నవీన్ శేఖరప్ప: ‘ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’

నవీన్ శేఖరప్ప
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

నవీన్ శేఖరప్ప జ్ఞానగౌండర్.. కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా రణబెన్నూర్ తాలూకా చలగేరి గ్రామం నుంచి యుక్రెయిన్ వెళ్లారు. ఖార్కియెవ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో గత నాలుగేళ్లుగా ఎంబీబీఎస్ చదువుతున్నారు.

''ఉదయం 8 గంటలకు (యుక్రెయిన్ సమయం) నాకు ఫోన్ చేశాడు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగాడు. మాకు ఆహారం కొనేందుకు బయటకు వెళ్లిన నవీన్‌ దగ్గర డబ్బులు సరిపోలేదు'' అని శ్రీకాంత్ చెన్నగౌడ బీబీసీతో చెప్పారు. శ్రీకాంత్ కూడా వైద్య విద్యార్థి. నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఖార్కియెవ్‌ నగరం బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ కింద ఉన్న బంకర్‌లో ఉన్నాడు.

యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఖార్కియెవ్ నగరంపై మంగళవారం ఉదయం రష్యా క్షిపణులను ప్రయోగించింది. తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయని స్థానిక అధికారులు ప్రకటించారు.

బెకెటోవ్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ కింద షెల్టర్‌లో ఉన్న నవీన్ శేఖరప్ప మంగళవారం ఉదయం సరుకులు కొనేందుకు బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.

ఖార్కియెవ్ నగరంలో సాయంత్రం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతోంది. దీంతో, కర్ఫ్యూ సడలించిన వెంటనే నవీన్ తనతో పాటు శ్రీకాత్, ఇతర స్నేహితుల కూడా ఆహారం తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు.

వీళ్లు తలదాచుకుంటున్న బంకర్‌కు 50 మీటర్ల దూరంలోనే ఒక సూపర్‌మార్కెట్ ఉంది.

నవీన్ శేఖరప్ప

ఫొటో సోర్స్, TWITTER/DIVYASPANDANA

''నేను డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాను. ఐదు పది నిమిషాల తర్వాత నవీన్‌కు కాల్ చేశాను. ఎన్నిసార్లు చేసినా నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు. తర్వాత నేను నవీన్ స్థానిక నంబర్‌కు కాల్ చేశాను. ఆ కాల్‌ను కూడా ఎత్తలేదు. అలా కొన్నిసార్లు ప్రయత్నించాక.. ఒకరు ఫోన్ ఆన్సర్ చేశారు. వారు యుక్రెనియన్ భాషలో మాట్లాడారు. వాళ్లేం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు'' అని శ్రీకాంత్ బీబీసీతో అన్నారు.

దీంతో శ్రీకాంత్ తన ఫోన్‌ను బంకర్‌లో ఉన్న వేరొకరికి ఫోన్ ఇచ్చి మాట్లాడమని కోరాడు. యుక్రెనియన్ భాషలో మాట్లాడిన తర్వాత ''నీ స్నేహితుడు ఇక లేడు'' అని ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి శ్రీకాంత్‌కు చెప్పారు.

''నేను నమ్మలేకపోయా. వెంటనే సూపర్‌మార్కెట్‌కు వెళ్లాను. అక్కడ బాంబు పేలుడు జరిగిన ఆనవాళ్లేమీ లేవు'' అని శ్రీకాంత్ తెలిపారు.

''ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. కానీ, ఎక్కడినుంచో దూసుకొచ్చిన బుల్లెట్ నవీన్‌కు తగిలి ఉంటుంది'' అని శ్రీకాంత్ అన్నారు.

''ఖార్కియెవ్‌లో బాంబుల వర్షం కురుస్తున్నట్లుంది. బంకర్‌లో మొత్తం తొమ్మిది మంది ఉన్నాం. అందులో ఐదుగురు వెళ్లిపోయారు. అలా బంకర్ నుంచి వెళ్లిపోవడం ప్రమాదకరం అని భావించి మేం అక్కడే ఉన్నాం. బుధవారం ఉదయం వెళ్లాలనుకున్నాం'' .

నవీన్ శేఖరప్ప

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC

''నవీన్ చాలా మంచోడు. చాలా తెలివైనోడు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరంలో 95 శాతం మార్కులు సాధించాడు. ఎప్పుడూ చదువుమీదే అతని ధ్యాస. అందరితోనూ చాలా బాగా ఉండేవాడు''.

''ఎంబసీ నుంచి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. నవీన్ మృతదేహం ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు'' అని శ్రీకాంత్ తెలిపారు.

నవీన్, శ్రీకాంత్ ఇద్దరూ 21 ఏళ్ల వారే. శ్రీకాంత్ మైసూరు ప్రాంతానికి చెందిన విద్యార్థి.

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

మృతదేహాన్ని తీసుకొస్తాం - కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై

యుక్రెయిన్‌లో మృతి చెందిన నవీన్ శేఖరప్ప కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

బాధిత కుటుంబం తనకు ఎంతో దగ్గరైనదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నవీన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రతి నిమిషమూ కీలకమే - రాహుల్ గాంధీ

యుక్రెయిన్‌లో మృతి చెందిన భారత విదార్థి నవీన్ కుటుంబానికి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.

"యుక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోయారనే విషాద వార్త తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. భారత పౌరులను అక్కడి నుంచి తరలించడానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతీ నిమిషం కీలకమే" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

వీడియో క్యాప్షన్, ఎల్ఐసీ ఐపీవోలో షేర్లు పొందడం ఎలా
ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)