సమ్మతమే సినిమా రివ్యూ: ప్రేమికులు ఒకరి కోసం మరొకరు తమ ఇష్టాలు మార్చుకోవాలా... మార్చుకోకపోతే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, AdityaMusic/Youtube
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రేమంటే ఏమిటి? మనకు నచ్చినట్టు ఎదుటివాళ్లు మారడమా? వాళ్లకు నచ్చినట్టు మనం మారిపోవడమా? లేదంటే ఒకరి ఇష్టాల్ని ఇంకొకరు తెలుసుకొని, వాళ్ల నిర్ణయాలకు గౌరవం ఇచ్చి.. జీవితాంతం కలిసి బతకడమా? ఇది.. చాలా పెద్ద డిబేట్. ఈ విషయంలో ఒకొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. `సమ్మతమే`లోనూ ఓ అభిప్రాయం బలంగా వినిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన సినిమా ఇది. `ఎస్.ఆర్.కల్యాణమండపం` హిట్టవ్వడంతో.. ఈ హీరోపై అంచనాలు పెరిగాయి. పైగా తనకు ఇష్టమైన జోనర్‌ని ఎంచుకున్నాడు. మరి.. ఈ ప్రేమకథలో ఏం చెప్పారు? ప్రేమకు ఎలాంటి నిర్వచనం ఇచ్చారు?
భిన్న ధ్రువాల కలయిక
కృష్ణ (కిరణ్ అబ్బవరం) చాలా పద్ధతైన అబ్బాయి. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరం అవ్వడం వల్ల... ఇంట్లో ఆడవాళ్లు లేని లోటేంటో స్పష్టంగా తెలుసు. తండ్రి ప్రేమగా పెంచినా తల్లి లేని బాధ అనుభవిస్తూనే ఉంటాడు. తాను త్వరగా పెళ్లి చేసుకోవాలని, ఆ ఇంటికి ఓ పద్ధతైన అమ్మాయిని తీసుకురావాలని చిన్నప్పటి నుంచే కలలు కంటుంటాడు. పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒకర్ని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించాలన్నది తన సిద్ధాంతం.
బాగా చదువుకొని, హైదరాబాద్‌లో ఓ మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడి అప్పుడు పెళ్లి చూపులకు బయల్దేరతాడు. తొలి పెళ్లి చూపులు శాన్వి (చాందిని చౌదరి)తో జరుగుతాయి. పైకి చాలా బుద్ధిమంతురాలిలా కనిపిస్తుంది. కానీ, అన్నీ అల్లరి పనులే. తనకో ప్రేమకథ కూడా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా శాన్విని ఇష్టపడతాడు కృష్ణ. తన ప్రేమతో శాన్వి మారుతుందనేది కృష్ణ నమ్మకం. ఆ ప్రయత్నాలు ఎలా సాగాయి? శాన్వి మారిందా? అసలు పెళ్లి, ప్రేమ విషయంలో కృష్ణ అభిప్రాయాలనే మార్చిందా? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, AdityaMusic/Youtube
మారాల్సింది అమ్మాయిలా?
ఇది ప్రేమకథలానే కనిపించి ఉండొచ్చు. కానీ, దాని చుట్టూ దర్శకుడు కాస్త బలమైన పాయింటే ఎంచుకొన్నాడు. ఓ వ్యక్తి అలవాట్లని బట్టి క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తారు? ప్రేమిస్తే అలవాట్లన్నీ మార్చుకోవాల్సిందేనా? ఓ వ్యక్తిని ఇష్టపడినప్పుడు.. తన బలహీనతల్ని ఎందుకు ఇష్టపడరు? ఇలాంటి పాయింట్లని ఈ కథలో చర్చించాడు. ''రోజులు బాగోలేవు అన్నప్పుడు మారాల్సింది రోజులే.. అమ్మాయిలు కాదు'' అంటూ ఓ తండ్రితో డైలాగ్ చెప్పించారు. అక్షరాలా అది నిజం.
