుతో రవన్న అలియాస్ రవిశంకర్ రాసిన కవిత్వం పరిచయం అవుతుంది. నక్సలైట్ కమాండర్ అయిన రవన్న రచనలకి ఫిదా అయిన వెన్నెల అతని ప్రేమలో పడుతుంది. ఎలాగైనా అతన్ని కలవాలని, అతనితో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయించినా కాదనుకుని రవన్నకోసం అడవి బాట పడుతుంది.
పోలీసుల హిట్ లిస్ట్‌లో ఉన్న రవన్న కోసం అడవుల్లో జల్లెడ పడుతుంటారు. ఈ దశలోనే వెన్నెల తనదైన శైలిలో ప్రయత్నాలు చేసి అడవిలోకి వెళుతుంది. ఆ క్రమంలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మరి రవన్నని కలిసి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందా? ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న రవన్న ఎలా స్పందించాడు? రవన్నతో వెన్నెల కలిశాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆమె ప్రేమకథ సుఖాంతమైందా? లేదా అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, facebook.com/SLVCinemasOfficial
నిజజీవితంలో సరళ కథ..
ఉద్యమం... ప్రేమ. ఈ రెండూ భిన్న ధృవాల్లాంటివి. కానీ వీటిని ముడిపెడుతూ దర్శకుడు ఈ కథని నడిపించాడు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితోనే అయినా ప్రేమని దైవత్వంలా తెరపై ఆవిష్కరించిన తీరు, లోతైన ఆ రచన మెప్పిస్తుంది.
1990 దశకంలో నక్సలైట్ ఉద్యమంలో చేరిన వరంగల్ వాసి సరళ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఆమెకే అంకితం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు వేణు ఊడుగుల.
సరళ ఉదంతం అప్పట్లో అటు నక్సలైట్ ఉద్యమంలోనూ... ఇటు పోలీసు, పౌర సమాజంలోనూ ఓ పెద్ద చర్చని లేవనెత్తింది.
అవ్వడానికి నిజ జీవితమే కావొచ్చు కానీ... దీని వెనక చాలా సున్నితమైన అంశాలున్నాయి. వాటిని అంతే నాజూగ్గా, తెలివిగా స్పృశించాడు దర్శకుడు.
వెన్నెల పుట్టుక, బాల్యంతో కథ మొదలవుతుంది. అరణ్య కవిత్వంతో ప్రేమలో పడటం, మొండిగా అతని కోసం అన్వేషణ మొదలు పెట్టడం, అంతే మొండిగా తనకి కుదిరిన పెళ్లిని నిరాకరించడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకుల్ని వేగంగా కథలో లీనం చేశాడు దర్శకుడు.
రవన్నని కలవడం కోసం వెన్నెల చేసే ప్రయత్నాలు మనసుల్ని హత్తకుంటాయి. ప్రేమ లోతుని ఆవిష్కరిస్తాయి ఆ సన్నివేశాలు. కాకపోతే అవి సుదీర్ఘంగా సాగినట్టు అనిపిస్తాయి. రవన్న దళానికీ, పోలీసులకీ మధ్య యుద్ధం మొదలయ్యాక కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆ యుద్ధం మధ్యలోకి వెన్నెల ప్రవేశించడం, ఆ తర్వాత సంఘర్షణ సినిమాకి కీలకం. అడుగడుగునా భావోద్వేగాలతో కట్టిపడేశాడు దర్శకుడు.
ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు మినహా మిగిలిన కథంతా అడవుల నేపథ్యంలోనే సాగుతుంది. నక్సలైట్ల గెరిల్లా వార్ ఎలా ఉంటుంది? ప్రజల కోసమే పనిచేస్తున్నామని భావించే పోలీసులు, నక్సలైట్ల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆధిపత్యం కోసం ఎవరెలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు? కోవర్ట్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఉద్యమంలో కంటిని కాపాడే రెప్పనే అనుమానించాల్సిన పరిస్థితులు ఎలా వస్తుంటాయి? తదితర విషయాల్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు.
అడవి బాట పట్టే సమయంలో వెన్నెల తన తండ్రిని కలిసి మాట్లాడే సందర్భం, రవన్ననీ... అతని తల్లినీ వెన్నెల కలిపే సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతా ఒకెత్తైతే, పతాక సన్నివేశాలు మరో ఎత్తు. అందరకీ మింగుడు పడని సన్నివేశాలు అవి. వాటిని స్వీకరిచడంపైనే కమర్షియల్ అంశాలు, బాక్సాఫీసు లెక్కలు ఆధారపడి ఉంటాయి. నిజాయతీ ప్రయత్నమే అయినా ప్రేక్షకుడు మరీ ఇంత గాఢతతో కూడిన వినోదాన్ని ఆస్వాదించే పరిస్థితులు ఇప్పుడున్నాయా అనేదే సందేహం.

