యుక్రెయిన్: ఖార్కియెవ్‌ బంకర్‌లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ

ఖార్కియెవ్ నగరంలో మంగళవారం నాడు షెల్లింగ్‌‌లో భారత విద్యార్థి నవీన్ చనిపోయారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖార్కియెవ్ నగరంలో మంగళవారం నాడు షెల్లింగ్‌‌లో భారత విద్యార్థి నవీన్ చనిపోయారు
    • రచయిత, జోయా మాటీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, న్యూదిల్లీ

''మేం నిద్రలో ఉండగా చెవులు చిల్లులుపడే పేలుడు శబ్దంతో భయంతో ఉలిక్కిపడి లేచాం. బిల్డింగ్ మొత్తం కంపించిపోయింది'' కొన్ని రోజుల కిందట ఖార్కియెవ్‌లోని తమ కాలేజీ హాస్టల్ నుంచి పారిపోయిన క్షణాలను గుర్తుచేసుకుంటూ చెప్పారు 22 ఏళ్ల సౌమ్య థామస్.

యుక్రెయిన్‌లో రెండో అతి పెద్ద నగరమైన ఖార్కియెవ్ మీద రష్యా శనివారం నుండి షెల్లింగ్ దాడి చేస్తోంది. ఈ దాడిలో చెట్ల కొమ్మలు విరిగిపోతున్నాయి. భవనాల కిటికీలు పగిలిపోతున్నాయి. కొన్నిసార్లు ఇళ్లు, స్కూళ్లను కూడా రష్యా షెల్లింగ్ తాకుతోంది. సౌమ్య స్నేహితుడు, సహ విద్యార్థి నవీస్ శేఖరప్ప ఖర్కియెవ్‌లో తాము తలదాచుకున్న బంకర్ నుంచి మంగళవారం నాడు ఆహారం కోసం బయటకు వెళ్లినపుడు ఈ షెల్లింగ్ బారినపడి చనిపోయారు.

షెల్లింగ్ జరిగిన రాత్రి తను, తన స్నేహితులు చేతికి దొరికిన వస్తువులను పట్టుకుని దగ్గర్లోని ఒక సరకుల దుకాణానికి వెళ్లామని, అక్కడి నుంచి సమీపంలోని బంకర్‌కు చేరుకున్నామని సౌమ్య తెలిపారు. వారిలో నవీన్ కూడా ఉన్నారు. వీరంతా ఖార్కియెవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు.

''అక్కడంతా మురికిగా, చీకటిగా, చాలా చలిగా ఉంది. తాగటానికి మంచి నీళ్లు లేవు. పైపు నీళ్లే తాగాం. బయట ఆగి ఆగి పేలుళ్లు వినిపిస్తున్నాయి. తిండి అడుగంటటంతో మేం రోజుకు ఒక్క పూట తిని సరిపెట్టుకోవాల్సి వచ్చింది'' అని సౌమ్య వివరించారు.

వీడియో క్యాప్షన్, ఖార్కియెవ్‌లోని ప్రభుత్వ కార్యాలయంపై రాకెట్ దాడి దృశ్యాలివి

భారత ప్రభుత్వం తమను రక్షించటానికి త్వరగా ఏదైనా చేస్తుందనే ఆశతో తాము బంకర్‌లోనే ఉండిపోయామన్నారు. ''కానీ అంతలో మా ఫ్రెండ్ చనిపోయాడు. మమ్మల్ని రక్షించటానికి ఎవరూ రారని నేను అనుకున్నా'' అన్నారామె.

సౌమ్య సహా సుమారు 20 మంది విద్యార్థుల బృందం ల్వీయెవ్ నగరానికి వెళ్లటానికి రైలు కోసం నిరీక్షిస్తున్నారు. యుక్రెయిన్ పశ్చిమ మూలలో పోలండ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుందా నగరం. అక్కడికి చేరుకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లటానికి సాయం దొరుకుతుందని వీరు ఆశిస్తున్నారు. కానీ పన్నెండు గంటల్లో మూడు రైళ్లు మిస్సయ్యారు. సౌమ్య చివరికి అలసిపోయారు.