ఒకరు మనల్ని ఇష్టపడుతుంటే, మనం వాళ్లకోసం మారాలా? అలవాట్లు, పద్ధతులూ, ఇష్టాలూ మార్చుకోవాలా? అలా మార్చుకుంటే ఏమవుతుంది? మార్చకోకపోతే ఆ ప్రేమ కథ ఎలా ఉంటుంది? `సమ్మతమే`లో అదే చూపించారు. భిన్న ధ్రువాల్ని కలిపి వాళ్ల మధ్య ప్రేమ పుట్టించి, అందులోంచి సంఘర్షణని రాబట్టే ప్రయత్నం చేశారు.
కథను ప్రారంభించిన విధానం చాలా నిదానంగా అనిపిస్తుంది. కృష్ణ బాల్యం, తల్లి లేని ఇంట్లో పడే కష్టాలూ ఇవన్నీ కళ్లకు కట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ రావడం, ఇక్కడో ఉద్యోగం సంపాదించడం.. దానికి సమాంతరంగా శాన్వి పాత్రని పరిచయం చేయడం.. ఇలా సినిమా సాఫీగా ముందుకు కదులుతుంటుంది. పరిచయ సన్నివేశాల కోసం, ఆయా పాత్రలను ఇంజెక్ట్ చేయడం కోసం దర్శకుడు కావల్సినదానికంటే ఎక్కువ సమయమే తీసుకొన్నాడు. హీరో - హీరోయిన్ల పెళ్లి చూపులతో... అసలు కథ మొదలవుతుంది. వాళ్ల తొలి పరిచయంతోనే.. సంఘర్షణ మొదలైపోతుంది.
ఈ కథలో ఉన్న పెద్ద మైనస్ ఏమిటంటే.. ఈ ప్రేమకథ మొత్తం అతుకుల బొంతలా అనిపిస్తుంది. అప్పుడే కలుసుకుంటారు.. మళ్లీ విడిపోతారు. మళ్లీ కలుసుకుంటారు.. ఇలా సాగుతుంటుంది. కలుసుకోవడానికీ, విడిపోవడానికీ, మళ్లీ కలుసుకోవడానికి పెద్ద కారణాలేం కనిపించవు. ఈరోజుల్లో కూడా కృష్ణలా అబ్బాయిలు ఉన్నారా? అలా బీసీ కాలపు మైండ్ సెట్‌తో ఆలోచిస్తున్నారా? చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటే అమ్మాయిల్ని చులకనగా చూస్తారా? అనిపిస్తుంటుంది కృష్ణ క్యారెక్టర్ చూస్తుంటే. ఇంట్లో అబద్ధాలు చెప్పకూడదు, పద్ధతిగా ఉండాలి, ఎలా పడితే అలా తిరక్కూడదని చెప్పే కృష్ణ... అదే అమ్మాయిని పెళ్లి కాకుండానే తనతో పాటు గోవాకు ఎందుకు తీసుకెళ్లాడని అడిగితే సమాధానం దొరకదు.

ఫొటో సోర్స్, Gopinath reddy/fb
పాత్ర చిత్రణ.. సంఘర్షణ
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను తన చిత్తానికి మార్చుకుంటూ వెళ్లాడు దర్శకుడు. పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించాలన్నది తన ఫిలాసఫీ. దాన్ని మూడో సీనుకే మార్చుకున్నాడు. అబద్ధాలు ఆడిన అమ్మాయిలంటే, పబ్బులకు వెళ్లే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ అభిప్రాయం కూడా త్వరగా మారిపోతుంది. ''ఇన్నిసార్లు వెధవని అయిన వెధవని నేనొక్కడినేనేమో'' అనే ఓ డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అన్ని సార్లు తన నిర్ణయాన్నీ, మనసునీ మార్చుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండదు.
