Draupadi Murmu: ఈ గిరిజన నేతను అభ్యర్థిగా ప్రకటించి విపక్షాలపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

    • రచయిత, రవి ప్రకాశ్
    • హోదా, బీబీసీ కోసం

వచ్చే నెలలో జరగబోతున్న భారత రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారాయి. కొన్ని రాజకీయ పార్టీలను, కొందరు నాయకులను ఇరకాటంలో పడేస్తున్నాయి.

ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విపక్షాలను గందరగోళంలో పడేసింది.

ప్రధానంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరేన్ పూర్తిగా గందరగోళంలో పడినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యూపీఏ కూటమి పార్టీలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)తో కలిసి జేఎంఎం ప్రభుత్వాన్ని నడుపుతోంది.

సాధారణంగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే హేమంత్ సోరెన్ మద్దతు ప్రకటించాలి. కానీ, రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ముతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

దీంతో ఇప్పుడు హేమంత్ సోరెన్ ఎటువైపు నిలబడతారని మీడియాతోపాటు రాజకీయ వర్గాలూ ఎదురుచూస్తున్నాయి. ట్విటర్‌లో హేమంత్ చాలా చురుగ్గా ఉంటారు. కానీ, రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

హేమంత్ సోరెన్ ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Ani

హేమంత్ సోరెన్ ముందున్న ప్రశ్న ఏమిటి?

ద్రౌపది ముర్ము సంథాల్ గిరిజన తెగకు చెందినవారు. భారత దేశంలో ఒక గిరిజన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి.

ఆమె తిరుగులేకుండా గెలుస్తారని ఇప్పటికే చాలా విశ్లేషణలు వస్తున్నాయి. ఒకవేళ ఆమె గెలిస్తే, భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో.. తొలి గిరిజన రాష్ట్రపతిగా ఆమె రికార్డు సృష్టిస్తారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. చాలా మంది గిరిజనులు ఇది తమకు దక్కిన గౌరవంగా చెబుతున్నారు.

మరోవైపు హేమంత్ సోరెన్ కూడా సంథాల్ గిరిజనుడే. ఆయన గిరిజన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు.

2019లో ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''దిల్లీలో గిరిజనులకు తగిన గౌరవం దక్కడం లేదు''అని అన్నారు. ఇప్పుడు అదే తెగకు చెందిన మహిళ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు ఆయన ఎలా అడ్డు చెప్పగలరనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆయన పార్టీ గిరిజన అభ్యర్థైన ద్రౌపదికి ఓటు వేస్తుందా? లేదా తమ కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు అండగా నిలబడుతుందా? అనేదే అసలైన ప్రశ్న.

ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ కూటమిని దాటుకుని వెళ్లి అవతలి అభ్యర్థికి ఓటు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, @sambitswaraj

ద్రౌపదితో సత్సంబంధాలు

ముఖ్యంగా ద్రౌపది ముర్ము, హేమంత్ సోరెన్‌ల మధ్య మంచి సంబంధాలున్నాయి. చాలాసార్లు ద్రౌపది ఇంటికి తన భార్య కల్పనా సోరెన్‌తో కలిసి హేమంత్ వెళ్లేవారు. ద్రౌపది కూడా ఆయన ఇంటికి వచ్చేవారు.

బహుశా అందుకేనేమో ఈ విషయంలో హేమంత్ సోరెన్ స్పందించడానికి సమయం తీసుకుంటున్నారు.

ఈ విషయంలో హేమంత్ సోరెన్, జేఎంఎం అధ్యక్షుడు సిబు సోరెన్ కలిసి నిర్ణయం తీసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు. ప్రతిపక్షాలతో ఇప్పటికే తాము చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

''దీనిపై మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మొద్దు. ప్రజలకు ఆమోద యోగ్యంగానే పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం ఉంటుంది. దీని కోసం కొన్ని రోజులు వేచిచూడాలి'' అని ఆయన అన్నారు.

అయితే, ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ ప్రకటించిన కొంత సేపటికే ఆమెకు మద్దతుగా జేఎంఎం ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి సుదివ్య కుమార్ ఒక ట్వీట్ చేశారు. ఆమె రాష్ట్రపతి కావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. దీంతో జేఎంఎం వైఖరి కూడా ఇలానే ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.

''గిరిజనుల గుర్తింపు కోసం మూడు దశాబ్దాలుగా మా పార్టీ పోరాడుతోంది. ఇప్పుడు ఒక గిరిజన నాయకురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆమెకు కచ్చితంగా మనం అండగా నిలవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. జేఎంఎం ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను అంగీకరిస్తాను. మా పార్టీ ఎవరికి వేయమంటే వారికే ఓటు వేస్తాను''అని బీబీసీతో సుదివ్య చెప్పారు.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

రాజకీయ నిపుణులు ఏం అంటున్నారు?

ఈ అంశంపై రాంచీకు చెందిన ప్రభాత్ ఖబర్ పత్రిక ఎడిటర్, రాజకీయ విశ్లేషకుడు సంజయ్ మిశ్ర బీబీసీతో మాట్లాడుతూ.. ''దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజుల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు పలుకుతున్నట్లు హేమంత్ సోరెన్ ప్రకటిస్తారు''అని అన్నారు.

''రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదివరకు ఇలా జరిగింది. ఇక్కడ గిరిజన గుర్తింపు మరచిపోకూడదు. హేమంత్ సోరెన్ కూడా దీనికే ప్రాధాన్యం ఇస్తారు. ఆయన పార్టీ రాజకీయాలు, కుటుంబ నేపథ్యం చూస్తే ఇది తెలుస్తుంది"అని మిశ్ర అన్నారు.

కూటమి నుంచి కూడా హేమంత్ సోరెన్ బయటకు వచ్చే అవకాశముందా? ఈ ప్రశ్నపై స్పందిస్తూ.. ''యూపీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కాంగ్రెస్ ఆయనపై ఒత్తిడి చేయొచ్చు. కానీ, ఆయన ద్రౌపది ముర్మువైపే మొగ్గుచూపే అవకాశముంది''అని మిశ్ర చెప్పారు. రెండు, మూడు రోజుల్లో అంశంలో స్పష్టత వచ్చేస్తుందని ఆయన అన్నారు.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఇలా సందిగ్ధతలో పడిపోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి.

2007 ఎన్నికల్లో శివసేన.. ఎన్‌డీఏ కూటమిలో ఉంది. అప్పట్లో బాలాసాహేబ్ ఠాక్రే ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవారు. అయితే, యూపీఏ తమ అభ్యర్థిగా మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ప్రతిభా పాటిల్‌ను ప్రకటించింది.

దీంతో మహారాష్ట్రకు గర్వకారణంగా చెబుతూ ప్రతిభా పాటిల్‌కు మద్దతుగా శివసేన ఓటువేసింది. అప్పట్లో తొలి మహిళా రాష్ట్రపతిగా, మరాఠీ మాట్లాడే తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు.

మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ తొలిసారి రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తుంటే తాము ఓటు వేయకుండా ఎలా ఉండగలమని బాలాసాహెబ్ ఠాక్రే అప్పట్లో వ్యాఖ్యానించారు.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

2012లోనూ

2012 రాష్ట్రపతి ఎన్నికలో యూపీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రణబ్ ముఖర్జీ బరిలోకి దిగారు. అప్పట్లో బీజేపీ మద్దతుతో బిహార్‌లో జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ప్రణబ్‌తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. దీంతో ఎన్‌డీఏలో ఉన్నప్పటికీ నీతీశ్ కుమార్.. ప్రణబ్‌కు మద్దతుగా ఓటు వేశారు.

ప్రణబ్ ముఖర్జీ చాలా మంచివారని, అందుకే తాము ఆయనకే ఓటు వేస్తామని అప్పట్లో నీతీశ్ కుమార్ చెప్పారు.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

అదే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికారు. మొదట్లో ప్రణబ్‌ను మమత విమర్శించేవారు.

కానీ, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో బెంగాల్‌కు ఇది ప్రతిష్ఠాత్మకమని చెబుతూ ప్రణబ్‌కు అనుకూలంగా మమత ఓటు వేశారు.

''బెంగాల్‌ నుంచి ఒక వ్యక్తి రాష్ట్రపతి అవుతున్నారు. అందుకే మా పార్టీ ఆయనకు సంపూర్ణ మద్దతు పలుకుతోంది''అని ఆమె అప్పట్లో చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆర్మీలో చేరకపోతే ఈ దేశాల్లో జైల్లో పెడతారు

2017లోనూ...

2017లో కేంద్రలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ గవర్నర్‌గా పనిచేసిన దళిత నాయకుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ ప్రకటించింది.

అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సాయంతో బిహార్‌లో నీతీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.

ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, IPRD

యూపీఏ నుంచి మీరా కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయినప్పటికీ రామ్‌నాథ్ కోవింద్‌కే నీతీశ్ కుమార్ మద్దతు ప్రకటించారు.

ప్రస్తుతం జులై 24తో రామ్‌నాథ్ పదవీ కాలం ముగియనుండటంతో తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, నరేంద్ర మోదీ నేపాల్ కొత్త విమానాశ్రయంలో ఎందుకు అడుగుపెట్టలేదు?

2022లోనూ

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ కూడా ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకుంటున్నాయి.

ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశా. ప్రస్తుతం ఒడిశాలో అధికారంలోనున్న బిజూ జనతా దళ్ (బీజేడీ) ఎన్‌డీఏలో లేదు.

అయినప్పటికీ ఒడిశాకు గర్వకారణంగా చెబుతూ ద్రౌపది ముర్ముకు బీజేడీ మద్దతు ప్రకటించింది. మొదటిసారి ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి రాష్ట్రపతి అవుతున్నారని, అందుకే తాము మద్దతు పలుకుతున్నామని నవీన్ పట్నాయక్ చెప్పారు.

బీజేడీ మద్దతు ప్రకటించిన తర్వాత ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. ప్రస్తుతం అందరి చూపులు హేమంత్ సోరెన్ వైపు ఉన్నాయి. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)