మంగళవారం రాత్రి ఆమె బీబీసీతో మాట్లాడుతూ.. ''మేం సరిగా తిని, నిద్రపోయి ఆరు రోజులైంది. పేలుళ్ల చప్పుడు మా చెవులకు చిల్లులు పొడుస్తున్నాయి. నా ఫ్రెండ్‌కి స్వాస తీసుకోవటం కష్టంగా ఉంది. ఆమెకు మందులు కావాలంటే ఫార్మసీని కూడా తెరవటం లేదు'' అని చెప్పారు.

తమ దగ్గర ఎనిమిది ఉడకబెట్టిన గుడ్లు, ఒక బ్రెడ్ పాకెట్, రెండు ప్యాకెట్ల బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి. ల్వీయెవ్ చేరుకోవటానికి 15 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఈ 20 మందికి ఆ ప్రయణానికి ఈ ఆహారం సరిపోదని సౌమ్య ఆందోళన చెందుతున్నారు. అయితే దానికి ముందు రైలు ఎక్కగలగాలి.

తమను మూడు రైళ్లు ఎక్కకుండా అడ్డకున్నారని, తాము యుక్రేనియన్లం కాకపోవటమే దానికి కారణమని సౌమ్య ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

షెల్లింగ్ దాడి జరుగుతున్న ఖార్కియెవ్ నగరంలో ఇంకా వేలాది మంది భారత విద్యార్థులు చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు.

భారతదేశం తన పౌరులను తీసుకురావటానికి తరలింపు కృషిని ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ దాదాపు 12,000 మంది విద్యార్థులు తిరిగివచ్చారని విదేశాంగ కార్యదర్శి చెప్పారు. యుక్రెయిన్‌లోని భారతీయులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని, సరిహద్దులు దాటి పోలండ్, హంగరీ, స్లొవేకియా, రొమేనియాలకు వెళ్లాలని, అక్కడి నుంచి ప్రత్యేక భారత విమానాలు ఎక్కవచ్చునని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సూచిస్తూ ఉంది.

సహాయ కార్యక్రమాల్లో సాయం చేయటానికి భారత ప్రభుత్వం ఈ నాలుగు దేశాలకూ నలుగురు మంత్రులను కూడా పంపించింది.

బుధవారం నాడు ప్రభుత్వం తాజా సలహా జారీ చేసింది. ఖార్కియెవ్‌లోని భారతీయులందరూ తక్షణమే ఆ నగరం విడిచివెళ్లాలని, అవసరమైతే కాలినడకనైనా వెళ్లిపోవాలని సూచించింది. బుధవారం రాత్రి కల్లా.. నగరానికి దక్షిణం వైపు, నైరుతి వైపు ఉన్న జిల్లాలకు వెళ్లిపోవాలని చెప్పింది.

యుక్రెయిన్‌లో దాదాపు 76,000 మంది విదేశీ విద్యార్థులు ఉండగా వారిలో నాలుగో వంతు.. దాదాపు 20,000 మంది భారత విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అక్కడి ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన వైద్య విద్య అందుబాటు వ్యయంలో లభిస్తుండటం వల్ల భారత విద్యార్థుల్లో చాలా మంది ఆ కోర్సుల్లో చేరుతున్నారు.

చాలా మంది విద్యార్థులు.. పురోగమిస్తున్న రష్యా బలగాలను తప్పంచుకోవటానికి పశ్చమ దిశగా పారిపోవటం వల్ల.. అటువైపు సరిహద్దుల వద్ద, వాటికి సమీపంలో చిక్కుకుపోయి ఉన్నారు.

రాబిన్ అనే విద్యార్థి కూడా మంగళవారం వరకూ ఖార్కియెవ్‌లోనే ఉన్నారు. అయితే మధ్యాహ్నం నాటికి ఒక రైలు ఎక్కగలిగారు. అది దేశంలో పశ్చిమ భాగంలోకి ఎక్కడికో వెళుతోందని అతడు చెప్పారు.