హైదరాబాద్‌లో ప్రేమకథ, గోవాలో సన్నివేశాలు ఇవన్నీ ఒకే పాయింట్‌ని అటు తిప్పి ఇటు తిప్పి చెబుతుంటాయి. చివరికి హీరో ''ప్రేమంటే వ్యక్తుల్నే కాదు.. ఇష్టాల్నీ ప్రేమించడం'' అని తెలుసుకుంటాడు. తండ్రి పాత్రతో ''వాళ్ల బతుకు కూడా నువ్వే బతికేద్దామంటే ఎలా'' అని చెప్పించడం బాగుంది. పాతికేళ్లు తన జీవితాన్ని ఇష్టమొచ్చినట్టు బతికిన అమ్మాయి... పెళ్లి చేసుకుంటే, ప్రేమిస్తే ఆ ఇష్టాల్ని ఎలా వదులుకుంటుంది? అని అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. బహుశా ఈ పాయింట్ అమ్మాయిలకు నచ్చుతుందేమో?
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కిరణ్ వన్ మ్యాన్ షో
యువతరం హీరోల్లో కిరణ్ అబ్బవరపు తనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకొన్నాడు. తన సహజమైన నటనతో అలరిస్తున్నాడు. ఈ సినిమాలోనూ అదే చేశాడు. కృష్ణగా తన పాత్ర చిత్రణ, నటన అన్నీ సహజంగా అనిపించాయి. భావోద్వేగాలు పలికించే సందర్భాల్లో బాగా నటిస్తున్నాడు. తన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. అయిత, ఈ పాత్ర చాలా సటిల్డ్ గా మలచడం వల్ల కామెడీకి పెద్ద స్కోప్ లేకుండా పోయింది.
శాన్విగా చాందినీ చౌదరి ఓకే అనిపిస్తుంది. తనని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా ఉంది. తెరపై ఈ రెండు పాత్రలకు తప్ప మిగిలిన వాళ్లకు పెద్దగా స్కోప్ లేదు. హీరో తండ్రి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆయనతో పలికించిన డైలాగులు సందర్భోచితంగా ఉన్నాయి. పతాక సన్నివేశాలకు ఆ పాత్ర బలాన్నిచ్చింది. మరోసారి కిరణ్ వన్ మ్యాన్ షోతో అలరించాడు.
సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. శేఖర్ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం కూల్‌గా ఉన్నాయి. బిట్ సాంగ్స్ ఎక్కువ. పరిమిత లొకేషన్లలో నడిచే కథ ఇది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తున్నాయి. ఆడపిల్లల గురించి, ప్రేమ గురించి, ఇష్టాల గురించి చర్చించేటప్పుడు సంభాషణలు బాగున్నాయి. చాలా చిన్న పాయింట్‌తో దర్శకుడు ఈ కథని నడిపించాడు. అలాంటప్పుడు బలమైన సన్నివేశాలు అవసరం అవుతాయి. అవి తగినన్ని లేకపోవడం ఈ చిత్రానికి ప్రధానమైన బలహీనత. ఓపిగ్గా ఓటీటీలో చూసుకొందాం అనుకొనేవాళ్లకు సమ్మతమే నచ్చొచ్చు. వాళ్లంతా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేంత వరకూ ఆగాలి.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ ఈయూలో చేరేందుకు సిద్ధమవుతోందా... రష్యా ఊరుకుంటుందా?
- రావాల్సిన ఉద్యోగం 24 ఏళ్లు ఆలస్యం.. ఒకరు పాత బట్టలు అమ్ముకుంటున్నారు, ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యారు
- ఎవరీ ఏక్నాథ్? ఒకప్పుడు ఆటో నడిపిన ఆయన ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా ఎలా మారారు
- హిరుణిక ప్రేమచంద్ర: 'నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను.. ముగ్గురు పిల్లలను పాలిచ్చి పెంచాను'
- ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