ఫొటో సోర్స్, facebook.com/SLVCinemasOfficial
‘సాయిపల్లవి వెన్నెల అయితే.. రానా చంద్రుడు’
సినిమాకి మహిళల పాత్రలు కీలకం. సాయిపల్లవి, ఈశ్వరీరావు, ప్రియమణి, నందితాదాస్, జరీనావహాబ్ పాత్రలు సినిమాపై బలమైన ప్రభావం చూపిస్తాయి. కొన్ని పాత్రలు తెరపై కనిపించేది తక్కువ సేపే అయినా సరే, ప్రతీ పాత్ర కథపై తనదైన ముద్ర వేసింది. సాయి పల్లవి నటన వెన్నెల పాత్రకే కాదు, సినిమాకి కూడా ప్రాణం పోసింది. కళ్లతోనే స్వచ్ఛమైన ప్రేమని పలికిస్తూ పాత్రలో ఒదిగిపోయింది. టీచర్‌గా నందితాదాస్, ద్వితీయార్థంలో భారతక్కగా ప్రియమణి, కథానాయకుడి తల్లిగా జరీనా వహాబ్, కథానాయిక తల్లిగా ఈశ్వరీ రావు అదరగొట్టారు.
సాయిపల్లవి పాత్ర వెన్నెల అయితే, రానా దగ్గుబాటి సినిమాకి చంద్రుడు అని దర్శకుడు చెప్పినట్టుగానే ఉంటుంది. రానా పరిచయ సన్నివేశాలు, గెరిల్లా వార్, తల్లితో కలిసి సెంటిమెంట్‌ని పండించే వైనం చిత్రానికి బలం. సాయిచంద్, బెనర్జీ, నవీన్‌చంద్ర తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా కెమెరా పనితనం సినిమా స్థాయిని పెంచింది. పీరియాడిక్ కథకి తగ్గట్టుగానే విజువల్స్ ని ఆవిష్కరించారు.
పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకి ప్రాణం పోశాయి. కోలో కోలోయన్న కోలో పాట, చిత్రణ హత్తుకుంటుంది. పాటలన్నీ సందర్భానుసారంగా వస్తాయి. మిగిలిన విభాగాలన్నీ కూడా చక్కటి పనితీరుని కనబరిచాయి.
దర్శకుడు వేణు ఊడుగుల రచయితగా తనదైన ప్రభావం చూపించారు. బలమైన మాటలతో కట్టిపడేశారు. `లోకమంతా చదివినట్టున్నావు... ఆడపిల్ల మనసుని చదవలేవా?`, `ఆకలి, దుఃఖం, దూప లోపల్నుంచి ఎలా తన్నుకుని వస్తుందో, ప్రేమ కూడా అంతే` లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. కథకుడిగా కథని నడిపిన విధానం కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఓ కొత్త ప్రేమకథని.. ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. మన ప్రేక్షకుడికి సినిమా ఇలాగే ఉండాలి? ఇలాగే ముగింపు ఉండాలనే పడికట్టు సూత్రాలకి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. నవతరం దర్శకులే ఇలాంటి కొత్త రకమైన ప్రయత్నాలు చేస్తారు. కచ్చితంగా ఇదొక నిజాయతీ ప్రయత్నమైనా ఆ నేపథ్యం, భారంగా సాగే ఆ సంఘర్షణ ప్రేక్షకులకి ఎంత వరకు రుచిస్తుందనేది కాలమే చెప్పాలి. హృద్యమైన భావోద్వేగాల్ని ఆవిష్కరించిన ఈ సినిమా కొంతకాలంపాటు గుర్తుపెట్టుకునేలా మాత్రం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- ‘మేం సముద్రంలో గంటల తరబడి వేటాడినా వలలో చేపలు పడట్లేదు’
- 1959లో నెహ్రూను ఎదిరించిన దక్షిణాది నేతల నుంచి ఇప్పుడు మోదీని ఢీకొడతానంటున్న కేసీఆర్ ఏం నేర్చుకోవాలి
- అగ్నిపథ్‌తో రాజుకున్న అగ్గి.. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాల్లో నిరసనలు- రైళ్లపై దాడులు, యువకుడి ఆత్మహత్య
- 10 తులాల బంగారం పోయింది.. ఎలుకల సాయంతో ఎలా పట్టుకున్నారంటే
- లక్షల మందిని బలితీసుకున్న భయానక బ్లాక్ డెత్ ఎక్కడ పుట్టింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