హాస్టల్ నుంచి బయటపడేటపుడు కేవలం తన పాస్‌పోర్టు మాత్రమే వెంటతెచ్చుకోగలిగానని ఆయన చెప్తున్నారు. దాడి చాలా భీకరంగా మొదలైందని, పరుగెత్తటానికి కూడా టైం లేదని చెప్పారు.

మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న రాబిన్ కూడా మొదట.. చనిపోయిన మరో విద్యార్థి నవీన్‌తో పాటు ఒకే అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో దాక్కున్నారు. తామిద్దరం దాదాపు ఒకే సమయంలో ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చామని రాబిన్ చెప్తున్నారు.

నవీన్ ఆహారం కొనటానికి బయటకు వెళితే, రాబిన్ అతడి స్నేహితులు రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారి తెలుసుకోవటానికి ప్రయత్నించారు.

భారత విద్యార్థులు ఖార్కియెవ్ నగరంలోని బంకర్లలో తలదాచుకుంటున్నారు

ఫొటో సోర్స్, ROBIN

ఫొటో క్యాప్షన్, భారత విద్యార్థులు ఖార్కియెవ్ నగరంలోని బంకర్లలో తలదాచుకుంటున్నారు

''అప్పుడు చాలా చలిగా ఉంది. కార్ల లైట్ల వెలుతురులో జనం ఆకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కార్లు కూడా.. షెల్లింగ్‌లో కూలిపోయిన భవనాల శిథిలాల్లోకు దూసుకెళ్లి చిక్కుకుపోతున్నాయి'' అని వివరించారు రాబిన్.

సరకుల దుకాణాల దగ్గర పొడవాటి క్యూలు ఉండటం, భవనాలు కుప్పకూలుతుండటం, రోడ్డు అంతటా శిథిలాలు, తగలబడిన వాహనాల దృశ్యాలను ఆయన వర్ణించారు.

''ఓ భారీ పేలుడు శబ్దం విన్నప్పుడు మేం ట్యాక్సీ కోసం వెదుకుతున్నాం. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే నవీన్ చనిపోయినట్లు మాకు తెలిసింది'' అని తెలిపారు.

తాను ట్యాక్సీ ఎక్కి పారిపోయినట్లు చెప్పారు.

రైలు ఎక్కిన తర్వాత బోగీలో జనం క్రిక్కిరిసి ఉన్నారని.. సీట్లేవీ ఖాళీ లేవని రాబిన్ పేర్కొన్నారు.

''కనీసం నిలుచోవటానికి కూడా చోటు లేదు. మా దగ్గర తిండి, నీళ్లు ఎప్పుడో అయిపోయాయి'' అని ఆ రైలులో ప్రయాణిస్తూ బీబీసీకి మెసేజీల ద్వారా చెప్పారాయన.

ఇండియాలో తన తల్లిదండ్రుల తన కోసం ఆందోళనతో గాభరా పడుతున్నారన్నారు. ఫోన్ బ్యాటరీ సేవ్ చేయటానికి.. వారితో వాట్సాప్‌లో అప్పుడప్పుడూ మెసేజ్‌ల ద్వారా మాట్లాడుతున్నానని చెప్పారు.

''పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. కానీ సాధ్యమైనంత త్వరగా మమ్మల్నందరినీ ఇక్కడి నుంచి తరలిస్తారని నేను ఆశిస్తున్నాను'' అన్నారు.

అతడి తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ''వారు ఇంకేం చేయగలరు?'' అంటారు రాబిన్.

అతడికి వేల మైళ్ల దూరంలో.. నిస్సహాయులైన అతడి తల్లిదండ్రులు ఇండియాలోని తమ ఇంట్లో ఆందోళనగా టీవీ చానళ్లలో యుద్ధ విమనాలు, తుపాకులు పట్టకున్న సైనికులు, మోర్టారు పేలుళ్లను భయంభయంగా కళ్లప్పగించి చూస్తున్నారు.

