పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్ ఎవరు?

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జూలై 7 గురువారం నాడు చండీగఢ్‌లో డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. 48 ఏళ్ల భగవంత్ మాన్‌కు ఇది రెండో పెళ్లి.
ఈ వివాహానికి భగవంత్ మాన్ కుటుంబంతో పాటు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం కూడా హాజరవుతున్నట్టు ఏఎన్ఐ తెలిపింది.
ఇంతకీ, పెళ్లికూతురు గురుప్రీత్ కౌర్ ఎవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గురుప్రీత్ కౌర్ హరియణాలోని కురుక్షేత్ర జిల్లాలో పెహోవా నగర్‌కు చెందినవారని, ఆమె తండ్రి పేరు ఇంద్రజీత్ సింగ్, తల్లి పేరు రాజ్ కౌర్ అని వారి పొరుగు గ్రామానికి చెందిన పల్వీందర్ బీబీసీతో చెప్పారు.
నిజానికి, వాళ్ల సొంత ఊరు పంజాబ్‌లోని లూథియానా. అయితే, గురుప్రీత్ తాత చాలా ఏళ్ల కిందటే హరియణా వచ్చి స్థిరపడ్డారు.
ఇంద్రజీత్ సింగ్ సోదరుడు గురిందర్‌జీత్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ, తమది వ్యవసాయ కుటుంబమని, ముగ్గురు సోదరులకు దాదాపు 150 ఎకరాల భూమి ఉందని తెలిపారు.
ప్రస్తుతం ఇంద్రజీత్ తమ భూమిలో కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్నారని, అంతకుముందు సొంతంగా వ్యవసాయం చేసేవారని చెప్పారు.
వీరి వ్యవసాయ భూములు పెహోవాలోని మదన్‌పూర్ గ్రామంలో ఉన్నాయి. 2007కు ముందు గురుప్రీత్ కుటుంబం మదన్‌పూర్ గ్రామంలో నివసించేది. ఆ తరువాత వారు పట్టణానికి వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
డాక్టర్ గురుప్రీత్ కౌర్
గురుప్రీత్ కౌర్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క అమెరికాలో, చిన్నక్క ఆస్ట్రేలియాలో స్థిరపడ్దారు. ముగ్గురూ బాగా చదువుకున్నవారే.
గురుప్రీత్ వృత్తిరీత్యా డాక్టర్. ఆమె మహర్షి మార్కండేశ్వర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. అంబాలా నుంచి 36 కి.మీ దూరంలోని ములానాలో ఈ విద్యాసంస్థ ఉంది. చదువులో ఆమె ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు.
ప్రస్తుతం గురుప్రీత్ కౌర్ తన తండ్రితో కలిసి మొహాలీలో నివసిస్తున్నారు. సంవత్సరం కిందట వీరు మొహాలీలో ఇల్లు కొనుగోలు చేసినప్పటికీ, హరియణాలోని స్వగ్రానికి రాకపోకలు సాగిస్తున్నారని గురిందర్‌జీత్ సింగ్ చెప్పారు.
గురిందర్‌జీత్ సింగ్ ఇంతకుముందు కాంగ్రెస్‌లో ఉండేవారు. గత సంవత్సరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. గురుప్రీత్ తండ్రికి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, ఆయనకు భక్తివిశ్వాసాలు ఎక్కువని, అధిక సమయం గురుద్వారాలోనే గడుపుతారని గురిందర్‌జీత్ సింగ్ చెప్పారు.
అయితే, గురుప్రీత్ తండ్రి గతంలో తన గ్రామానికి సర్పంచ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన చిన్న తమ్ముడు వారి గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నారు.
భగవంత్ మాన్ 2015లో తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ నుంచి విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటారు. ఈ ఏడాది భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి పిల్లలిద్దరూ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ఒక ‘సెక్స్ స్కాండల్’ బ్రిటన్ ప్రధాని పదవికి ఎలా గండం తెచ్చింది
- మహేంద్ర సింగ్ ధోని: ది బెస్ట్ ఫినిషర్ కెరీర్లో 5 బెస్ట్ ఇన్నింగ్స్
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే లవ్ స్టోరీ’ అని రసూల్ పూకుట్టి ఎందుకన్నారు... కీరవాణి ఏమని బదులిచ్చారు
- ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