''పరిస్థితి ఏమీ బాగోలేదు. మా కూతురుతో మేం ప్రతి రోజూ మాట్లాడుతాం. కానీ ఆమెకు సాయం చేయటానికి ఏం చేయలేకపోతున్నాం'' అని కేరళలోని సౌమ్య తండ్రి బిజు థామస్ బీబీసీతో చెప్పారు.

భారత ప్రభుత్వ అధికారులను తాను సంప్రదించగా.. సౌమ్య ఏదైనా సరిహద్దు నగరానికి రావటానికి ప్రయత్నించాలని వారు తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. దీంతో సౌమ్య ల్వీయెవ్ నగరానికి చేరుకుంటుందని తాము ఆశిస్తున్నామన్నారు.

''మిగతా భారమంతా దేవుడికే వదిలేశాం'' అన్నారు థామస్.

కీయెవ్, ఖార్కియెవ్ ప్రజలు రష్యా దాడుల నుంచి తప్పించుకోవటానికి మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కీయెవ్, ఖార్కియెవ్ ప్రజలు రష్యా దాడుల నుంచి తప్పించుకోవటానికి మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అన్సారి తల్లిదండ్రుల వంటి వారు కొందరు.. రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య కొన్ని వారాల కిందట ఉద్రిక్తతలు పెరగటం మొదలుకాగానే తమ పిల్లలను స్వదేశానికి తిరిగి వచ్చేయాలని సూచించారు.

వారి 18 ఏళ్ల కొడుకు నోమన్ కూడా ఖార్కియెవ్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థి. అక్కడ గొడవలు ముదురుతుండగానే తమ కొడుకును వెంటనే విమానం ఎక్కి వచ్చేయాలని తాను చెప్పినట్లు అన్సారీ తెలిపారు.

కానీ ఆందోళన పడాల్సిందేమీ లేదని తమ కొడుకు చెప్పటంతో ఆయన పట్టుపట్టలేదు.

నోమన్ ఆరు రోజులుగా తమ హాస్టల్ బంకర్‌లో చిక్కుకుపోయి ఉన్నాడు. అతడికి అందుబాటులో తిండి, నీళ్లు పెద్దగా లేవు. అక్కడి నుంచి 'బయటపడే దారే లేదు'.

దీంతో అన్సారి దంపతులు కుంగిపోయారు. ''నేను వాడి మాట విని ఉండాల్సింది కాదు. కానీ.. పరిస్థితులు ఇంతలా మారిపోతాయని ఎవరు అనుకుని ఉంటారు'' అని వణుకుతున్న గొంతుతో చెప్పారు అన్సారి.

భారతదేశంలో రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించటానికి తాను పలుమార్లు ప్రయత్నించానని ఆయన తెలిపారు. తమ పౌరులు యుక్రెయిన్ విడిచి వెళ్లాలని హెచ్చరిక జారీ చేయటానికి.. భారతదేశానికి మిగతా దేశాల కన్నా ఎక్కువ సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్సిస్తున్నారు.

యుక్రెయిన్‌లో అత్యవసర పని లేని భారతీయులు.. ''అనిశ్చిత పరిస్థితుల'' రీత్యా ''తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అంశాన్ని పరిశీలించవచ్చు'' అని యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 15న సలహా విడుదల చేసింది. దానికి నాలుగైదు రోజులు ముందుగానే.. బ్రిటన్, అమెరికాలు తమ పౌరులను తక్షణమే యుక్రెయిన్ విడిచి వెళ్లాలని హెచ్చరిక జారీ చేశాయి.

''నా కొడుకును మళ్లీ చూడాలని మాత్రమే నేను కోరకుంటున్నా'' అన్నారు అన్సారి.

''నేను నా నోమన్‌తో మాట్లాడిన ప్రతిసారీ.. సాయం చేయాలని అడుగుతున్నాడు. 'సాయం వస్తోంది.. ధైర్యంగా ఉండు' అని నేను చెప్తున్నా. కానీ ఆ సాయం ఎప్పుడు అందుతుంది?'' అని ప్రశ్నించారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)